జయా బచ్చన్, షర్మిలా ఠాగూర్, జీవిత
ఒకరు నెగటివ్‌గా కనిపించనున్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ ఆమెను అలాంటి పాత్రలో చూడలేదు. ఇంకొకరు కన్నీళ్లు తెప్పించే పాత్రతో వచ్చారు.. అలాంటి పాత్రతో వచ్చినందుకు ఆనందభాష్పాలను ఆపుకోలేకపోయారామె. మరొకరు కథానాయికగా కనుమరుగై.. చెల్లెలిగా రిటర్న్ అవుతున్నారు. నటనకు ఒక్కసారి బ్రేక్ ఇచ్చాక మళ్లీ నటించాలంటే ఆ క్యారెక్టర్ ఎంతో బలమైనది అయ్యుంటేనే ఆ ఆర్టిస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. జయా బచ్చన్, షర్మిలా ఠాగూర్, జీవితలకు అలాంటి పాత్రలే దొరికాయి. అందుకే బ్రేక్‌లు తీశారు.. నటిగా మేకప్ వేసుకున్నారు. ఒక్కప్పటి ఈ స్టార్స్ రిటర్న్ కావడం అభిమానులకు ఆనందమే కదా. ఇక ఈ ముగ్గురి చిత్రాల విశేషాలు తెలుసుకుందాం.
తొలిసారి నెగటివ్‌గా...
జయా బచ్చన్ కెరీర్ దాదాపు 60 ఏళ్లు. ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో నటిగా ఎన్నో అద్భుత పాత్రలు చేశారామె. కెరీర్ ఆరంభంలో ‘గుడ్డి’ (1971)లో చేసిన పాత్రతో ‘గర్ల్ నెక్ట్స్ డోర్’ ఇమేజ్ తెచ్చుకున్న జయ ఆ తర్వాత ‘జవానీ దివానీ’లో గ్లామరస్ రోల్‌లో మెప్పించారు. అలాగే అనామిక (1973)లో కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేసి, భేష్ అనిపించుకున్నారు. అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో జయ పూర్తి స్థాయి నెగటివ్ క్యారెక్టర్ చేయలేదు.
ఇప్పుడు చేస్తున్నారు. ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో లేడీ విలన్‌గా కనిపించనున్నారామె. దాదాపు ఏడేళ్ల తర్వాత జయా బచ్చన్ ఒప్పుకున్న చిత్రం ఇది. కరణ్ జోహార్ స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయా బచ్చన్‌తో కరణ్ నెగటివ్ క్యారెక్టర్ గురించి చెప్పగానే ‘‘నేనా? నన్నే తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు?’ అని ఆమె అడిగారు... ‘మీరే చేయాలి’ అంటూ జయాని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు కరణ్.
ఫైనల్‌గా ‘ఓకే’ అన్నారామె. అయితే ఈ పాత్రని అర్థం చేసుకుని, ఒక క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తిలా నటించడానికి జయ కొన్నాళ్లు ఇబ్బందిపడ్డారట. ఆ తర్వాత పూర్తిగా ఆ పాత్రలోకి లీనం కాగలిగారని, నెగటివ్ క్యారెక్టర్‌ని ఆమె ఎంజాయ్ చేస్తున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా రూపొందిన ఈ చిత్రం జులై 28న విడుదల కానుంది.
పుష్కర కాలం తర్వాత...
పుష్కర కాలం తర్వాత షర్మిలా ఠాగూర్ ఓ సినిమా చేశారు. ఈ నెల 3న విడుదలైన ‘గుల్‌మోహార్’లో ఆమె ఇంటి పెద్దగా లీడ్ రోల్ చేశారు. గుల్ మోహార్ అనే తమ ఇంటిని అమ్మేసి, తాను వేరే రాష్ట్రానికి వెళతానని ఇంటి పెద్ద కుసుమ్ బాత్రా (షర్మిలా ఠాగూర్ పాత్ర) చెబుతారు. అప్పుడు ఆ కుటుంబ సభ్యుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
‘బ్రేక్ కే బాద్’ (2010) సినిమా తర్వాత మళ్లీ మంచి పాత్రలు వచ్చేంతవరకూ బ్రేక్ తీసుకోవాలనుకున్నారు షర్మిలా. ‘గుల్‌మోహార్’లో తన పాత్ర కీలకం కావడంతో పాటు మంచి ఎమోషన్స్ కనబరిచే చాన్స్ ఉన్నందున ఆమె అంగీకరించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసి, షర్మిలా ఏడుపు ఆపుకోలేకపోయారు. ‘‘పన్నెండేళ్ల తర్వాత ఒక మంచి పాత్రలో తెరపై కనిపించడంతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. ఈ సినిమాని మూడుసార్లు చూశాను. చూసిన ప్రతిసారీ ఏడ్చాను. అంతగా ఈ పాత్రతో కనెక్ట్ అయ్యాను’’ అని షర్మిలా పేర్కొన్నారు.
చెల్లెలిగా...
కథానాయికగా గర్ల్ నెక్ట్స్ డోర్ అనదగ్గ పాత్రల్లో కనిపించారు జీవిత. ‘తలంబ్రాలు’, ‘ఆహుతి’, ‘అంకుశం’ వంటి చిత్రాల్లో చేసిన పాత్రలతో మంచి నటి అనిపించుకున్నారామె. ‘మగాడు’ (1990) తర్వాత నటిగా వేరే సినిమాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు రజనీకాంత్ అతిథి పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’లో నటించడానికి జీవిత ఒప్పుకున్నారు. ఇందులో ఆమెది రజనీ చెల్లెలి పాత్ర. ‘‘నా కెరీర్‌లో రజనీ సార్‌తో సినిమా చేయలేదు. ఇప్పుడు కుదిరినందుకు హ్యాపీగా ఉంది.
ఈ సినిమా ఒప్పుకోవడానికి కొంత టైమ్ తీసుకున్నాను. ‘మీరు స్క్రీన్‌పై కనిపించి చాలా రోజులైంది కాబట్టి.. చేస్తే బాగుంటుంది’ అని ఐశ్వర్య అనడం, నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఓకే చెప్పాను’’ అని పేర్కొన్నారు జీవిత. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె కనిపించనున్న చిత్రం ఇది. కాగా నటిగా ఇన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిర్మాతగా ‘గడ్డం గ్యాంగ్, దెయ్యం’ వంటి చిత్రాలను నిర్మించారు. గత ఏడాది ‘శేఖర్’ చిత్రానికి దర్శకత్వం వహించారు జీవిత.
Comments
Please login to add a commentAdd a comment