సినిమా అంతా బాల నటీనటులతోనే తీస్తే? భారతదేశంలో మునుపెన్నడూ ఎవరూ చేయని ఈ ప్రయోగాన్ని తెలుగు వాళ్ళు మొదట చేశారు. 85 ఏళ్ళ క్రితం విడుదలైన ఈస్టిండియా వారి ‘సతీ అనసూయ’ ఆ రికార్డును సొంతం చేసుకుంది. నిడివి రీత్యా చిన్నవైన ‘సతీ అనసూయ – ధ్రువవిజయము (1936)– ఈ రెండు వేర్వేరు టాకీలను ఒకే టికెట్‌పై చూపి, దర్శకుడు సి. పుల్లయ్య అప్పట్లో చేసిన విన్యాసం నేటికీ విశేషమే!
మన దేశంలో మూగ సినిమాలు పోయి, వెండితెర మాట్లాడడం మొదలుపెట్టిన తొలి రోజులవి. తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6) రిలీజై, నాలుగేళ్ళవుతోంది. బొంబాయి, కలకత్తా స్టూడియోలలో అక్కడి నిర్మాతలే ఎక్కువగా తెలుగులో సినిమాలు తీస్తున్నారు. కలకత్తా సంస్థ ఈస్టిండియా ఫిల్మ్ కంపెనీ అప్పటికే చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో ‘సతీ సావిత్రి’ (1933 ఫిబ్రవరి 5), ‘లవకుశ’ (1934 డిసెంబర్ 22)– రెండు తెలుగు టాకీలు తీసి, రెండింటితోనూ లాభాలు గడించింది. రామాయణ కథ ‘లవ–కుశ’ తెలుగులో తొలి బాక్సాఫీస్ బంపర్ హిట్. లవ, కుశులుగా నటించిన చిన్న పిల్లలు (మాస్టర్ భీమారావు, మాస్టర్ మల్లేశ్వరరావు) – ఇద్దరూ జనంలో స్టార్లయిపోయారు. ఇద్దరుంటేనే జనం ఇంతగా అక్కున చేర్చుకుంటే, మొత్తం పిల్లలతోనే సినిమా తీస్తేనో? అలా బాలలతో ‘సతీ అనసూయ’కు బీజం పడింది.
కలకత్తా ఇంట్లో... పిల్లల తండ్రిలా పుల్లయ్య
మూకీల కాలం నుంచి సినీ ప్రదర్శన, నిర్మాణ, దర్శకత్వ శాఖల్లో అనుభవం గడించిన ప్రతిభాశాలి – కాకినాడకు చెందిన సి. పుల్లయ్య. పూర్తిగా పిల్లలతోనే ‘సతీ అనసూయ’ తీస్తే అనే ఆయన ఆలోచన ఓ విప్లవమే. ఆయన డైరెక్టర్ గానే ఉండిపోలేదు. ఆ పిల్లలందరినీ ఆయన, ఆయన భార్య రంగమ్మ సొంత తల్లితండ్రులలాగా చూసుకునేవారు. పిల్లల్లో ఎవరైనా అలిగితే, ఆయన బతిమాలి అన్నం తినిపించేవారు. షూటింగ్ సమయంలో కలకత్తాలో ఆయన ఓ మూడంతస్థుల బంగళా తీసుకున్నారు. చదువు పోకూడదని... పిల్లలకంతా అక్కడే స్కూలు, క్లాసులు ఏర్పాటు చేశారు. ‘‘అనసూయ’లో అందరం పిల్లలమే. ‘ధ్రువ’లో మాత్రం బాలపాత్రలు మినహా మిగతా అందరూ పెద్దవాళ్ళే చేశారు. పద్యాలు, పాటలు మేమే పాడుకొనేవాళ్ళం. మేము పాడుతూ నటిస్తుంటే, పక్కనే ఆర్కెస్ట్రా వాళ్ళు మమ్మల్ని అనుసరిస్తూ సంగీతమందించేవారు’’ అని 90వ పడిలోవున్న నటి, నిర్మాత, అనసూయ పాత్రధారిణి సి. కృష్ణవేణి ‘సాక్షి’తో గుర్తుచేసుకున్నారు.
ప్రొడక్షన్ మేనేజర్‌గా... రేలంగి!
తరువాతి కాలంలో కమెడియన్ గా పేరుతెచ్చుకున్న రేలంగి అప్పట్లో ‘ధ్రువవిజయము’లో ఇంద్రుడిగా నటించడం మొదలు క్యాస్టింగ్ ఏజెంట్, ప్రొడక్షన్ మేనేజర్, డైరెక్టర్ కి అసిస్టెంట్ – ఇలా అన్నీ అయ్యారు. షూటింగ్ లేనప్పుడు వారానికి రెండుసార్లు పిల్లలందరినీ ‘జూ’కో, సినిమాకో తీసుకెళ్ళేవారు.
తొలి ఆర్ట్ డైరెక్టర్ అడివి బాపిరాజు
ప్రముఖ రచయిత, చిత్రకారుడు అడివి బాపిరాజు ఈ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తెలుగు సినిమాలకు ఓ తెలుగు వ్యక్తి పూర్తిస్థాయిలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేయడం అదే మొదలు. అలా ‘తొలి తెలుగు ఆర్ట్ డైరెక్టర్’గా చరిత్ర కెక్కారు. అప్పటికే బాపిరాజు మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాల ప్రిన్సిపాల్. ‘అనసూయ’ కోసం ఆయన వేసిన కైలాసం సెట్, చాక్‌పౌడర్‌తో కైలాసంపై మంచు పడే ఎఫెక్ట్ అపూర్వం.
తెరపై తొలిసారి అన్నమయ్య గీతం...
తెలుగు తెరపై తొలిసారి అన్నమయ్య కీర్తన వినిపించిన సినిమా కూడా బాలల చిత్రం ‘సతీ అనసూయే’. అన్నమయ్య రచన ‘జో అచ్యుతానంద జోజో ముకుందా...’ను త్రిమూర్తులను పసిపాపలుగా చేసి, అనసూయా సాధ్వి జోల పాడే చోట వాడుకున్నారు. కొన్ని పదాలను మాత్రం రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంతం మార్చి, మిగతాదంతా జనబాహుళ్యంలో ఉన్న అన్నమయ్య కీర్తననే యథాతథంగా ఉంచారు. అలా తెరపైకి తొలిసారి అన్నమయ్య కీర్తన ఎక్కింది.
ఒకే టికెట్‌పై... రెండు సినిమాలు!
భక్తితో దైవప్రార్థన చేస్తే, సాధించలేనిది ఏదీ లేదని ఈ ‘సతీ అనసూయ’, ‘ధ్రువ విజయము’ చిత్రాలు రెండింటిలో చక్కగా చూపెట్టారు. నిజానికి, ఇవి రెండు వేర్వేరు చిత్రాలు. ఆ రెండు చిత్రాలనూ కలిపి, ఒకే పూర్తి ప్రోగ్రామ్‌గా హాళ్ళలో ప్రదర్శించారు. రెండు చిత్రాలూ కలిపినా మొత్తం ప్రదర్శన ‘‘2 గంటల 40 నిమిషా’’లే! ఈ ‘అనసూయ – ధ్రువ’ డబుల్ ప్రోగ్రామ్‌లో ఇంటర్వెల్ దాకా ఒక సినిమా, ఇంటర్వెల్ తరువాత రెండో సినిమా ప్రదర్శించేవారు. గమ్మత్తేంటంటే, ‘1936లో సినీ అద్భుతం’గా పేర్కొన్న ఈ ‘‘డబుల్ ప్రోగ్రాముల’’తో పాటు కాశీ పుణ్యక్షేత్రం, హరిద్వార్ ల గురించి తెలుగు వ్యాఖ్యానంతో ఒక రీలు టాపికల్ చిత్రాన్నీ ప్రదర్శించారు.
ఆ సినిమా హాలుకు 105 ఏళ్ళు!
తొలివిడతగా బెజవాడ, రాజమండ్రి, కాకినాడల్లో మే 8న ఈ చిత్ర ద్వయం రిలీజైంది. మే 11న మద్రాస్‌లో విడుదలైంది. విశేషమేమిటంటే చెన్నైలో ఇప్పటికి 105 ఏళ్ళుగా నడుస్తున్న ‘మినర్వా’ టాకీస్ (జార్జ్‌టౌన్‌లో నేటికీ ‘బాషా’ ఏ.సి పేరుతో నడుస్తోంది) ఈ డబుల్ ప్రోగ్రామ్‌తోనే టాకీ హాలు అయింది.
బాలల చిత్రాల్లో... శోభన, చిన్న ఎన్టీఆర్
ఇలా బాలలతోనే సినిమాలు తీసే ప్రయోగాలు తర్వాత మరికొన్ని జరిగాయి. దర్శక – నిర్మాత కె.ఎస్. ప్రకాశరావు మూడు చిన్న చిత్రాల సమాహారంగా ‘బాలానందం’ (1954 ఏప్రిల్ 24)పేర ఒకే ప్రోగ్రాంగా రిలీజ్ చేశారు. ‘బూరెలమూకుడు’, ‘రాజయోగం’, ‘కొంటె కిష్టయ్య’ అనే ఆ 3 చిత్రాలలోనూ పిల్లలే నటులు. అంతా ‘బాలానందసంఘ’ సభ్యులే! నటి, దర్శక, నిర్మాత భానుమతి ‘భక్త ధ్రువ మార్కండేయ’ (1982 నవంబర్ 19) రూపొందించారు. జాతీయ ఉత్తమ నటి–కళాకారిణి శోభన (చిరంజీవి ‘రుద్రవీణ’ హీరోయిన్)కు ఇదే తొలి తెలుగు చిత్రం. తర్వాత ఎమ్మెస్ రెడ్డి నిర్మాతగా, దర్శకుడు గుణశేఖర్ పూర్తిగా బాలలతోనే ‘రామాయణం’ (1997) తీశారు. రాముడిగా నేటి హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆ చిత్రం జాతీయ అవార్డు గెలిచింది. తర్వాత పెద్ద ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘దానవీరశూర కర్ణ’ (1977) స్ఫూర్తితో, అదే కథ – అదే టైటిల్‌తో 2015 ఆగస్టు 15న ఓ బాలల చిత్రం వచ్చింది. జయాపజయాలెలా ఉన్నా ఇలా మొత్తం బాలనటులతోనే కష్టించి సినిమా తీసిన ఈ ప్రయత్నాలు అభినందనీయం!
– రెంటాల జయదేవ
Children's Day 2021: తొలి బాలల టాకీ తెలుగువారిదే!
Published Sun, Nov 14 2021 8:13 AM | Last Updated on Sun, Nov 14 2021 9:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment