
అన్నపూర్ణా స్టూడియోలో ‘బాహుబలి’ డి.ఐ. చేసిన బృంద సభ్యులు సి.వి. రావు, కలరిస్ట్ బి.వి.ఆర్. శివకుమార్
‘బాహుబలి’ ఓపెనింగ్ సీన్ గుర్తుందా? చేతిలో పసికందుతో రమ్యకృష్ణ చీకటిలో నడుచుకుంటూ వస్తుంటుంది. సైనికులు తరుముకొస్తుంటారు. అలాగే, ప్రభాస్ వెంట సైనికులు పడే దృశ్యం కూడా! ఆ దృశ్యాలను చిమ్మచీకటిలో, అంత పర్‌ఫెక్ట్‌గా ఎలా చిత్రీకరించారని ఆశ్చర్యపోతున్నారా? కెమెరామన్ సెంథిల్‌కుమార్ పట్టపగలు తీసిన ఆ దృశ్యాలు అలా రాత్రి పడే క్రీనీడలతో తెరపై కనిపించిందంటే - అదంతా డెరైక్టర్, కెమెరామన్ల ఆలోచన, దాన్ని ఆచరణలో పెట్టిన బి.వి.ఆర్. శివకుమార్ లాంటి కలరిస్టుల బృందం పనితనం! సినీపరిభాషలో చెప్పాలంటే - అంతా ‘డి.ఐ’ మహిమ!!
రాజ్‌తరుణ్ నటించిన ‘ఉయ్యాల - జంపాల’ చూశారా? గోదావరి తీరంలో చెట్టును ఆనుకొని, హీరో నిల్చొని దూరంగా నది మీది వంతెన వైపు చూస్తుంటే, ఆ షాట్‌లో ఆకాశంలో సూర్యుడు నారింజపండు రంగులో మెరుస్తూ కనిపిస్తాడు. షూటింగ్‌లో లేని సూర్యుడు తెరపై ఫ్రేమ్ మీదకెంత సహజంగా వచ్చాడంటే, అంతా కెమేరా పనితనమే అనుకుంటాం. కానీ, కెమెరామన్ మనస్సులో సృష్టించుకొన్న ఆ దృశ్యాన్ని అలా తెరపై పునఃసృష్టించడం కలరిస్టుల గొప్పతనమే. ఇలాంటివెన్నో చేయడాన్ని డిజిటల్ ఇంటర్‌మీడియట్ (డి.ఐ) చేయడమంటారు.
అప్పట్లో గ్రేడింగ్... ఇప్పుడు ‘డి.ఐ’
కంప్యూటర్లు రాని దశలో కేవలం రీళ్ళ ప్రాసెసింగ్, ప్రింటింగ్ టైమ్‌లో కెమెరామన్ సూచన మేరకు ల్యాబ్ టెక్నీషియన్లు ఇలాంటి పనే చేసేవారు. రంగులు ఏ మేరకు తెరపై కనిపించాలనే దాన్ని బట్టి కలర్ గ్రేడింగ్ చేసేవారు. నెగిటివ్‌ల ప్రాసెసింగ్, థియేటర్‌కు పంపే రీళ్ళ ప్రింటింగ్ జరిపేవారు. తొలి రోజుల్లో మాన్యువల్‌గా, తరువాతి రోజుల్లో యంత్రాల సాయంతో ఈ పని సాగింది. ఇప్పుడు అదే పనిని మరిన్ని సౌకర్యాలతో కంప్యూటర్‌లో చేస్తున్నారన్న మాట.
మొన్న మొన్నటిదాకా నెగిటివ్‌తో సినిమా తీసేవారు. అప్పుడు రీళ్ళలోని ఆ విజువల్స్ అన్నీ ముందుగా డిజిటల్‌లోకి మార్చుకొనేవారు. ఆ తరువాత ఆ డిజిటల్ దృశ్యాల్లో రంగులు మరింత ప్రస్ఫుటంగా కనిపించేలా, ఇందాక చెప్పుకున్నట్లు కావాల్సిన ఎఫెక్ట్స్ వచ్చేలా కంప్యూటర్ సాయంతో చేసేవారు. అంతా అయ్యాక ఆ డిజిటల్ అవుట్‌పుట్‌ను మళ్ళీ నెగిటివ్ మీదకు ఎక్కించేవారు. ఆ ఫైనల్ అవుట్‌పుట్ సినిమా నుంచి థియేటర్లలో ప్రదర్శించే పాజిటివ్ ప్రింట్లు వేయించేవారు. ఇలా ఒకప్పుడు సినిమా రీళ్ళ దశలో ఉన్నప్పుడు, మధ్యలో మెరుగులు దిద్దే ఈ డిజిటల్ వ్యవహారాన్ని అంతా ‘డి.ఐ’ అని పిలిచేవారు.
అయితే, ఇప్పుడు సినిమా చిత్రీకరణ మొదలు పోస్ట్‌ప్రొడక్షన్, థియేటర్‌లో ప్రదర్శన - అంతా డిజిటలే! రీళ్ళే లేవు. అందుకే డిజిటల్ మీడియవ్‌ుని మధ్యలో ఉపయోగించడమనే అర్థంలో వాడుతున్న డి.ఐ అనే మాట ఇప్పుడు కరెక్టే కాదు. అందుకే, హాలీవుడ్, బాలీవుడ్‌తో సహా అన్నీ ‘కలర్ కరెక్షన్’, ‘కలరిస్ట్’ లాంటి పదాలే వాడుతున్నాయి. పిలిచే పిలుపు ఏదైనా, ఇవాళ ప్రతి సినిమా ఇలా ‘కలర్ కరెక్షన్’ చేసుకొన్న తరువాతే మన ముందుకొస్తోంది. కావాల్సిన ఎఫెక్ట్స్ ఎన్నో పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ‘డి.ఐ’లో సృష్టించడానికి వీలు చిక్కింది. షూట్ చేసిన ఫుటేజ్‌కీ, తెరపై అవుట్‌పుట్‌కీ తేడా కొట్టొచ్చినట్లు రంగుల్లో కనపడసాగింది.
కంప్యూటర్‌లో కొన్ని వేల ఆప్షన్లు
ఇవాళ డి.ఐ. లేకుండా ఏ సినిమానూ ఊహించలేం. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల టైమ్‌లో తెరపై అంతా ‘ఈవెన్ టోన్’ ఉండేలా చేసేవారు. అది పరిమితమైన కరెక్షన్. కలర్ చిత్రాలు వచ్చాక, గతంలో ‘రెడ్, బ్లూ, గ్రీన్, బ్రైట్‌నెస్’ అనే నాలుగే కంట్రోల్స్‌తో ఈ ఎఫెక్ట్‌లన్నీ చేసేవారు. అవన్నీ రీళ్ళ కాలం నాటి సంగతులు. కానీ, ఇప్పుడు డిజిటల్ యుగంలో కంప్యూటర్‌తో కొన్ని వేల ఆప్షన్లు వచ్చాయి. ‘‘ఇన్ని ఆప్షన్లున్నాయి కాబట్టి, మనకు ఏం కావాలో కెమేరామన్‌కు స్పష్టత ఉండాలి. దాన్ని అవగాహన చేసుకొని కలరిస్ట్ డి.ఐ. చేయాలి. లేదంటే, తప్పు చేసే ప్రమాదం ఉంది’’ అని సీనియర్ కలరిస్ట్ బి.వి.ఆర్. శివకుమార్ అన్నారు. అన్నపూర్ణా స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్న శివకుమార్ ‘ఉయ్యాల జంపాల’, ‘బాహుబలి’ సహా చాలా చిత్రాలకు డి.ఐ. చేశారు.
ఒక్కోసారి లైటింగ్ తదితర విషయాల్లో షూటింగుల్లో జరిగిన తప్పులను కూడా డి.ఐ.లో సరిచేయాల్సి వస్తుంది. ‘‘చాలా సందర్భాల్లో కెమేరామన్లు సరైన అవుట్‌పుట్ ఇవ్వకపోయినా, దాన్ని డి.ఐ. ద్వారా మెరుగుచేయాల్సి ఉంటుంది. కానీ, ఒక మామూలు సినిమా తీసి, దాన్ని ‘అవతార్’ లాగా చేయాలని ఆత్రపడితే అయ్యేపని కాదు. మా దగ్గరకు వచ్చిన ఇన్‌పుట్ ఎంత బాగుంటుందో, అంత బాగా అవుట్‌పుట్ తీర్చిదిద్దుతాం’’ అని శివకుమార్, అన్నపూర్ణా స్టూడియో డి.ఐ. విభాగం జనరల్ మేనేజర్ సి.వి. రావు వ్యాఖ్యానించారు.
తెలుగుకు సంబంధించినంత వరకు తొలిసారిగా డి.ఐ. చేయించిన సినిమా కృష్ణవంశీ ‘శ్రీఆంజనేయం’ (2004) అని పరిశీలకులు చెబుతున్నారు. అప్పటికి ఇంత ప్రాచుర్యం పొందని ఈ ప్రక్రియ కోసం దర్శక - నిర్మాత కృష్ణవంశీ చాలా ఖర్చు పెట్టారు. ఆ తరువాత రోజుల్లో ‘‘చిన్న ఎన్టీయార్ ‘అశోక్’ (2006)ని సూపర్35 కెమెరాలో చిత్రీకరించి, డి.ఐ చేశాం’’ అని సెంథిల్ గుర్తుచేసుకున్నారు. ముంబయ్ నుంచి క్రమంగా చెన్నై, హైదరాబాద్‌లకు డి.ఐ. వచ్చింది.
ప్రీ-ప్రొడక్షన్ నుంచే... అంతా టీమ్‌వర్క్
నిజానికి, డి.ఐ. అనేది పూర్తిగా టీమ్‌వర్క్. కథ, సన్నివేశం మూడ్ తెలుసుకొని, దృశ్యంలో ఆ మూడ్ ఉండేలా డి.ఐ.లో రంగుల్లో గాఢతను కలరిస్ట్ నిర్ణయిస్తారు. అలాగే, కెమెరామన్ కూడా చివరి క్షణం హడావిడి వల్ల షూటింగ్‌లో తాను చేయలేకపోయినవి గుర్తుంచుకొని, డి.ఐలో కలర్‌కరెక్షన్ చేయించుకోవాలి. కెమెరామన్ చెబుతున్నది విజువలైజ్ చేసుకొని, డి.ఐ. చేయడంలో కలరిస్ట్ ప్రతిభ బయటపడుతుంది. కెమెరామన్ సైతం తనతో అనుబంధమున్న కలరిస్ట్‌ను ఎంచుకుంటారు.
ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, తెర మీద విజువల్ ఎక్స్‌పీరియన్స్ కీలకమైన ‘బాహుబలి’ లాంటి సినిమాలకు ప్రీ-ప్రొడక్షన్ దశ నుంచి.... కలరిస్టులను భాగం చేస్తారు. లొకేషన్, సెట్ మారినప్పుడల్లా కలరిస్ట్‌ను పిలుస్తారు. ఎక్కడెలా షూట్ చేస్తున్నదీ చూపిస్తారు. ‘‘షూటింగ్‌లో ఏ రంగులు వాడారో, కాస్ట్యూమ్స్ ఏమిటో కళ్ళారా చూస్తే, రేపు పోస్ట్‌ప్రొడక్షన్‌లో డి.ఐ.లో ఏ ప్యాలెట్ ఆఫ్ కలర్స్ వాడవచ్చో స్పష్టత వస్తుంది’’ అని శివకుమార్ చెప్పారు.
‘బాహుబలి’కి కొత్త పద్ధతి
అలాగే, ఒకప్పుడు రీళ్ళ ప్రింట్లు ఒక్కటే ఉండేవి. కాబట్టి, డి.ఐ. కూడా ఒక రకంగా సులువు. కానీ, ఇప్పుడు డిజిటల్ ప్రింట్లు వచ్చి, ‘క్యూబ్, యు.ఎఫ్.ఒ, పిఎక్స్‌డి, కె సెరాసెరా, స్క్రాబుల్, యునెటైడ్ మీడియా, ఐ-మ్యాక్స్ (4కె వైడ్)’ లాంటి రకరకాల విధానాల్లో థియేటర్‌లో ప్రొజెక్షన్ జరుగుతోంది. కాబట్టి, అన్ని విధానాల్లోనూ తెరపై దృశ్యం ఒకేలా కావాల్సిన ఎఫెక్ట్‌లో కనిపించేలా కలరిస్ట్ జాగ్రత్తపడాల్సి వస్తోంది. అలాగే,షూటింగ్‌కు బ్లాక్ మ్యాజిక్, రెడ్ ఎపిక్, గో ప్రో, ఫాంటమ్, ఆరీ - ఇలా రకరకాల కెమెరాలు వాడుతుంటారు.
ఒక్కో రకం కెమెరాలో ఒక్కో రకం కలర్ స్పేసెస్ ఉంటాయి. సినిమాను వేర్వేరు కెమెరాలతో చిత్రీకరించినా, ఆ మొత్తం విజువల్ ఇన్ఫర్మేషన్‌ను ఒక స్మూత్ ఫ్లో ఉండే లాగా చేయడం డి.ఐ. చేసే కలరిస్ట్ ముందుండే పెద్ద సవాలు. అలా డి.ఐ. చేయడానికి డావిన్సి, లస్టర్, బేస్‌లైట్, మిస్టికా లాంటి రకరకాల మెషిన్లను వాడుతుంటారు.
అయితే, ‘బాహుబలి’కి సంబంధించి డి.ఐ.లో ‘అకాడెమీ కలర్ ఎన్‌కోడింగ్ సిస్టమ్’ (ఏ.సి.ఇ.ఎస్) అనే పద్ధతిని తొలిసారిగా వాడారు. ‘అతి పెద్ద కలర్ స్పేస్’ అయిన దీనివల్ల చిత్రీకరణ సమయంలో కెమేరాతో బంధించిన దృశ్యం తాలూకు సమాచారం కంప్రెస్ కాకుండా, ఫుల్ ఇన్ఫోతో డి.ఐ.కి అందుబాటులో ఉంటుంది. డి.ఐ. చేశాకా విజువల్ ఇన్ఫర్మేషన్ నష్టం కాదు. మల్టీప్లెక్సుల్లో 4కె ప్రొజెక్షన్ ద్వారా వేసినా, చివరకు ప్రపంచంలో రెండో అతి పెద్దతెర ప్రసాద్స్ ‘ఐమ్యాక్స్’ స్క్రీన్‌పై ప్రొజెక్ట్ చేసినా సరే ఎక్కడా చుక్కలు చుక్కలుగా కనిపించదు.
అందుకే, కెమెరామన్, కలరిస్ట్‌ల మధ్య అవగాహన ముఖ్యం. ‘ఫోటోషాప్ లేకుండా - దాంతో కలర్ కరక్షన్, క్రాపింగ్ చేయకుండా ఇవాళ ఫోటోలు ఊహించలేం. అలాగే, కలరిస్టులు, డి.ఐ లేకుండా సినిమాని ఊహించలేం. ఇప్పుడిది మోస్ట్ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్’. ‘బాహుబలి’ లాంటి విజువల్ వండర్స్ తెరపై చూస్తున్నామంటే, తెర వెనుక శివకుమార్ లాంటి కలరిస్ట్‌ల కనిపించని శ్రమ అపారం. అందుకే, ఒక్కముక్కలో ఇవాళ తెరపై సినిమాకు డి.ఐ.యే ఒక బాహుబలి.
- రెంటాల జయదేవ
ఇవాళ డి.ఐ. లేకుండా ఏ సినిమానూ ఊహించలేం. పోస్ట్‌ప్రొడక్షన్‌లో అతి ముఖ్యమైన సపోర్టింగ్ రోల్ దానిది. ‘డి.ఐ’ అంటే వట్టి కలర్ కరెక్షన్ అనుకుంటే పొరపాటే. అంతకు మించిన వ్యవహారం. అవుట్‌డోర్ షూటింగ్‌లో ఒక సీన్ చిత్రీకరణ పొద్దున మొదలుపెడితే, పూర్తయ్యేసరికి సాయంత్రం కావచ్చు. కానీ, తెరపై ఆ షాట్‌లన్నీ ఒకే టైమ్‌లో తీసినట్లనిపించాలి. ఆ జాగ్రత్త డి.ఐ.లో తీసుకుంటాం.
- ‘బాహుబలి’ కెమేరామన్ సెంథిల్‌కుమార్
తెలుసా?
* ‘బాహుబలి’లో దాదాపు 5 వేల వి.ఎఫ్.ఎక్స్. ఫ్రేవ్‌ులున్నాయి.
* దీని డి.ఐ. అన్నపూర్ణా స్టూడియోలోనే, మన కలరిస్ట్‌ల చేతుల్లో జరిగింది.
* ఏ రోజుకారోజు షూటింగ్ అయిపోగానే ‘రా ఫుటేజ్’ మీద కలరిస్ట్‌ల పని మొదలైపోయేది. అలా దాదాపు 2.2 లక్షల ఫ్రేమ్ లపై వర్క్ చేశారు.
* ‘బాహుబలి’ డి.ఐ.కి దాదాపు 8 నెలలు పట్టింది.డి.ఐ. ఎలా చేస్తారంటే...
* షూటింగ్‌లో కెమెరాలో బంధించిన దృశ్యాల ‘రా మెటీరియల్’ను ముందు డి.ఐ.కి ఇస్తారు. అక్కడ కలరిస్ట్ దానికి బేసిక్‌గా కలర్ కరెక్షన్ చేస్తారు.
* ఆ రఫ్ వెర్షన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ (వి.ఎఫ్.ఎక్స్) నిపుణుడికి పంపుతారు.
* అతను దానికి విజువల్ ఎఫెక్ట్స్ జత చేసి, మళ్ళీ డి.ఐ. దగ్గరకి పంపుతారు.
* ఆ అవుట్‌పుట్‌లోని తప్పొప్పుల్ని కెమెరామన్, కలరిస్ట్ చూసి, అవసరాన్ని బట్టి వి.ఎఫ్.ఎక్స్‌కు మళ్ళీ పంపుతారు. అనుకున్న రీతిలో వచ్చేవరకు ఇలా టెన్నిస్‌మ్యాచ్‌లో బంతిలా అటూ ఇటూ ఆ విజువల్స్ వెళుతూ, వస్తాయి.
* ఈ సుదీర్ఘమైన ప్రాసెస్‌లో దర్శకుడు ఊహించిన రీతిలో తుది విజువల్ వచ్చేలా చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో మొదట చిత్రీకరించిన విజువల్ కాస్తా చివరకొచ్చేసరికి ఒక్కోసారి రెట్టింపు మెరుగవుతుంది.