MAA Elections 2021: మాలో మాకు పడదా? | Political Heat in Movie artists association maa elections | Sakshi
Sakshi News home page

MAA Elections 2021: మాలో మాకు పడదా?

Published Thu, Jun 24 2021 5:13 AM | Last Updated on Thu, Jun 24 2021 3:26 PM

Political Heat in Movie artists association maa elections - Sakshi

మరోసారి రచ్చ మొదలైంది. ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) ఎన్నికలు మళ్ళీ ఉత్కంఠభరితంగా మారాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలకు 3 నెలల ముందే వాతావరణం వేడెక్కింది. సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్, ఇటు అంతకన్నా సీనియర్‌ నటుడైన మోహన్‌బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు, ఆ వెంటనే ఉన్నట్టుండి మరో నటి జీవితా రాజశేఖర్‌ ఒకరి తరువాత ఒకరు ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. బుధవారం ‘‘తోటివాళ్ళ ఒత్తిడితో’’ తానూ పోటీకి దిగుతున్నట్టు నటి హేమ ప్రకటించారు. దాంతో ఇప్పుడు సినీ‘మా’ నాలుగుస్తంభాలాట మొదలైంది.

‘మెగా’ మద్దతు ఎటువైపు?
‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ రాజకీయ ప్రశ్నలు సంధించే ప్రకాశ్‌ రాజ్‌ పోటీ ప్రకటన నాటకీయంగానే సాగింది. ఆ మధ్య ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ను విమర్శించిన ప్రకాశ్‌రాజ్, ఇటీవల ‘వకీల్‌ సాబ్‌’ ప్రమోషన్లలో ‘మావి రాజకీయ సైద్ధాంతిక విభేదాలు మాత్రమే’ అంటూ ప్రశంసలు వర్షించారు. ఆ విమర్శలవేళ ప్రకాశ్‌రాజ్‌పై విరుచుకుపడ్డ మెగాబ్రదర్‌ నాగబాబు సైతం ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌ అభ్యర్థిత్వాన్ని బాహాటంగా సమర్థిస్తున్నారు. అంటే మెగాఫ్యామిలీ అండదండలు ప్రకాశ్‌రాజ్‌కు ఉన్నట్టే! నిజానికి, ఎన్నికల బరిలోకి దిగక ముందే చిరంజీవి మద్దతును ప్రకాశ్‌రాజ్‌ ముందుగా కోరారట. మెగాస్టార్‌ తమ పూర్తి మద్దతుంటుందని హామీ ఇచ్చారట. అన్న మాటకు తగ్గట్టే తమ్ముడు నాగబాబూ లైన్‌లోకి వచ్చి, ప్రకాశ్‌రాజ్‌ పోటీ చేస్తానని ప్రపంచానికి చెప్పీచెప్పగానే సమర్థించేశారు. ‘మెగా మద్దతు’ ఎటువైపు ఉందో సిగ్నల్స్‌ ఇచ్చేశారు.


ఇగో క్లాష్‌లు... ఎత్తుకు పైయెత్తులు...
ఎవరికివారే గొప్పనుకొనే కళారంగంలో ఇగో క్లాష్‌లు కామనే! ఈ పోటాపోటీలోనూ అవి చాలా ఉన్నాయని ఖబర్‌. గతంలో ‘మా’ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన యువ హీరో మంచు విష్ణు, సీనియర్‌ ప్రకాశ్‌రాజ్‌కు ప్రత్యర్థిగా దిగడం వెనుక కారణాల్నీ పలువురు చర్చిస్తున్నారు. మోహన్‌బాబు తన పుత్రుడికి మద్దతు కోరి, చిరంజీవికి ఫోన్‌ చేశారట. అప్పటికే ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు హామీ ఇచ్చేశాననీ, మాట తప్పలేననీ చిరంజీవి చెప్పారట. దాంతో మంచు కుటుంబం హర్ట్‌ అయ్యిందని కృష్ణానగర్‌ గుసగుస. అందుకే, తండ్రి ఆశీస్సులతో మంచు వారసుడు పోటీకి సై అంటే సై అన్నారని ఓ టాక్‌.

జూన్‌ 20న మోహన్‌బాబు, విష్ణు స్వయంగా సీనియర్‌ నటుడు కృష్ణ ఇంటికి వెళ్ళి మద్దతు కోరారు. మరో సీనియర్‌ కృష్ణంరాజు ఆశీస్సులూ అందుకున్నారు. ఈ వ్యూహాత్మక ఎత్తుగడ సినీరంగంలో చీలిక, సామాజిక వర్గసమీకరణ అనే వాదనకు సోషల్‌ మీడియాలో తెర లేపింది. అలాగే, ‘మా’ సభ్యుడిగా పోటీకి అన్నివిధాలా అర్హుడైనప్పటికీ, ‘కన్నడిగుడైన ప్రకాశ్‌రాజ్‌కు తెలుగు నటుల సంఘానికి అధ్యక్షుడేమి’టనే ‘లోకల్‌– నాన్‌ లోకల్‌’ చర్చ తెలివిగా తెరపైకొచ్చింది. నిజానికి, బయటకు ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ ఆటలా ఉన్నా, ఆంతరంగికంగా మెగా, మంచు పెద్దల మధ్య మంచి స్నేహం ఉంది. మరి తాజా పోటాపోటీ, ఇగో క్లాష్‌ల
పర్యవసానం ఏమిటి?

పోటీలోకి మరికొందరు!
మరోపక్క ప్రస్తుత కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శి జీవిత, ఇప్పటికే ‘మా’లో వివిధ పదవులు నిర్వహించిన హేమ లాంటి తారలూ అధ్యక్షపదవి పోటీకి దిగడంతో కథ కొత్త మలుపు తిరిగింది. వీరిని ఎటో ఒకవైపు తిప్పుకొనే ప్రయత్నాలూ సాగుతున్నట్టు సమాచారం. ఇక, ఎన్నికల వేళ ఏవో పాత సమస్యలను లేవనెత్తుతూ... బరిలోకి దిగే ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఉండనే ఉంటారు. ఇప్పటికైతే పోటీలో ఇన్ని పేర్లు వినిపిస్తున్నా, పోలింగ్‌ తేదీ నాటికి ఇంతమందీ బరిలో ఉంటారా అన్నదీ అనుమానమే. 2015 ఎన్నికలలో సహా, అనేకసార్లు పెద్ద పోస్టులకు పోటీ దిగినవారు సైతం ఆఖరు నిమిషంలో బరిలో నుంచి తప్పుకున్నారు. ఈసారీ అలాంటివి జరగవచ్చు.

ఎందుకింత మోజు... క్రేజు..?
‘మా’ అధ్యక్షపదవికి ఇంత పోటీ, మోజు ఉండడం ఆశ్చర్యమే! సభ్యుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం 1993 అక్టోబర్‌ 4న మొదలైన ‘మా’కు రెండేళ్ళకోసారి ఎన్నికలవుతాయి. గతంలో కృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, నాగబాబు, రాజేంద్రప్రసాద్, శివాజీరాజా తదితరులు ‘మా’ ప్రెసిడెంట్లుగా పనిచేశారు. మురళీమోహన్‌ అత్యధికంగా 6సార్లు (12 ఏళ్ళు) అధ్యక్షపదవి నిర్వహించారు.  అయితే, దాదాపు రూ. 3 కోట్ల చిల్లర కార్పస్‌ ఫండ్‌ మినహా ‘మా’కు ఆస్తులూ, అంతస్థులూ లేవు. నిధుల సమీకరణ కోసం ఒకçప్పటి బెనిఫిట్‌ షోలూ ఇటీవల లేవు. పెన్షన్, బీమా లాంటి సంక్షేమ చర్యల ఖర్చుతో ఆ నిధీ అంతకంతకూ తరిగిపోతోంది.

ఎన్నికలొస్తే... గాలిలో సొంత మేడలు!
ఇక గడచిన రెండు దశాబ్దాలుగా ఎప్పుడు ‘మా’ ఎన్నికలు జరిగినా వినిపించే హామీ– ‘మా’కు సొంత భవన నిర్మాణం! కానీ ఎంతమంది ప్రెసిడెంట్లు హామీ ఇచ్చినా – అది వట్టి ఎన్నికల హామీగానే మిగిలింది. ప్రతిసారీ ఎన్నికలప్పుడు మాత్రమే సొంత భవనం కల తెర మీదకొచ్చి, ఆ తరువాత అదృశ్యమవడం ఆనవాయితీ అయింది. రానున్న ఎన్నికలకూ అభ్యర్థులందరూ ఆ సొంత ఇంటి పాతపాటనే మళ్ళీ ఎత్తుకున్నారు.

అంతా (అ)సమైక్య రాగమే!
ఎన్ని వాదవివాదాలైనా ఎన్నికలైపోయాక మళ్ళీ ‘అందరం సినిమాతల్లి ముద్దుబిడ్డలం. మేమందరం ఒకటే. ‘మా’లో మాకు విభేదాలు లేవు’ అంటూ గ్రూప్‌ ఫోటోలు దిగడం కామన్‌. లోపల లుకలుకలు, ఇగోలున్నా పైకి మాత్రం ఇలా సమైక్యరాగం ఆలపిస్తుంటారని అందరికీ ఇట్టే అర్థమైపోతుంటుంది. 2015లో పాపులర్‌ ‘రాజేంద్రప్రసాద్‌ వర్సెస్‌ జయసుధ’ పోటాపోటీలో రాజేంద్రప్రసాద్‌ గెలిచిన తరువాత నుంచి ‘మా’ అనైక్యత తరచూ వీధికెక్కుతోంది.

ప్రస్తుతం సీనియర్‌ నరేశ్‌ ప్రెసిడెంటైన కార్యవర్గంలోనైతే కుమ్ములాట తారస్థాయికి చేరింది. ప్రమాణ స్వీకారం రోజున తోటి నటి (హేమ) మైకు లాక్కోవడం దగ్గర నుంచి సాక్షాత్తూ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (రాజశేఖర్‌) వేదికపై విభేదాలను ప్రస్తావించడం, రాజీనామా దాకా ఎన్నో పరిణామాలు – గడచిన రెండేళ్ళలో ‘మా’ను రచ్చకీడ్చాయి.

ఒక దశలో నరేశ్‌ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా మెజారిటీ కార్యవర్గ సభ్యులు కలిసి, కనివిని ఎరుగని రీతిలో ‘అభిశంసన తీర్మానం’తో, పదవి నుంచి తొలగించే ప్రయత్నమూ జరిగింది. చివరకు రాజీబాటలో కొన్నాళ్ళు నరేశ్‌ సెలవు మీద వెళ్ళి, మరో సీనియర్‌ నటుడు బెనర్జీ తాత్కాలికంగా అధ్యక్షబాధ్యత నిర్వహించాల్సొచ్చింది.

ఇక తాజాగా మూడు నెలల తర్వాత జరగాల్సిన ఎన్నికలకు ఇప్పటి నుంచే మొదలైన పోటాపోటీ ఎటు దారితీస్తుందో చూడాలి. కరోనా కష్టకాలంలో ఆర్టిస్టుల కష్టాల కన్నా ఎన్నికల మీద అందరూ దృష్టి పెట్టడమే విచిత్రం! ‘మా’ ప్రతిష్ఠను మసకబార్చే ఈ పోటాపోటీ అసలే థియేటర్లు, సినిమాలు లేని కరోనా వేళ ఆడియన్స్‌కు అనవసర వీధి వినోదాన్ని అందించడమే విషాదం!!


ఈసారైనా స్టార్లు వస్తారా?
కేవలం 150 మంది సభ్యులతో మొదలైన ‘మా’లో దివంగతుల సంఖ్య పోగా, ఇప్పుడున్నది 828 మంది సభ్యులే! వీరందరూ ఓటర్లే. వీళ్ళలో అధికశాతం మంది చిన్నాచితకా ఆర్టిస్టులే. అందుకే, పోలింగ్‌ రోజున ఓటేసే యువ హీరో, హీరోయిన్లు తక్కువే. మహేశ్, జూనియర్‌ ఎన్టీఆర్, ప్రభాస్‌ లాంటి నేటి టాప్‌ స్టార్లయితే కొన్నేళ్ళుగా వార్షిక సర్వసభ్య సమావేశాల్లో కానీ, పోలింగ్‌ లో కానీ కనపడనే లేదు. ఒక్క 2004, 2015లలో తప్ప మరెప్పుడూ ‘మా’ ఎన్నికలలో భారీగా ఓటింగూ జరగలేదు. సగటున ప్రతిసారీ పోలయ్యేది 400 ఓట్లే! అయితే, గ్లామర్‌ నిండిన సినీ సమరం కావడంతో ఈ మాత్రానికే ప్రచారం మాత్రం మీడియాలో హోరెత్తిపోతుంటుంది. 
– రెంటాల జయదేవ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement