‘కొండవీటి సింహం’ @ 40 ఇయర్స్‌ | kondaveeti simham completes 40 years in film industry | Sakshi
Sakshi News home page

Kondaveeti Simham Movie: ‘కొండవీటి సింహం’ @ 40 ఇయర్స్‌

Published Thu, Oct 7 2021 12:10 AM | Last Updated on Thu, Oct 7 2021 10:46 AM

kondaveeti simham completes 40 years in film industry - Sakshi

ఫ్యాషన్‌... సినిమా... ఈ రెండు రంగాల్లో కాలాన్ని బట్టి ట్రెండ్‌ మారిపోవడం సహజం. అలా ట్రెండ్‌ మార్చినవీ, మార్చిన ట్రెండ్‌లో వచ్చినవీ సంచలన విజయం సాధిస్తాయి. తెలుగు వాణిజ్య సినిమాకు ‘అడవి రాముడు’ ఓ ట్రెండ్‌సెట్టర్‌. అక్కడ నుంచి ‘వేటగాడు’ (1979) దాకా వరుసగా ఆరు పాటలు, 3 ఫైట్ల ఆ కమర్షియల్‌ ధోరణిదే రాజ్యం. ఆ వైఖరిని మార్చింది – కె. విశ్వనాథ్‌ ‘శంకరాభరణం’ (1980). ఆ సంగీతభరిత కళాత్మక చిత్రం తరువాత ‘గజదొంగ’ లాంటి కమర్షియల్‌ సినిమాలకు మునుపటి జోరు తగ్గింది. దాంతో, మాస్‌ హీరోల వాణిజ్య సినిమా పాత పద్ధతి మార్చుకోవాల్సి వచ్చింది. కొత్త దారి తొక్కి, తనను తాను పునరావిష్కరించుకొనే పనిలో పడింది. ఆ మథనంలో నుంచి వచ్చినదే – మెలోడ్రామా నిండిన పెద్ద వయసు హీరో పాత్రల ట్రెండ్‌. తండ్రీ కొడుకుల పాత్రలు అంతఃసంఘర్షణ పడే స్టార్‌ హీరో డ్యుయల్‌ రోల్‌ ఫార్ములా. ఎన్టీఆర్‌ – దాసరి ‘సర్దార్‌ పాపారాయుడు’ నుంచి తెలుగు తెరపై ఇది బాక్సాఫీస్‌ విజయసూత్రమైంది. పాపారాయుడు సంచలన విజయం తరువాత ఎన్టీఆర్‌ చేసిన అలాంటి మరో తండ్రీ కొడుకుల డ్యుయల్‌ రోల్‌ బాక్సాఫీస్‌ హిట్‌ – ‘కొండవీటి సింహం’. 1981 అక్టోబర్‌ 7న రిలీజైన ఈ బాక్సాఫీస్‌ హిట్‌కు నేటితో 40 ఏళ్ళు. 



శివాజీ అడ్డుపడ్డ తమిళ ‘తంగపతకం’తోనే...
బాక్సాఫీస్‌ హిట్‌ ‘కొండవీటి సింహం’ కథకు మూలం శివాజీగణేశన్‌ నటించిన తమిళ ‘తంగపతకం’ (1974 జూన్‌ 1). అదే పేరుతో వచ్చిన ఓ తమిళ నాటకం ఆ సినిమాకు ఆధారం. తమిళనాట సూపర్‌ హిట్టయిన ఆ కర్తవ్యదీక్షా పరుడైన పోలీసు అధికారి సెంటిమెంటల్‌ కథాచిత్రం తెలుగు రైట్స్‌ నటుడు అల్లు రామలింగయ్య కొన్నారు. అప్పటికే ఆయన ‘బంట్రోతు భార్య’ (1974), ‘దేవుడే దిగివస్తే’ (1975)తో చిత్ర నిర్మాతగానూ ఎదిగారు. తెలుగులో ఎన్టీఆర్‌తో ఈ రీమేక్‌ నిర్మించాలని అల్లు రామలింగయ్య అనుకున్నారు. నిజానికి, శివాజీ గణేశన్‌ కెరీర్‌ బెస్ట్‌ సినిమాలు అనేకం తెలుగులో ఎన్టీఆరే చేశారు. ‘కలసి ఉంటే కలదు సుఖం’ (తమిళ ‘భాగ పిరివినై’), ‘గుడిగంటలు’ (‘ఆలయమణి’), ‘రక్తసంబంధం’ (‘పాశమలర్‌’), ‘ఆత్మబంధువు’ (‘పడిక్కాదమేదై’) – ఇలా అనేకం అలా సూపర్‌ హిట్‌ రీమేక్స్‌ అయ్యాయి. 

 కానీ, ఎందుకనో ఈసారి శివాజీగణేశన్‌కు మనస్కరించలేదు. ‘తంగపతకం’ తనకే మిగిలిపోవాలని అనుకున్నట్టున్నారు. అందుకే, ఆ చిత్రాన్ని శివాజీయే సమర్పిస్తూ, అల్లుతో ‘బంగారు పతకం’ (1976) పేరిట తెలుగులో డబ్బింగ్‌ చేయించారు. ఆ డబ్బింగ్‌ చిత్రం కూడా హిట్టే. కానీ, అలా మిస్సయిన ఆ సెంటిమెంట్‌ కథలోని అంశాలే సరిగ్గా మరో ఏడేళ్ళకు ‘కొండవీటి సింహం’కి పునాది అయ్యాయి. ‘వేటగాడు’ హిట్‌ తర్వాత ఎన్టీఆర్‌తో మరో సినిమా కోసం రోజా మూవీస్‌ అధినేత ఎం. అర్జునరాజు రెండేళ్ళు నిరీక్షించారు. ఎన్టీఆర్‌తో ప్రాజెక్ట్‌ ఓకే కాగానే, దర్శక, రచయితలతో ఆ పాత తమిళ హిట్‌ మళ్ళీ చర్చకు వచ్చింది. రైట్స్‌ సమస్య వచ్చే ‘తంగపతకం’ రీమేక్‌లా కాకుండా, అదే కథను వేరే పద్ధతిలోకి మార్చారు. మాస్, సెంటిమెంట్‌ రెండూ పండేలా రచయిత సత్యానంద్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు ‘కొండవీటి సింహం’ కథను తీర్చిదిద్దారు. శివాజీ కెరీర్‌ బెస్ట్‌ చిత్రాల్లో ఒకటైన ఆ పోలీసు కథ, ఆ పాత్ర, అదే క్యారెక్టరైజేషన్‌ తెలుగులో మళ్ళీ ఎన్టీఆరే చేశారు. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల చరిత్ర సృష్టించారు. 

(చదవండి: Prabhas: ప్రభాస్‌కు అబద్ధం ఎందుకు చెప్పావు? నటుడికి యంగ్‌ హీరో క్వశ్చన్‌)

చిరంజీవిని అనుకొని మోహన్‌బాబుతో...ఎన్టీఆర్‌ ‘వేటగాడు’ హిందీ రీమేక్‌ ‘నిషానా’ రజతోత్సవం జరిపిన రోజునే, 1981 మే 21న మద్రాసు ప్రసాద్‌ స్టూడియోలో‘కొండవీటి సింహం’ షూటింగ్‌ ప్రారంభమైంది. తమిళ కథకు భిన్నంగా తెలుగులో సిన్సియర్‌ పోలీసాఫీసర్‌ తండ్రికి ఇద్దరు కొడుకులు. ఒకడు మంచివాడు, రెండోవాడు చెడ్డవాడు. తండ్రి, మంచి కొడుకు పాత్రల్లో హీరో ద్విపాత్రాభినయం. అదీ ప్రధానమైన మార్పు. ఎస్పీ రంజిత్‌ కుమార్‌గా, కొడుకు రాముగా ఎన్టీఆర్‌ జీవం పోశారు. ఇక, తండ్రికి తలవంపులు తెచ్చే చెడ్డ కొడుకుగా మోహన్‌బాబు నటనకు మంచి పేరొచ్చింది.

నిజానికి, ఈ చెడ్డ కొడుకు పాత్రకు దర్శక, నిర్మాతలు మొదట అనుకున్న నటుడు – నేటి మెగా హీరో చిరంజీవి. పాటలు, డ్యాన్సులు, విలన్‌ తరహా పాత్రలతో పేరు తెచ్చుకుంటున్న చిరంజీవి పేరుతో సహా తారాగణం వివరాల పత్రికా ప్రకటన కూడా చేశారు. స్క్రిప్టులో హీరోయిన్‌ గీత టైప్‌మిషన్‌ దగ్గర ఐ లవ్యూ చెప్పే సీన్‌లో ఒక డ్యూయెట్‌ కూడా అనుకున్నారు. అంతకు ముందు అంతగా ఆడని ‘తిరుగులేని మనిషి’లో తొలిసారిగా ఎన్టీఆర్‌తో కలసి చిరంజీవి నటించారు. సెంటిమెంట్లు బలంగా పనిచేసే సినీరంగంలో చివరకు ‘కొండవీటి సింహం’లోని నెగటివ్‌ పాత్రకు చిరంజీవి బదులు మోహన్‌బాబును తీసుకున్నారు. చిరంజీవి కోసం అనుకున్న డ్యూయెట్‌ను కూడా స్క్రిప్టులో నుంచి తొలగించేశారు. 

ఎన్టీఆర్‌తో కొత్త క్లైమాక్స్‌... రీషూట్‌!
చెడ్డవాడైన కొడుకును పోలీసు విధి నిర్వహణలో తండ్రే చంపేయడం, ఆ అంకితభావానికి మెచ్చి ప్రభుత్వం బంగారు పతకం ఇవ్వడం – శివాజీ ‘తంగపతకం’ క్లైమాక్స్‌. ‘కొండవీటి సింహం’కి కూడా మొదట ఎన్టీఆరే, కొడుకు మోహన్‌బాబును చంపినట్టు, అదే రకం క్లైమాక్స్‌ తీశారు. కానీ, ఆ తర్వాత ఎందుకనో దర్శక, రచయితలు పునరాలోచనలో పడ్డారు. కర్తవ్య నిర్వహణలో తండ్రి పాత్రే మరణించినట్టు తీస్తే, సెంటిమెంట్‌ మరింత పండుతుందని భావించారు. నిజానికి, అప్పటికే 3 షెడ్యూళ్ళలో 30 రోజుల్లో సినిమా అయిపోయింది. అలాంటిది మళ్ళీ ఆ ఏడాది ఆగస్టు చివరలో ఒక వారం అదనపు డేట్లు తీసుకొని, హొగెనకల్‌ వెళ్ళి, కొత్త క్లైమాక్స్‌ తీశారు. అలా ఇప్పుడు సినిమాలో ఉన్న రెండో క్లైమాక్స్‌ వచ్చింది.

క్రాంతికుమార్‌ అంచనా తప్పింది!
అయిపోయిన చిత్రాన్ని రీషూట్‌ చేస్తున్నారనే సరికి, ఎన్నో అనుమానాలు, సినిమా బాగా లేదనే పుకార్లు షికారు చేశాయి. కొత్త క్లైమాక్స్‌తో సినిమా సిద్ధమయ్యాక, సలహా కోసం సీనియర్‌ దర్శక – నిర్మాత క్రాంతికుమార్‌కు ప్రివ్యూ చూపించారు. ‘మొదటి 10 నిమిషాలు, చివరి 10 నిమిషాలే ఇది ఎన్టీఆర్‌ సినిమా. మిగతా అంతా ఏయన్నార్‌ సినిమాలా ఉంది. జనం మెచ్చరు’ అంటూ ఈ ఫ్యామిలీ సెంటిమెంట్‌ చిత్రంపై పెదవి విరిచారు. దాంతో, నిర్మాతలూ కొంత భయపడి, రిలీజుకు ముందే అన్ని ఏరియాలూ సినిమా అమ్మేశారు. తీరా రిలీజయ్యాక ‘కొండవీటి సింహం’ ఆ భయాలు, అనుమానాలను బాక్సాఫీస్‌ వద్ద బద్దలు కొట్టింది. 1981 అక్టోబర్‌ 7న విజయదశమి కానుకగా రిలీజైన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించింది. సినిమా ప్రదర్శన హక్కులు కొన్న ప్రతి ఒక్కరికీ పెట్టిన రూపాయికి అయిదు నుంచి పది రూపాయల లాభం రావడం అప్పట్లో సంచలనం.

కన్నీటికి... మహిళల కలెక్షన్ల వాన
పెద్ద వయసు భార్యాభర్తల అనురాగాలు, అనారోగ్యంతో చక్రాల కుర్చీకే భార్య పరిమితమైతే భర్తే ఆమెకు సేవలు చేసే అనుబంధాలు, దారితప్పిన కొడుకుతో తల్లితండ్రుల అంతఃసంఘర్షణ, కన్నతల్లి కడచూపునకు కూడా రాని కొడుకు అమానవీయత – ఇవన్నీ ‘కొండవీటి సింహం’ కథకు ఆయువుపట్టు. మాస్‌ అంశాలకు, మనసును ఆర్ద్రంగా మార్చే ఈ లేడీస్‌ సెంటిమెంట్‌ తోడవడంతో మహిళలు తండోపతండాలుగా వచ్చి, ఈ సినిమాను మెచ్చారు. ‘మా ఇంటిలోన మహలక్ష్మి నీవే...’ అంటూ ఎన్టీఆర్, జయంతిపై వచ్చే కరుణ రస గీతం జనం గుండెల్లో నిలిచిపోయింది. కన్నీళ్ళతో కరిగిన రిపీట్‌ లేడీ ఆడియన్స్‌ ఘన నీరాజనంతో కలెక్షన్ల వర్షం కురిసింది. 

బాక్సాఫీస్‌ సింహగర్జన
కర్తవ్యనిర్వహణ అనే మాస్‌ ఎలిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్‌ – రెండింటినీ రంగరించిన చిత్రం ఇది. ఎస్పీ రంజిత్‌ కుమార్‌గా తండ్రి పాత్రలో ఎన్టీఆర్‌ గంభీరమైన నటనకు జనం జేజేలు పలికారు. ఆ రోజుల్లో 47 ప్రింట్లతో, 43 కేంద్రాల్లో ‘కొండవీటి సింహం’ రిలీజైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో క్రిక్కిరిసిన ప్రేక్షకులతో 70 రోజులాడింది. అప్పటికి అత్యధికంగా 37 కేంద్రాలలో వంద రోజులు జరుపుకొంది. ఏకంగా 15 కేంద్రాల్లో సిల్వర్‌ జూబ్లీ చేసుకుంది. వైజాగ్‌లో షిఫ్టులతో 315 రోజులు ప్రదర్శితమైంది. అలాగే, లేట్‌ రన్‌లో సైతం ఈ బాక్సాఫీస్‌ సింహం దాదాపు 200 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం, 15 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఫస్ట్‌ రిలీజుకు నాలుగు నెలల తర్వాత రిలీజైన అనకాపల్లిలో నేరుగా 178 రోజులు ఆడి, లేట్‌ రన్‌లో ఇప్పటికీ స్టేట్‌ రికార్డుగా నిలిచి ఉంది.
(చదవండి: ChaySam: ‘నేను నీ దాన్ని.. నీవు నా వాడివి’.. పోస్ట్‌ వైరల్‌)

సీమలో 4 ఆటల సంస్కృతి
విశేషం ఏమిటంటే, సాధారణంగా వారం, రెండు వారాలు మాత్రమే సినిమాలు ఆడే మారుమూల ‘సి’ క్లాస్‌ సెంటర్లలో సైతం విపరీతమైన మహిళాదరణ ఫలితంగా ‘కొండవీటి సింహం’ 50 రోజులు ఆడింది. పలు కేంద్రాల్లో మునుపటి రికార్డ్‌ చిత్రాల వంద రోజుల వసూళ్ళను, నాలుగంటే 4 వారాలకే దాటేసింది. ఒకప్పుడు రాయలసీమ ఏరియాలో సాధారణంగా ఫస్ట్‌ షో, సెకండ్‌ షోలే ఎక్కువ రోజులు వేసేవారు. ఎన్టీఆర్‌ ‘అడవిరాముడు’  చిత్రం సీమలో మ్యాట్నీతో సహా 3 ఆటలను రెగ్యులర్‌ షోల పద్ధతిగా అలవాటు చేసింది. ఇక, రెగ్యులర్‌ గా మార్నింగ్‌ షోల సంస్కృతిని ప్రవేశపెట్టి, రోజూ 4 ఆటల పద్ధతిని నేర్పింది – ఎన్టీఆర్‌దే ‘కొండవీటి సింహం’.

ఆనాటి ఇండస్ట్రీ రికార్డ్‌... ఇదే!
వసూళ్ళపరంగా ఇండస్ట్రీ రికార్డుల్లోనూ ఎన్టీఆర్‌ కాలంతో పోటీపడ్డారు. యాభై రోజులకు ఎన్టీఆర్‌ ‘అడవి రాముడు’ రూ. 81 లక్షలతో రికార్డు. తరువాత ఎన్టీఆర్‌దే ‘వేటగాడు’ రూ. 96 లక్షలతో కొత్త రికార్డయింది. ఇక, ‘కొండవీటి సింహం’ యాభై రోజులకు కనివిని ఎరుగని రీతిలో రూ. 1.21 కోట్ల గ్రాస్‌ సంపాదించింది. అప్పటికి సరికొత్త ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది. 

అప్పట్లో వంద రోజులకు సింగిల్‌ థియేటర్‌ కలెక్షన్లలో స్టేట్‌ రికార్డులూ పెద్ద ఎన్టీఆర్‌వే. ‘అడవి రాముడు’ (1977 – హైదరాబాద్‌ ‘వెంకటేశా’ థియేటర్‌లో) రూ. 9.40 లక్షలు ఆర్జించింది. ఆ వెంటనే ‘వేటగాడు’ (హైదరాబాద్‌ ‘సంగమ్‌’లో) రూ. 9.90 లక్షలు సంపాదించింది. ‘కొండవీటి సింహం’ (వైజాగ్‌ ‘శరత్‌’లో) రూ. 9.95 లక్షలు తెచ్చింది. దాసరి – ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లోని ‘బొబ్బిలిపులి’ (1982– హైదరాబాద్‌ ‘సుదర్శన్‌’లో) ఏకంగా రూ. 10.06 లక్షలు సంపాదించి, పై మూడు రికార్డులనూ దాటేసింది. అలా 1977 నుంచి 1982 దాకా ఆరేళ్ళ పాటు ఎన్టీఆర్‌ ఎప్పటికప్పుడు తన రికార్డును తానే బద్దలుకొడుతూ దూసుకెళ్ళి, ఏకంగా రాజకీయ సింహాసనాన్నే అధిష్ఠించేశారు.

జయంతి సెకండ్‌ ఇన్నింగ్స్‌ షురూ!
తమిళంలో కె.ఆర్‌. విజయ చేసిన తల్లి పాత్రకు ఇటీవలే కన్నుమూసిన సీనియర్‌ నటి జయంతి తెలుగులో ప్రాణం పోశారు. చక్రవర్తి సంగీతం, వేటూరి సాహిత్యంతో ఈ సినిమాలోని 7 పాటలూ హిట్టే. శ్రీదేవితో వచ్చే ‘బంగినపల్లి మామిడిపండు..’, ‘అత్త మడుగు వాగులోన..’, ‘వానొచ్చే వరదొచ్చే..’, ‘పిల్ల ఉంది..‘ లాంటి మాస్‌ పాటలతో పాటు జయంతితో వచ్చే ‘ఈ మధుమాసంలో ఈ దరహాసంలో..’ లాంటి హుందా డ్యూయట్‌ కూడా నేటికీ నాటి ప్రేక్షక జనం నోట నానుతుండడం గమనార్హం. ఎన్టీఆర్‌ ‘జగదేక వీరుని కథ’ (1961)తో మొదలైన జయంతి ప్రస్థానం సరిగ్గా ఇరవై ఏళ్ళ తరువాత అదే ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ‘కొండవీటి సింహం’తో కొత్త మలుపు తిరిగింది. ఈ తరహా సెంటిమెంటల్‌ భార్య, అమ్మ పాత్రలకు ఆమె పెట్టింది పేరయ్యారు. ఈ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కృష్ణ ‘రక్తసంబంధం’ సహా పలువురు పెద్ద హీరోల ఓల్డ్‌ క్యారెక్టర్లకు ఆమె సరిజోడీ అయ్యారు. 

ఈ కథ సత్తా అది...
కొన్ని కథలు ఏ భాషలోకి వెళ్ళినా సార్వజనీనంగా మెప్పిస్తాయి. ‘తంగపతకం’ డ్రామా హిట్‌. అదే పేరుతో సినిమాగా (1974) తమిళంలో పెద్ద హిట్‌. దాన్ని తెలుగులో ‘బంగారుపతకం’ (1976)గా అనువదిస్తే, అదీ హిట్టు. రైట్స్‌ లేని ఆ కథనే కొంతమార్చి, ‘కొండవీటి సింహం’ (1981) చేస్తే బాక్సాఫీస్‌ రికార్డు. హిందీలో ఈ కొత్త కథను జితేంద్ర, హేమమాలినితో ‘ఫర్జ్‌ ఔర్‌ కానూన్‌’ (1982 ఆగస్ట్‌ 6)గా ఇదే దర్శక, నిర్మాతలు చేస్తే అదీ ఓకే. మరోపక్క ‘తంగపతకం’ అధికారిక హిందీ రీమేక్‌గా దిలీప్‌కుమార్, అమితాబ్‌ బచ్చన్‌లు కలసి నటించిన ఏకైక చిత్రం ‘శక్తి’ (1982 అక్టోబర్‌ 1) రిలీజైంది. రమేశ్‌ సిప్పీ దర్శకత్వంలో అదీ బంపర్‌ హిట్‌. అన్నయ్య పోలీసు – తమ్ముడు దొంగ – వారి మధ్య ఘర్షణ, పిల్లల మధ్య నలిగిన తల్లి ఆత్మసంఘర్షణగా వచ్చిన అమితాబ్‌ సూపర్‌హిట్‌ ‘దీవార్‌’ (1975)లోనూ ఈ కథ ఛాయలు కనిపిస్తాయి. వెరసి, అనేక భాషల్లో, అనేక కోణాల్లో తిరిగి, వెళ్ళిన ప్రతిచోటా విజయవంతం కావడం ఈ సెంటిమెంటల్‌ పోలీసు కథ బాక్సాఫీస్‌ సత్తా. 

ఒకే వేదికపై... రెండు సింహాలు
1982 జనవరి 21వ తేదీ సాయంత్రం మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ హాలులో ‘కొండవీటి సింహం’ శతదినోత్సవం జరిగింది. షావుకారు జానకి వ్యాఖ్యాత్రిగా సాగిన ఉత్సవానికి దర్శక, నిర్మాత ఎల్వీ ప్రసాద్‌ అధ్యక్షత వహిస్తే, ఎన్టీఆర్‌కు సమకాలికుడైన మరో స్టార్‌ హీరో ఏయన్నార్‌ ముఖ్య అతిథిగా వచ్చి, జ్ఞాపికలు అందజేశారు. ఎన్టీఆర్‌పై సభాంగణం బాల్కనీ నుంచి అభిమానులు పుష్పవృష్టి కురిపించడం విశేషం. ఎన్టీఆర్, ఏయన్నార్లను రెండు సింహాలుగా ప్రస్తావిస్తూ, 'ఈ ఇద్దరు ఉన్నంత కాలం తెలుగు సినీ పరిశ్రమకు ఏ బాధా లేద'ని ఎల్వీ ప్రసాద్‌ పేర్కొనడం విశేషం.

ఎన్టీఆర్‌ సింహమే కానీ, శారీరకంగా తాను సింహం కాదని ఏయన్నార్‌ అంటే – దానికి ఎన్టీఆర్‌ తన ప్రసంగంలో బదులిచ్చారు. శారీరకంగా సింహం కాకపోవచ్చేమో కానీ, మేధాపరంగా అలాంటివాడే ఏయన్నార్‌ అన్నారు. 'చిన్న విగ్రహమైనప్పటికీ గాంధీ ప్రజల్ని సమీకరించి, దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు కదా' అని ఎన్టీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇక, ఒకానొకప్పుడు తాను రిటైర్‌ అవుతానంటే, ‘బ్రదర్‌! ఆర్టిస్టు రిటైర్‌ కాకూడదు’ అని సలహా ఇచ్చింది ఎన్టీఆరే అని వేదికపై ఏయన్నార్‌ వెల్లడించారు. ‘ప్రేక్షకులు ఆదరించినంత కాలం మేమిద్దరం సినిమా రంగం నుంచి రిటైర్‌ అయ్యే ప్రసక్తే లేదు’ అని తమ ఇద్దరి తరఫున ఎన్టీఆర్‌ ఆ సభలో ప్రకటించడం విశేషం. మొత్తానికి, ‘కొండవీటి సింహం’ శతదినోత్సవ సంరంభం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం.
    
రాజకీయాల్లోకి... ఘనమైన సినీ వీడ్కోలు
ఎంట్రీ ఎంత గొప్పగా ఉంటుందో, ఎగ్జిట్‌ కూడా అంతే హుందాగా, గౌరవంగా ఉండాలంటారు. జనాదరణతో ముడిపడిన సినీరంగంలో ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటారు. మరీ ముఖ్యంగా స్టార్లు. రాజకీయాల్లోకి వెళ్ళే ముందు నటరత్న ఎన్టీరామారావుకు అలాంటి అద్భుతమైన విజయాలతో తెలుగు సినీ పరిశ్రమ నుచి ఘనమైన వీడ్కోలు దక్కింది. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళే ముందు వరుసగా దక్కిన నాలుగు బ్లాక్‌బస్టర్‌ హిట్లలో ‘కొండవీటి సింహం’ రెండోది. దేశభక్తి, స్వాతంత్య్ర సమర నేపథ్యంలో ‘సర్దార్‌ పాపారాయుడు’, చట్టం – పోలీసు వ్యవస్థతో ‘కొండవీటి సింహం’, న్యాయవ్యవస్థతో ‘జస్టిస్‌ చౌదరి’, సైన్యం – విప్లవ నేపథ్యంతో ‘బొబ్బిలిపులి’ – ఇలా నాలుగూ నాలుగు వేర్వేరు నేపథ్యాలతో, విభిన్నమైన చిత్రాలు కావడం విశేషం. అన్నీ సంచలన విజయాలే. ఆ రోజుల్లో ఈ 4 సినిమాల డైలాగులూ ఎల్పీ రికార్డులుగా రావడం మరో విశేషం. ఎన్టీఆర్‌ రాజకీయ పార్టీ పెట్టిన కొత్తల్లో ‘కొండవీటి సింహం’ డైలాగ్‌లు క్యాసెట్లుగా వచ్చి, ఊరూవాడా మారుమోగడం మరీ విశేషం. వెరసి, ఎన్టీఆర్‌ కెరీర్‌లో, అలాగే తెలుగు బాక్సాఫీస్‌ చరిత్రలో ‘కొండవీటి సింహం’ అప్పటికీ, ఇప్పటికీ స్పెషల్‌. 
– రెంటాల జయదేవ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement