విశ్వజయం | Valentine's Day Special k.Viswanath | Sakshi
Sakshi News home page

విశ్వజయం

Published Sun, Feb 14 2016 3:33 AM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

విశ్వజయం

విశ్వజయం

విశ్వాన్ని జయించడానికి జయలక్ష్మి లాంటి సహచరి కావాలి. జయాన్ని విశ్వమంతా గుర్తించాలంటే విశ్వనాథ్ లాంటి మార్గదర్శి కావాలి. విశ్వజయానికి ప్రేమ కావాలి. స్వచ్ఛమైన ప్రేమ కావాలి. దిసీజ్ ది స్టోరీ ఆఫ్ టు సోల్‌మేట్స్. ఈ దంపతుల ప్రేమలో ఆత్మ ఉంది.  అయినా... ఆత్మీయమైన ప్రేమకు  ఒక రోజెలా సరిపోతుంది? అందుకే ‘ప్రేమికుల రోజు’, ‘వరల్డ్ మ్యారేజ్ డే’ లాంటివి లాంఛనాలు మాత్రమే.
 
* ఆదిదంపతుల లాంటి మీకు నమస్కారమండీ! విశ్వనాథ్ గారూ! ఏమిటీ గడ్డం పెంచారు? కొత్త సినిమా గెటప్పా?
కె. విశ్వనాథ్: అదేమీ లేదండీ! (సరదాగా...) ఈ గడ్డం చూసైనా, కొత్త తరహా వేషాలు వస్తాయేమోనని!
 జయలక్ష్మి: (నవ్వేస్తూ) ఆ..అదొకటి కూడానా! (నవ్వులు)
 విశ్వనాథ్: ఈ 19న నా బర్‌‌తడేకైనా తీసేయమని గొడవ!
     
* ఇంతకీ, మీ పెళ్ళి తేదీ గుర్తుందా?
జయలక్ష్మి: (అందుకుంటూ...) నా పుట్టినరోజు వినాయక చవితి. ఇక, మా పెళ్ళి రోజు అక్టోబర్ రెండో తేదీ.
     
* పెళ్ళైన తొలినాళ్ళు, కొత్తకాపురం సంగతులు గుర్తున్నాయా?
జయలక్ష్మి: అప్పుడు నాకు 14 ఏళ్ళు. ఆయనకు 19 ఏళ్ళు. నేను పదో తరగతి చదువుతుండగానే పెళ్ళయింది. ఆ తరువాత కాపురానికొచ్చేశాను. మద్రాసుకు వచ్చిన కొత్తల్లో వడపళని దగ్గర చిన్న ఇంట్లో ఉన్న రోజులు గుర్తే!
విశ్వనాథ్: (నవ్వుతూ) అప్పట్లో సౌండ్‌రికార్డిస్ట్‌గా నా జీతం 75 రూపాయలు. చాప వేసుకొని పడుకొంటే, చేతికి చెప్పుల స్టాండ్ తగిలేంత చిన్న అద్దె గది. దానికి రూ. 20 అద్దె. ఆ గదికి ముందు కొబ్బరాకులతో చిన్న వరండా లాంటిది వేస్తే బాగుంటుందనుకొనేవాణ్ణి. చివరకు మా ఓనర్ వేయించాడు. కాకపోతే, మరో 5 రూపాయలు అద్దె పెంచాడు (నవ్వులు...).  అక్కడ దానికి ఆనుకొని తోటమాలి ఉండేవాడు. అతనికి ఓ కూతురు. పిచ్చిది.
జయలక్ష్మి: ఆ అమ్మాయి పేరు ఇంద్రాణి! నాకు గుర్తే!
విశ్వనాథ్: మా నాన్న గారు వాళ్ళు మా ఆవిడను కాపురానికి తీసుకొని బెజవాడ నుంచి మద్రాసుకు ‘మెయిల్’లో ఉదయాన్నే వచ్చారు. చెక్క భోషాణంలో సరుకులు, సామాన్లు అవీ తీసుకొచ్చారు. కానీ నాన్న గారితో ఇంటి సంగతులు చెప్పి ఇబ్బంది పడతారని ‘వెంటనే వెళ్ళిపొమ్మన్నా’. ఉదయం కాపురానికొచ్చిన మా ఆవిడ వాళ్ళు ఆ సాయంత్రమే వెళ్ళిపోయారు (నవ్వు).
 జయలక్ష్మి: తర్వాత మళ్ళీ వచ్చాం లెండి!
విశ్వనాథ్: ఇల్లంటే బెజవాడలో పెరిగిన రోజులు గుర్తుకొస్తాయి. కృష్ణలంకలో తాడికొండవారి తోటలో మా ఇల్లు. అప్పట్లో అగ్నిప్రమాదాలు, కృష్ణానదికి వరదలెక్కువ. ఏది జరిగినా ఇంట్లో నుంచి సామాన్లన్నీ తీసుకొని, కట్ట మీదకొచ్చి, కాలక్షేపం చేసేవాళ్ళం. మా తర్వాతే నా ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్ళకి పురుళ్ళు పుణ్యాలొస్తే తనే! పెద్దవాళ్ళను చూసుకొనేదీ తనే! ఏడాదిలో 8 నెలలు బెజవాడలో, 4 నెలలు మద్రాసులో!
     
* మరి, మిస్సయిన ఫీలింగ్ ఉండేదా?
జయలక్ష్మి: ఎప్పుడూలేదు. అత్తమామల సేవలో తృప్తుంది.చల్లగావున్నామంటే వారి ఆశీర్వాదం.
 విశ్వనాథ్: అప్పట్లో నైట్ షూటింగ్స్ ఎక్కువ. రికార్డిస్ట్‌గా రాత్రంతా పనిచేసి, ఉదయాన్నే స్టూడియో క్యాంటీన్‌లో టిఫిన్ చేసొచ్చి, రూమ్‌లో పడుకొనేవాణ్ణి. సాయంత్రమే లేవడం! మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు. లేవగానే స్నానం చేసి, స్టూడియోకి. వేరే ధ్యాసే లేదు.
జయలక్ష్మి: సేవ చేసేది పరాయివాళ్లకని అనుకోలేదు. మా అత్తగారికి ఆయన కన్నా నా మీదే నమ్మకముండేది.
విశ్వనాథ్: పెళ్లయిన ఎనిమిదేళ్లకు మాకు పిల్లలు పుట్టారు. నేను అన్నపూర్ణా సంస్థలో చాకిరీ చేస్తున్న రోజులవి. మా మొదటి సంతానం... అమ్మాయి పుట్టింది. విజయవాడలో అమెరికన్ ఆసుపత్రిలో డెలివరీ. మా మేనమామ అర్జెంట్‌గా రమ్మని ఫోన్ చేస్తే, వెళ్ళా. ఆరోగ్యం బాలేని పసిగుడ్డుని ఒళ్ళో పెట్టుకొని, ‘చంద్ర శేఖరాష్టకం’ చదువుకుంటూ మా ఆవిడ కనిపించింది. అప్పుడు ‘వెలుగు నీడలు’ రీరికార్డింగ్ జరుగుతోంది. రీరికార్డింగ్ నోట్స్ నా దగ్గరే ఉంది. నేను దర్శకుణ్ణి కాకున్నాసరే వెంటనే మద్రాసెళ్ళిపోయా. దాన్ని మూర్ఖత్వమనుకోవాలి! ఆమె మాత్రం ఏమీ అనుకోలేదు.
     
* ఫలానా చేయలేకపోయానన్న గిల్టీ ఫీలింగ్ ఏమైనా ఉందా?
విశ్వనాథ్: స్కూల్ ఫైనలయ్యాక చదువుతానంటూ అప్పట్లో మా ఆవిడ ఉత్తరం రాసింది. పరిస్థితుల వల్ల కంటిన్యూ చేయించలేదు. అదే ఇప్పటికీ నాకు పెద్ద గిల్టీ.
జయలక్ష్మి: నాకు బాధేమీ లేదు. టెన్త్ వరకే చదివినా, ఇప్పటికీ గుర్తే. మనవరాళ్ళు చదువుతుంటే నేను సరిదిద్దుతా. ‘ఇవన్నీ తెలుసా బామ్మా!’ అని ఆశ్చర్యపోతుంటారు.

* మీ చిన్నప్పటి కబుర్లు, స్కూలు విషయాలు చెప్పండమ్మా?
జయలక్ష్మి: మాది కైకలూరు. మా పుట్టింటి వారు ‘బందా’ వారు. ప్రముఖ రంగస్థల కళాకారులు బందా కనకలింగేశ్వరరావు మాకు దాయాదులే! నాన్న గారు, బాబాయి అప్పట్లో ఇక్కడ హైదరాబాద్‌లో నిజామ్ వారి రైల్వేస్‌లో పనిచేసేవారు. రజాకార్ల ఉద్యమ సమయంలో కైకలూరు వచ్చేశారు. తర్వాత అన్నయ్య చదువుకి బందరు మారాం. అక్కడ లేడీ యాంథల్ మిషనరీ స్కూల్లో చదివా.  
     
* మీ పెళ్ళెలా కుదిరింది? అయినవాళ్ళ సంబంధమా?
జయలక్ష్మి: (నవ్వుతూ) లేదు. బయట సంబంధమే! అదో కథ. అన్నయ్య పెళ్లి చేసుకున్న వారి వైపు నుంచి ఒక సంబంధం వచ్చింది. అంతా సిద్ధమనుకున్నాక, తీరా అది తప్పిపోయింది. అప్పుడీయనతో పెళ్ళి జరిగింది.
విశ్వనాథ్: నాదీ ఓ పిట్టకథ ఉంది. ప్రసిద్ధ ఓరియంటల్ పబ్లిషింగ్ కంపెనీకి విజయవాడ మేనేజర్‌గా మా మేనమామ పనిచేసేవారు. మంచి మనిషి. వాళ్ళ యజమానికి ముగ్గురు కూతుళ్ళు. ఆ రోజుల్లోనే కోట్ల ఆస్తి. రెండో అమ్మాయిని చూడడానికి తెనాలి తీసుకెళ్ళాడు మా మేనమామ. తీరా చేసుకోనంటే, మామయ్య చెడతిట్టాడు. నా చిత్రాల్లో ‘సాక్షి’ రంగారావు పాత్రల స్వభావం ఆయనదే!
     
* సంసారం నడుపుకోవడం, మంచీచెడు ఎలా నేర్చుకున్నారు!
విశ్వనాథ్: ఏదైనా పొరపాటు చేద్దామన్నా ‘నాన్న గారేమంటారో, అమ్మేమంటుందో’ అనే భయం ఉండేది. డిసిప్లిన్డ్ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీవ్యాల్యూస్‌తో పెరిగాం. ‘తల్లి తండ్రుల్ని ప్రేమించవలె’నని ప్రత్యేకించి నీతులు చెప్పక్కర్లేదు.
 
జయలక్ష్మి: మన ప్రవర్తన బాగుంటే పిల్లలూ ఆ దోవలోనే. అత్తమామల్తో వచ్చేపోయే చుట్టాలతో సర్దుబాటెలా ఉండేది?
జయలక్ష్మి: బంధువుల్ని చూస్తే పిల్లలకు ఆనందం! బంధువులెవరైనా వచ్చివెళ్ళిపోతుంటే, దిగులు వాళ్ళకు! ‘వెళ్లద్దు మావయ్యా’ అని ఆప్యాయత చూపేవారు. కానీ, అంతమందికి వండడం, వడ్డించడం...
జయలక్ష్మి: కష్టం అనుకుంటే కష్టం, ఆనందం అనుకుంటే ఆనందం. కలసి పని చేసుకునేవాళ్లం.  
 
* వంటలో ఆయనెప్పుడైనా సాయం చేసేవారా?

జయలక్ష్మి: వంట చేయడం నామోషీ కాదు. మా మామ గారు వంటలో సాయం చేసేవారు. ఈయనా కూరలు తరగడంలో సాయపడతారు. అదేగా దాంపత్యమంటే!

* తరాలతో ప్రేమ, పెళ్లి మీద అభిప్రాయాలు మారుతున్నాయి!
జయలక్ష్మి: ఎప్పుడూ ప్రేమలు, పెళ్లిల్లూ ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయండి ఈ ప్రపంచంలో. భార్యలను కొట్టే మొగుళ్లున్నారు, ప్రేమగా చూసుకునే వారున్నారు. తల్లితండ్రులు కొట్టుకుంటుంటే పిల్లలూ అలాగే తయారవుతారు.
     
* విశ్వనాథ్ గారికి ఒక్కోసారి కాస్తంత కోపం ఎక్కువేమో!
జయలక్ష్మి: అబ్బే లేదండీ! అది చీకాకు. పని అనుకున్నట్లు జరగకపోతే వస్తుంది. వచ్చినా ఒక్క క్షణమే!  

* భార్యాభర్తలకు సరిపడకపోయినా కాపురం చేయాలా?
విశ్వనాథ్: అవసరం లేదు. రోజూ తిట్టుకొని, కొట్టుకొనే కన్నా ఆ బంధం నుంచి బయటకొచ్చేయచ్చు. ‘మాంగల్యానికి మరో ముడి’ సినిమాలో అదే చెప్పా.  
జయలక్ష్మి: సరైన కారణాలుంటే సరే. ప్రతి చిన్నదానికీ విడాకులొద్దు. పిడుగుకీ బియ్యానికీ ఒకే మంత్రం కుదర్దు.
విశ్వనాథ్: మహిళలు బాధ్యతలన్నీ నిర్వర్తించడం నాట్ ఎ జోక్. అందుకే సినిమాల్లో స్త్రీలని ఉన్నతంగా చూపిస్తా. మ్యారీడ్ కపుల్‌పై లవ్‌స్టోరీ తీయాలని ఇప్పుడనిపిస్తోంది.
జయలక్ష్మి: అవును... ఇంత జీవితం చూసిన తర్వాత ఇదివరకటి కన్నా ఇప్పుడే బాగా తీయగలరు కూడా! (నవ్వులు)
     
* మీరు ఎప్పుడైనా షూటింగ్‌లకు వెళ్లేవారా?
 జయలక్ష్మి: ఏముందనక్కడ ఇల్లు వదిలేసి వెళ్లడానికి! పిల్లలకీ అదే అలవాటైంది. ఆయన సినిమాలేస్తే చూసేవాళ్ళం.
     
* ఆయనలో మీకు నచ్చని అంశం ఏదైనా ఉందా?
జయలక్ష్మి: నచ్చని అంశం ఏమీ లేదు కానీ, ఆయనకు డబ్బు విషయంలో శ్రద్ధ తక్కువ. అదే చెబుతుంటాను.
విశ్వనాథ్: అది నిజం. యావ లేదు, శ్రద్ధా తక్కువే. లేకపోతే కోట్లు కూడబెట్టేవాళ్ళం! అయినా తృప్తిగా ఉన్నాం. నలుగురొస్తే అన్నం పెట్టగలుగుతున్నాం. ఇంకేం కావాలి!
     
* మరి మీరు మీ శ్రీమతికి ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి?

 విశ్వనాథ్: ఐ హ్యావ్ గివెన్ హర్ త్రీ గుడ్ చిల్డ్రన్.
 జయలక్ష్మి: (నవ్వుతూ) ఇంకేం కావాలి.. పిల్లలు బంగారం!
 విశ్వనాథ్: మా కోడళ్ళు అంతకన్నా బంగారాలు!

* అది సరే! మీరెప్పుడైనా మీ శ్రీమతికి చీరలు కొని తెచ్చేవారా?
జయలక్ష్మి: (అందుకుంటూ) తెచ్చినా, నాకు నచ్చేది కాదు!
విశ్వనాథ్: (నవ్వుతూ) నాకు ఆలివ్ గ్రీన్ రంగు ఇష్టం. వాళ్ళేమో దాన్ని పాచి రంగనేవారు. ఒకసారి మద్రాస్‌లో చీర కొని, బెజవాడ తీసుకెళ్ళా. చీర చూడగానే ‘ఎంత’ అంది మా ఆవిడ. ‘నాలుగువేలు’ అని చెప్పగానే ‘అంత ధర కనబడట్లేదే చీరలో’ అనేసింది. నా గాలి పోయింది!
     
* అప్పట్లో అత్తా కోడళ్లు అంటే అమ్మా కూతుళ్లలా ఉండేవారా?
జయలక్ష్మి: అప్పుడైనా ఇప్పుడైనా అలాగే ఉండాల్సింది!
విశ్వనాథ్: నా సినిమాల్లో కూడా అలాగే చూపించేవాడిని.
     
* మీ మధ్య ఎప్పుడైనా, ఏదైనా విషయంలో గొడవలు?
విశ్వనాథ్: ఇప్పటివరకూ ఎలాంటి గొడవలూ లేవు, రావు!
జయలక్ష్మి: మీరెన్ని రాసినా రావు (నవ్వులు...)!
     
* విశ్వనాథ్ గారూ! ఇలాంటి జీవిత భాగస్వామి దొరకడం...?
విశ్వనాథ్: నిజంగా నా అదృష్టం.
జయలక్ష్మి: సేమ్ టు సేమ్. ఇది నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం. ఆయన బింబం... నేను అద్దంలో కనిపించే ప్రతిబింబం. ఏ తేడా లేదు.
సాక్షి: అభిమాన దేవుళ్ళ నుంచి మీకు శతమానం భవతి.
- రెంటాల జయదేవ
 
విశ్వనాథ్: పెద్ద నగ కొంటే, డైమండ్ రింగ్ కొనిస్తేనే ప్రేమ అనుకోకండి. మా నాన్న గారు అప్పట్లో వాహినీ పిక్చర్స్‌లో ఫిల్మ్ రిప్రెజెంటేటివ్. ఆయన జీతం నెలకు 24 రూపాయలు. రోజుకు రూపాయి పావలా బేటా. ఎన్ని టూర్లకు వెళ్ళినా, ఆ కొద్ది మొత్తంలోనే జాగ్రత్తగా మిగిల్చి, తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మకు కచ్చితంగా చీర తెచ్చేవారు. మాకు చాక్లెట్లు తెచ్చేవారు. మలబార్‌కు వెళ్ళినప్పుడు ఆవకాయ ముక్కలు కోసే కత్తి పట్టుకొస్తే, పెద్ద విషయం. నాకు మూడుచక్రాల సైకిల్ కొన్నారు. అదే మాకు రోల్స్‌రాయిస్ కారు! ప్రేమ, వాత్సల్యానికి ప్రతిరూపాలైన వాటికి విలువెవరు కట్టగలరు!
 
విశ్వనాథ్: భార్యాభర్తల మధ్య తప్పనిసరిగా ఉండాల్సింది పరస్పరం నమ్మకం. ప్రేమ, గౌరవం మన హృదయాంతరాళంలో నుంచి రావాలి. అంతేకాని, ప్రత్యేకించి ఫాదర్స్ డే, మదర్స్ డే, ప్రేమికుల దినం, వైవాహిక దినం - అని ఏడాదికి ఒక రోజే మొక్కుబడిగా చేసుకోవడంలో అర్థం లేదు.

జయలక్ష్మి: ప్రేమ ఉన్నప్పుడు ఏదీ తప్పుగా అనిపించనే అనిపించదు. ఏమైనా,  డబ్బు వల్ల సమస్యలొస్తాయి. అతిగా కోరికలు లేకుండా, ఉన్నదాంట్లో తృప్తి పడితే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. ‘కోరికలు దుఃఖహేతువులు’ అని బుద్ధుడు ఏనాడో చెప్పాడు కదా! (నవ్వులు...)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement