2020వ సంవత్సరానికి గాను తాజా 68వ జాతీయ అవార్డుల ప్రకటన తెలుగు సినీ రంగానికి కొంత సంతోషమిచ్చినా, తమిళం (10 అవార్డులు), మలయాళం (9 అవార్డులు)తో పోలిస్తే, మన ఫీచర్ ఫిల్మ్‌లకు నాలుగే అవార్డులు దక్కాయన్న అసంతృప్తినీ మిగిల్చింది. సంఖ్యాపరంగా, బాక్సాఫీస్ లెక్కల పరంగా దేశాన్ని ఊపేస్తున్న తెలుగు సినిమాకు తగిన న్యాయం జరగలేదా? తాజా జాతీయ అవార్డుల తుది నిర్ణాయక సంఘంలో ఏకైక తెలుగు సభ్యుడు – ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్యతో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ...
► ఈ అవార్డుల ఎంపికలో మీ పాత్ర ఏమిటి?
జాతీయ అవార్డ్స్‌లో రెండు విడతల వడపోతతో ఫీచర్ ఫిల్మ్‌ల అవార్డుల నిర్ణయం ఉంటుంది. ఈసారి తొలి వడపోతలో నార్త్, ఈస్ట్, వెస్ట్‌లకు ఒక్కొక్కటీ, సౌత్‌కు రెండు – మొత్తం 5 ప్రాంతీయ జ్యూరీలున్నాయి. ప్రతి జ్యూరీలో అయిదుగురు సభ్యులు. ఇలా 25 మంది వచ్చిన మొత్తం ఎంట్రీల నుంచి బాగున్న ఆయా భాషా చిత్రాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. అలా తొలి వడపోతలో మిగిలిన ఎంట్రీలను ఫైనల్ జ్యూరీ రెండో వడపోత చేసి, తుది అవార్డులు ప్రకటించింది. ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 30 భాషల్లో కలిపి 305 దాకా ఎంట్రీలొచ్చాయి.
ప్రాంతీయ జ్యూరీల దశ దాటి ఫైనల్స్‌కు వచ్చినవి 67 సినిమాలే. ఫైనల్ జ్యూరీలో ప్రాంతీయ జ్యూరీల ఛైర్మన్లు అయిదుగురు, మరో ఆరుగురు కొత్త సభ్యులుంటారు. వారిలో ఒకరు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ ఫైనల్ జ్యూరీ 11 మందిలో ఏకైక తెలుగువాడిగా బాధ్యత నిర్వహించా.
► మీ బాధ్యత, పాత్ర మీకు తృప్తినిచ్చాయా?
చిన్నప్పుడు బెజవాడలో సినిమాపై పిచ్చిప్రేమతో టికెట్ల కోసం హాళ్ళ దగ్గర కొట్టుకొని చూసిన సామాన్య ప్రేక్షకుడి స్థాయి నుంచి ఇవాళ ప్రభుత్వ సౌకర్యాలతో రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 10 దాకా దేశంలోని ఉత్తమ సినిమాలెన్నో చూసే స్థాయికి రావడం ఫిల్మ్ లవర్‌గా నాకు మరపురాని అనుభూతి, అనుభవం.
► తమిళ, మలయాళాలతో పోలిస్తే బాగా తక్కువగా తెలుగుకు నాలుగు అవార్డులే వచ్చాయేం?
ప్రాంతీయ జ్యూరీకి మొత్తం ఎన్ని తెలుగు ఎంట్రీలు వచ్చాయో తెలీదు. ఫైనల్స్‌లో మా ముందుకొచ్చినవి ‘కలర్ ఫోటో’, ‘నాట్యం’, ‘ప్లేబ్యాక్’, ‘సీజన్ ఆఫ్ ఇన్నోసెన్స్’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, నితిన్ ‘భీష్మ’, విష్వక్సేన్ ‘హిట్–1’, – ఇలా ఏడెనిమిది తెలుగు సినిమాలే. ఆ లెక్కన 4 అవార్డులు మరీ తక్కువేం కాదు. ఒకప్పుడు ఉత్తమ ప్రాంతీయ చిత్రం మినహా మరే అవార్డూ దక్కని తెలుగు సినిమాకు ఇప్పుడిన్ని రావడం గమనార్హం.
► తప్పు ఎక్కడ జరిగిందంటారు?
అవార్డుల ఎంపికలో అయితే కానే కాదు. కరోనాతో 2020లో సినిమాలు, ఎంట్రీలూ తగ్గాయి. కాకపోతే, సౌత్ ప్రాంతీయ జ్యూరీలు రెండిట్లోనూ తెలుగువారెవరూ లేకపోవడంతో, ఫైనల్స్‌కు మనవి ఎక్కువ చేరలేదేమో! బయట నేను చూసిన కొన్ని బాగున్న సినిమాలు కూడా ఫైనల్స్ పోటీలో రాలేదు ఎందుకనో! రెండు తెలుగు రాష్ట్రాలున్నా, ఇన్ని సినిమాలు తీస్తున్నా... ఒకే సభ్యుణ్ణి తీసుకోవడం తప్పే! ఇద్దరేసి వంతున రెండు రాష్ట్రాలకూ కలిపి నలుగురుండాలని చెప్పాను. కొన్ని రాష్ట్రాల నుంచి అవగాహన ఉన్న మంచి జర్నలిస్టులూ సభ్యులుగా వచ్చారు. అలా మన నుంచి ఎందుకు పంపరు?
► మన భాషకు న్యాయం జరగలేదని ఒప్పుకుంటారా?
నా వాదన ఎంట్రీలు చూసిన సభ్యుల సంఖ్య విషయంలోనే! అవార్డుల సంగతికొస్తే కాసేపు తెలుగును పక్కనపెట్టి చూడండి. ఈసారి ప్రమాణాలు లేవని ఉత్తమ క్రిటిక్, గుజరాతీ, ఒడియా భాషల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డులే ఇవ్వలేదు. బాగున్న కొన్ని మారుమూల భాషలకూ అవార్డులిచ్చారు. ప్రోత్సహించాలంటూ ప్రమాణాలు లేకున్నా ప్రతి కేటగిరీలో ఎవరో ఒకరికి అవార్డులు ఇవ్వడం సరికాదని ఛైర్మన్ మొదటి నుంచీ గట్టిగా నిలబడ్డారు. జ్యూరీ పారదర్శకంగా, నిజాయతీగా చర్చించి అర్హులైనవారికే అవార్డులిచ్చింది.
► ఇతర భాషలతో పోలిస్తే మనం ఎక్కడున్నాం?
ఇతర భాషలకు ఎక్కువ అవార్డులొచ్చాయి గనక మనమేమీ చేయట్లేదనుకోవడం తప్పు. మనం ఎక్కువ వినోదం, వసూళ్ళ మోడల్‌లో వెళుతున్నాం. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే అంశంలో మనమే ముందున్నాం. సాంకేతికంగా, నిర్మాణపరంగా, ఈస్థటికల్‌గా, ప్రేక్షకుల కిచ్చే వినోదపరంగా మన తెలుగు సినిమా చాలా బాగుంది. మనకు ప్రతిభకు కొదవ లేదు కానీ, అవార్డుల మీద ఫోకస్సే లేదు. కొన్నిసార్లు హీరో ఇమేజ్ కోసం కథలో కాంప్రమైజ్ కావడం, పాటలు, ఫైట్లు పెట్టడం లాంటివి మనకు ఎక్కువ. అలా చేయని మల యాళ, తదితర భాషా చిత్రాలకు మనకన్నా అవార్డులు ఎక్కువ రావచ్చు. అయినా, అవార్డు అనేది ఆ ఒక్క సినిమాకే వర్తిస్తుంది. మొత్తం పరిశ్రమకు కాదు. సహజత్వానికి దగ్గరగా తీసే సినిమాలకు వసూళ్ళు వచ్చే మోడల్ తమిళ, మలయాళాల్లో లాగా మన దగ్గరుంటే, మనమూ అలాంటి సినిమాలు తీయగలం.
► అవార్డుల్లోనూ దేశం తెలుగు వైపు తలతిప్పేలా చేయాలంటే...?
(నవ్వుతూ...) మరిన్ని మంచి సినిమాలు తీయాలి. వాటిని అవార్డ్స్‌కు ఎంట్రీలుగా పంపాలి. ‘జాతీయ అవార్డులు మనకు రావులే’ అని ముందుగానే మనకు మనమే అనేసుకుంటే ఎలా? అప్లయ్ చేస్తేనేగా అవార్డొచ్చేది! తమిళ, మలయాళ, కన్నడ, చివరకు అస్సామీకి వచ్చినన్ని ఎక్కువ ఎంట్రీలు మనకు రాలేదు. ప్రయత్నలోపం మనదే! మనకు నాలుగే అవార్డులు రావడానికి అదే కారణం. అలాగే, అవార్డులకు అప్లికేషన్ సరిగ్గా నింపకపోవడం, పూర్తి వివరాలు ఇవ్వకపోవడం, సరైన కేటగిరీకి ఎంట్రీగా పంపకపోవడం, పంపిన సినిమాల్లోనూ టెక్నికల్ సమస్యల వల్ల కూడా తెలుగు సినిమాలు ఛాన్స్ పోగొట్టుకుంటున్నాయి. దీనిపై మన ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా విస్తృత ప్రచారం చేసి, అవగాహన పెంచాలని నా అభ్యర్థన. నా వంతుగా నేనూ పరిస్థితులు వివరించేందుకు కృషి చేస్తా!
► మీరు ఒంటరి కాబట్టి, నేషనల్ అవార్డులకై కొట్లాడాల్సి వచ్చిందా?
జ్యూరీ అంతా సినీ అనుభవజ్ఞులే. ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటారు. ఓటింగ్ కూడా ఉంటుంది. స్నేహంగానే ఎవరి పాయింట్ వారు వినిపించాం. ప్రతి తెలుగు ఎంట్రీకీ దానికి తగ్గ కేటగిరీలో అవార్డు వచ్చేందుకు నా వాదన నేనూ వినిపించా. సహజత్వానికీ దగ్గరగా ఉన్నందుకు అత్యధిక ఓట్లతో ‘కలర్ ఫోటో’కూ, స్క్రీన్‌ప్లేలో భాగమయ్యేలా పాటలకు సంగీతాన్నిచ్చి కోట్లమందికి చేరిన ‘అల వైకుంఠపురములో...’కూ, పాశ్చాత్య – సంప్రదాయ రీతుల మేళవింపుగా పూర్తి డ్యాన్స్ ఫిల్మ్ తీసి, మేకప్‌లోనూ వైవిధ్యం చూపిన ‘నాట్యం’కి – ఇలా 4 అవార్డులొచ్చాయి. సహజంగానే అన్నిటికీ రావుగా! అయితే, మన గొంతు మనం బలంగా వినిపించకపోతే, మనకు రావాల్సినవి కూడా రావు. అవార్డుల్లోనే కాదు అన్నిటా అది చేదు నిజం!
– రెంటాల జయదేవ
అడగకపోతే... అవార్డులూ రావు!
Published Sun, Jul 24 2022 1:03 AM | Last Updated on Sun, Jul 24 2022 1:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment