vn adithya
-
నా కెరీర్లో చేస్తున్న చాలెంజింగ్ క్యారెక్టర్ ‘ఫణి’: కేథరిన్ ట్రెసా
వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమాకి ‘ఫణి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో కేథరిన్ ట్రెసా లీడ్ రోల్ చేస్తున్నారు. ఏయు–ఐ స్టూడియో పద్మనాభరెడ్డి సమర్పణలో ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్‌లో మీనాక్షి అనిపిండి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ని డా. తోటకూర ప్రసాద్ విడుదల చేయగా, నిర్మాత అనిల్ సుంకర బ్యానర్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘కేథరిన్ లేకుంటే మా ‘ఫణి’ లేదు. ఆమె ధైర్యానికి అభినందనలు’’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత డా. మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ– ‘‘ఫణి’ ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మా సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అని తెలిపారు. ‘‘నా కెరీర్లో చేస్తున్న చాలెంజింగ్ క్యారెక్టర్ ‘ఫణి’ సినిమాలోనిదే. ఓ మంచి థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’’ అని కేథరిన్ ట్రెసా చెప్పారు. -
డైరెక్టర్ వీఎన్ ఆదిత్య కొత్త సినిమా.. అమెరికాలో ఆడిషన్స్
సీనియర్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య గతంలో పలు తెలుగు సినిమాలు తీశారు. మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తీసిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: సాయిపల్లవి ఇకపై హీరోయిన్ కమ్ డాక్టర్.. వీడియో వైరల్)డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మాత వ్యవహరిస్తున్న కొత్త సినిమా కోసం యూఎస్‌లోని డల్లాస్‌లో తాజాగా ఆడిషన్స్ జరిగాయి. ఇందులో ప్రవాస భారతీయులతో పాటు విదేశీయులు కూడా పలువురు పాల్గొన్నారు. సున్నితమైన భావోద్వేగాలతో ఈ సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ నుంచి కొత్త అప్డేట్స్ రావొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) -
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థపై సీనియర్ డైరెక్టర్ ఆగ్రహం.. కారణమేంటి?
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. మనసంతా నువ్వే, నేనున్నాను లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అలాంటిది ఇతడు గత కొన్నేళ్లుగా మూవీస్ తీస్తున్నప్పటికీ అవి రిలీజ్ కావడం లేదు. అయితే అందుకు గల కారణాన్ని ఇప్పుడు ఈయనే బయటపెట్టాడు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్లో దర్శకుడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రస్తుతం.. 'మిస్టర్ బచ్చన్, విశ్వం, మా కాళి, స్వాగ్ సినిమాలని నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల గురించి టీమ్ అంతా చర్చించుకున్నామని చెప్పి ఓ ఫొటో పోస్ట్ చేశారు. దీనికి బదులిస్తూనే దర్శకుడు వీఎన్ ఆదిత్య షాకింగ్ కామెంట్స్ చేశారు."నా మూడు సెన్సిబుల్ సినిమాలు ఈ సంస్థ ద్వారా విడుదల అవుతాయని గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా. మీ కంపెనీ పెద్దలు నా సినిమాల విడుదల గురించి అరక్షణం ఆలోచిస్తే సరిపోతుంది. నేను సహనం కోల్పోయా. అందుకే ఇలా అడగాల్సి వస్తోంది' అని వీఎన్ ఆదిత్య ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. ఈయన డైరెక్ట్ చేసిన లవ్@ 65, మర్యాద కృష్ణయ్య, మీరెవరు లాంటి మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికి ఏళ్లకు ఏళ్లు జాప్యం చేస్తుండటంత వీఎన్ ఆదిత్య ఇలా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరి దీనికి సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు: మృణాల్ ఠాకుర్) -
జర్నీ టు అయోధ్య
శ్రీరామ నవమిని పురస్కరించుకుని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ అధినేత వేణు దోనేపూడి ‘జర్నీ టు అయోధ్య’ (వర్కింగ్ టైటిల్) పేరుతో సినిమా ప్రకటించారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘విశ్వం’ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ బేనర్లో ‘జర్నీ టు అయోధ్య’ రెండో సినిమా. దర్శకుడు వీఎన్ ఆదిత్య ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ‘‘అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ్ర΄÷డక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే వీఎన్ ఆదిత్య నేతృత్వంలో అయోధ్య సహా పలు చోట్ల లొకేషన్స్ పరిశీలిస్తున్నారు. ఒక యంగ్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి దర్శక– నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారధ్యం వహిస్తున్నారు. -
ప్రముఖ డైరెక్టర్ వీఎన్ ఆదిత్యకు గౌరవ డాక్టరేట్
"మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నారు డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న ఆదిత్యకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ వివిధ రంగాలలోని ప్రముఖులకి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. ఈ డాక్టరేట్ గౌరవాన్ని.. అందులో సినీ రంగం నుంచి దర్శకుడు వీఎన్ ఆదిత్య డాక్టరేట్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ఐఈఎస్ సలహాదారు శివప్ప, సెక్రటరీ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి, జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ డైరెక్టర్ నీలమణి, నేషనల్ SC & ST కమిషన్ సభ్యుడు దినేష్ గురూజీ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. 'ఈ డాక్టరేట్ గౌరవాన్ని మా అమ్మగారికి అంకితం ఇస్తున్నాను. నాకే కాదు అమ్మకు కూడా.. నేను సినీ రంగంలో కాకుండా విద్యారంగంలో ఉన్నతస్థాయిలో ఉండాలని అమ్మ కోరుకుంది. నేను ఇష్టపడిన చిత్ర రంగంలో డాక్టరేట్ పొందడం నాకే కాదు అమ్మకు కూడా సంతోషాన్నిచ్చే విషయం. నాకు గౌరవ డాక్టరేట్ అందించిన అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను' అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. -
'ఘంటసాలకు భారతరత్న వస్తే అవార్డుకే అందం'
స్వాతంత్ర సమరయోధుడు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుకు భారతరత్న వచ్చేందుకు మనమంతా కృషి చేయాలని ప్రముఖ టాలీవుడ్ దర్శకులు ఆదిత్య, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘంటసాల శత జయంతి వేడుకల సందర్భంగా కేంద్రం అవార్డు ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని నీలిమ గడ్డమణగు వ్యాఖ్యాతగా సెప్టెంబర్ 18న వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలను ఏకతాటిపైకి తీసుకొస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అంశంపై అమెరికాలోని శంకర నేత్రాలయ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో టీవీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ ' మీరందరు విదేశాల్లో ఉండి కూడా ఘంటసాలకి భారతరత్న రావాలన్న మీ ప్రయత్నాలకు మా అందరి తరఫున అభినందనలు. ముఖ్యంగా ఘంటసాల కుటుంబ సభ్యులను భాగస్వామ్యం చేయడం, అందరినీ కలుపుకొని పోవడం అభినందనీయం. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఘంటసాల జాతీయ సంపద.. స్వాతంత్ర సమరయోధుడు. వందల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడం, కొన్ని వేల పాటలు పాడటం ఇలా అన్ని విధాలుగా వారు భారతరత్నకు అర్హులు' అని అన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ 'ఈ కార్యక్రమం గురించి ఈ మధ్యనే విన్నా. ఘంటసాలకు భారతరత్న వస్తే అది భారతరత్నకే అందం. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు అందిస్తే మా నాన్న నాకు ఘంటసాల పాటలు, సాహిత్యాన్ని అందించారు. అదే మా నాన్న నాకిచ్చిన వారసత్వం. ఆయన పాటలు, సాహిత్యాన్ని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తూ వారికి పూర్తి సహకారం అందిస్తానని' తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ 'ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం. ఇది చాలా గొప్ప కార్యక్రమం. మా ముందు తరాల వారికీ ఆయన ఒక దేవుడు. సంగీతం లో గాన గంధర్వుడు. మంచి గాయకుడే కాకుండా 100కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. నాకు ఘంటసాల పాటలు అంటే చాలా ఇష్టం. ఆయన సంగీత దర్శకత్వం వహించిన రెండు సినిమాలు మాయాబజార్, గుండమ్మ కథ. ఆ సినిమాలో వారు పాడిన పాటలు ఇప్పటికి ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన శతజయంతి ఉత్సవాలు జరపడం గొప్ప విషయం. మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. ఆయనకు భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'అని అన్నారు. ఘంటసాలకు భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరమని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఘంటసాలకి కేంద్రం భారతరత్న అవార్డుతో సత్కరించాలని కోరారు. విదేశాల్లోని తెలుగు సంస్థలు, ఇతర సంస్థలు ఏకతాటిపై వచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో గతంలో ఘంటసాల కార్యక్రమాలకు సాంకేతిక సహాయం అందించిన ప్రమీలకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ప్రముఖ మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, ప్రముఖ సింగర్స్ గీత మాధురి, మాళవిక, ఇండియన్ ఐడల్ రన్నరప్ రోహిత్, అనురూప్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, శంకర్ నేత్రాలయ, యూఎస్ఏ బోర్డు సభ్యులు సౌమియా నారాయణన్, లక్ష్మయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అడగకపోతే... అవార్డులూ రావు!
2020వ సంవత్సరానికి గాను తాజా 68వ జాతీయ అవార్డుల ప్రకటన తెలుగు సినీ రంగానికి కొంత సంతోషమిచ్చినా, తమిళం (10 అవార్డులు), మలయాళం (9 అవార్డులు)తో పోలిస్తే, మన ఫీచర్ ఫిల్మ్‌లకు నాలుగే అవార్డులు దక్కాయన్న అసంతృప్తినీ మిగిల్చింది. సంఖ్యాపరంగా, బాక్సాఫీస్ లెక్కల పరంగా దేశాన్ని ఊపేస్తున్న తెలుగు సినిమాకు తగిన న్యాయం జరగలేదా? తాజా జాతీయ అవార్డుల తుది నిర్ణాయక సంఘంలో ఏకైక తెలుగు సభ్యుడు – ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్యతో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ... ► ఈ అవార్డుల ఎంపికలో మీ పాత్ర ఏమిటి? జాతీయ అవార్డ్స్‌లో రెండు విడతల వడపోతతో ఫీచర్ ఫిల్మ్‌ల అవార్డుల నిర్ణయం ఉంటుంది. ఈసారి తొలి వడపోతలో నార్త్, ఈస్ట్, వెస్ట్‌లకు ఒక్కొక్కటీ, సౌత్‌కు రెండు – మొత్తం 5 ప్రాంతీయ జ్యూరీలున్నాయి. ప్రతి జ్యూరీలో అయిదుగురు సభ్యులు. ఇలా 25 మంది వచ్చిన మొత్తం ఎంట్రీల నుంచి బాగున్న ఆయా భాషా చిత్రాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. అలా తొలి వడపోతలో మిగిలిన ఎంట్రీలను ఫైనల్ జ్యూరీ రెండో వడపోత చేసి, తుది అవార్డులు ప్రకటించింది. ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 30 భాషల్లో కలిపి 305 దాకా ఎంట్రీలొచ్చాయి. ప్రాంతీయ జ్యూరీల దశ దాటి ఫైనల్స్‌కు వచ్చినవి 67 సినిమాలే. ఫైనల్ జ్యూరీలో ప్రాంతీయ జ్యూరీల ఛైర్మన్లు అయిదుగురు, మరో ఆరుగురు కొత్త సభ్యులుంటారు. వారిలో ఒకరు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ ఫైనల్ జ్యూరీ 11 మందిలో ఏకైక తెలుగువాడిగా బాధ్యత నిర్వహించా. ► మీ బాధ్యత, పాత్ర మీకు తృప్తినిచ్చాయా? చిన్నప్పుడు బెజవాడలో సినిమాపై పిచ్చిప్రేమతో టికెట్ల కోసం హాళ్ళ దగ్గర కొట్టుకొని చూసిన సామాన్య ప్రేక్షకుడి స్థాయి నుంచి ఇవాళ ప్రభుత్వ సౌకర్యాలతో రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 10 దాకా దేశంలోని ఉత్తమ సినిమాలెన్నో చూసే స్థాయికి రావడం ఫిల్మ్ లవర్‌గా నాకు మరపురాని అనుభూతి, అనుభవం. ► తమిళ, మలయాళాలతో పోలిస్తే బాగా తక్కువగా తెలుగుకు నాలుగు అవార్డులే వచ్చాయేం? ప్రాంతీయ జ్యూరీకి మొత్తం ఎన్ని తెలుగు ఎంట్రీలు వచ్చాయో తెలీదు. ఫైనల్స్‌లో మా ముందుకొచ్చినవి ‘కలర్ ఫోటో’, ‘నాట్యం’, ‘ప్లేబ్యాక్’, ‘సీజన్ ఆఫ్ ఇన్నోసెన్స్’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, నితిన్ ‘భీష్మ’, విష్వక్సేన్ ‘హిట్–1’, – ఇలా ఏడెనిమిది తెలుగు సినిమాలే. ఆ లెక్కన 4 అవార్డులు మరీ తక్కువేం కాదు. ఒకప్పుడు ఉత్తమ ప్రాంతీయ చిత్రం మినహా మరే అవార్డూ దక్కని తెలుగు సినిమాకు ఇప్పుడిన్ని రావడం గమనార్హం. ► తప్పు ఎక్కడ జరిగిందంటారు? అవార్డుల ఎంపికలో అయితే కానే కాదు. కరోనాతో 2020లో సినిమాలు, ఎంట్రీలూ తగ్గాయి. కాకపోతే, సౌత్ ప్రాంతీయ జ్యూరీలు రెండిట్లోనూ తెలుగువారెవరూ లేకపోవడంతో, ఫైనల్స్‌కు మనవి ఎక్కువ చేరలేదేమో! బయట నేను చూసిన కొన్ని బాగున్న సినిమాలు కూడా ఫైనల్స్ పోటీలో రాలేదు ఎందుకనో! రెండు తెలుగు రాష్ట్రాలున్నా, ఇన్ని సినిమాలు తీస్తున్నా... ఒకే సభ్యుణ్ణి తీసుకోవడం తప్పే! ఇద్దరేసి వంతున రెండు రాష్ట్రాలకూ కలిపి నలుగురుండాలని చెప్పాను. కొన్ని రాష్ట్రాల నుంచి అవగాహన ఉన్న మంచి జర్నలిస్టులూ సభ్యులుగా వచ్చారు. అలా మన నుంచి ఎందుకు పంపరు? ► మన భాషకు న్యాయం జరగలేదని ఒప్పుకుంటారా? నా వాదన ఎంట్రీలు చూసిన సభ్యుల సంఖ్య విషయంలోనే! అవార్డుల సంగతికొస్తే కాసేపు తెలుగును పక్కనపెట్టి చూడండి. ఈసారి ప్రమాణాలు లేవని ఉత్తమ క్రిటిక్, గుజరాతీ, ఒడియా భాషల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డులే ఇవ్వలేదు. బాగున్న కొన్ని మారుమూల భాషలకూ అవార్డులిచ్చారు. ప్రోత్సహించాలంటూ ప్రమాణాలు లేకున్నా ప్రతి కేటగిరీలో ఎవరో ఒకరికి అవార్డులు ఇవ్వడం సరికాదని ఛైర్మన్ మొదటి నుంచీ గట్టిగా నిలబడ్డారు. జ్యూరీ పారదర్శకంగా, నిజాయతీగా చర్చించి అర్హులైనవారికే అవార్డులిచ్చింది. ► ఇతర భాషలతో పోలిస్తే మనం ఎక్కడున్నాం? ఇతర భాషలకు ఎక్కువ అవార్డులొచ్చాయి గనక మనమేమీ చేయట్లేదనుకోవడం తప్పు. మనం ఎక్కువ వినోదం, వసూళ్ళ మోడల్లో వెళుతున్నాం. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే అంశంలో మనమే ముందున్నాం. సాంకేతికంగా, నిర్మాణపరంగా, ఈస్థటికల్గా, ప్రేక్షకుల కిచ్చే వినోదపరంగా మన తెలుగు సినిమా చాలా బాగుంది. మనకు ప్రతిభకు కొదవ లేదు కానీ, అవార్డుల మీద ఫోకస్సే లేదు. కొన్నిసార్లు హీరో ఇమేజ్ కోసం కథలో కాంప్రమైజ్ కావడం, పాటలు, ఫైట్లు పెట్టడం లాంటివి మనకు ఎక్కువ. అలా చేయని మల యాళ, తదితర భాషా చిత్రాలకు మనకన్నా అవార్డులు ఎక్కువ రావచ్చు. అయినా, అవార్డు అనేది ఆ ఒక్క సినిమాకే వర్తిస్తుంది. మొత్తం పరిశ్రమకు కాదు. సహజత్వానికి దగ్గరగా తీసే సినిమాలకు వసూళ్ళు వచ్చే మోడల్ తమిళ, మలయాళాల్లో లాగా మన దగ్గరుంటే, మనమూ అలాంటి సినిమాలు తీయగలం. ► అవార్డుల్లోనూ దేశం తెలుగు వైపు తలతిప్పేలా చేయాలంటే...? (నవ్వుతూ...) మరిన్ని మంచి సినిమాలు తీయాలి. వాటిని అవార్డ్స్‌కు ఎంట్రీలుగా పంపాలి. ‘జాతీయ అవార్డులు మనకు రావులే’ అని ముందుగానే మనకు మనమే అనేసుకుంటే ఎలా? అప్లయ్ చేస్తేనేగా అవార్డొచ్చేది! తమిళ, మలయాళ, కన్నడ, చివరకు అస్సామీకి వచ్చినన్ని ఎక్కువ ఎంట్రీలు మనకు రాలేదు. ప్రయత్నలోపం మనదే! మనకు నాలుగే అవార్డులు రావడానికి అదే కారణం. అలాగే, అవార్డులకు అప్లికేషన్ సరిగ్గా నింపకపోవడం, పూర్తి వివరాలు ఇవ్వకపోవడం, సరైన కేటగిరీకి ఎంట్రీగా పంపకపోవడం, పంపిన సినిమాల్లోనూ టెక్నికల్ సమస్యల వల్ల కూడా తెలుగు సినిమాలు ఛాన్స్ పోగొట్టుకుంటున్నాయి. దీనిపై మన ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా విస్తృత ప్రచారం చేసి, అవగాహన పెంచాలని నా అభ్యర్థన. నా వంతుగా నేనూ పరిస్థితులు వివరించేందుకు కృషి చేస్తా! ► మీరు ఒంటరి కాబట్టి, నేషనల్ అవార్డులకై కొట్లాడాల్సి వచ్చిందా? జ్యూరీ అంతా సినీ అనుభవజ్ఞులే. ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటారు. ఓటింగ్ కూడా ఉంటుంది. స్నేహంగానే ఎవరి పాయింట్ వారు వినిపించాం. ప్రతి తెలుగు ఎంట్రీకీ దానికి తగ్గ కేటగిరీలో అవార్డు వచ్చేందుకు నా వాదన నేనూ వినిపించా. సహజత్వానికీ దగ్గరగా ఉన్నందుకు అత్యధిక ఓట్లతో ‘కలర్ ఫోటో’కూ, స్క్రీన్‌ప్లేలో భాగమయ్యేలా పాటలకు సంగీతాన్నిచ్చి కోట్లమందికి చేరిన ‘అల వైకుంఠపురములో...’కూ, పాశ్చాత్య – సంప్రదాయ రీతుల మేళవింపుగా పూర్తి డ్యాన్స్ ఫిల్మ్ తీసి, మేకప్‌లోనూ వైవిధ్యం చూపిన ‘నాట్యం’కి – ఇలా 4 అవార్డులొచ్చాయి. సహజంగానే అన్నిటికీ రావుగా! అయితే, మన గొంతు మనం బలంగా వినిపించకపోతే, మనకు రావాల్సినవి కూడా రావు. అవార్డుల్లోనే కాదు అన్నిటా అది చేదు నిజం! – రెంటాల జయదేవ -
‘ఇస్త్రీ పెట్టెపై దోశలు వేసి చూపించిన నాగ్’
‘క్రికెట్లో భారతే గెలుస్తుంది.. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేము.. కానీ ‘నేనున్నాను’ సినిమా మాత్రం సూపర్‌డూపర్ హిట్ సాధిస్తుంది’అంటూ మార్చి 11, 2004న జరిగిన ‘నేనున్నాను’ ఆడియో ఫంక్షన్లో అప్పటి యువసామ్రాట్ ఇప్పటి టాలీవుడ్ కింగ్ నాగార్జున పలికిన మాటలివి. నాగార్జున సరసన శ్రియా, ఆర్తీ అగర్వాల్ నటించిన ఈ చిత్రాన్ని విఎన్ ఆదిత్య దర్శకత్వం వహించారు. నాగార్జున కెరీర్లో మరుపురాని మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అన్నివర్గాలను ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయిన ఈ చిత్రం అనేక సెంటర్లలో వందరోజులు దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. కామాక్షి మూవీస్‌పై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం విడుదలై నేటికి 16 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు మీకోసం.. సినిమా రిలీజ్ కంటే ముందే ఆడియోతో సెన్సేషన్ సృష్టించింది ఈ చిత్రం. ఎంఎం కీరవాణి అందించిన పాటలు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ‘ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో’ పాట సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. వినోదం, పాటలు, ప్రేమ, ఎమోషన్ ఇలా అన్ని కలబోసిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బ్రహ్మానందం, అలీ, శివారెడ్డిల కామెడీ.. నాగార్జున టైమింగ్.. శ్రియ, ఆర్తిల అభినయం.. నాగార్జున, శ్రియల కామెడీ అండ్ ఎమోషన్ సీన్స్ వావ్ అనిపించేలా ఉంటాయి. ముఖ్యంగా శ్రియ కోసం ఇస్త్రీ పెట్టెపై దోశలు వేసే సీన్ అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు లాక్డౌన్ నేపథ్యంలో కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు కదా అందరూ కలిసి మరోసారి ‘నేనున్నాను’ చూసి కుటుంబసమేతంగా ఎంజాయ్ చేయండి. -
శిష్యుడి కోసం...
విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘వాళ్లిద్దరి మధ్య’. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యం నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వీయన్ ఆదిత్య దర్శకుడు. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొయినాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కి చిత్రదర్శకుడు వి.యన్. ఆదిత్య గురువు, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు çసతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆదిత్య మాట్లాడుతూ– ‘‘సింగీతంగారు దర్శకత్వం వహించిన ‘బృందావనం’, ‘భైరవద్వీపం’, ‘శ్రీకృష్ణార్జున విజయం’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. అప్పట్లో 4 ఏళ్ల పాటు వాళ్లింట్లో భోజనం చేసి పెరిగాను. ఆయన మా షూటింగ్‌కి వచ్చి ఓ సన్నివేశానికి డైరెక్ట్ చేయటం, ఆయన అసిస్టెంట్‌గా ఆ సన్నివేశానికి నేను క్లాప్నివ్వటం.. చెన్నై వాహిని స్టూడియోలో నేను క్లాప్ కొట్టిన అనుభూతి మరలా పునరావృతమైంది’’ అన్నారు. నిర్మాత అర్జున్ మాట్లాడుతూ– ‘‘88 ఏళ్ల వయసులో సింగీతంగారి ఎనర్జీ చూసి ఆశ్యర్యపోయాము. ఎన్నో పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు మా సినిమా షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిబొట్ల తదితరులు పాల్గొన్నారు. -
వాళ్లిద్దరి ప్రేమ
‘మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట’ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం ‘వాళ్ళిద్దరి మధ్య’. విరాజ్ అశ్విన్, నేహాకృష్ణ జంటగా నటిస్తున్నారు. వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘వాళ్ళిద్దరి మధ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఇద్దరు ప్రతినాయకులలాంటి హీరో హీరోయిన్ మధ్య జరిగే ప్రేమకథ ఇది. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్‌గారి మేనల్లుడు విరాజ్ అశ్విన్ ఈ కథకు హీరోగా కరెక్టుగా సరిపోయాడు. ఈ చిత్రంలో హీరోయిన్ అమెరికా నుంచి వస్తుంది కాబట్టి సహజత్వానికి దగ్గరగా ఉండేలా కథానాయికని అమెరికా నుంచే పిలిపించాం. కెమెరామన్ పి.జి. విందా దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన ఆర్.ఆర్. కోలంచిని ఈ చిత్రం ద్వారా కెమెరామన్‌గా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుందీ చిత్రం. డిసెంబర్ మొదటి వారంలోపు చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు అర్జున్ దాస్యన్. ‘‘నా రెండవ చిత్రం ఆదిత్యగారితో చేయడం చాలా సంతోషంగా ఉంది. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు విరాజ్ అశ్విన్. ‘తెలుగు చిత్రాల్లో నటించాలనుకుని ఆదిత్యగారిని సంప్రదించా. ఆయన సినిమాలోనే హీరోయిన్గా ఎంచుకున్నందుకు థ్యాంక్స్’’ అన్నారు నేహా చిత్ర. ఈ చిత్రానికి సంగీతం: మధు స్రవంతి, లైన్ ప్రొడ్యూసర్: శ్రావణ్ నిడమానూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సూరపనేని కిషోర్. -
మేం రెడీ..
హుద్‌హుద్ ఎఫెక్ట్‌తో సర్వం కోల్పోయిన వైజాగ్‌వాసులను ఆదుకోవడానికి టాలీవుడ్ ఉక్కు సంకల్పంతో దూసుకెళ్తోంది. ‘మేముసైతం’ కోసం సీరియస్‌గా ప్రిపేర్ అయిన తారాలోకం.. ఈ రోజు అదరగొడతాం అంటోంది. శనివారం ప్రాక్టీస్ సెక్షన్లో ఆటవిడుపుగా ఫొటోకు ఇదిగో ఇలా పోజిచ్చారు. మేమంతా ఒక్కటే.. హుద్‌హుద్ తుపాన్ బాధితుల కోసం సినిమా లోకం చేస్తున్న ప్రయత్నానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా తారలంతా ఇందులో పాలుపంచుకుంటున్నారు. సినిమా జనాలను సెలబ్రిటీలుగా మార్చిన ఘనత ప్రేక్షక దేవుళ్లదే. ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్న ప్రతిసారీ వారే మమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పుడు ఆ ప్రేక్షకులు కష్టంలో ఉన్నారు. వారికి జరిగిన నష్టాన్ని పూర్తిగా తీర్చలేం. కానీ, మావంతు సాయంగా ‘మేముసైతం’ అంటూ ముందుకొచ్చాం. మా స్పందన వారికి ఓదార్పునిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, సురేష్‌బాబు, దామోదరప్రసాద్.. ఎందరో దర్శక నిర్మాతలు, వీరితోపాటు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ‘మేముసైతం’లో పాలుపంచుకుంటున్నారు. ఈ బృహత్కార్యంలో టెక్నికల్‌గా సపోర్ట్ చేస్తూ సూపర్వైజింగ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వైజాగ్‌ను హుద్‌హుద్ తుడిచిపెట్టేసింది. ఇటీవల విశాఖ వెళ్లినప్పుడు అక్కడి వాళ్లలో ఓ ధైర్యం కనిపించింది. తమ నగరాన్ని తిరిగి అంతే సుందరంగా పునర్నిర్మించుకుంటామనే నమ్మకం వాళ్లలో ఉంది. వైజాగ్‌వాసుల మొక్కవోని ఆత్మవిశ్వాసానికి జోహార్లు. - వీఎన్ ఆదిత్య