డబ్బులున్నా... ఇలాంటి ఆర్టిస్ట్‌లు లేకపోతే కొన్ని సినిమాలు తీయలేం! | 'Rudhramadevi': Anushka Shetty's New Look Released; Special Video to be out on 7 November | Sakshi
Sakshi News home page

డబ్బులున్నా... ఇలాంటి ఆర్టిస్ట్‌లు లేకపోతే కొన్ని సినిమాలు తీయలేం!

Published Fri, Nov 7 2014 12:08 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

డబ్బులున్నా... ఇలాంటి ఆర్టిస్ట్‌లు లేకపోతే కొన్ని సినిమాలు తీయలేం! - Sakshi

డబ్బులున్నా... ఇలాంటి ఆర్టిస్ట్‌లు లేకపోతే కొన్ని సినిమాలు తీయలేం!

- దర్శక, నిర్మాత గుణశేఖర్
అనుష్కతో నా పరిచయం - సినిమాల ద్వారానే! ఆమె సినిమాలు చూసినప్పుడు మంచి నటి అనుకున్నా. కానీ, కె. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నిర్మించిన ‘అరుంధతి’ చూశాక దిగ్భ్రమకు లోనయ్యా. నటిగా ఆ అమ్మాయిలో ఉన్న శక్తిసామర్థ్యాలనూ, లోలోపల దాగిన అపారమైన ప్రతిభనూ బయటపెట్టిన పాత్ర అది. రాణీ రుద్రమదేవి కథతో సినిమా తీయాలని 2002 నుంచి నాలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అయితే, ఆ పాత్రకు ఎవరు బాగుంటారన్నది ఒక పట్టాన తెగలేదు. కొత్తవాళ్ళను తీసుకొని, ఫోటోషూట్స్ చేశా. అప్పటికి అనుష్క గురించి నాకు ఆలోచన లేదు. ‘అరుంధతి’ చూశాక నా రుద్రమదేవి దొరికిందనిపించింది. ‘రుద్రమదేవి’కి సిద్ధమయ్యా.
 
చిత్ర సమయంలో నాకు అర్థమైంది ఒకటే - అనుష్క దర్శకుల నటి, నిర్మాతల నటి. ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాక ఆ పాత్రను పండించడం కోసం తన సమస్త శక్తియుక్తులూ ధారపోసే నటి. యూనిట్‌కు అంత సహకరించే నటిని మరొకరిని ఈ రోజుల్లో చూడలేం! ‘రుద్రమదేవి’ని తపస్సులా చేస్తున్నానని ఆమె గుర్తించారు. పాత్రను సవాలుగా తీసుకొని కత్తిసాము, గుర్రపుస్వారీ లాంటి కఠోర శిక్షణలన్నీ తీసుకున్నారు. పాత్రను నరనరాల్లో జీర్ణించుకొని, నటించారు. అది చూసి మంత్రముగ్ధుణ్ణయ్యా.
 
ఏ ఆర్టిస్టుకైనా రూపురేఖలు చాలా ముఖ్యం. చేస్తున్న పాత్రకు తగ్గట్లుగా వాటిని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకోవడం ఆ ఆర్టిస్టు అంకితభావానికి ప్రతీక. యుద్ధం చేసే రాణీ రుద్రమదేవి పాత్రలో కనిపించడం కోసం ఆమె తన ఫిజిక్‌ను పెంచుకొన్నారు. అయిదు నెలల పాటు ఆ షూటింగ్ అయిపోగానే, కొద్దిగా విరామం తరువాత అందాల యువరాణి సన్నివేశాలను చిత్రీకరించాలి. అంతే! మూడే మూడు నెలల్లో మళ్ళీ అనుష్క చాలా అందంగా, నాజూగ్గా ఆ సన్నివేశాలకు తగ్గట్లు శరీరాన్ని తగ్గించుకున్నారు. అందుకు ఆమె పడిన శ్రమ మాటల్లో చెప్పలేనిది. నిజం చెప్పాలంటే, షెడ్యూల్ షెడ్యూల్‌కీ ఆమె నాలో స్ఫూర్తి నింపింది. షూటింగ్ కొంత అయ్యాక... నిజంగా అనుష్క లేకపోతే ఈ పాత్రను ఎవరు చేసేవాళ్ళు, సినిమా ఎలా చేసేవాణ్ణి అనిపించింది.
 
సినిమాలకయ్యే బడ్జెట్, పెట్టే ఖర్చు, అయ్యే శ్రమ గురించి కాసేపు పక్కనపెడదాం. డబ్బులున్నప్పటికీ, ఇలాంటి ఆర్టిస్టు లేకపోతే ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’ లాంటి కొన్ని సినిమాలు తీయలేం! అప్పట్లో ‘అరుంధతి’ చిత్రం కోసం దాదాపు మూడేళ్ళ పాటు అనుష్క పడిన కష్టం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘రుద్రమదేవి’గా యుద్ధ సన్నివేశాల్లో ఒక యాక్షన్ హీరోలా రకరకాల ఫీట్లు చేశారు. 150 అడుగుల ఎత్తున క్రేన్ మీద వేలాడుతూ ఉండేవారు. అలాగే, క్లైమాక్స్‌లో భాగంగా ఏడు కోటల ముట్టడి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు 40 రోజులు ఆమె కత్తియుద్ధాలు చేయాల్సొచ్చింది. కత్తి పట్టి తిప్పుతూ ఉండేసరికి, ముంజేతి దగ్గర గాయమైంది. డాక్టర్లు కత్తి తిప్పవద్దన్నా అనుష్క మాత్రం డూప్‌ని పెట్టడానికి కూడా ఒప్పుకోలేదు. ముంజేతికి ప్లాస్టర్ మీద ప్లాస్టర్ చుట్టుకొని, తానే స్వయంగా నటించారు. అంతటి అంకితభావం చాలా కొద్దిమందిలోనే మనం చూస్తాం!
 
నిజం చెప్పాలంటే, మన దగ్గర చాలామంది హీరోయిన్లకు మంచి పాత్రలు చేయాలనే కోరికా ఉంది. చేసే సత్తా ఉంది. అలాంటి పాత్రలు వస్తే, చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారనడానికి అనుష్క ఒక మంచి ఉదాహరణ. ఆకలిగొన్న పులిలా ‘అరుంధతి’, ‘రుద్రమ దేవి’ పాత్రల్ని ఆమె పండించారు. అందుకే, నన్నడిగితే మిగతా హీరోయిన్‌లకు కూడా ఆమె స్ఫూర్తి ఆదర్శప్రాయం. వ్యక్తిగా కూడా ఆమెలో ఎన్నో సుగుణాలున్నాయి. సెట్స్‌లో అందరితో కలిసిపోతూ, అందరినీ కలుపుకొంటూ పోతుంటారు.

ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరిస్తారు. స్టార్‌డమ్ వచ్చినా, అంత సాదాసీదాగా వ్యవహరించడం ఆమెలోని ప్రత్యేకత. ఆమె ఎప్పుడూ తోటి హీరోయిన్ల గురించో, ఇతరుల సినిమాల గురించో వ్యాఖ్యానించరు. అసూయపడరు. పోటీతత్త్వం ప్రదర్శిస్తూనే, అసూయ లేకపోవడమనే ఆ అరుదైన లక్షణం ఎవరైనా నేర్చుకోవాల్సిన అంశం. అనుష్క మంచి నటే కాదు మంచి మనిషి కూడా అనేది అందుకే. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- సంభాషణ : రెంటాల జయదేవ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement