కొన్ని సినిమాలు... కాంబినేషన్లు అంతే! అతిగా ఊహించినప్పటి కన్నా, అంచనాలు లేనప్పుడే అద్భుత విజయాలు అందించి, ఆశ్చర్యపరుస్తాయి. ఆపైన ఆ కాంబినేషన్‌ను బాక్సాఫీస్ సంచలనంగా మార్చేస్తాయి!! అందుకు ఉదాహరణ – దర్శకుడు కె.రాఘవేంద్రరావు, హీరో కృష్ణ కాంబినేషన్‌లో 1981 జనవరి 14న రిలీజైన ‘ఊరుకి మొనగాడు’. ఆ కథ తెలుగులో హీరో కృష్ణ కెరీర్ లో ఘన విజయం! హిందీలో కె. రాఘవేంద్రరావునూ, శ్రీదేవినీ స్టార్లను చేసిన సంచలనం! కామెడీ విలనీకి ట్రేడ్ మార్కు కథనం!! ఆ ఫార్ములాకు తెరపై ఇప్పుడు 40 వసంతాలు.
నాలుగు దశాబ్దాల క్రితం మాట. హీరో కృష్ణ అప్పటికే 175 సినిమాల హీరో. ‘పండంటి కాపురం’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘పాడిపంటలు’ లాంటి సూపర్ హిట్లు అందించిన హీరో. అయితే, ఎంతసేపటికీ ‘కృష్ణ సొంతంగా నిర్మించిన సినిమాలే పెద్ద హిట్టవుతాయి. బయటి నిర్మాతలకు పనిచేసినవి ఆడవు’ అనే అపవాదు ఉండేది. దాన్ని తుడిచిపెట్టి, బయటి బ్యానర్ లో కూడా కృష్ణకు భారీ హిట్స్ వస్తాయని బాక్సాఫీస్ సాక్షిగా నిరూపించిన చిత్రం ‘ఊరుకి మొనగాడు’. ఈ మాట సాక్షాత్తూ హీరో కృష్ణే శతదినోత్సవంలో చెప్పారు. ఈ గ్రామీణ నేపథ్య కుటుంబకథ ఆ సంక్రాంతికి పెద్ద హిట్! కృష్ణ కెరీర్‌లోనే థర్డ్ బిగ్గెస్ట్ హిట్!!
కసితో వచ్చిన కాంబినేషన్...
అంతకు సరిగ్గా ఏడాది ముందు 1980 సంక్రాంతికి కె. రాఘవేంద్రరావు – హీరో కృష్ణ కాంబినేషన్‌లోనే తొలి చిత్రం ‘భలే కృష్ణుడు’ వచ్చింది. ఆ రాఘవేంద్రరావు సొంత సినిమా నిరాశపరిచింది. మరో 2 నెలలకు ‘ఘరానా దొంగ’ (1980 మార్చి 29) వచ్చి, కాస్త ఫరవాలేదనిపించింది. కానీ, తమ కాంబినేషన్ అనుకున్న హిట్ సాధించలేదనే బాధ రాఘవేంద్రరావులో ఉండిపోయింది. దాంతో మూడో చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నిర్మాత అడుసు మిల్లి గోపాలకృష్ణేమో స్వయంగా ఆయన స్నేహితుడైన ఎ. లక్ష్మీ కుమార్ (శోభన్‌బాబు ‘రాజా’ చిత్ర నిర్మాత)కు తమ్ముడు. నిర్మాత నుంచి ఏ ఆటంకాలూ లేని ఆ సమయంలో, ఓ మంచి హిట్ ఫార్ములా కథ కోసం చూస్తున్న ఆయనకు సత్యానంద్ రాసిన కథ ‘ఊరుకి మొనగాడు’.
‘‘అప్పట్లో ‘భలేకృష్ణుడు’కు జంధ్యాల, నేను కలసి పని చేసినా, ఎందుకో ఆశించిన ఫలితం రాలేదు. కథ కోసం అన్వేషిస్తున్నప్పుడు అంతకు రెండేళ్ళ క్రితమే నాకు తట్టిన లైన్ చెప్పా. సినిమాలో మొదట మామూలుగా కనిపించే హీరో– చివరకు ఓ పోలీసని తేలడం, పగ తీర్చుకోవడం అనేది కమర్షియల్ ఫార్ములా. అదే పద్ధతిలో... గ్రామీణ నేపథ్యంలో ఓ ఇంజనీరులా ఉద్యోగం మీద ఓ ఊరికి వచ్చిన హీరో వెనుక అసలు కథ వేరే ఉంటే? ఆ ఊరితో అతనికి వేరే బంధముండి, తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటే? ఈ స్టోరీలైన్ చెప్పగానే రాఘవేంద్రరావుకు నచ్చేసింది. దాన్ని ‘ఊరుకి మొనగాడు’గా తీర్చిదిద్దా’’ అని సత్యానంద్ తెలిపారు.
వినోదాత్మక విలనీ క్యారెక్టరైజేషన్!
‘ఊరుకి మొనగాడు’ షూటింగ్ అధిక భాగం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, కూళ్ళ, వాకతిప్ప, రామచంద్రాపురాల్లో జరిగింది. గ్రామీణ ప్రాంతంలోని మనుషులు, మనస్తత్వాలు, ఆకతాయి హీరోయిన్, బావా మరదళ్ళ సరసం, హీరోతో చేతులు కలిపి తండ్రి తప్పుదిద్దే హీరోయిన్, మామను ఆట పట్టించే కాబోయే అల్లుడు లాంటి సత్యా నంద్ రచనా చమక్కులన్నీ ఈ సినిమాకు హిట్ దినుసులయ్యాయి. ముఖ్యంగా, రావు గోపాలరావు, ఆయనకు సహచరుడైన అల్లు రామలింగయ్యల ట్రాక్ జనానికి తెగ నచ్చింది. రావు గోపాలరావు పాత్ర చిత్రణ, ఆ పాత్రకు రాసిన డైలాగ్స్ ఇప్పటికీ కొత్తగా అనిపిస్తాయి.
బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, ఆ తరువాత నాగభూషణం లాంటివాళ్ళు వినోదం పండిస్తూనే, విలనీ చేసేవారు. ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ (1969)లో నాగభూషణం కామిక్ రిలీఫ్ ఇస్తూ, విలనీ పండించడం, భమిడిపాటి రాధాకృష్ణ డైలాగులు కాలేజీ రోజుల్లో సత్యానంద్ మనసుపై ముద్ర వేశాయి. ‘‘మామూలుగా సినిమాలో విలన్లు పవర్‌ఫుల్‌గా, వయొ లెంట్‌గా ఉంటారు. కానీ, విలన్లు ఈ కథలో పాత్రలకు భయం కలిగిస్తూనే, చూసే ప్రేక్షకులకు వినోదం పంచా లనే కాన్సెప్ట్ తీసుకున్నా. ఆ పద్ధతిని నా తొలి చిత్రం ‘మాయదారి మల్లిగాడు’ (1973)లో నాగభూషణంతో ప్రయత్నించా. ‘ఊరుకి...’లో రావుగోపాలరావు, అల్లుతో పూర్తిస్థాయిలో పెట్టా’’ అని సత్యానంద్ వివరించారు.
హిందీలోకీ అదే ఫార్ములా!
విలన్, విలన్ వెంట సహాయకుడిగా కామెడీ విలన్ అనేది బాక్సాఫీస్ ఫార్ములాగా మారింది. ఈ సినిమాతో స్థిరపడ్డ ఆ ఫార్ములా ఆ తరువాత ఓ ట్రెండ్ గా తెలుగు తెరపై స్థిరపడింది. సత్యానంద్, రాఘవేంద్రరావు బృందం తీర్చిదిద్దిన ఈ సక్సెస్ ఫార్ములా ఆపైన హిందీ సినిమాల్లోకీ వెళ్ళడం విశేషం. రాఘవేంద్రరావు తన హిందీ చిత్రాల్లో రచయిత, నటుడు ఖాదర్ ఖాన్‌తో కలసి ఆ ఫార్ములాను ఉత్తరాదిలోనూ పాపులర్ చేశారు. అక్కడ చాలా సినిమాల్లో శక్తికపూర్, ఖాదర్‌ఖాన్ జంట మీదా ఈ విలన్, కమెడియన్ జంట ఫార్ములా బాక్సాఫీస్ వద్ద వర్కౌటైంది. గమ్మత్తేమిటంటే, 1990లలో కోట శ్రీనివాసరావు, అతని పక్కన బాబూమోహన్ అనే ట్రెండ్‌కు ఈ ఫార్ములానే మాతృక.
కృష్ణకు... థర్డ్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్
‘ఊరుకి మొనగాడు’పై మొదట అంచనాలు లేవు. కానీ, హీరో కృష్ణ ఇంట్రడక్షన్ మొదలు కథ, కథనం, పాత్రల స్వరూపస్వభావాలు, డైలాగులతో వాటిని నడిపిన తీరు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే జనానికి బాగా పట్టేశాయి. అదే సంక్రాంతి రోజున రిలీజైన ఎన్టీఆర్ ‘ప్రేమ సింహాసనం’ని కూడా కాదని, ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టారు. అప్పటికే ఎన్టీఆర్‌తో బ్లాక్‌బస్టర్లిచ్చిన రాఘవేంద్రరావు ఈసారి కృష్ణతో తన కమర్షియల్ మాయాజాలం చూపారు. కృష్ణకు కెరీర్‌లో మూడో బిగ్గెస్ట్ హిట్‌గా ‘ఊరుకి మొనగాడు’ను నిలిపారు.
ఆ ఏడాది సంక్రాంతి సీజన్‌లో తెలుగులో 8 సినిమాలొచ్చాయి. కృష్ణ ‘బంగారు బావ’ (1980 డిసెంబర్ 31), కొత్త ఏడాదిలో అక్కినేని ‘శ్రీవారి ముచ్చట్లు’, శోభన్‌బాబు ‘పండంటి జీవితం’, ‘జగమొండి’, ‘దేవుడు మామయ్య’, ఎన్టీఆర్ ‘ప్రేమ సింహాసనం’, కృష్ణ ‘ఊరుకి మొనగాడు’, కృష్ణంరాజు ‘ఆడాళ్ళూ మీకు జోహార్లు’ రిలీజయ్యాయి. వీటన్నిటిలోకీ ‘ఊరుకి...’ పెద్ద హిట్. ఈ సినిమా రిలీజై నెల తిరగ్గానే అక్కినేని – దాసరి గోల్డెన్‌జూబ్లీ హిట్ ‘ప్రేమాభిషేకం’ వచ్చింది. ఆ ప్రభంజనాన్ని సైతం తట్టుకొని, ‘ఊరుకి...’ నిలబడడం విశేషం.
కృష్ణ సినీజీవితంలో ‘పండంటి కాపురం’ (17 కేంద్రాలు), ‘అల్లూరి సీతారామరాజు’ (15) తరువాత అత్యధిక సెంటర్లలో (7 కేంద్రాలు – విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, తెనాలి, ఒంగోలు) డైరెక్ట్‌గా వంద రోజులు ఆడిన చిత్రం ‘ఊరుకి మొనగా’డే! అలాగే ఈ చిత్రం మరో 4 కేంద్రాల్లో నూన్ షోస్‌తోనూ వంద నడిచింది. ఆపై షిఫ్టింగులతో రజతోత్సవం కూడా జరుపుకొంది. ఆ తరువాత విడుదలైన ‘ఈనాడు’ (1982) కూడా నేరుగా 7 కేంద్రాలలో 100 రోజులు ఆడి, ‘ఊరుకి’తో సమంగా నిలిచింది. కృష్ణకు నేరుగా 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన చిత్రాలుగా ‘పాడిపంటలు’ (1976), ‘సింహాసనం’ (1986), ‘నెంబర్ వన్’ (1994) రికార్డుకెక్కాయి.
మారిన సినీ గ్రామర్...
మామూలుగా తెలుగు భాషా, వ్యాకరణ, వాడుక భాషా సంప్రదాయాల్లో దేని ప్రకారం చూసినా ‘ఊరికి’ మొనగాడు అని రాయడం కరెక్ట్. కానీ, ఈ సినిమాకు ‘ఊరుకి’ అని తప్పుగా టైటిల్ పెట్టడం అప్పట్లో విమర్శలకు గురైంది. విజయవాడలో సినిమా యూనిట్ ‘గెట్ టుగెదర్’లో ప్రముఖ రచయిత రెంటాల గోపాలకృష్ణ లాంటి వారు సభాముఖంగా ఈ తప్పు ప్రస్తావించారు. అయితే, వ్యాకరణానికే కాదు... ఒక రకంగా సినీ వ్యాకరణానికి కూడా ఈ సినిమా ఎదురెళ్ళింది. సాధారణంగా తెలుగు సినిమాలో 70 నుంచి 80 సీన్లుంటాయి. కానీ, రెండున్నర గంటలైనా లేని ‘ఊరుకి..’లో ఏకంగా 120 దాకా సీన్లున్నాయి. కాకపోతే, అన్నీ చిన్న చిన్న సీన్లే. దాంతో, సీన్లు ఎక్కువున్నా, సినిమా నిడివి తక్కువే. చిన్న సీన్లతోనే చకచకా కథ చెబుతూ, ఒక్క సెంటిమెంట్ పార్ట్ మినహా హీరోయిన్, విలన్ల పాత్రలు సహా మిగతా అంతా ఎంటర్ టైనింగ్‌గా సాగే విధానాన్ని అప్పట్లోనే అనుసరించడం విశేషం.
తెలుగు డేట్స్‌తో... హిందీ సినిమా
ఈ చిత్ర హిందీ రీమేక్ ‘హిమ్మత్‌వాలా’ ముందు భారతీరాజా తమిళ హిట్ ‘పదు నారు వయదినిలే’ (పదహారేళ్ళ వయసు) హిందీ రీమేక్ ‘సోలవా( సావన్’ (1979) లాంటి సినిమాల్లో శ్రీదేవి నటించారు. అవేవీ ఆమెకు కలిసిరాలేదు. ఆ మాటకొస్తే, ఈ ‘హిమ్మత్ వాలా’లోనూ శ్రీదేవిని హీరోయిన్‌గా పెట్టుకోవాలని పద్మాలయా సంస్థ మొదట అనుకోలేదు. వారు ఓ తెలుగు సినిమా కోసం శ్రీదేవిని బుక్ చేసుకొని, డేట్లు తీసుకున్నారు. అనుకోకుండా ఆ తెలుగు సినిమా అనుకున్న టైమ్‌కి మొదలుకాలేదు. ఆగింది. దాంతో, శ్రీదేవి డేట్లు వేస్ట్ చేయడం ఎందుకని హిందీలో తీస్తున్న ‘హిమ్మత్ వాలా’కు అప్పటికప్పుడు శ్రీదేవిని పెట్టారు. ఆమె డేట్స్ అలా వాడుకున్నారు.
అలా ఆపద్ధర్మంగా వాళ్ళు తీసుకున్న ఓ నిర్ణయం శ్రీదేవి కెరీర్‌నే మార్చేసింది. హిందీ సీమలో తిరుగులేని నాయికగా ఆమె ఎదగడానికి బలమైన పునాది వేసింది. జితేంద్ర, శ్రీదేవి జంట తెలుగు సిన్మాల హిందీ రీమేక్స్‌కు సరికొత్త పాపులర్ కాంబినేషన్ అయింది. ‘నిషానా’ (1980 – ఎన్టీఆర్ ‘వేటగాడు’ రీమేక్)తో హిందీలో అడుగుపెట్టిన రాఘవేంద్రరావుకు ‘ఫర్జ్ ఔర్ కానూన్’ (1982 – ఎన్టీఆర్ ‘కొండవీటి సింహం’ రీమేక్) తరువాత, ఈ మూడో చిత్రం ‘హిమ్మత్ వాలా’తోనే బాలీవుడ్‌లో భారీ బ్లాక్‌బస్టర్ వచ్చింది. ఒక్క కథ – ఇటు కృష్ణ, రావు – అల్లు కాంబినేషన్ నుంచి అటు శ్రీదేవి, జితేంద్ర, రాఘవేంద్రరావు దాకా ఎందరి కెరీర్‌నో కీలకమైన మలుపు తిప్పింది. అందరినీ బాక్సాఫీస్ మొనగాళ్ళుగా నిలిపింది.
శ్రీదేవి కెరీర్ మార్చిన కథ!
హీరో కృష్ణ సొంత సంస్థ పద్మాలయా వారు ఇదే కథను రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే హిందీలో శ్రీదేవి, జితేంద్ర జంటగా ‘హిమ్మత్ వాలా’ (1983) పేరుతో రీమేక్ చేశారు. ఏకంగా 50 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకొన్న ఆ హిందీ రీమేక్ అటు పద్మాలయాకూ, ఇటు శ్రీదేవికీ, రాఘవేంద్రరావుకీ – ముగ్గురికీ ఉత్తరాది సినీ సీమలో బ్రేక్ ఇచ్చింది. జితేంద్ర కెరీర్‌కు హీరోగా సెకండ్ ఇన్నింగ్సూ వచ్చింది.
తెలుగు తెరపై... దివిసీమ ఉప్పెన!
సమకాలీన సంఘటనల్ని సినిమాలోకి జొప్పిస్తే, అది ఎప్పుడూ బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములానే! 1977 నవంబర్‌లో కృష్ణాజిల్లా దివిసీమ తుపానులో జరిగిన భారీ ప్రాణనష్టం దేశవ్యాప్త సంచలనం. ‘ఊరుకి’లో ఆ సంఘటనను సందర్భోచితంగా వాడుకున్నారు. జనం మనసును మెలిపెడుతున్న ఆ ఘట్టాన్ని సినిమాలో వాడితే బాగుంటుందన్నది రాఘవేంద్రరావు ఆలోచన. ఆ ఆలోచనను అందుకొని, దాన్ని మూగవాడైన నటుడు చంద్రమోహన్ పాత్రకూ, నిర్మలమ్మ పాత్రకూ ముడి పెడుతూ, మంచి సెంటిమెంట్ ట్రాక్‌గా కథలో జొప్పించారు సత్యానంద్.
ఉప్పెన వల్ల అయినవారిని పోగొట్టుకొని, కొంపా గోడు పోయి వీధిన పడ్డ సామాన్యుల కోసం విరాళాల సేకరణ జరిగిన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఈ సినిమాలో హీరో కృష్ణ జోలె పట్టి తిరిగే దృశ్యాలు తీశారు. ‘కదలి రండి మనుషులైతే...’ అంటూ ఆ సందర్భానికి తగ్గట్టు ఆరుద్ర రాసిన భావోద్వేగ గీతం ప్రేక్షకులను కదిలించింది. చిత్ర ఘనవిజయానికి బాగా తోడ్పడింది. ఆ పాట ఇవాళ్టికీ ప్రకృతి విపత్తుల వేళ రేడియోలో, టీవీలో తప్పకుండా వినిపించే మాట. ఈ కమర్షియల్ సినిమాలో చక్రవర్తి స్వరకల్పనలో ‘ఇదిగో తెల్లచీరా ఇవిగో మల్లెపూలు...’, ‘బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో...’, ‘అందాల జవ్వని మందార పువ్వని...’, ‘మొగ్గా పిందేళ నాడే...’ లాంటి వేటూరి మార్కు గీతాలన్నీ మాస్ నోట నానాయి. కథ, కథనంలోని బిగువుకు ఈ కమర్షియల్ పాటల సరళీ బాగా కలిసొచ్చింది.
ఎన్టీఆర్ లాంటి హిట్స్ కోసం...
ఆ రోజుల్లో ‘ఊరుకి మొనగాడు’ చిత్రం గుంటూరు జిల్లా హక్కులను హీరోయిన్ శ్రీదేవి తల్లి రూ. 3.2 లక్షలకు తీసుకుంటే, బోలెడంత లాభం వచ్చిందట. 1981 ఏప్రిల్ 25న మద్రాసులో పామ్‌గ్రోవ్ హోటల్‌లో శతదినోత్సవం జరిగింది. ప్రముఖ దర్శక, నిర్మాత ఎల్వీ ప్రసాద్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా హీరో ఎన్టీఆర్ విచ్చేసి, కృష్ణను అభినందించి, షీల్డులు అందించారు. ‘‘ఎన్టీఆర్ తో ‘అడవి రాముడు’, ‘వేటగాడు’ లాంటి సూపర్‌హిట్స్ తీసిన రాఘవేంద్రరావు నాతోనూ ఆ స్థాయి హిట్టయ్యే సినిమాలు ముందు ముందు తీయాలని ఆశిస్తున్నా’’ అంటూ వేదికపై కృష్ణ పేర్కొనడం గమనార్హం. ఇక, నిర్మాతగా ఈ తొలి చిత్రంతోనే బాక్సాఫీస్ హిట్ సాధించిన అడుసుమిల్లి గోపాలకృష్ణ తమ గోపీ మూవీస్ పతాకంపై రెండో చిత్రం ‘శక్తి’ (1983) కూడా కృష్ణ, రాఘవేంద్రరావుల కాంబినేష¯Œ లోనే నిర్మించడం, అదీ హిట్టవడం విశేషం. ఆ పైన రాఘవేంద్రరావు, కృష్ణ కలయికలో ‘అడవి సింహాలు’,‘ఇద్దరు దొంగలు’,‘అగ్నిపర్వతం’, ‘వజ్రాయుధం’ లాంటి చిత్రాలు వచ్చాయి.
జయప్రద, కృష్ణ
– రెంటాల జయదేవ
Comments
Please login to add a commentAdd a comment