సినిమా రివ్యూ : పండగ చేస్కో | pandaga chesko review | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ : పండగ చేస్కో

Published Fri, May 29 2015 10:29 PM | Last Updated on Sat, Aug 11 2018 8:27 PM

సినిమా రివ్యూ : పండగ చేస్కో - Sakshi

సినిమా రివ్యూ : పండగ చేస్కో

డబ్బు, టైమ్... ‘దండగ చేస్కో’!
చిత్రం - పండగ చేస్కో, తారాగణం - రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం,
కథ - వెలిగొండ శ్రీనివాస్, స్క్రీన్‌ప్లే - మాటలు - కోన వెంకట్,
రచనా సహకారం - అనిల్ రావిపూడి,  కెమేరా - సమీర్ రెడ్డి,
నిర్మాత - పరుచూరి కిరీటి, స్క్రీన్‌ప్లే - దర్శకత్వం - గోపీచంద్ మలినేని


ఒక సగటు తెలుగు సినిమాలో ఉండేవి ఏమిటి? విడిపోయిన కుటుంబాలు... తెగిపోయిన బంధాలు... ఆ ఫ్యామిలీలను కలపడానికి హీరో పడే శ్రమ, అందుకు హీరోయిన్‌తో సాగించే ప్రేమ... వాటి మధ్యలో ఒక విలన్ బృందపు వేట! దీనికి బ్యాక్‌డ్రాప్ - పెళ్ళి వారి ఇంటి నేపథ్యం. ఇలాంటి కథలు ఎన్ని వందలు తెరపై చూశామని బుర్ర బద్దలుకోనక్కర లేదు. గతంలో అలాంటివి చూడకుండా తప్పించుకున్నవారెవరైనా ఉంటే, వారి కోసం తాజాగా అటువంటి మరో సినిమా వచ్చింది. అది చూసి, ‘పండగ చేస్కో’వచ్చు.
 
కథ ఏమిటంటే...
ఎక్కడో పోర్చుగల్‌లో కార్తీక్ పోతినేని (రామ్). వీడియో గేమ్స్ మీద పట్టుతో వాటినే డెవలప్ చేసి, పెద్ద కంపెనీ పెట్టి, కోట్లు గడించిన యువతరం వ్యాపారవేత్త. తల్లితండ్రులు (పవిత్రా లోకేశ్, రావు రమేశ్), చెల్లెలు, బావ ఉంటారు. పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్న తరుణంలో అతనికి అనుష్క (సోనాల్ చౌహాన్) అనే మరో బడా పారిశ్రామికవేత్త తగులుతుంది. ఫలానా వయసులోగా భారతీయ సంతతి వ్యక్తిని ఎవరినైనా పెళ్ళిచేసుకోకపోతే, వేల కోట్ల ఆస్తి మొత్తం వేరొకరికి వెళ్ళిపోతుందని ఆమె తండ్రి వీలునామా రాసిన సంగతి ఆమెకు ఆలస్యంగా తెలుస్తుంది. ముప్ఫై రోజులే గడువు ఉండడంతో, వరుడి కోసం వెతుకుతున్న ఆమె కార్తీక్‌ను పెళ్ళాడాలనుకుంటుంది.
     
మరోపక్క, బొబ్బిలిలో ఉండే హీరోయిన్ దివ్య (రకుల్ ప్రీత్ సింగ్). ఆమె తల్లి, తండ్రి (‘మిర్చి’ సంపత్) విడిపోతారు. తల్లి, మేనమామ (సాయికుమార్) దగ్గర పెరుగుతుంటుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తండ్రికీ, మేనమామకూ మధ్య నలిగిపోతుంటుంది. లాభం లేదని వేరే ఊరికి వచ్చేస్తుంది. కాలుష్యానికి కారణమవుతోందంటూ హీరో గారి ఫ్యాక్టరీ మీద కేసు వేసి, మూయించే పరిస్థితి తెస్తుంది. ఇండియాలోని ఈ ఫ్యాక్టరీ కోసం పోర్చుగల్ నుంచి పెళ్ళి పనులు కూడా పక్కన పడేసి, మరీ వస్తాడు హీరో.
     
హీరో ఇక్కడ కొచ్చాక, ఈ హీరోయిన్‌ను ప్రేమలో పడేయడానికి ప్రయత్నిస్తాడు. అదేమంటే, అసలు తాను పెళ్ళి చేసుకోవాలనుకున్నది ఈ హీరోయిన్‌నే అంటాడు. కావాలని తానే కేసు వేయించానంటూ ట్విస్ట్ ఇస్తాడు. ఇదేమిటని మనం విస్తుపోవడంతో ఫస్టాఫ్ ముగిసి, ఇంటర్వెల్ కార్డు పడుతుంది.  ఇక, సెకండాఫ్ అంతా... హీరో ఎవరు? అతనికీ హీరోయిన్ తండ్రికీ ఉన్న బంధం ఏమిటి? హీరోయిన్ తండ్రికీ, మేనమామకూ మధ్య వైరానికి కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానం వస్తుంది. ఇంతలో పోర్చుగల్‌లో హీరో పెళ్ళి మాట ఇచ్చిన బిజినెస్ మ్యాగ్నెట్ ఇండియాకు దిగుతుంది. ఈ గందరగోళాల మధ్య ఏం జరిగింది, విడిపోయిన కుటుంబాలు ఎలా కలిశాయన్నది మిగతా సినిమా.

 ఎలా ఉందంటే...
 తరచూ పవన్ కల్యాణ్‌ను అనుసరిస్తున్నట్లు అనిపించే రామ్ ఈసారీ అలానే అనిపించారు. ఈసారి ‘అత్తారింటికి దారేది’ తరహా కథ, క్లైమాక్స్‌ను అనుసరించారని అనిపిస్తుంది. కాకపోతే, ఉన్నంతలో ఆయన మంచి ఎనర్జీతో నటించారు. డ్యాన్సులు చేశారు. ఫైట్లూ అంతే. కాకపోతే, ఏ పాటా గుర్తుండదు. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ చూడడానికి బాగుందే తప్ప, ఆ పాత్రకు ఒక నిర్దిష్ట ప్రయోజనం, పరిధి కనిపించవు. సోనాలీ చౌహాన్ పనికొచ్చిందల్లా... బికినీలో గ్లామరస్‌గా కనిపించే పాటకే! అందరికీ ఉచితంగా సలహాలిచ్చే ‘వీకెండ్ వెంకటరావు’ పాత్రలో బ్రహ్మానందం కాసేపు నవ్విస్తారు. కానీ, సెకండాఫ్‌లో ఆ పాత్రను మరీ చౌకబారుగా మార్చేశారని అనిపిస్తుంది. వెయ్యి సినిమాలు చేసేసిన తరువాత ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం లాంటి ఆలోచనాపరుడు ఇలాంటి పాత్రలు చేయకపోతే మాత్రం వచ్చే నష్టం ఏమిటనిపిస్తుంది!
     
రౌడీ శంకరన్నగా అభిమన్యు సింగ్ సో సోగా ఉన్నా, అతని మేనమామ పాత్రలో జయప్రకాశ్‌రెడ్డి డైలాగ్స్, టైమింగ్ కొంత నవ్విస్తాయి. తీరా ఆ పాత్రలు కూడా అర్ధంతరంగా ఆగిపోతాయి. మళ్ళీ ఆఖరు క్షణంలో దర్శక, రచయితలకు గుర్తొచ్చినప్పుడు తెర పైన కనిపిస్తాయి. ఈ సినిమాకు సంగీతం - తమన్‌ది. అయితే, తమన్ బాణీలు కేవలం డప్పులు, దరువుల మోత అంటూ ఒక పాటలో సాహిత్యం ఉండడం తమన్ నిజాయతీకి నిదర్శనం అనుకోవాలేమో! ఇండియాలో తీసి, పోర్చుగల్ బ్యాక్‌డ్రాప్‌తో మిక్స్ చేసిన సి.జి. సీన్లు తెలిసిపోతుంటాయి. ఒకటి, రెండు పాటల చిత్రీకరణ, కెమేరా వర్క్, నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.
     
ముగ్గురు రచయితలు రచనలో చేయి పెట్టిన ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే క్రెడిట్ కూడా ఒక రచయితకూ, దర్శకుడికీ కట్టబెట్టారు. ఇంతా చేసి, కథ, కథనం మాత్రం ‘ఢీ’, ‘రెఢీ’, ‘కలిసుందాం రా’, ‘బృందావనం’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సవాలక్ష చిత్రాల్లోని సీన్లకు పేలవమైన అనుసరణే. ఇన్ని సినిమాల రీమిక్స్ అయిన ఈ సరికొత్త వెండితెర వంటకంలో ద్వంద్వార్థపు మాటలు, సీన్లు, వెకిలి చేష్టలు మాత్రం అదనం. ఫస్టాఫ్ కొంత బోర్ అనుకుంటే, సెకండాఫ్‌ను వినోదం పేరుతో అశ్లీలం నింపడం చీకాకు అనిపిస్తుంది.

పాతికేళ్ళుగా సంసారం చేయని భార్యాభర్తలు, పెళ్ళికాకుండానే ప్రేమలో హద్దులు దాటాలని చూసే యువకులు, అప్పుడెప్పుడో పెళ్ళి కాక ముందే తల్లి అయిన ఒక స్త్రీ ఫ్లాష్‌బ్యాక్, బాస్‌నే పడగొట్టాలని రాత్రిళ్ళు గదుల వెంట తిరిగే కమెడియన్ - ఇలా అంతా కేవలం ‘సెక్స్’ చుట్టూ తిరుగుతున్నట్లు కథ నడిపారు. ‘పండగ చేస్కో’ లాంటి ఫ్యామిలీ టైటిల్‌కూ, కథా నేపథ్యానికీ, ఈ ప్రవర్తనకూ సరిపడుతుందా, లేదా అన్న ఆలోచన కూడా దర్శక, నిర్మాతలు, రచయితలు చేసినట్లు కనిపించదు.
     
ఇక, సినిమా కథ, కథనంలో లోపాలు సవాలక్ష. అప్పటిదాకా హాస్టల్‌లో చదువుకున్నట్లున్న హీరోయిన్ ఎక్కడో వేరే ఊరికి వెళ్ళినట్లు చెప్పారు. ఆ తరువాత అక్కడ చాలా కాలంగా ‘గ్రీన్ ఆర్మీ’ పేరిట పచ్చదనం పరిరక్షణకు పనిచేస్తున్నట్లు చూపారు. ఆమె స్టూడెంటా? యాక్టివిస్టా? లాంటి డౌట్లు వస్తాయి. అలాగే మేనమామ కూతురిని పెళ్ళాడాలని అనుకున్న హీరో, మరి పోర్చుగల్‌లో బిజినెస్ మ్యాగ్నెట్ (సోనాలీ చౌహాన్)ను పెళ్ళాడతానని ఎందుకు అన్నట్లు? అనిపిస్తుంది. కానీ, అవన్నీ అప్పటికప్పుడు సినిమాటిక్ స్క్రీన్‌ప్లే రచయితలు తీసుకున్న కన్వీనియన్స్ అనుకొని సర్దుకుపోవడం మినహా సగటు ప్రేక్షకుడు చేయగలిగింది ఏమీ లేదు.
     
వెరసి, కొన్ని కట్స్‌తో చివరకు ‘యు ఏ’ సర్టిఫికెట్ అందుకున్న ఈ 2 గంటల 42 నిమిషాల సినిమాలో కట్ చేయాల్సిన సీన్లు చాలానే కనిపిస్తాయి. ‘ఏ’ సినిమాకు ‘యు ఏ’ఎలా దక్కిందా అన్న ఆశ్చర్యమూ కలుగుతుంది. వెరసి... బోలెడంత టైమ్, కాసింత డబ్బు దండగ చేస్కోవాలంటే మాత్రం ‘పండగ చేస్కో’ మన తెలుగు ప్రేక్షకులకు వచ్చిన లేటెస్ట్ ఆప్షన్.
 - రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement