pandaga chesko
-
'నా సినిమా ఆగిపోలేదు'
పండగ చేస్కో సినిమా తరువాత ఒక్క సినిమాకూడా అంగకీరించని గోపిచంద్ మలినేని, ఇటీవల మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమాను ప్రారంభించాడు. అయితే సాయి ప్రస్తుతం సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తిక్క సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో గోపిచంద్ సినిమా ఇంకా సెట్స్ మీదకు రాలేదు. అయితే అదే సమయంలో సాయిధరమ్ తేజ్ ఇతర దర్శకులతో సినిమాలు అంగీకరించాడన్న వార్తలు వినిపించాయి. దీంతో తిక్క తరువాత సాయిధరమ్ తేజ్ చేయబోయే సినిమాపై అనుమానాలు ఏర్పాడ్డాయి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ప్రారంభమైన సినిమాను పక్కన పెట్టి, సాయి మరో దర్శకుడితో సినిమా ప్రారంభిస్తున్నాడన్న టాక్ వినిపించింది. ఇలాంటి రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెడుతూ త్వరలోనే తమ సినిమా స్టార్ అవుతుందన్న సంకేతాలిచ్చాడు దర్శకుడు గోపిచంద్. తన సినిమా స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్తో అలరిస్తానని ట్విట్టర్లో కామెంట్ చేశాడు. Don't trust any false news abt my film..script is in final stage ...it's a pakka commercial entertainer — Gopichand Malineni (@megopichand) 2 June 2016 -
రొటీన్‌గా తీస్తే... రొటీన్‌గా హిట్ చేశారు!
విమర్శకుల మాటెలా ఉన్నా, ప్రేక్షకులు మాత్రం వినోదం అనిపిస్తే చాలు... రొటీన్ సినిమాలకు కూడా పట్టం కట్టేస్తారు. తాజాగా ‘పండగ చేస్కో’ సినిమాకు వస్తున్న వసూళ్ళే అందుకు నిదర్శనం. రామ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ తదితరులు నటించగా, పరుచూరి ప్రసాద్ నిర్మాతగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘పండగ చేస్కో’ గతవారం రిలీజైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం చిత్ర విజయోత్సవం జరిపిన యూనిట్, సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. చిత్రానికి పనిచేసిన నట, సాంకేతిక వర్గంతో పాటు, పలువురు సినిమా ప్రముఖలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో హీరో రామ్ మాట్లాడుతూ -‘‘2013 మే నెలలో వెలిగొండ శ్రీనివాస్ నుంచి ఈ కథ విన్నాను. అప్పుడు ఫ్రెష్‌గా అనిపించింది. తరువాత చాలా సినిమాలు రావడం వల్ల కొంత రొటీన్ అనే అభిప్రాయం వ్యక్తమైందేమో. ఈ సినిమాకు పరిశ్రమలోని బెస్ట్ టీమ్ పనిచేసింది’’ అన్నారు. ‘‘రామ్ కెరీర్లో ‘రెడీ’, ‘కందిరీగ’ లాగా ‘పండగ చేస్కో’ కమర్షియల్ హిట్. వినోదం వల్లే ఈ సినిమా ఇంత హిట్. సెకండాఫ్ గంటా 27 నిమిషాలనూ ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏణ్ణర్ధం పాటు కష్టపడి నిర్మాత పరుచూరి ప్రసాద్ తీసిన ఈ సినిమా మా డిస్ట్రిబ్యూటర్లందరికీ డబ్బులు తెచ్చిపెడుతోంది’’ అని డిస్ట్రిబ్యూటర్ ‘దిల్’ రాజు అన్నారు. ‘‘రివ్యూలకూ, రెవెన్యూకూ సంబంధం లేకుండా ఉంది. వైజాగ్‌లో మా థియేటర్లో అన్ని ఆటలూ ఫుల్స్‌తో ఆడుతోంది’’ అని ప్రముఖ దర్శకుడు, ఎగ్జిబిటర్ వి.వి. వినాయక్ చెప్పారు. ‘‘ఫ్యామిలీ డ్రామా, ఎంటర్టైన్మెంట్ల వల్లే ఈ సినిమా బాగా ఆడుతోంది. మేము పడిన కష్టానికి నిదర్శనంగా ఏ రోజుకారోజు సినిమా కలెక్షన్లు పెరుగుతూ వెళుతున్నాయి. ఈ సక్సెస్‌ను ఎవరూ ఆపలేరు’’ అని దర్శకుడు గోపీచంద్ మలినేని వ్యాఖ్యానించారు. ‘‘మేము చాలా రొటీన్ కథను రొటీన్‌గా తీస్తే, ఆడియన్స్‌ను కూడా రొటీన్‌గా చూసి, రొటీన్‌గా హాలులో పగలబడి నవ్వడం వల్ల, రొటీన్‌గానే హీరో, హీరోయిన్లు, ‘మిర్చి’ సంపత్ సీన్లు పండించడం వల్ల ఈ సినిమా రొటీన్‌గానే హిట్టయింది’’ అంటూ చిత్ర రచయితల్లో ఒకరైన కోన వెంకట్ వ్యంగ్యంగా మాట్లాడారు. మొత్తానికి, సినిమాలో బూతు ఎక్కువగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తినా, జనం మాత్రం అవేమీ పట్టించుకోకుండా ‘పండగ చేస్కో’ను ఆదరిస్తుండడం విశేషమే. మరి, ఇందులో తప్పెవరిది? జనం నాడి అందుకోలేకపోతున్న విమర్శకులదా? కాసేపు నవ్వుకుంటే చాలు... మిగతావన్నీ ఎందుకంటున్న ప్రేక్షకులదా? ఆలోచించాల్సిన విషయమే! -
సినిమా రివ్యూ : పండగ చేస్కో
డబ్బు, టైమ్... ‘దండగ చేస్కో’! చిత్రం - పండగ చేస్కో, తారాగణం - రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, కథ - వెలిగొండ శ్రీనివాస్, స్క్రీన్‌ప్లే - మాటలు - కోన వెంకట్, రచనా సహకారం - అనిల్ రావిపూడి, కెమేరా - సమీర్ రెడ్డి, నిర్మాత - పరుచూరి కిరీటి, స్క్రీన్‌ప్లే - దర్శకత్వం - గోపీచంద్ మలినేని ఒక సగటు తెలుగు సినిమాలో ఉండేవి ఏమిటి? విడిపోయిన కుటుంబాలు... తెగిపోయిన బంధాలు... ఆ ఫ్యామిలీలను కలపడానికి హీరో పడే శ్రమ, అందుకు హీరోయిన్‌తో సాగించే ప్రేమ... వాటి మధ్యలో ఒక విలన్ బృందపు వేట! దీనికి బ్యాక్‌డ్రాప్ - పెళ్ళి వారి ఇంటి నేపథ్యం. ఇలాంటి కథలు ఎన్ని వందలు తెరపై చూశామని బుర్ర బద్దలుకోనక్కర లేదు. గతంలో అలాంటివి చూడకుండా తప్పించుకున్నవారెవరైనా ఉంటే, వారి కోసం తాజాగా అటువంటి మరో సినిమా వచ్చింది. అది చూసి, ‘పండగ చేస్కో’వచ్చు. కథ ఏమిటంటే... ఎక్కడో పోర్చుగల్‌లో కార్తీక్ పోతినేని (రామ్). వీడియో గేమ్స్ మీద పట్టుతో వాటినే డెవలప్ చేసి, పెద్ద కంపెనీ పెట్టి, కోట్లు గడించిన యువతరం వ్యాపారవేత్త. తల్లితండ్రులు (పవిత్రా లోకేశ్, రావు రమేశ్), చెల్లెలు, బావ ఉంటారు. పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్న తరుణంలో అతనికి అనుష్క (సోనాల్ చౌహాన్) అనే మరో బడా పారిశ్రామికవేత్త తగులుతుంది. ఫలానా వయసులోగా భారతీయ సంతతి వ్యక్తిని ఎవరినైనా పెళ్ళిచేసుకోకపోతే, వేల కోట్ల ఆస్తి మొత్తం వేరొకరికి వెళ్ళిపోతుందని ఆమె తండ్రి వీలునామా రాసిన సంగతి ఆమెకు ఆలస్యంగా తెలుస్తుంది. ముప్ఫై రోజులే గడువు ఉండడంతో, వరుడి కోసం వెతుకుతున్న ఆమె కార్తీక్‌ను పెళ్ళాడాలనుకుంటుంది. మరోపక్క, బొబ్బిలిలో ఉండే హీరోయిన్ దివ్య (రకుల్ ప్రీత్ సింగ్). ఆమె తల్లి, తండ్రి (‘మిర్చి’ సంపత్) విడిపోతారు. తల్లి, మేనమామ (సాయికుమార్) దగ్గర పెరుగుతుంటుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తండ్రికీ, మేనమామకూ మధ్య నలిగిపోతుంటుంది. లాభం లేదని వేరే ఊరికి వచ్చేస్తుంది. కాలుష్యానికి కారణమవుతోందంటూ హీరో గారి ఫ్యాక్టరీ మీద కేసు వేసి, మూయించే పరిస్థితి తెస్తుంది. ఇండియాలోని ఈ ఫ్యాక్టరీ కోసం పోర్చుగల్ నుంచి పెళ్ళి పనులు కూడా పక్కన పడేసి, మరీ వస్తాడు హీరో. హీరో ఇక్కడ కొచ్చాక, ఈ హీరోయిన్ను ప్రేమలో పడేయడానికి ప్రయత్నిస్తాడు. అదేమంటే, అసలు తాను పెళ్ళి చేసుకోవాలనుకున్నది ఈ హీరోయిన్నే అంటాడు. కావాలని తానే కేసు వేయించానంటూ ట్విస్ట్ ఇస్తాడు. ఇదేమిటని మనం విస్తుపోవడంతో ఫస్టాఫ్ ముగిసి, ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇక, సెకండాఫ్ అంతా... హీరో ఎవరు? అతనికీ హీరోయిన్ తండ్రికీ ఉన్న బంధం ఏమిటి? హీరోయిన్ తండ్రికీ, మేనమామకూ మధ్య వైరానికి కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానం వస్తుంది. ఇంతలో పోర్చుగల్‌లో హీరో పెళ్ళి మాట ఇచ్చిన బిజినెస్ మ్యాగ్నెట్ ఇండియాకు దిగుతుంది. ఈ గందరగోళాల మధ్య ఏం జరిగింది, విడిపోయిన కుటుంబాలు ఎలా కలిశాయన్నది మిగతా సినిమా. ఎలా ఉందంటే... తరచూ పవన్ కల్యాణ్‌ను అనుసరిస్తున్నట్లు అనిపించే రామ్ ఈసారీ అలానే అనిపించారు. ఈసారి ‘అత్తారింటికి దారేది’ తరహా కథ, క్లైమాక్స్‌ను అనుసరించారని అనిపిస్తుంది. కాకపోతే, ఉన్నంతలో ఆయన మంచి ఎనర్జీతో నటించారు. డ్యాన్సులు చేశారు. ఫైట్లూ అంతే. కాకపోతే, ఏ పాటా గుర్తుండదు. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ చూడడానికి బాగుందే తప్ప, ఆ పాత్రకు ఒక నిర్దిష్ట ప్రయోజనం, పరిధి కనిపించవు. సోనాలీ చౌహాన్ పనికొచ్చిందల్లా... బికినీలో గ్లామరస్‌గా కనిపించే పాటకే! అందరికీ ఉచితంగా సలహాలిచ్చే ‘వీకెండ్ వెంకటరావు’ పాత్రలో బ్రహ్మానందం కాసేపు నవ్విస్తారు. కానీ, సెకండాఫ్‌లో ఆ పాత్రను మరీ చౌకబారుగా మార్చేశారని అనిపిస్తుంది. వెయ్యి సినిమాలు చేసేసిన తరువాత ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం లాంటి ఆలోచనాపరుడు ఇలాంటి పాత్రలు చేయకపోతే మాత్రం వచ్చే నష్టం ఏమిటనిపిస్తుంది! రౌడీ శంకరన్నగా అభిమన్యు సింగ్ సో సోగా ఉన్నా, అతని మేనమామ పాత్రలో జయప్రకాశ్‌రెడ్డి డైలాగ్స్, టైమింగ్ కొంత నవ్విస్తాయి. తీరా ఆ పాత్రలు కూడా అర్ధంతరంగా ఆగిపోతాయి. మళ్ళీ ఆఖరు క్షణంలో దర్శక, రచయితలకు గుర్తొచ్చినప్పుడు తెర పైన కనిపిస్తాయి. ఈ సినిమాకు సంగీతం - తమన్‌ది. అయితే, తమన్ బాణీలు కేవలం డప్పులు, దరువుల మోత అంటూ ఒక పాటలో సాహిత్యం ఉండడం తమన్ నిజాయతీకి నిదర్శనం అనుకోవాలేమో! ఇండియాలో తీసి, పోర్చుగల్ బ్యాక్‌డ్రాప్‌తో మిక్స్ చేసిన సి.జి. సీన్లు తెలిసిపోతుంటాయి. ఒకటి, రెండు పాటల చిత్రీకరణ, కెమేరా వర్క్, నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. ముగ్గురు రచయితలు రచనలో చేయి పెట్టిన ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే క్రెడిట్ కూడా ఒక రచయితకూ, దర్శకుడికీ కట్టబెట్టారు. ఇంతా చేసి, కథ, కథనం మాత్రం ‘ఢీ’, ‘రెఢీ’, ‘కలిసుందాం రా’, ‘బృందావనం’, ‘అత్తారింటికి దారేది’ లాంటి సవాలక్ష చిత్రాల్లోని సీన్లకు పేలవమైన అనుసరణే. ఇన్ని సినిమాల రీమిక్స్ అయిన ఈ సరికొత్త వెండితెర వంటకంలో ద్వంద్వార్థపు మాటలు, సీన్లు, వెకిలి చేష్టలు మాత్రం అదనం. ఫస్టాఫ్ కొంత బోర్ అనుకుంటే, సెకండాఫ్‌ను వినోదం పేరుతో అశ్లీలం నింపడం చీకాకు అనిపిస్తుంది. పాతికేళ్ళుగా సంసారం చేయని భార్యాభర్తలు, పెళ్ళికాకుండానే ప్రేమలో హద్దులు దాటాలని చూసే యువకులు, అప్పుడెప్పుడో పెళ్ళి కాక ముందే తల్లి అయిన ఒక స్త్రీ ఫ్లాష్‌బ్యాక్, బాస్‌నే పడగొట్టాలని రాత్రిళ్ళు గదుల వెంట తిరిగే కమెడియన్ - ఇలా అంతా కేవలం ‘సెక్స్’ చుట్టూ తిరుగుతున్నట్లు కథ నడిపారు. ‘పండగ చేస్కో’ లాంటి ఫ్యామిలీ టైటిల్‌కూ, కథా నేపథ్యానికీ, ఈ ప్రవర్తనకూ సరిపడుతుందా, లేదా అన్న ఆలోచన కూడా దర్శక, నిర్మాతలు, రచయితలు చేసినట్లు కనిపించదు. ఇక, సినిమా కథ, కథనంలో లోపాలు సవాలక్ష. అప్పటిదాకా హాస్టల్లో చదువుకున్నట్లున్న హీరోయిన్ ఎక్కడో వేరే ఊరికి వెళ్ళినట్లు చెప్పారు. ఆ తరువాత అక్కడ చాలా కాలంగా ‘గ్రీన్ ఆర్మీ’ పేరిట పచ్చదనం పరిరక్షణకు పనిచేస్తున్నట్లు చూపారు. ఆమె స్టూడెంటా? యాక్టివిస్టా? లాంటి డౌట్లు వస్తాయి. అలాగే మేనమామ కూతురిని పెళ్ళాడాలని అనుకున్న హీరో, మరి పోర్చుగల్‌లో బిజినెస్ మ్యాగ్నెట్ (సోనాలీ చౌహాన్)ను పెళ్ళాడతానని ఎందుకు అన్నట్లు? అనిపిస్తుంది. కానీ, అవన్నీ అప్పటికప్పుడు సినిమాటిక్ స్క్రీన్‌ప్లే రచయితలు తీసుకున్న కన్వీనియన్స్ అనుకొని సర్దుకుపోవడం మినహా సగటు ప్రేక్షకుడు చేయగలిగింది ఏమీ లేదు. వెరసి, కొన్ని కట్స్‌తో చివరకు ‘యు ఏ’ సర్టిఫికెట్ అందుకున్న ఈ 2 గంటల 42 నిమిషాల సినిమాలో కట్ చేయాల్సిన సీన్లు చాలానే కనిపిస్తాయి. ‘ఏ’ సినిమాకు ‘యు ఏ’ఎలా దక్కిందా అన్న ఆశ్చర్యమూ కలుగుతుంది. వెరసి... బోలెడంత టైమ్, కాసింత డబ్బు దండగ చేస్కోవాలంటే మాత్రం ‘పండగ చేస్కో’ మన తెలుగు ప్రేక్షకులకు వచ్చిన లేటెస్ట్ ఆప్షన్. - రెంటాల జయదేవ -
వెన్నులో వణుకు పుట్టింది!
‘‘నేనేదైనా సినిమా ఒప్పుకున్నానంటే, అందులోని పాత్ర నా మనసుకి విపరీతంగా నచ్చాలి. ఖాళీగా ఇంట్లో కూర్చున్నా ఫర్వాలేదు.. నచ్చని సినిమా చేసి బాధపడటమెందుకు? అనుకుంటాను’’ అని సోనాల్ చౌహాన్ అంటున్నారు. రామ్ సరసన ఆమె నటించిన ‘పండగ చేస్కో’ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సోనాల్ మాట్లాడుతూ, ‘‘ఈ చిత్రంలో నేను ఎన్నారై యువతిగా నటించాను. పొగరుబోతు. పెత్తనం చెలాయిస్తుంది. నా మనస్తత్వానికి విరుద్ధంగా ఉన్న ఈ పాత్ర చేయడం ఓ సవాలే. అలా ఈ సినిమా నాకు నటిగా సంతృప్తిని మిగిల్చింది. అలాగే, మర్చిపోలేని సంఘటన ఒకటుంది. పోర్చుగల్‌లోని అల్గార్లో ఓ పెద్ద కొండ దగ్గర పాట తీశాం. ఆ కొండ మీద డాన్స్ చేయాలన్నమాట. కొండ మీద నుంచి కిందకి చూస్తే, 150 అడుగుల లోతు ఉంది. పైగా బలమైన గాలి. వెన్నులో వణుకు పుట్టింది. ఆ గాలికి నా ప్రాణం గాల్లో కలిసిపోతుందేమో అనిపించింది. అదే కొండ మీద రామ్ నన్ను కూర్చోబెట్టుకుని డాన్స్ చేసే సీన్ తీసినప్పుడు కూడా భయపడ్డాను’’ అన్నారు. ప్రస్తుతం అనుష్క నటిస్తున్న ‘సైజ్ జీరో’తో పాటు కల్యాణ్ రామ్ ‘షేర్’లో చేస్తున్నానని సోనాల్ తెలిపారు. -
అందుకే అది ఆడడం మానేశా!
‘‘కెమెరా ముందుకెళ్లాక నేను రకుల్ అనే విషయాన్ని స్విచాఫ్ చేసేసి, చేస్తున్న పాత్రను స్విచాన్ చేస్తాను’’ అని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. రామ్ సరసన ఆమె నటించిన ‘పండగ చేస్కో’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి రకుల్ చెబుతూ -‘‘ఇందులో నేను ప్రకృతి ప్రేమికురాలిని. పేరు దివ్య. సినిమాలో తను చేసే పనులన్నీ చూసేవాళ్లకి కామెడీగా అనిపిస్తాయి. రామ్ ఫుల్ ఎనర్జిటిక్. అతనితో డాన్స్ చేయడం కొంచెం కష్టమనిపించింది. అయినప్పటికీ సవాలుగా తీసుకుని చేశాను. ఇప్పట్నుంచీ మరో రెండు నెలల వరకూ పండగలు లేవు. కానీ, ఈ సినిమా ఓ పండగ లాంటిదే. నాకు అన్ని పండగలూ ఇష్టమే. ముఖ్యంగా హోలీ పండగంటే ఇష్టం. రంగుల పొడి వల్ల చర్మం, జుట్టు పాడవుతాయని హోలీ ఆడడం మానేశాను’’ అన్నారు. గ్లామర్ అంటే చాలామంది నెగటివ్‌గా అనుకుంటున్నారని చెబుతూ -‘‘గ్లామర్ అంటే అందంగా కనిపించడం... అభ్యంతరకరంగా కనిపించడం కాదు. కథ డిమాండ్ చేస్తే, నేను గ్లామరస్‌గా కనిపించడానికి వెనకాడను. పాత్రకు న్యాయం చేయడానికి కృషి చేస్తాను కాబట్టే, ఈ స్థాయికి రాగలిగాను. ఇప్పుడందరూ ‘నువ్వు టాప్ ఫైవ్ హీరోయిన్స్‌లో ఉన్నావ్’ అంటుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు. -
‘పండగ చేస్కో’ మూవీ స్టిల్స్
-
రకుల్ ప్రీత్ సింగ్ బ్యాక్ షో...
-
బ్యాక్ షో...డెబ్భైవేలు!
శుక్రవారం సాయంత్రం... హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక ప్రాంగణం... ‘పండగ చేస్కో’ ఆడియో వేడుక హంగామా... సరిగ్గా ఆరున్నర గంటలకు ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులోంచి దేవకన్య దిగింది. అవును నిజమే... రకుల్ ప్రీత్ సింగ్ దేవకన్యలానే ఉన్నారు. అసలే గులాబీ రంగులో మెరిసిపోతున్న రకుల్‌కి ఆమె ధరించిన పొడవాటి పింక్ కలర్ గౌన్ రెట్టింపు అందాన్ని తీసుకొచ్చింది. ఆ గౌన్ని చూడాలో... రకుల్‌ని చూడాలో... కళ్లకే కన్ఫ్యూజన్. ఆ గౌను స్పెషాల్టీ ఏమంటే... బ్యాక్ పార్ట్ అంతా హాఫ్ వరకూ ఓపెన్. దాంతో రకుల్ వీపు వెన్నెల సంద్రపు ఒడ్డులా మిళమిళలాడుతోంది. మామూలుగానే ఆ ఫంక్షన్‌కి రకుల్ సెంటరాఫ్ ఎట్రాక్షన్. ఈ గౌను పుణ్యమా అంటూ ఆమె డబుల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇంతకీ గౌను ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా... 70 వేల రూపాయలు. అమ్మో అని గుండెలు బాదుకుంటున్నారా? హీరోయిన్ అన్నాక ఆ మాత్రం స్పెషల్ ఉండాలి కదా. రకుల్ తన వీపు చూపించడానికి 70 వేలు ఖర్చు పెట్టిందని కుర్రకారు మాత్రం తెగ ఆనందపడుతున్నారు. భయపడుతూనే వేసుకున్నా: ‘‘అసలు ఈ ఫంక్షన్‌కి నేను చీర కట్టుకోవాలనుకున్నాను. నా పర్సనల్ స్టయిలిస్ట్ నీరజ కోనను ఏదైనా మంచి డిజైనర్ శారీ సెలక్ట్ చేయమని అడిగితే, ఓ పొడవాటి గౌను ఫొటో పంపించి, ఇది బాగుంటుందని చెప్పింది. ‘బ్యాక్ మరీ ఇంత ఓపెన్‌గా.. బాగుంటుందో? లేదో?’ అని భయపడ్డా. కానీ, తనే కన్విన్స్ చేసి, గౌరీ అండ్ నైనికాతో ఈ గౌను డిజైన్ చేయించింది. ఇండియాలో వాళ్లు బెస్ట్ డిజైనర్స్. అయినప్పటికీ భయపడుతూనే వేసుకున్నా. బాగానే ఉన్నట్లనిపించింది. తీరా ఆడియో ఫంక్షన్‌కి వెళ్తే, బోల్డన్ని కాంప్లిమెంట్స్. చాలా మంది ఫోన్ చేసి మరీ, అభినందించారు. ఈ అభినందనల తాలూకు క్రెడిట్ అంతా నీరజకే దక్కుతుంది.’’ -
ఈ కథ నాకు రావడం లక్ : రామ్
‘‘రామ్ మంచి నటుడు. సినిమా తప్ప అతనికి వేరే ప్రపంచం తెలియదు. అలాంటి లక్షణాలున్న వాళ్లెవరైనా మంచి స్థాయిలో ఉంటారు’’ అని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్‌ల కాంబినేషన్లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మించిన చిత్రం ‘పండగ చేస్కో’. తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని శ్రీను వైట్ల ఆవిష్కరించి, దర్శకుడు సురేందర్ రెడ్డికి ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ, ‘‘పాటలు, ప్రచార చిత్రాలు చూస్తుంటే ఈ చిత్రం ఘన విజయం సాధించడం ఖాయమనిపిస్తోంది’’ అని అన్నారు. రామ్ మాట్లాడుతూ - ‘‘ ‘మసాలా’ షూటింగ్ అప్పుడు వెలిగొండ శ్రీనివాస్ ఈ కథ తీసుకొచ్చారు. కథ విన్న వెంటనే, ఇది నాకు రావడం లక్కీ అనుకున్నా. అలాగే ఆ కథ గోపీ చంద్ మలినేని చేతిలో పడడం ఆయన లక్ అనుకున్నా. ఆయన చాలా బాగా తీశారు. ‘పండగ చేస్కో’కి అన్నీ తీపి గుర్తులే. 18 నెలల తర్వాత నా సినిమా విడుదలవుతోంది’’ అన్నారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో రామ్‌లో ఓ కొత్త కోణం చూస్తారు. రామ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. నేను దర్శకత్వ శాఖలో పని చేస్తున్నప్పుడు నటి అనుష్కతో వర్క్ చాలా కంఫర్ట్‌గా ఉండేది. ఆమె చాలా డౌన్ టు ఎర్త్. ఈ సినిమా చేశాక రకుల్ మరో అనుష్కలా అనిపించింది’’ అని చెప్పారు. బ్రహ్మానందం మాట్లాడుతూ- ‘‘టైటిల్‌కు తగ్గట్టుగానే పండగ చేసుకునే సినిమా ఇది. ఈ సినిమా చేస్తున్నప్పుడు రామ్ నాకు ఆకలిగా ఉన్న పులిలా అనిపించాడు’’ అని వ్యాఖ్యానించారు. మాటల రచయిత కోనవెంకట్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాకైనా నన్ను వదిలేయమని చెప్పా. కానీ నేను లేకుండా సినిమా చేయనన్నాడు దర్శకుడు. నాకు రామ్‌లో నచ్చే గుణం ఏంటంటే టెక్నీషియన్స్‌కు విలువనిచ్చే హీరో. రామ్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ గ్రాసర్ అవుతుంది’’ అని చెప్పారు. పరుచూరి ప్రసాద్, పరుచూరి కిరీటి, తమన్, రకుల్, సోనాల్, భాస్కరభట్ల, అనిల్ రావిపూడి తదితర చిత్రబృందం పాల్గొన్నారు. ‘స్రవంతి’ రవికిశోర్, ‘దిల్’ రాజు, నల్లమలుపు బుజ్జి, బీవీయస్‌యన్ ప్రసాద్, వీరూ పోట్ల, బాబీ తదితర అతిథులు ‘పండగ చేస్కో’ యూనిట్‌కు శుభాకాంక్షలు అందజేశారు. -
‘పండగ చేస్కో’ ఆడియో ఆవిష్కరణ
-
కొత్త రాజధాని నీకు నే కట్టిస్తనే!
ఓ పక్క బందరు లడ్డులాంటి సుందరాంగి... ఇంకో పక్క జాంపండులాంటి కోమలాంగి... నారి నారి నడుమ మురారిలాగా చాకులాంటి కుర్రాడు! మంచి లొకేషన్ కుదిరింది. అకేషన్ అదిరింది. ఇంకేముంది... డ్యూయట్ స్టార్ట్. ‘‘జాంపేట కాడ కన్ను కొట్టేస్తనే! నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తనే! కొత్తపేట కాడ కొంగు లాగేస్తనే! కొత్త రాజధాని నీకు నే కట్టిస్తనే!’’... ఇదంతా ‘పండగ చేస్కో’ పాట సంరంభం. రామ్, రకుల్ ప్రీత్‌సింగ్, సోనాల్ చౌహాన్‌లపై ఇటీవల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో జానీ నృత్య దర్శకత్వంలో, భాస్కరభట్ల రాసిన ఈ పాటను భారీ ఎత్తున చిత్రీకరించారు దర్శకుడు మలినేని గోపీచంద్. పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ పాటతో పూర్తయింది. ఈ నెలాఖరున పాటలను, వచ్చే నెల ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ టీవీ ఛానల్ చాలా క్రేజీ ఆఫర్‌తో చేజిక్కించుకున్నట్టు సమాచారం. -
పండగ చేస్కుంటాడా?
-
మూడు చిత్రాలతో బిజీ!
ఇప్పుడు రామ్‌కు క్షణం తీరిక లేదు. వరుసగా షూటింగ్‌ల మీద షూటింగులు. విశ్రాంతి గురించి కూడా ఆలోచించకుండా డేట్స్ కేటాయించేశారు. ఒకవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘పండగ చేస్కో’ సినిమా చేస్తూనే, మరోవైపు రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపేశారు. జస్ట్ అంగీకరించడం మాత్రమే కాదు.. జెట్ వేగంతో ఓ చిత్రం మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసేశారు. శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. దీనికి ‘శివమ్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా తొలి షెడ్యూల్ బుధవారంతో పూర్తయింది. శుక్రవారం రాత్రి ‘పండగ చేస్కో’ కోసం పోర్చుగల్, స్పెయిన్ ప్రయాణం అవుతున్నారు రామ్. వచ్చే నెల 23 వరకు అక్కడ ఉంటారు రామ్. ఇక్కడకు రాగానే, ‘శివమ్’ రెండో షెడ్యూల్ ఆరంభం అవుతుంది. ఆ వెంటనే శ్రీ స్రవంతి మూవీస్‌లోనే మరో చిత్రం షూటింగ్లో పాల్గొంటారు. తిరుమల కిశోర్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. కథ కూడా సిద్ధమైంది. ఏప్రిల్‌లో చిత్రీకరణ మొదలవుతుంది. ప్రస్తుతం కథానాయిక ఎంపిక జరుగుతోంది. అంటే... ఈ ఏడాది రామ్ మూడు సినిమాలతో అభిమానులను అలరించనున్నారన్నమాట. -
ఆడపిల్లలంటే తగని సిగ్గు!
తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకొని, క్రేజు సంపాదించుకున్న యువ హీరో రామ్. అయితే, ఆయన ఇటీవల నటించిన ‘ఒంగోలు గిత్త’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘మసాలా’ చిత్రాలు ఆశించినంతగా ఆడలేదు. దాంతో, మళ్ళీ మంచి విజయం సాధించాలనే పట్టుదలతో తాజాగా సెట్స్‌పై ఉన్న ‘పండగ చేస్కో’ చిత్రంపై ఆయన ఏకాగ్ర దృష్టి పెట్టారు. సినిమాల సంగతి కాసేపు పక్కనపెడితే, ఇప్పటి వరకు తన కెరీర్‌లోని మొత్తం 11 చిత్రాల్లో ఏకంగా 16 మంది హీరోయిన్లతో నటించి, పలు చిత్రాల్లో ఒకరికి ఇద్దరు హీరోయిన్లతో తెరపై నర్తించిన ఘనత ఈ యువ హీరోకు దక్కింది. అయితే, గమ్మత్తేమిటంటే ఈ యువ హీరోకు చిన్నప్పుడు మాత్రం ఆడవాళ్ళంటే తగని సిగ్గట! ఇటీవల ఆయన ఆ సంగతులు ముచ్చటిస్తూ, ఒక ఆసక్తికరమైన సంగతి బయటపెట్టారు. తను చిన్నతనంలో ఆడవాళ్ళతో అసలు మాట్లాడేవాడు కాదట! అయితే, కొందరిని చూసి మనసు పారేసుకొని, మోహంలో పడిన అనుభవాలు మాత్రం ఉన్నాయట! ‘‘నా మీద మనసు పడ్డ ఒక అమ్మాయి గతంలో ఒకసారి నాతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. అంతే! నేను అక్కడ నుంచి పరారయ్యాను. అలాగే, కొన్నిసార్లు కొంతమంది అమ్మాయిలు నాకు ప్రేమ ప్రతిపాదన చేశారు. కానీ, అలాంటప్పుడు ఎలా స్పందించాలో నాకు తెలిసేది కాదు’’ అని రామ్ అప్పటి సంగతులు చెప్పుకొచ్చారు. స్కూల్లో చదువుకొనే రోజుల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో రామ్ చురుగ్గా పాల్గొనేవారట! ‘‘స్కూల్లో నేనొక్కణ్ణే మంచి జావెలిన్ త్రోయర్ని. చిన్నప్పటి నుంచీ నాకు సినిమా హీరోను కావాలని కోరిక. అందుకే, జాజ్, డ్యాన్స్, గుర్రపుస్వారీ, కుంగ్‌ఫూ లాంటి వాటిలో క్రాష్ కోర్సులు చేస్తూ వచ్చా. హీరోనయ్యాక అవన్నీ నాకు ఉపయోగపడతాయనుకున్నా. అచ్చంగా, అలాగే పదహారేళ్ళ వయసులో ‘దేవదాసు’తో తెరపైకి వచ్చా’’ అని రామ్ ఆనందంగా ఆ సంగతులు చెప్పారు. ఎంతైనా, జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా చిన్నప్పటి సంగతులు తీపి జ్ఞాపకాలే కదా! -
పండగ చేస్కో అంటున్న రామ్
-
స్టయిలిష్ లుక్...
తొలి సినిమా ‘దేవదాస్’ నుంచి మొన్నటి ‘మసాలా’ వరకూ సినిమా సినిమాకీ తనలోని ఎనర్జీ లెవల్స్‌ని పెంచుకుంటూ వెళ్తున్నారు హీరో రామ్. ప్రస్తుతం ‘పండగచేస్కో’ షూటింగ్లో బిజీగా ఉన్నారాయన. కుర్రకారు పండగ చేసుకునేలా ఈ సినిమా కథ, కథనాలుంటాయని చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని అంటున్నారు. ఈ చిత్రంలో రామ్ చాలా స్టయిలిష్ లుక్‌తో కనిపిస్తారని ఆయన పేర్కొన్నారు. పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ సందర్భంగా పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘నటునిగా రామ్ సత్తా ఏంటో తెలిపే సినిమా ఇది. ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా పాత్ర చిత్రణ ఉంటుంది. గత నెలలో 15 రోజుల పాటు పొల్లాచ్చిలో స్టన్ శివ నేతృత్వంలో పోరాట సన్నివేశాలు చిత్రీకరించాం. ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకూ హైదరాబాద్‌లో కొంత టాకీతో పాటు పోరాట సన్నివేశాలు తీస్తాం. అక్టోబర్ 20 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ఉంటుంది’’ అని తెలిపారు. రకుల్ ప్రీత్‌సింగ్, సోనాలి చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, కెమెరా: ఆర్థర్ వెల్సన్, సంగీతం: తమన్. -
పొల్లాచ్చిలో ఫైటింగ్!
పండగలాంటి సినిమా ఇవ్వడానికి కృషి చేస్తున్నాం.. పండగ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటున్నారు ‘పండగ చేస్కో’ చిత్రబృందం. రామ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రం ఇది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఇటీవల కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. ప్రస్తుతం రామ్ పాల్గొనగా స్టన్ శివ నేతృత్వంలో ఫైట్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 30 వరకు సాగే ఈ షెడ్యూల్లో ఇంకా టాకీ సీన్స్ కూడా తీస్తాం. రామ్ శారీరక భాషకు తగ్గట్టుగా తన పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. తమన్ మంచి పాటలు స్వరపరిచారు’’ అని చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్, సోనాల్ చౌహాన్, సాయికుమార్, బ్రహ్మానందం తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: అనిల్ రావిపూడి, కెమెరా: ఆర్థర్ విల్సన్. -
పేరుకు తగ్గట్టే పండగ..!
‘‘పేరుకు తగ్గట్టే ‘పండగచేస్కో’ సినిమా ఉంటుంది’’ అంటున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. రామ్ కథానాయకునిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పండగచేస్కో. పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్, సోనాలి చౌహాన్ కథానాయికలు. ఈ చిత్రం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇందులో రామ్ ఆహార్యం, అభినయం కొత్తగా ఉంటాయి. రామ్ శారీరక భాషకు తగ్గట్టుగా ఎనర్జిటిక్‌గా ఆయన పాత్రను మలచడం జరిగింది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం. సెప్టెంబర్‌లో అమెరికా షెడ్యూల్ ఉంటుంది. నవంబర్ 15 వరకూ జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. యువతరాన్ని ఉర్రూతలూగించేలా సినిమా ఉంటుంది. తమన్ సంగీతం ఈ సినిమాకు హైలైట్’’ అని తెలిపారు. సాయికుమార్, బ్రహ్మానందం, జయప్రకాశ్‌రెడ్డి, రావురమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, కెమెరా: ఆర్థర్ వెల్సన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాణం: యునెటైడ్ మూవీస్. -
ఎన్నారైగా హంగామా
డాలర్లలో పుట్టి పెరిగిన కుర్రాడు అతను. పిజ్జాలూ బర్గర్లూ, ఫ్యాషన్లూ, హైఫై, వైఫై... ఇదే అతని ప్రపంచం. అలాంటివాడు విదేశం వదిలి స్వదేశంలోకి అడుగుపెట్టాల్సి వస్తుంది. ఇక్కడకు ఎందుకొచ్చాడు? ఇక్కడేం చేశాడు? రామ్ తాజా సినిమా ‘పండగ చేస్కో’ కథా కమామీషు ఇది. ఎన్నారై కుర్రాడిగా ఫుల్ జోష్‌తో రామ్ ఇందులో కనిపిస్తారని దర్శకుడు గోపీచంద్ మలినేని చెబుతున్నారు. రవితేజతో ‘బలుపు’ వంటి హిట్ సినిమా చేసిన గోపి ఈ చిత్రాన్ని రామ్ శారీరక భాషకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ‘సింహా’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన నిర్మాత పరుచూరి ప్రసాద్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన పాత్రలో రకరకాల డైమన్షన్లు ఉండడంలో రామ్ ఈ సినిమా విషయంలో ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. రామ్ శైలికి తగిన వినోదం, యాక్షన్ ఇందులో ఉంటాయట. ఈ చిత్రంలో రామ్‌కి జోడీగా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తున్నారు. సోమవారం నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. త్వరలో విదేశాల్లో భారీ షెడ్యూలు చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
పది రోజుల్లో పండగ మొదలు
ప్రేక్షకులు పండగ చేసుకునే స్థాయిలో మా ‘పండగ చేస్కో’ ఉంటుందని నిర్మాత పరుచూరి కిరీటి అంటున్నారు. రామ్ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 12న మొదలుకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇందులోని హీరో పాత్ర చిత్రణ రామ్ శారీరకభాషకు తగ్గట్టుగా ఉంటుంది. రామ్ అత్యంత శక్తిమంతమైన పాత్రను పోషించనున్నారు. పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది’’ అని చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోనవెంకట్, కెమెరా: ఆర్థర్ ఎ.విల్సన్, సంగీతం: తమన్, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: పరుచూరి ప్రసాద్. -
పండగలా ఉండే సినిమా : రామ్
‘‘దాదాపు ఏడాది విరామం తర్వాత చేస్తున్న సినిమా ఇది. ‘మసాలా’ సినిమాకు ముందే రచయిత వెలిగొండ శ్రీనివాస్ నాకీ కథ చెప్పాడు. చాలా నచ్చింది. అతనితో పాటు మంచి రచయితల బృందం కుదిరింది. అలాగే, ఇతర శాఖలకు కూడా ప్రతిభావంతులు కుదరడం ఆనందంగా ఉంది. ఎంత అన్యమన స్కంగా థియేటర్‌కి వెళ్లినా ఈ సినిమా బాగుందనే అంటారు’’ అని చెప్పారు రామ్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రామ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా యునెటైడ్ మూవీస్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ‘పండగ చేస్కో’ శనివారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ముహూర్తపు దృశ్యానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘రామ్ ఎనర్జీ అంటే నాకిష్టం. ఆ ఎనర్జీ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది. ‘బలుపు’ తర్వాత కొంత సమయం తీసుకున్నా మంచి కథ కుదిరింది. చక్కని కథ, మంచి నిర్మాతతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. నాయకా నాయికల పాత్రలు ఎనర్జిటిక్‌గా ఉంటాయి. జగపతిబాబుది ఇందులో ముఖ్యమైన పాత్ర’’ అని చెప్పారు. గోపీచంద్, రామ్‌లతో ముచ్చటగా తనకిది మూడో సినిమా అని, హ్యాట్రిక్ సాధించడం ఖాయం అని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. రామ్ కోసమే రాసిన కథ ఇదనీ, ఓ కోటీశ్వరుడు భారతదేశం వచ్చి ఏం చేశాడు? అనేదే ఈ చిత్రకథ అని చెప్పారు వెలిగొండ శ్రీనివాస్. నిర్మాత పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ, ‘‘రామ్తోగత నాలుగేళ్లుగా సినిమా చేయాలనుకుంటున్నా. అయితే ఎన్టీఆర్, బన్నీ స్థాయికి తగ్గ కథ ఉంటేనే రామ్‌తో చేయాలనుకున్నా. ఎందుకంటే అతను అంత ఎనర్జిటిక్. వినోద ప్రధానంగా సాగే సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడి చూస్తున్నారు. పండగలా ఉండే ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ఈ సినిమాలో నటించడం పట్ల రకుల్ తన ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: అనిల్ రావిపూడి. -
వరుసగా రెండు సినిమాలు!
జయాపజయాలకు అతీతంగా యువతలో క్రేజ్‌ని సొంతం చేసుకున్న యువ కథానాయకుడు రామ్. వెంకటేశ్‌తో కలిసి ఆయన నటించిన మల్టీస్టారర్ ‘మసాలా’ వచ్చి అయిదు నెలలు కావస్తోంది. ఇప్పటివరకూ రామ్ సినిమా ఏదీ మొదలు కాలేదు. ఎనర్జీకి పర్యాయ పదమైన రామ్ సినిమా కోసం యువతరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ విజయాన్ని సాధించాలనే కసితో రామ్ ఉన్నారని, ఈ విరామానికి కారణం అదేనని ఆయన ఆంతరంగికుల సమాచారం. కథల విషయంలో చాలా అప్రమత్తంగా రామ్ ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్గా రామ్ ఓ కథను ‘ఓకే’ చేశారు. వేణు అనే నూతన దర్శకుడు చెప్పిన ఈ కథ రామ్‌కి విపరీతంగా నచ్చడంతో... వెంటనే పచ్చజెండా ఊపేశారట. ఓ నూతన నిర్మాణ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించనుంది. రామ్ సరసన సమంత కథానాయికగా నటించడం ఈ సినిమాకు మరో విశేషం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రామ్ నటించే ‘పండగచేస్కో’ చిత్రం ఈ నెలలోనే సెట్స్‌కి వెళ్లనుంది. మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందనుంది. హన్సిక కథానాయికగా నటించే ఈ సినిమా తర్వాత... కొత్త దర్శకుడు వేణు సినిమా చేస్తారు రామ్. ఇప్పటివరకూ సినిమాల విషయంలో నిదానమే ప్రధానం అంటూ ముందుకెళ్లిన రామ్... ఇక నుంచి వేగం పెంచాలనుకుంటున్నారట. ఆయన అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. -
ఏప్రిల్ నుంచి పండగే...
సినిమా సినిమాకూ జోరు పెంచుకుంటూ పోతున్నారు రామ్. తన గత చిత్రం ‘మసాలా’ ఫలితం ఎలా ఉన్నా, నటుడిగా రామ్‌కి మాత్రం ఆ సినిమా మంచి గుర్తింపునే తెచ్చింది. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించనున్నారు. పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మించనున్న ఈ చిత్రానికి ‘పండగ చేస్కో’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘కందిరీగ’ తర్వాత రామ్, హన్సిక కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా కోసం అమెరికాలో భారీ సెట్ నిర్మించనుండటం మరో విశేషం. ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి గోపిచంద్ మలినేని మాట్లాడుతూ -‘‘‘బలుపు’ తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. రామ్ శారీరక భాషకు తగ్గట్టుగా పాత్ర చిత్రణ ఉంటుంది. ఈ పూర్తి స్థాయి మాస్ చిత్రానికి ‘పండగ చేస్కో’ అనే టైటిల్ సరిగ్గా యాప్ట్. ‘సింహా’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన యునెటైడ్ మూవీస్ బేనర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది’’అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్. -
పండగ చేస్కో అంటున్న రామ్
ఆనందకరమైన సందర్భాల్లో యూత్ ఎక్కువగా ఉపయోగించే పదం ‘పండగ చేస్కో’. మంచి మాస్ ఫీల్ ఉన్న పదం అది. రామ్ లాంటి కత్తిలాంటి కుర్రాడి సినిమాకైతే... ఈ టైటిల్ సరిగ్గా యాప్ట్. అందుకే... రామ్‌తో గోపిచంద్ మలినేని తెరకెక్కించనున్న చిత్రానికి ‘పండగ చేస్కో’ అనే టైటిల్ ఖరారు చేశారట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘సింహా’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందించిన పరుచూరి కిరీటి నిర్మాత. పరుచూరి ప్రసాద్ సమర్పకుడు. ఈ నెలలోనే ఈ చిత్రం ప్రారంభ వేడుకను ఘనంగా ఈ సినిమాను నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉగాది తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందట. రామ్ ఇమేజ్‌కి తగ్గట్టు హై ఎనర్జిటిక్‌గా హీరో పాత్రను డిజైన్ చేశారట గోపిచంద్ మలినేని. యువతరానికి, మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఈ కథలో మెండుగా ఉంటాయని సమాచారం. తమన్ స్వరాలందిస్తున్న ఈ చిత్రానికి కథానాయిక ఇంకా ఖరారు కాలేదు. ఓ ప్రముఖ కథానాయిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.