ఆడపిల్లలంటే తగని సిగ్గు!
తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకొని, క్రేజు సంపాదించుకున్న యువ హీరో రామ్. అయితే, ఆయన ఇటీవల నటించిన ‘ఒంగోలు గిత్త’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘మసాలా’ చిత్రాలు ఆశించినంతగా ఆడలేదు. దాంతో, మళ్ళీ మంచి విజయం సాధించాలనే పట్టుదలతో తాజాగా సెట్స్‌పై ఉన్న ‘పండగ చేస్కో’ చిత్రంపై ఆయన ఏకాగ్ర దృష్టి పెట్టారు. సినిమాల సంగతి కాసేపు పక్కనపెడితే, ఇప్పటి వరకు తన కెరీర్‌లోని మొత్తం 11 చిత్రాల్లో ఏకంగా 16 మంది హీరోయిన్లతో నటించి, పలు చిత్రాల్లో ఒకరికి ఇద్దరు హీరోయిన్లతో తెరపై నర్తించిన ఘనత ఈ యువ హీరోకు దక్కింది.
అయితే, గమ్మత్తేమిటంటే ఈ యువ హీరోకు చిన్నప్పుడు మాత్రం ఆడవాళ్ళంటే తగని సిగ్గట! ఇటీవల ఆయన ఆ సంగతులు ముచ్చటిస్తూ, ఒక ఆసక్తికరమైన సంగతి బయటపెట్టారు. తను చిన్నతనంలో ఆడవాళ్ళతో అసలు మాట్లాడేవాడు కాదట! అయితే, కొందరిని చూసి మనసు పారేసుకొని, మోహంలో పడిన అనుభవాలు మాత్రం ఉన్నాయట! ‘‘నా మీద మనసు పడ్డ ఒక అమ్మాయి గతంలో ఒకసారి నాతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. అంతే! నేను అక్కడ నుంచి పరారయ్యాను. అలాగే, కొన్నిసార్లు కొంతమంది అమ్మాయిలు నాకు ప్రేమ ప్రతిపాదన చేశారు. కానీ, అలాంటప్పుడు ఎలా స్పందించాలో నాకు తెలిసేది కాదు’’ అని రామ్ అప్పటి సంగతులు చెప్పుకొచ్చారు.
స్కూల్‌లో చదువుకొనే రోజుల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో రామ్ చురుగ్గా పాల్గొనేవారట! ‘‘స్కూల్‌లో నేనొక్కణ్ణే మంచి జావెలిన్ త్రోయర్‌ని. చిన్నప్పటి నుంచీ నాకు సినిమా హీరోను కావాలని కోరిక. అందుకే, జాజ్, డ్యాన్స్, గుర్రపుస్వారీ, కుంగ్‌ఫూ లాంటి వాటిలో క్రాష్ కోర్సులు చేస్తూ వచ్చా. హీరోనయ్యాక అవన్నీ నాకు ఉపయోగపడతాయనుకున్నా. అచ్చంగా, అలాగే పదహారేళ్ళ వయసులో ‘దేవదాసు’తో తెరపైకి వచ్చా’’ అని రామ్ ఆనందంగా ఆ సంగతులు చెప్పారు. ఎంతైనా, జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా చిన్నప్పటి సంగతులు తీపి జ్ఞాపకాలే కదా!