ఒంగోలు గిత్తలకు పూర్వ వైభవం.. గుండెలదిరే రంకెలు, చూపులో కసి.. | Gir cow Embryos were Experimentally Introduced into Ongole Cows | Sakshi
Sakshi News home page

యాంబ్రియో పద్ధతిలో ప్రయోగం.. ఒంగోలు గిత్తలకు పూర్వ వైభవం..

Published Fri, Sep 30 2022 11:56 AM | Last Updated on Fri, Sep 30 2022 2:51 PM

Gir cow Embryos were Experimentally Introduced into Ongole Cows - Sakshi

ఒంగోలు గిత్త.. బలీయమైన దేహం. గుండెలదిరే రంకెలు. చూపులో కసి.. ఉట్టిపడే రాజసం. ఎంతటి బరువునైనా సులభంగా లాగేసే జబ్బబలం.. దీని సొంతం. ఒక్కసారి రంకే వేసి కదనరంగంలోకి దిగితే ఇక అంతే. పౌరుషానికి మారుపేరైన ఈ గిత్తలు ప్రకాశం జిల్లా సొంతం. గత పాలకుల నిర్లక్ష్యంతో వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. చదలవాడ పశుక్షేత్రం ద్వారా వీటిని సంరక్షించే చర్యలు చేపట్టింది. ఏటా వీటి సంపద పెరుగతూ వస్తోంది. నూతన సాంకేతిక విధానంతో యాంబ్రియో పద్ధతి ద్వారా దేశంలో మంచి పేరున్న గిర్‌ ఆవు పిండాలను ఒంగోలు జాతి ఆవుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక  గిర్‌ గిత్తలు రంకెలు వేయనున్నాయి. 

సాక్షి, ఒంగోలు: ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఒంగోలు గిత్తల జాతి గత పాలకుల నిర్లక్ష్యంతో అంతరించే దశకు చేరుకుంది.  2004 సంవత్సరం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఈ జాతి గిత్తల వృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నిధులు విడుదల చేశారు. మళ్లీ ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒంగోలు జాతి రక్షణకు దృష్టిసారించారు. 

క్షేత్రంలో 326 పశువులు... 
చదలవాడ పశుక్షేత్రంలో ఇప్పటి వరకు 326 పశువులున్నాయి. వీటిలో పాలిచ్చే ఆవులు 72, చూడివి 54, ఒట్టిపోయిన ఆవులు 24, మిగిలినవి ఏడాది నుంచి మూడేళ్లలోపు లేగ దూడలు ఉన్నాయి. క్షేత్రంలో ఏడాదికి 120 కోడె దూడలు ఉత్పత్తి చేశారు. వాటిలో 50 ఆవు దూడలు, 70 కోడెదూడలు. గతేడాది రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ కింద జిల్లాలోని పశ్ఛిమ ప్రాంత రైతులకు 43 కోడెదూడలు ఉచితంగా అందజేశారు. మరో 12 ఒంగోలు జాతి కోడె దూడలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మరో 29 కోడె దూడలను గుంటూరు జిల్లా నకిరేకల్‌ కోడెదూడల ఉత్పత్తి క్షేత్రానికి పంపించారు. 

గడిచిన మూడేళ్లుగా.. 
గత టీడీపీ ప్రభుత్వం ఒంగోలు జాతి పశువులను కాపాడాలన్న విషయాన్ని పూర్తిగా గాలికొదిసింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో భారీగా నిధలు కేటాయించింది. క్రమేణా వీటి సంతతి పెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. మేలైన ఆవుల అండాల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా గుజరాత్‌ నుంచి యంత్రాన్ని తెప్పించారు. సేకరించిన అండాల నిల్వ కోసం ప్రత్యేక ల్యాబ్‌ను కూడా అభివృద్ధి చేశారు. 

నిధులు పుష్కలం... 
రాష్ట్ర ప్రభుత్వం సుమారు నాలుగు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంతో చదలవాడ పశుక్షేత్రంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పశువుల సం«ఖ్య అధికమవుతుండటంతో రూ.2 కోట్లతో నాలుగు నూతన షెడ్లు ఏర్పాటు చేశారు. పాలనా అవసరాల కోసం రూ.70 లక్షలతో పరిపాలన భవనం, వీటితో పాటు మరో రూ.40 లక్షలతో అంతర్గత రోడ్లు ఏర్పాటు చేశారు. రూ.10 లక్షలతో సోలార్‌ లైట్లు ఏర్పాటు చేయడంతో క్షేత్రంలో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అంతేగాకుండా గోచార్‌ పథకంలో భాగంగా క్షేత్రంలో భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.52 లక్షలు ఖర్చు చేయనుంది.  

ప్రయోగాత్మకంగా యాంబ్రియో..
యాంబ్రియో(పిండం) పద్ధతి అంటే మేలు జాతి ఎద్దు, ఆవు పిండాలను కలగలిపి నేరుగా వేరే ఆవు గర్భంలో ప్రవేశ పెట్టడమే. మనుషుల్లో సరోగసీ ఎలాగో పశువుల్లో యాంబ్రియో అలానే. దీనికోసం కొత్త సాంకేతికతను చదలవాడ పశుక్షేత్రంలో విజయవంతంగా అమలు చేశారు. దేశంలో మంచి పేరున్న గుజరాత్‌కు చెందిన గిర్‌ జాతి ఆవు నుంచి సేకరించిన పిండాలను ఒంగోలు జాతి ఆవులో ప్రవేశపెట్టారు. ఇలా ఈ ఏడాది జనవరి నెలలో ఆరు పశువుపై ప్రయోగం చేశారు. వాటిలో ఒకటి విజయవంతంగా చూడి కట్టింది. దీంతో ప్రస్తుతం ఒక ఆవు ఈ నెలాఖరుకు ఈన వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

మేలైన ఒంగోలు జాతి పశువుల ఉత్పత్తే లక్ష్యం
ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయించడంతో ఒంగోలు జాతి పశువులను ఉత్పత్తి చేస్తున్నాం. గతంలో ఉన్న కష్టాలు ప్రస్తుతం తొలగిపోయాయి. పశుక్షేత్రంలో ఇప్పటికే మౌలిక వసతులు కల్పించారు. యాంబ్రియో పద్ధతి ద్వారా మేలు జాతి పశువుల ఉత్పత్తి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. 
– బి.రవి, డిప్యూటీ డైరెక్టర్, చదలవాడ పశుక్షేత్రం 

ఉచితంగా ఒంగోలు జాతి కోడె దూడ ఇచ్చారు 
ఒంగోలు ఆవు జాతి, ఒంగోలు గిత్తలను పెంపొందించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు జాతి కోడె దూడను నాలుగు నెలల క్రితం ఉచితంగా ఇచ్చింది. అప్పటికే ఏడాది పాటు దాని పోషణ చేసిన తర్వాత రైతుగా, పశుపోషకునిగా ఉన్న నాకు దానిని అందజేశారు. ఒంగోలు పశుగణాభివృద్ధి సంస్థ అధికారులు రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌ పథకం ద్వారా అందజేశారు. దాణా, మందులు కూడా ఇచ్చారు. ఆవులను దాటడానికి విత్తనపు గిత్తగా దీనిని తయారు చేస్తున్నాం. నాకు నాలుగు ఆవులు ఉన్నాయి. గ్రామంలోని అందరి పశుపోషకుల ఆవులను దాటించడానికి దానిని వినియోగిస్తాం. తద్వారా ఒంగోలు జాతి ఉత్పత్తిని పెంపొందిస్తాం. 
– గుండారెడ్డి మల్లికార్జునరెడ్డి, రైతు, చినదోర్నాల  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement