Gir cow
-
‘పిండ మార్పిడి’ విధానంలో గిర్‌జాతి కోడె దూడ జననం
చేబ్రోలు: పిండ మార్పిడి విధానంలో పశువులు, ఆవుల్లో గర్భం దాల్చడం ఇప్పటి వరకు పరిశోధనశాలలు, ఫామ్స్‌లో మాత్రమే ఉన్నాయని, ఆ దశదాటిన పరిశోధనలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుంటూరు అనీల్ కుమార్‌రెడ్డికి సంబంధించిన జెర్సీ ఆవుకు పిండమార్పిడి ద్వారా గిర్‌జాతి కోడెదూడ జన్మించింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో శ్రీనివాసరావు, లాం ఫాం పశుపరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎం. ముత్తారావు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈవో డి. బాలశంకరరావు తదితర బృందం గిర్‌జాతి కోడెదూడను పరిశీలించారు. జెర్సీ ఆవుకు గిర్‌జాతికి చెందిన పిండాన్ని ఈ ఏడాది మార్చి 13న ప్రవేశపెట్టారు. ఆ జెర్సీ ఆవు ఈనెల 22న గిర్‌జాతికి చెందిన కోడెదూడకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా సీఈవో ఎం శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ పిండ మార్పిడి ద్వారా మేలు రకం జాతి లక్షణాలు ఉన్న సంతతితో పాటు, అంతరించి పోతున్న దేశవాళీ జాతులను కూడా వృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 145 పిండాలను మార్పిడి చేయగా 45వరకు చూడి దశలో ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 కోట్లు కేటాయించినట్టు వివరించారు. వచ్చే ఏడాది వంద దూడలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఏడీకి సీఈవో అభినందన జిల్లాలో మొట్టమొదటి పిండమార్పిడిలో గిర్‌జాతి కోడె దూడ జన్మించింది. ఈ ప్రయోగాల కోసం కృషి చేసిన ఏడీ సాంబశివరావును సీఈవో ఎం శ్రీనివాసరావు, శాస్త్రవేత్త ముత్తారావు, ఉన్నతాధికారులు సన్మానించారు. పశుసంవర్థకశాఖ ఏడీలు, పశువైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఒంగోలు గిత్తలకు పూర్వ వైభవం.. గుండెలదిరే రంకెలు, చూపులో కసి..
ఒంగోలు గిత్త.. బలీయమైన దేహం. గుండెలదిరే రంకెలు. చూపులో కసి.. ఉట్టిపడే రాజసం. ఎంతటి బరువునైనా సులభంగా లాగేసే జబ్బబలం.. దీని సొంతం. ఒక్కసారి రంకే వేసి కదనరంగంలోకి దిగితే ఇక అంతే. పౌరుషానికి మారుపేరైన ఈ గిత్తలు ప్రకాశం జిల్లా సొంతం. గత పాలకుల నిర్లక్ష్యంతో వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. చదలవాడ పశుక్షేత్రం ద్వారా వీటిని సంరక్షించే చర్యలు చేపట్టింది. ఏటా వీటి సంపద పెరుగతూ వస్తోంది. నూతన సాంకేతిక విధానంతో యాంబ్రియో పద్ధతి ద్వారా దేశంలో మంచి పేరున్న గిర్ ఆవు పిండాలను ఒంగోలు జాతి ఆవుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక గిర్ గిత్తలు రంకెలు వేయనున్నాయి. సాక్షి, ఒంగోలు: ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఒంగోలు గిత్తల జాతి గత పాలకుల నిర్లక్ష్యంతో అంతరించే దశకు చేరుకుంది. 2004 సంవత్సరం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ జాతి గిత్తల వృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నిధులు విడుదల చేశారు. మళ్లీ ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంగోలు జాతి రక్షణకు దృష్టిసారించారు. క్షేత్రంలో 326 పశువులు... చదలవాడ పశుక్షేత్రంలో ఇప్పటి వరకు 326 పశువులున్నాయి. వీటిలో పాలిచ్చే ఆవులు 72, చూడివి 54, ఒట్టిపోయిన ఆవులు 24, మిగిలినవి ఏడాది నుంచి మూడేళ్లలోపు లేగ దూడలు ఉన్నాయి. క్షేత్రంలో ఏడాదికి 120 కోడె దూడలు ఉత్పత్తి చేశారు. వాటిలో 50 ఆవు దూడలు, 70 కోడెదూడలు. గతేడాది రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద జిల్లాలోని పశ్ఛిమ ప్రాంత రైతులకు 43 కోడెదూడలు ఉచితంగా అందజేశారు. మరో 12 ఒంగోలు జాతి కోడె దూడలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మరో 29 కోడె దూడలను గుంటూరు జిల్లా నకిరేకల్ కోడెదూడల ఉత్పత్తి క్షేత్రానికి పంపించారు. గడిచిన మూడేళ్లుగా.. గత టీడీపీ ప్రభుత్వం ఒంగోలు జాతి పశువులను కాపాడాలన్న విషయాన్ని పూర్తిగా గాలికొదిసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో భారీగా నిధలు కేటాయించింది. క్రమేణా వీటి సంతతి పెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. మేలైన ఆవుల అండాల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా గుజరాత్ నుంచి యంత్రాన్ని తెప్పించారు. సేకరించిన అండాల నిల్వ కోసం ప్రత్యేక ల్యాబ్‌ను కూడా అభివృద్ధి చేశారు. నిధులు పుష్కలం... రాష్ట్ర ప్రభుత్వం సుమారు నాలుగు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంతో చదలవాడ పశుక్షేత్రంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పశువుల సం«ఖ్య అధికమవుతుండటంతో రూ.2 కోట్లతో నాలుగు నూతన షెడ్లు ఏర్పాటు చేశారు. పాలనా అవసరాల కోసం రూ.70 లక్షలతో పరిపాలన భవనం, వీటితో పాటు మరో రూ.40 లక్షలతో అంతర్గత రోడ్లు ఏర్పాటు చేశారు. రూ.10 లక్షలతో సోలార్ లైట్లు ఏర్పాటు చేయడంతో క్షేత్రంలో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అంతేగాకుండా గోచార్ పథకంలో భాగంగా క్షేత్రంలో భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.52 లక్షలు ఖర్చు చేయనుంది. ప్రయోగాత్మకంగా యాంబ్రియో.. యాంబ్రియో(పిండం) పద్ధతి అంటే మేలు జాతి ఎద్దు, ఆవు పిండాలను కలగలిపి నేరుగా వేరే ఆవు గర్భంలో ప్రవేశ పెట్టడమే. మనుషుల్లో సరోగసీ ఎలాగో పశువుల్లో యాంబ్రియో అలానే. దీనికోసం కొత్త సాంకేతికతను చదలవాడ పశుక్షేత్రంలో విజయవంతంగా అమలు చేశారు. దేశంలో మంచి పేరున్న గుజరాత్‌కు చెందిన గిర్ జాతి ఆవు నుంచి సేకరించిన పిండాలను ఒంగోలు జాతి ఆవులో ప్రవేశపెట్టారు. ఇలా ఈ ఏడాది జనవరి నెలలో ఆరు పశువుపై ప్రయోగం చేశారు. వాటిలో ఒకటి విజయవంతంగా చూడి కట్టింది. దీంతో ప్రస్తుతం ఒక ఆవు ఈ నెలాఖరుకు ఈన వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మేలైన ఒంగోలు జాతి పశువుల ఉత్పత్తే లక్ష్యం ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయించడంతో ఒంగోలు జాతి పశువులను ఉత్పత్తి చేస్తున్నాం. గతంలో ఉన్న కష్టాలు ప్రస్తుతం తొలగిపోయాయి. పశుక్షేత్రంలో ఇప్పటికే మౌలిక వసతులు కల్పించారు. యాంబ్రియో పద్ధతి ద్వారా మేలు జాతి పశువుల ఉత్పత్తి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. – బి.రవి, డిప్యూటీ డైరెక్టర్, చదలవాడ పశుక్షేత్రం ఉచితంగా ఒంగోలు జాతి కోడె దూడ ఇచ్చారు ఒంగోలు ఆవు జాతి, ఒంగోలు గిత్తలను పెంపొందించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు జాతి కోడె దూడను నాలుగు నెలల క్రితం ఉచితంగా ఇచ్చింది. అప్పటికే ఏడాది పాటు దాని పోషణ చేసిన తర్వాత రైతుగా, పశుపోషకునిగా ఉన్న నాకు దానిని అందజేశారు. ఒంగోలు పశుగణాభివృద్ధి సంస్థ అధికారులు రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ద్వారా అందజేశారు. దాణా, మందులు కూడా ఇచ్చారు. ఆవులను దాటడానికి విత్తనపు గిత్తగా దీనిని తయారు చేస్తున్నాం. నాకు నాలుగు ఆవులు ఉన్నాయి. గ్రామంలోని అందరి పశుపోషకుల ఆవులను దాటించడానికి దానిని వినియోగిస్తాం. తద్వారా ఒంగోలు జాతి ఉత్పత్తిని పెంపొందిస్తాం. – గుండారెడ్డి మల్లికార్జునరెడ్డి, రైతు, చినదోర్నాల -
‘విక్కీడోనర్’ వర్కవుట్ అయ్యేనా ?
-
Gyr Cattle: ‘విక్కీడోనర్’ వర్కవుట్ అయ్యేనా?
వెబ్‌డెస్క్ : పాడి రైతుల ఇంట కాసుల వర్షం కురిపించేందుకు సరికొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్టు మహారాష్ట్ర సర్కారు చెబుతోంది. అందుకోసం బ్రెజిల్ నుంచి గిర్ జాతి గిత్తల వీర్యాన్ని దిగుమతి చేసుకుంటోంది. అంతేకాదు బ్రెజిల్ బ్రీడ్ గిర్ గిత్తలను ఇండియాకు తీసుకువచ్చి స్థానిక గిర్ ఆవులతో సంకరం చేయించాలని నిర్ణయించింది. ఈ పథకానికి గోకుల్ మిషన్‌గా పేరు పెట్టింది. దీని ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ పథకం తీరు తెన్నులు, ఎందుకు ప్రవేశ పెట్టాల్సి వచ్చిందనే వివరాలు తెలుసుకుందాం రండి. -
‘దేశీ’ దశగవ్య!
దేశీ ఆవుల ఆలంబనగా సేంద్రియ వ్యవసాయాన్ని ఓ మహిళా రైతు కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. గిర్ ఆవుల పాలను తోడుపెట్టి, మజ్జిగ చిలికి సంప్రదాయబద్ధంగా నెయ్యిని తీస్తున్నారు. స్వచ్ఛమైన దేశీ ఆవుల నెయ్యి, పాలు, పేడ, మూత్రం తదితరాలతో పంచగవ్య మాదిరిగా ‘దశగవ్య’(సేంద్రియ పంటల పెరుగుదలకు ఉపకరించే పోషక ద్రావణం) తయారు చేస్తున్నారు. తన 25 ఎకరాల సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో పశుగ్రాసాలు, ఆహార పంటలను పండిస్తున్నారు. దేశీ ఆవు నెయ్యి, దశగవ్య, ఘనజీవామృతం విక్రయిస్తూ శభాష్ అనిపించుకుంటున్న ఉడుముల లావణ్యారెడ్డి ‘డాక్టర్ ఆఫ్ అగ్రికల్చర్’ డిగ్రీని అందుకున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. మంజీర నది తీరాన సంగారెడ్డి జిల్లా అందోలు వద్ద 25 ఎకరాల్లో కొలువైన విలక్షణ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం అది. హైద్రాబాద్‌కు చెందిన ఉడుముల లావణ్య రెడ్డి మక్కువతో ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో 200కు పైగా ఉత్తమ దేశీ గిర్ జాతి గోవులున్నాయి. పుంగనూరు, సాహివాల్ వంటి ఇతర దేశీ జాతుల ఆవులు సైతం ఒకటి, రెండు ఉన్నాయి. ప్రస్తుతం 40 గిర్ ఆవులు పాలు ఇస్తున్నాయి. లావణ్య రెడ్డి పాలు అమ్మరు. పాలను కాచి తోడుపెట్టి, పెరుగును చిలికి సంప్రదాయ పద్ధతిలో స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసి అమ్ముతారు. ప్రతి 28 లీటర్ల పాలకు కిలో నెయ్యి తయారవుతుందని, నెలకు 80–90 కిలోల నెయ్యిని తాము ఉత్పత్తి చేస్తున్నామని ఆమె తెలిపారు. దీంతోపాటు.. సేంద్రియ పంటలు ఏపుగా పెరిగేందుకు దోహదపడే దశగవ్య అనే పోషక ద్రావణాన్ని తయారు చేసి తమ పంటలకు వాడుకుంటూ, ఇతరులకూ విక్రయిస్తున్నారు. ఘనజీవామృతం, జీవామృతం, దశగవ్య, అగ్రి అస్త్రం కూడా తయారు చేసుకొని పూర్తి సేంద్రియ పద్ధతుల్లో వరి, కూరగాయలు, పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేపట్టిన తొలి ఏడాదే జైశ్రీరాం, ఆర్ఎన్ఆర్ సన్న రకాల ధాన్యాన్ని ఎకరానికి 40 బస్తాలు(70 కిలోల) పండించామని ఆమె తెలిపారు. ఆమె కృషికి మెచ్చిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఇటీవల ‘డాక్టర్ ఆఫ్ అగ్రికల్చర్’ డిగ్రీని ప్రదానం చేసింది. దశగవ్య తయారీ పద్ధతి సేంద్రియ పంటల పెరుగుదలకు దోహదపడే గోఉత్పత్తులతో ‘పంచగవ్య’ తయారీకి తమిళనాడుకు చెందిన డా. నటరాజన్ ఆద్యుడు. అదే రీతిలో 10 ఉత్పాదకాలను కలిపి దశగవ్యను తయారు చేయడం వాడుకలోకి వచ్చింది. దశగవ్య తయారీపై లావణ్య రెడ్డి అందించిన వివరాలు.. 50 లీటర్ల బ్యారెల్‌ను తీసుకొని.. 40 లీటర్ల దశగవ్యను తయారు చేయాలి. 7.5 కిలోల పేడ, 7.5 లీటర్ల మూత్రం, 750 గ్రాముల నెయ్యి, 5 లీటర్ల పాలు, 5 లీటర్ల పెరుగు, 5 లీటర్ల కొబ్బరి నీళ్లు, 5 లీటర్ల చెరుకు రసం, చిన్నవైతే 24–పెద్దవైతే 18 అరటి పండ్లు, 2 కిలోల నల్ల ద్రాక్ష పండ్లు, 5 లీటర్ల తాటి కల్లుతో దశగవ్యను తయారు చేయాలి. మొదట బ్యారెల్‌లో పేడ, నెయ్యి వేసి అరగంట నుంచి గంట వరకు కట్టెతో బాగా కలపాలి. అనంతరం దానికి మూత పెట్టకూడదు. పల్చటి గుడ్డ కట్టాలి. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిపూట కలియదిప్పాలి. 5వ రోజు పైన చెప్పిన మోతాదులో మిగతా 8 రకాలను కలపాలి. 18వ రోజు వరకు రోజూ ఇలాగే రోజుకు నాలుగు సార్లు కలియదిప్పుతూ ఉండాలి. 19వ రోజున వడపోస్తే.. దశగవ్య సిద్ధమవుతుంది. సీసాల్లో నింపి నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత కలియదిప్పాల్సిన అవసరం లేదు. ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది. వడపోయగా వచ్చిన పిప్పిని పంట పొలంలో ఎరువుగా వేసుకోవచ్చు. 15 రోజులకోసారి పిచికారీ దశగవ్యను వివిధపంటలపై 30 లీటర్ల నీటిలో ఒక లీటరు దశగవ్యను కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయవచ్చని లావణ్యారెడ్డి తెలిపారు. డ్రిప్ ద్వారా కూడా పంటలకు అందించవచ్చు. ఎకరం వరి పంటకు పిచికారీకి సుమారు 200 లీటర్ల ద్రావణం అవసరమవుతుందని, అందుకు ఆరు–ఏడు లీటర్ల దశగవ్య అవసరమవుతుందని ఆమె తెలిపారు. కూరగాయ పంటలకు పిచికారీ చేసేటప్పుడు 25 లీటర్ల నీటికి ఒక లీటరు దశగవ్య కలపాలని తెలిపారు. దశగవ్య పిచికారీ చేసిన పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయని, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటాయని, మంచి దిగుబడినిస్తాయని ఆమె అన్నారు. ఆవుపేడ, మూత్రం పుష్కలంగా ఉంది కాబట్టి ఘనజీవామృతం తయారు చేసుకొని నెలకోసారి ఎకరానికి 5–6 క్వింటాళ్లు చల్లుతున్నామన్నారు. నీటిని అందించేటప్పుడు జీవామృతం కలిపి పారిస్తున్నామన్నారు. అగ్రి అస్త్రం, బ్రహ్మాస్త్రం కూడా అవసరాన్ని బట్టి వాడుతున్నామని, మొత్తంగా తమ పంటలు ఆశ్చర్యకరంగా దిగుబడులు వస్తున్నాయన్నారు. జంజుబ గడ్డి.. 18 రోజులకో కోత లావణ్యారెడ్డి తమ వ్యవసాయ క్షేత్రంలో ప్రస్తుతం 9 ఎకరాల్లో సంప్రదాయ రకం జంజుబ గడ్డితోపాటు పారాగడ్డి, సూపర్ నేపియర్, తీపిజొన్న రకాలను సాగు చేస్తున్నారు. అరెకరంలో కూరగాయలు, ఎకరంలో పసుపు, ఎకరంలో చెరకు, రెండెకరాల్లో సుగంధ దేశీరకం వరిని సాగు చేస్తున్నారు. జుంజుబ రకం గడ్డిని ఆవులు ఇష్టంగా తింటాయన్నారు. ఇది 18 రోజులకోసారి కోతకు వస్తుందన్నారు. కోత కోసిన తర్వాత నీటితోపాటు జీవామృతం పారిస్తామని, 5–6 రోజుల తర్వాత దశగవ్య పిచికారీ చేస్తామన్నారు. మోకాళ్ల ఎత్తుకు ఎదిగిన తర్వాత కోసి ఆవులకు వేస్తామన్నారు. –ఆకుల రాంబాబు, సాక్షి, జోగిపేట, సంగారెడ్డి జిల్లా సేంద్రియ సాగు వ్యాప్తే లక్ష్యం దేశీ ఆవులు సేంద్రియ వ్యవసాయానికి మూలాధారం. గో ఉత్పత్తుల ద్వారా వ్యవసాయంలో రసాయనాలకు పూర్తిగా స్వస్తి చెప్పటం సాధ్యమేనని రైతులకు తెలియజెప్పడం కోసం మోడల్ ఫామ్‌ను ఏర్పాటు చేశాను. ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తికి దోహదపడే దశగవ్య, ఘనజీవామృతాలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాను. సేంద్రియ సేద్యాన్ని వ్యాప్తిలోకి తేవాలన్నదే లక్ష్యం. – డా. ఉడుముల లావణ్యారెడ్డి (92468 45501), అందోలు, సంగారెడ్డి జిల్లా దేశీ రకం వరి, వంగ మొక్కలు, చెరకు తోట, కొర్ర పంట ప్లాస్టిక్ బ్యారెల్‌లో దశగవ్యను కలియదిప్పుతున్న కార్మికులు ఆవుల కోసం దాణా జుంజుబ గడ్డి -
ఆవుల మూత్రంలో బంగారం!
జునాఘడ్: గుజరాత్ లోని జునాఘడ్ జిల్లాలో ఎక్కువగా కనిపించే గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 400 గిర్ జాతి ఆవుల మూత్రంపై నాలుగేళ్ల పాటు విస్తృతంగా పరిశోధనలు జరిపిన జునాఘడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(జేఏయూ) లీటర్ మూత్రంలో మూడు మిల్లీ గ్రాముల నుంచి 10 మిల్లీ గ్రాముల వరకు బంగారం ఉన్నట్టు పేర్కొన్నారు. బంగారానికి సంబంధించిన ధాతువులు నీటిలో కలిసిపోయి ఆవుల మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పూర్వీకుల చిత్రాల్లో మాత్రమే ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లు తెలిసేదని, పరిశోధనలు చేయగా అది నిజమేనని తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని రకాల కెమికల్ పద్ధతులను ఉపయోగించి ఆవుల మూత్రం నుంచి బంగారాన్ని బయటకు తేవచ్చని చెప్పారు. ఒంటె, గేదే, గొర్రె, మేకలపై కూడా ఇలాంటి పరిశోధనలు చేశామని చెప్పారు. అయితే, వాటి మూత్రంలో వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి ఆధారాలేవీ కనిపించలేదని వివరించారు. గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో అనేక రకాల వ్యాధులకు నిరోధకంగా పనిచేసే లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ పరిశోధనలు చేసే జేఏయూ ఫుడ్ టెస్టింగ్ లాబోరేటరీ ఏటా దాదాపు 50,000లకు పైగా పరీక్షలు జరుపుతుంది. ఎగుమతులు, డైరీ ప్రొడక్ట్స్, కూరగాయలు, దినుసులు, తేనే, పురుగుల మందులు తదితరాలపై పరిశోధనలు ఇక్కడ నిర్వహిస్తారు. ప్రస్తుతం గిర్ ఆవుల మూత్రం మనుషుల జబ్బులకు, వృక్షాల పెంపకానికి ఎలా పనిచేస్తుందో పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రజ్ఞులు వివరించారు.