‘పిండ మార్పిడి’ విధానంలో గిర్‌జాతి కోడె దూడ జననం | Cattle in embryo transfer procedure | Sakshi
Sakshi News home page

‘పిండ మార్పిడి’ విధానంలో గిర్‌జాతి కోడె దూడ జననం

Published Wed, Dec 27 2023 5:05 AM | Last Updated on Wed, Dec 27 2023 5:05 AM

Cattle in embryo transfer procedure - Sakshi

చేబ్రోలు: పిండ మార్పిడి విధానంలో పశువులు, ఆవుల్లో గర్భం దాల్చడం ఇప్పటి వరకు పరిశోధనశాలలు, ఫామ్స్‌­లో మాత్రమే ఉన్నాయని, ఆ దశదాటిన పరిశోధనలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుంటూరు అనీల్‌ కుమార్‌రెడ్డికి సంబంధించిన జెర్సీ ఆవుకు పిండమార్పిడి ద్వారా గిర్‌జాతి కోడెదూడ జన్మించింది.

మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో  శ్రీనివాసరావు, లాం ఫాం పశుపరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎం. ముత్తారావు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈవో డి. బాలశంకరరావు తదితర బృందం గిర్‌జాతి కోడెదూడను పరిశీలించారు. జెర్సీ ఆవుకు గిర్‌జాతికి చెందిన పిండాన్ని ఈ ఏడాది మార్చి 13న ప్రవేశపెట్టారు. ఆ జెర్సీ ఆవు ఈనెల 22న గిర్‌జాతికి చెందిన కోడెదూడకు జన్మనిచ్చింది.

ఈ సందర్భంగా సీఈవో ఎం శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ పిండ మార్పిడి ద్వారా మేలు రకం జాతి లక్షణాలు ఉన్న సంతతితో పాటు, అంతరించి పోతున్న దేశవాళీ జాతులను కూడా వృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 145 పిండాలను మార్పిడి చేయగా 45వరకు చూడి దశలో ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 కోట్లు కేటాయించినట్టు వివరించారు. వచ్చే ఏడాది వంద దూడలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 

ఏడీకి సీఈవో అభినందన  
జిల్లాలో మొట్టమొదటి పిండమార్పిడిలో గిర్‌జాతి కోడె దూ­డ జన్మించింది. ఈ ప్రయోగాల కోసం కృషి చేసిన ఏడీ సాంబశివరావును సీఈవో ఎం శ్రీనివాసరావు, శాస్త్రవేత్త ముత్తారావు, ఉన్నతాధికారులు సన్మానించారు. పశుసంవర్థక­శాఖ ఏడీలు, పశువైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement