embryo
-
‘పిండ మార్పిడి’ విధానంలో గిర్‌జాతి కోడె దూడ జననం
చేబ్రోలు: పిండ మార్పిడి విధానంలో పశువులు, ఆవుల్లో గర్భం దాల్చడం ఇప్పటి వరకు పరిశోధనశాలలు, ఫామ్స్‌లో మాత్రమే ఉన్నాయని, ఆ దశదాటిన పరిశోధనలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుంటూరు అనీల్ కుమార్‌రెడ్డికి సంబంధించిన జెర్సీ ఆవుకు పిండమార్పిడి ద్వారా గిర్‌జాతి కోడెదూడ జన్మించింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో శ్రీనివాసరావు, లాం ఫాం పశుపరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎం. ముత్తారావు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈవో డి. బాలశంకరరావు తదితర బృందం గిర్‌జాతి కోడెదూడను పరిశీలించారు. జెర్సీ ఆవుకు గిర్‌జాతికి చెందిన పిండాన్ని ఈ ఏడాది మార్చి 13న ప్రవేశపెట్టారు. ఆ జెర్సీ ఆవు ఈనెల 22న గిర్‌జాతికి చెందిన కోడెదూడకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా సీఈవో ఎం శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ పిండ మార్పిడి ద్వారా మేలు రకం జాతి లక్షణాలు ఉన్న సంతతితో పాటు, అంతరించి పోతున్న దేశవాళీ జాతులను కూడా వృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 145 పిండాలను మార్పిడి చేయగా 45వరకు చూడి దశలో ఉన్నాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 కోట్లు కేటాయించినట్టు వివరించారు. వచ్చే ఏడాది వంద దూడలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఏడీకి సీఈవో అభినందన జిల్లాలో మొట్టమొదటి పిండమార్పిడిలో గిర్‌జాతి కోడె దూడ జన్మించింది. ఈ ప్రయోగాల కోసం కృషి చేసిన ఏడీ సాంబశివరావును సీఈవో ఎం శ్రీనివాసరావు, శాస్త్రవేత్త ముత్తారావు, ఉన్నతాధికారులు సన్మానించారు. పశుసంవర్థకశాఖ ఏడీలు, పశువైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వైద్య చరిత్రలో మరో అద్భుతం... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం
కేం బ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ గర్భస్థ పిండాన్ని సృష్టించారు. ఈ పిండంలో మానవ పిండం మాదిరిగా అవయవాలన్ని క్రమంగా అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గర్భస్థ పిండాన్ని సృష్టించడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. వాస్తవానికి పరిశోధకులు వైద్యశాలల్లో పిండాన్ని స్త్రీలోని అండాలు, పురుషుడిలోని స్పెర్మ్‌ని ఉపయోగించి కృత్రిమంగా పిండాన్ని రూపొందిస్తారు. దీన్నే టెస్ట్‌ట్యూబ్ బేబి అంటారు. బాహ్యంగా పిండాన్ని రూపొందించడం. కానీ ఇక్కడ మాత్రం శాస్త్రవేత్తలు వాటిని వినియోగించకుండా కేవలం స్టెమ్ సెల్స్(మూల కణాలను) వినియోగించి కృత్రిమ గర్భస్థ పిండాన్ని రూపొందించారు. ఈ మేరకు ప్రోఫెసర్ మాగ్డలీనా జెర్నికా నేతృత్వంలో తమ బృందం ఈ పిండాన్ని రూపొందిచినట్లు తెలిపారు. అదీకూడా మూడు వేర్వేరు మూలకణాలను తీసుకుని ఈ పరిశోధన చేసినట్లు తెలిపారు. ఆ మూలకణాల్లోని జన్యువులను పరస్పరం చర్య జరుపుకునేలా ప్రత్యేక వాతావరణాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. అలా రూపొందిన ఈ గర్భస్థ పిండం మానవుల గర్భస్థ పిండంలో గుండె కొట్టుకోవడం, మెదడు, చర్మం వంటివి ఎలా అభివృద్ధి చెందుతాయో అలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన కొంతమంది తల్లులకు గర్భం విజయవంతమవ్వడం, మరికొందరికి గర్భస్రావం అవ్వడంవంటివి ఎందుకు జరుగుతాయో తెలుసుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. తల్లిగర్భంలో ఎలా పిండం అభివృద్ధి చెందుతుందో అలా మూలకణాలతో రూపొందిన కృత్రిమ పిండం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ కృత్రిమ పిండాన్ని తల్లి గర్భంలో అమర్చి వివిధ దశల్లో ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోగలగడమే కాకుండా మరిన్ని పరిశోధనలకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు. (చదవండి: ఉక్రెయిన్ విడిచి వచ్చిన పౌరులకు... బంపరాఫర్ ప్రకటించిన పుతిన్) -
భర్త జ్ఞాపకంగా బిడ్డ.. ఐవీఎఫ్ పద్ధతిలో పండంటి మగశిశువుకు జన్మ
సాక్షి, వరంగల్: వారికి పెళ్లై తొమ్మిదేళ్లయ్యింది. పిల్లలు లేకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చివరికి ఐవీఎఫ్ పద్ధ తిలో గర్భం కోసం భార్యాభర్తలి ద్దరూ తమ కణాలను కూడా భద్ర పరిచారు. దురదృష్టవ శాత్తు భర్త కోవిడ్‌తో మరణించారు. ఆయన జ్ఞాపకమైన బిడ్డ కోసం భార్య హైకోర్టుకు వెళ్లారు. కోర్టు అనుమతి తెచ్చుకుని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ అరుదైన ఘటన వరంగల్‌లో చోటుచేసు కుంది. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లాలో ఫ్యూరిఫైడ్ వాటర్ వ్యాపారం చేసుకుంటున్న కుమార్(32), ప్రేమ(పేరు మార్చాం)లకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్లైంది. కానీ పిల్లలు లేకపోవడంతో... 2020లో వరంగల్‌లోని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్‌ను సంప్రదించారు. ఫెర్టిలిటీ సెంటర్ స్పెషలిస్ట్, క్లినికల్ హెడ్ డాక్టర్ జలగం కావ్యరావు పర్యవేక్షణలో ఐవీఎఫ్ చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె అండం, అతని శుక్రకణాలను భద్రపరిచారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో కుమార్‌కు పాజిటివ్ వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విష మించడంతో చనిపోయాడు. చదవండి: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం ఐవీఎఫ్ విధా నంలో పిండ మార్పిడికి భార్యా భర్తలిద్దరి సమ్మతి అవసరం. భర్త చనిపోయిన కారణంగా సమ్మతి కుదరదు కాబట్టి, గత తీర్పులను ఉటంకిస్తూ, ప్రేమ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు... ఫ్రీజింగ్ చేసిన కణాల ఫలదీకరణ, పిండ మార్పిడికి ప్రేమకు అనుమతి ఇచ్చింది. దీంతో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వారు ఫ్రోజెన్ యాంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా ఆమెలోకి పిండం పంపారు. మార్చి 22న ప్రేమ మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లే కుండా పోయాయి. వరంగల్ ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్–ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జలగం కావ్యరావు మాట్లాడుతూ.. విధి ఆమెకు అపార మైన నష్టం కలిగించినా, అధునాతనమైన సంతానోత్పత్తి ప్రక్రియతో ప్రేమ జీవితంలో కొత్త ఆశలను చిగురింపచేయగలిగామని అన్నారు. -
పళ్లులేని రాకాసి బల్లి.. శిలాజ అండంలో ఎదిగిన పిండం!
బీజింగ్: దాదాపు 7 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ గుడ్డును చైనాలోని గాంఝూ నగరంలో పరిశోధకులు కనుగొన్నారు. ఈ శిలాజ అండంలో పూర్తిగా ఎదిగిన పిండం ఉండడం విశేషం. దీనికి ముద్దుగా బేబీ ఇంగిలియాంగ్ అని పేరుపెట్టారు. ఈ గుడ్డు పళ్లులేని రాకాసి బల్లి ఒవిరాప్టోరోసారస్కు చెందినదై ఉండొచ్చని పరిశోధన నిర్వహించిన బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ పురాతత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రాకాసి బల్లుల శరీరంపై ఈకలుండేవని, వీటికి రకరకాల ముక్కులుండేవని తెలిపారు. గతంలో వీటి శిలాజాలు ఆసియా, ఉత్తర అమెరికాల్లో లభించాయి. ఇంతవరకు పూర్తిగా ఎదిగిన పిండం ఉన్న డైనోసార్ గుడ్లు అరుదుగా లభించాయి. ప్రస్తుతం లభించిన గుడ్డు, దానిలోని జీవి ప్రస్తుత పక్షుల గుడ్లను, అందులోని పిండాలను పోలి ఉండడం విశేషం. బేబీ ఇంగ్లియాంగ్ పొదగడం పూర్తయ్యే దశలో శిలాజంగా మారి ఉండొచ్చని అందుకే దాని తల శరీరం కిందకు ముడుచుకొనిఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పక్షుల గుడ్లలో పిండాలు పొదుగుదల పూర్తయ్యే దశలో ఇదే ఫోజులో ఉంటాయి. ఈ భంగిమను టకింగ్ అంటారు. పక్షి పిండానికి రెక్కలుంటాయి, ఈ డైనోసార్ పిండానికి పంజాలున్న చిన్న చేతులున్నాయి. ఇంతవరకు ఇలాంటి టకింగ్ భంగిమ ఆధునిక పక్షి జాతులకే సొంతమని భావించారు. ప్రస్తుతం లభించిన డైనోసార్ శిలాజ అండంలో కూడా ఇదే పొజిషన్లో పిండం ఉండడం గమనిస్తే ఈ తరహా భంగిమ తొలుత డైనోసార్లలో ఉండేదని, కాలక్రమేణా పక్షుల్లోకి వచ్చిందని తెలుస్తోంది. డైనోసార్ల పెరుగుదల, పునరుత్పత్తి, పక్షులతో వీటి సంబంధం తదితరఅంశాలను పరిశోధించేందుకు తాజా శిలాజం ఉపయోగపడుతుందని పరిశోధక బృందంలోని ప్రొఫెసర్ ఫియాన్వైసుమ్ మా చెప్పారు. నిజానికి దీన్ని 2000 సంవత్సరంలోనే కనుగొన్నారు. అనంతరం పదేళ్లు స్టోరేజ్‌లో ఉంచారు. 2010 తర్వాత దీనిపై పరిశోధనలు ఆరంభించారు. ఇందులో ఎదిగిన పిండం ఉందనే విషయం తాజాగా బయటపడింది. పరిశోధనా వివరాలను జర్నల్ ఐసైన్స్లో ప్రచురించారు. బేబీ ఇంగ్లియాంగ్ విశేషాలు ► వయసు: సుమారు 6.6– 7.2 కోట్ల ఏళ్లు. ► జాతి: ఒవిరాప్టోరోసారస్(గుడ్లను దొంగలించే బల్లులు అని అర్ధం) ► పొడవు: 27 సెంటీమీటర్లు. (ముడుచుకోకుండా ఉంటే) ► గుడ్డు సైజు: 17 సెంటీమీటర్లు. ► పెద్దయ్యాక సైజు: 2– 3 మీటర్లు(అంచనా). -
అద్భుతం.. 27 ఏళ్ల తర్వాత జన్మించింది
వాషింగ్టన్: సాధారణంగా మనందరం దాదాపు తొమ్మిదినెలలు తల్లి గర్భంలో ఉన్న తర్వాత భూమ్మీదకు వస్తాం. కానీ మోలీ గిబ్సన్ అనే చిన్నారి మాత్రం దాదాపు 27 ఏళ్ల తర్వాత భూమ్మీద పడింది. ఈ ఏడాది అక్టోబర్‌లో చిన్నారి మోలీ కళ్లు తెరిచింది. కానీ తన గర్భస్థ పిండం మాత్రం 1992లో ఏర్పడింది. ఇన్నేళ్ల పాటు ఆ పిండాన్ని గడ్డకట్టిన స్థితిలో భద్రపరిచారు. తాజాగా 2020 ఫిబ్రవరిలో ఓ జంట బిడ్డ కావాలని కోరడంతో ఆ పిండాన్ని అభివృద్ధి పరిచారు. టేనస్సీకి చెందిన టీనా, బెన్ గిబ్సన్ దంపతుల ఇలా దీర్ఘకాలం గడ్డకట్టించిన పిండం నుంచి బిడ్డను కన్న దంపతులుగా రికార్డు సృష్టించారు. ఈ అరుదైన పద్దతిలో జన్మించిన రెండో బిడ్డగా మోలీ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఆమె సోదరి ఎమ్మా పేరు మీద ఉంది. ఎందుకంటే తాను కూడా గడ్డకట్టించిన పిండం నుంచే జన్మించింది కాబట్టి. ఈ పద్దతిని ‘ఎంబ్రోయో డొనేషన్’ అంటారు అంటారు. అంటే పిండాన్ని దత్తత తీసుకోవడం. ఈ పద్దతిలో ఏళ్ల క్రితమే పిండాలను తయారు చేసి వాటిని గట్టకట్టిన స్థితిలో భద్రపరుస్తారు. పిల్లలకు కావాలనుకున్న దంపతులకు ఈ పిండాలను దత్తత ఇస్తారు. అలా మోలీ 27 ఏళ్ల కిందటే పిండంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు గడ్డకట్టిన (ఫ్రోజెన్) స్థితిలోనే ఉంది. ఎట్టకేలకు ఆమె ఈ ఏడాది అక్టోబరులో బిడ్డగా ఈ లోకంలోకి అడుగుపెట్టింది. పిల్లలు కోసం కలలుగనే జంటల కోసం ఇప్పుడు ఎన్నో విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ‘ఎంబ్రోయో డొనేషన్’ విధానం చాలా చాలా ప్రత్యేకం. అంతేగాక.. ఇదెంతో అరుదైనది కూడా. ఇక పిండం దత్తత మనకు వింతగా ఉన్నా అమెరికాలో మాత్రం ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా అమెరికాలోని నేషనల్ ఎంబ్రోయో డొనేషన్ సెంటర్ (ఎన్ఈడీసీ) అనే సామాజిక సంస్థ.. పిండాలను శీతల ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచుతుంది. ఎవరికైనా సంతానం అవసరమైతే.. ఆ పిండాలను దానమిస్తుంది. (చదవండి: బాలికకు షాక్ ఇచ్చిన స్లో ఇంటర్నెట్) ఈ క్రమంలో టీనా, గిబ్సన్ దంపతులు ‘ఎంబ్రోయో డోనేషన్’ విధానంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే, ఆ ఇద్దరు పిల్లలు 27 ఏళ్ల కిందటే పిండంగా మారారు. అలా గిబ్సన్ దంపతులు 2017లోనే.. 24 ఏళ్ల నాటి పిండాన్ని బిడ్డగా పొంది తొలి రికార్డు నెలకొల్పారు. తాజాగా రెండో బిడ్డను కూడా పొంది మొదటి రికార్డును బద్దలు కొట్టారు. దీన్ని బట్టి చూస్తే.. వారికి పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకేసారి పిండాలుగా మారారు. రెండో పిండం ఈ లోకాన్ని చూసేందుకు అదనంగా మూడేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. -
తల్లికి 26ఏళ్లు, బిడ్డకు 25ఏళ్లు!
వాషింగ్టన్: పాతికేళ్లుగా శీతలీకరణ స్థితిలో ఉన్న ఓ పిండం పసిపాపగా ప్రాణం పోసుకుంది. 1992 అక్టోబరులో ఓ దాత నుంచి సేకరించిన ఒక పిండాన్ని శీతలీకరించి వైద్యులు భద్రపరిచారు. కాగా, ఈ ఏడాది మార్చిలో 26ఏళ్ల ఓ అమెరికన్ మహిళ గర్భంలోకి ఆ పిండాన్ని ప్రవేశపెట్టడంతో ఆమె గర్భందాల్చి నవంబర్ 25న పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. ‘సీఎన్ఎన్’ వార్తాకథనం ప్రకారం.. పాపకు జన్మనిచ్చిన టీనా భర్త బెంజమిన్ గిబ్సన్‌కు జన్యుపరమైన సమస్యలున్నాయి. దాంతో ఈ జంట దాత నుంచి సేకరించిన పిండం ద్వారా బిడ్డను కనాలనుకున్నారు. ‘అమెరికా నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్’ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జెఫెరే కీనన్ ఆధ్వర్యంలో పాతికేళ్లనాటి పిండాన్ని టీనా గర్భంలో ప్రవేశపెట్టారు. ‘పిండం ఎన్నో ఏళ్ల క్రితంనాటిదని మాకు తెలియదు. ఆ లెక్కన చూస్తే వయసురీత్యా నా కూతురు, నేను బెస్ట్ ఫ్రెండ్స్. నా కుమార్తె దేవుడిచ్చిన క్రిస్మస్ కానుక’ అని తల్లి టీనా వ్యాఖ్యానించారు. -
పిండంగా ఉన్నప్పుడే చూడొచ్చు!
లండన్: ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా పిల్లల్ని కనాలనుకునే దంపతులు.. ఇక నుంచి పిండాన్ని స్త్రీ గర్భంలోకి ప్రవేశపెట్టక ముందే చూడవచ్చు. అంటే తమ చిన్నారులు ప్రయోగశాలలో పిండంగా ఉండే తొలి రోజు నుంచే వారిని చూడ్డానికి వీలౌతుంది. శాస్త్రవేత్తలు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానంతో పిండం అభివృద్ధిని వైద్యులు ఫొటోల సహాయంతో పది నిమిషాలకు ఒకసారి పరీక్షించవచ్చు. అలాగే బాగా ఆరోగ్యంగా ఉన్న పిండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెట్టి, పిల్లలు పుట్టే సంభావ్యతను కూడా మెరుగుపరచొచ్చు. ‘ఈ సాంకేతికత పిండం ఏర్పడిన తొలి రోజు నుంచి కొన్ని రోజుల వరకు పిండం ఎదుగుదలను ఫొటోలు తీసి యూఎస్బీ డివైస్‌లో భద్రపరుస్తుంది’ అని బ్రిటన్‌లోని హెవిట్ సంతాన సాఫల్య కేంద్రంలో వైద్యుడైన చార్లెస్ కింగ్సలాండ్ చెప్పారు. -
పన్నెండేళ్ల పిండం.. ఆరోగ్యకరమైన బిడ్డ
చైనాలో అత్యంత అరుదైన శిశువు జన్మించి ప్రపంచ ఖ్యాతి గాంచింది. 12 ఏళ్ల పాటు ఆస్పత్రిలో భద్రపరచిన పిండం.. దేశంలో లాంగెస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీగానే కాక అత్యంత ఆరోగ్యకరమైన బిడ్డగా పేరు తెచ్చుకుంది. చైనా వాయవ్య షాంగ్జీ రాష్ట్రంలోని 40 ఏళ్ల మహిళ లీ గేవ్ తన రెండో కొడుకుగా 3.440 కిలోగ్రాముల బిడ్డకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. గ్జియాన్ నగరంలోని తంగ్డు ఆస్పత్రిలో బుధవారం లీ తన బిడ్డకు జన్మనిచ్చింది. మహిళల్లో సంతానోత్పత్తి, గర్భధారణపై ప్రభావం చూపే ఫెలోపియన్ నాళాలు మూసుకుపోవడం, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యలతో బాధపడుతున్న లీ గేవ్.. 2003 లో ఐవీఎఫ్ ద్వారా గర్భధారణకు ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పట్లో డాక్టర్లు ఆమె నుంచి సేకరించిన 12 అండాలను.. ఆమె భర్త వీర్యకణాలతో కలపి పిండాలుగా రూపొందించారు. వాటిలోని రెండు పిండాలను లీ గర్భంలో ప్రవేశపెట్టారు. మిగిలిన వాటిలో ఆరోగ్యంగా ఉన్న ఏడింటిని అలాగే ఆస్పత్రిలోని రీ ప్రొడక్టివ్ మెడిసిన్ సెంటర్లో భద్రపరిచారు. అనంతరం 2004 లో లీ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పట్నుంచీ అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఆ పిండాలను భద్రపరిచడానికి ఆస్పత్రికి రోజుకు 50 సెంట్లు అంటే సుమారు 45 రూపాయల చొప్పున చెల్లిస్తూ వస్తోంది. గతేడాది చైనా ఒకే బిడ్డ విధానాన్ని ఎత్తివేయడంతో లీ.. రెండో బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. దీంతో భద్రపరిచిన పిండాల నుంచి రెండు ఆరోగ్యమైన పిండాలను డాక్టర్లు ఆమె గర్భంలోకి ప్రవేశపెట్టారు. వాటిలో ఒకటి విజయవంతమైంది. సాధారణంగా తమ ఆస్పత్రిలో ఈ పద్ధతిని అవలంబించే సమయంలో గర్భంలోకి రెండు మూడు పిండాలను ప్రవేశపెడతారని, ఎందుకంటే వాటిలో 40 శాతమే సురక్షితంగా ఉండే అవకాశం ఉందని తంగ్డు ఆస్పత్రి రీ ప్రొడక్టివ్ మెడిసిన్ సెంటర్ డైరెక్టర్ వాంగ్ గ్జియో హాంగ్ తెలిపారు. పిండాలను భద్రపరచడంతో అదృష్టం కొద్దీ రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం కలిగిందని లీ గేవ్ భర్త ఆనందంగా చెబుతున్నాడు. మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ 1978 లో బ్రిటన్‌లో జన్మించాడు. ఆ తర్వాత సుమారు 50 లక్షల మంది పిల్లలు ఐవీఎఫ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జన్మించారు. చైనా ప్రధాన భూభాగంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ జెంగ్ మెంగ్జు 1988 లో జన్మించాడు. చైనాలో సుమారు 40 శాతం మంది వంధ్యత్వంతో బాధపడుతున్నారని, ప్రభావవంతమైన పునరుత్పత్తి సహాయ పద్ధతుల్లో ఐవీఎఫ్ ఒకటి అని వాంగ్ తెలిపారు. 2003 నుంచీ తంగ్డూ ఆస్పత్రి పిండాలను భద్రపరచడం ప్రారంభించిందని ఇప్పటివరకూ సుమారు లక్షకు పైగా పిండాలను భద్రపరచగా, వాటిలో 27000 వరకూ పునరుత్పత్తికి వినియోగించామని... ఈ పద్ధతి ద్వారా 4,293 ఆరోగ్యకరమైన టెస్ట్ ట్యూబ్ బేబీలు జన్మించినట్లు వాంగ్ తెలిపారు.