పిండంగా ఉన్నప్పుడే చూడొచ్చు!
లండన్: ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా పిల్లల్ని కనాలనుకునే దంపతులు.. ఇక నుంచి పిండాన్ని స్త్రీ గర్భంలోకి ప్రవేశపెట్టక ముందే చూడవచ్చు. అంటే తమ చిన్నారులు ప్రయోగశాలలో పిండంగా ఉండే తొలి రోజు నుంచే వారిని చూడ్డానికి వీలౌతుంది. శాస్త్రవేత్తలు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానంతో పిండం అభివృద్ధిని వైద్యులు ఫొటోల సహాయంతో పది నిమిషాలకు ఒకసారి పరీక్షించవచ్చు.
అలాగే బాగా ఆరోగ్యంగా ఉన్న పిండాన్ని గర్భాశయంలోకి ప్రవేశపెట్టి, పిల్లలు పుట్టే సంభావ్యతను కూడా మెరుగుపరచొచ్చు. ‘ఈ సాంకేతికత పిండం ఏర్పడిన తొలి రోజు నుంచి కొన్ని రోజుల వరకు పిండం ఎదుగుదలను ఫొటోలు తీసి యూఎస్‌బీ డివైస్‌లో భద్రపరుస్తుంది’ అని బ్రిటన్‌లోని హెవిట్ సంతాన సాఫల్య కేంద్రంలో వైద్యుడైన చార్లెస్ కింగ్‌సలాండ్ చెప్పారు.