రెండు చేతులా సంపాదిస్తున్నా సరిపోవడం లేదని కొందరు వాపోతుంటారు.. అదే మరో చేయి కూడా ఉంటే..?
పక్షుల్లా ఆకాశంలో ఎగరాలని ఎందరో కలలు కంటుంటారు..
అలా మనకూ రెక్కలు వచ్చేస్తే..? ..
...ఇవన్నీ మరికొన్ని ఏళ్లలో సాధ్యమేనని.. ఇప్పటికే సిద్ధం చేసిన ‘మూడో బొటనవేలు (థర్డ్ థంబ్)’ సాక్ష్యమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒక చేతికి ఈ ‘థర్డ్ థంబ్’ను అమర్చుకుంటే.. రెండు చేతులతో చేసే పనిని ఒక చేతితోనే చేసేయవచ్చని స్పష్టమైందని, ఇదే సాంకేతికతతో భవిష్యత్తులో రెక్కలు, టెంటకిల్స్ వంటివీ పెట్టేసుకోవచ్చని వివరిస్తున్నారు. అసలు ‘థర్డ్ థంబ్’ ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఈ టెక్నాలజీ మిగతా వాటికి ఎలా దారిచూపుతుందో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్
కోల్పోయినా.. కావాలన్నా..
ప్రమాదాలు, యుద్ధాలు, దాడుల్లో కొందరు కాళ్లు, చేతులు కోల్పోతుంటారు. అలాంటి వారి కోసం పూర్తిస్థాయిలో పనిచేయగల కృత్రిమ అవయవాలను రూపొందించడంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు మనుషుల సామర్థ్యం పెరిగేలా పరికరాల సృష్టికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే కేంబ్రిడ్జ్ వర్సిటీ కాగి్నటివ్ న్యూరోసైన్స్ ప్రొఫె సర్లు డానీ క్లోడ్, తమర్ మకిన్ కలసి కృత్రిమ బొటనవేలిని రూపొందించారు. ‘థర్డ్ థంబ్’గా పిలుస్తున్న ఈ పరికరాన్ని త్రీడీ ప్రింటింగ్ ద్వారా ముద్రించి, పలు రకాల సెన్సర్లను అమర్చారు. చేతిపై చిటికెన వేలికి కాస్త కిందుగా దీన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి అనుసంధానంగా కాలి బొటనవేలి వద్ద ఒత్తిడిని గుర్తించే) సెన్సర్లను అమర్చుతారు. కాలి బొటనవేలి కదలికలు, ఒత్తిడిని బట్టి.. చేతికి అమర్చిన ‘థర్డ్ థంబ్’ కదులుతుందన్న మాట.
శరీరంలో భాగమే అనుకునేలా..
20 మంది వలంటీర్లకు ఈ ‘థర్డ్ థంబ్’ను ప్రయోగాత్మకంగా అమర్చి.. పనితీరు, కదలికలపై ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. వారి మెదడు ఈ పరికరాన్ని శరీరంలో భాగంగా పరిగణించి, తగినట్టుగా స్పందించడానికి త్వరగానే అలవాటు పడింది.
వలంటీర్లు ఒకే చేతితో కాఫీ కప్పు పట్టుకుని,దానిలో చక్కెర వేసి కలపడం, సూదిలో దారం ఎక్కించడం, ఒకే సమయంలో ఎక్కువ వస్తువులను పట్టుకోవడం వంటివి ఈ ‘థర్డ్ థంబ్’తో చేయ గలిగారు. ఒకదశలో ఇది శరీరంలో భాగమనే స్థాయిలో ఫీల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను శాస్త్రవేత్తలు విడుదల చేశారు.
మరిన్ని అవయవాలు కూడా..
‘థర్డ్ థంబ్’ను మెదడు దాదాపుగా స్వీకరించిందని.. అంటే భవిష్యత్తులో మరింత పెద్దవైన, సంక్లిష్టమైన రెక్కలు, టెంటకిల్స్ వంటి అవయవాలనూ జత చేసుకోగలమని ప్రొఫెసర్ తమర్ మకిన్ చెప్పారు. ఇప్పటికే అలాంటి టెక్నాలజీలు కొంతమేర అందుబాటులో ఉన్నాయన్నారు.
ప్రస్తుతం ‘థర్డ్ థంబ్’ను నియంత్రించడానికి కాలి బొటనవేలి కదలికలను ఉపయోగించుకున్నామని.. నేరుగా మెదడు నుంచి అందే సిగ్నల్స్‌తో కదిలించే స్థాయికి చేరాల్సి ఉందని వివరించారు. కృత్రిమ రెక్క లు, టెంటకిల్స్ తేలికగా, సమర్థవంతంగా, తక్కువ విద్యుత్‌తో పనిచేయాలని.. భవిష్యత్తులో దీనికి దారి చూపగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇప్పటికే రోబోటిక్ టెంటకిల్..
ప్రొఫెసర్ డానీ క్లోడ్ ఇప్పటికే ‘వైన్ 2.0’ పేరిట ఒక రోబోటిక్ టెంటకిల్‌ను కూడా రూపొందించారు. వెన్నెముక తరహాలో 26 భాగాలను అనుసంధానం చేసి రూపొందించిన ఈ టెంటకిల్‌ను.. పాదాల వద్ద ఏర్పాటు చేసిన ఒత్తిడి సెన్సర్ల ద్వారా నియంత్రించవచ్చు. అది అచ్చంగా ఆక్టోపస్ తరహా కదలికలను చూపడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment