ongole bulls
-
ఒంగోలు గిత్తలకు పూర్వ వైభవం.. గుండెలదిరే రంకెలు, చూపులో కసి..
ఒంగోలు గిత్త.. బలీయమైన దేహం. గుండెలదిరే రంకెలు. చూపులో కసి.. ఉట్టిపడే రాజసం. ఎంతటి బరువునైనా సులభంగా లాగేసే జబ్బబలం.. దీని సొంతం. ఒక్కసారి రంకే వేసి కదనరంగంలోకి దిగితే ఇక అంతే. పౌరుషానికి మారుపేరైన ఈ గిత్తలు ప్రకాశం జిల్లా సొంతం. గత పాలకుల నిర్లక్ష్యంతో వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. చదలవాడ పశుక్షేత్రం ద్వారా వీటిని సంరక్షించే చర్యలు చేపట్టింది. ఏటా వీటి సంపద పెరుగతూ వస్తోంది. నూతన సాంకేతిక విధానంతో యాంబ్రియో పద్ధతి ద్వారా దేశంలో మంచి పేరున్న గిర్ ఆవు పిండాలను ఒంగోలు జాతి ఆవుల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక గిర్ గిత్తలు రంకెలు వేయనున్నాయి. సాక్షి, ఒంగోలు: ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఒంగోలు గిత్తల జాతి గత పాలకుల నిర్లక్ష్యంతో అంతరించే దశకు చేరుకుంది. 2004 సంవత్సరం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ జాతి గిత్తల వృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నిధులు విడుదల చేశారు. మళ్లీ ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంగోలు జాతి రక్షణకు దృష్టిసారించారు. క్షేత్రంలో 326 పశువులు... చదలవాడ పశుక్షేత్రంలో ఇప్పటి వరకు 326 పశువులున్నాయి. వీటిలో పాలిచ్చే ఆవులు 72, చూడివి 54, ఒట్టిపోయిన ఆవులు 24, మిగిలినవి ఏడాది నుంచి మూడేళ్లలోపు లేగ దూడలు ఉన్నాయి. క్షేత్రంలో ఏడాదికి 120 కోడె దూడలు ఉత్పత్తి చేశారు. వాటిలో 50 ఆవు దూడలు, 70 కోడెదూడలు. గతేడాది రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద జిల్లాలోని పశ్ఛిమ ప్రాంత రైతులకు 43 కోడెదూడలు ఉచితంగా అందజేశారు. మరో 12 ఒంగోలు జాతి కోడె దూడలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మరో 29 కోడె దూడలను గుంటూరు జిల్లా నకిరేకల్ కోడెదూడల ఉత్పత్తి క్షేత్రానికి పంపించారు. గడిచిన మూడేళ్లుగా.. గత టీడీపీ ప్రభుత్వం ఒంగోలు జాతి పశువులను కాపాడాలన్న విషయాన్ని పూర్తిగా గాలికొదిసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో భారీగా నిధలు కేటాయించింది. క్రమేణా వీటి సంతతి పెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. మేలైన ఆవుల అండాల ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా గుజరాత్ నుంచి యంత్రాన్ని తెప్పించారు. సేకరించిన అండాల నిల్వ కోసం ప్రత్యేక ల్యాబ్‌ను కూడా అభివృద్ధి చేశారు. నిధులు పుష్కలం... రాష్ట్ర ప్రభుత్వం సుమారు నాలుగు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంతో చదలవాడ పశుక్షేత్రంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పశువుల సం«ఖ్య అధికమవుతుండటంతో రూ.2 కోట్లతో నాలుగు నూతన షెడ్లు ఏర్పాటు చేశారు. పాలనా అవసరాల కోసం రూ.70 లక్షలతో పరిపాలన భవనం, వీటితో పాటు మరో రూ.40 లక్షలతో అంతర్గత రోడ్లు ఏర్పాటు చేశారు. రూ.10 లక్షలతో సోలార్ లైట్లు ఏర్పాటు చేయడంతో క్షేత్రంలో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అంతేగాకుండా గోచార్ పథకంలో భాగంగా క్షేత్రంలో భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.52 లక్షలు ఖర్చు చేయనుంది. ప్రయోగాత్మకంగా యాంబ్రియో.. యాంబ్రియో(పిండం) పద్ధతి అంటే మేలు జాతి ఎద్దు, ఆవు పిండాలను కలగలిపి నేరుగా వేరే ఆవు గర్భంలో ప్రవేశ పెట్టడమే. మనుషుల్లో సరోగసీ ఎలాగో పశువుల్లో యాంబ్రియో అలానే. దీనికోసం కొత్త సాంకేతికతను చదలవాడ పశుక్షేత్రంలో విజయవంతంగా అమలు చేశారు. దేశంలో మంచి పేరున్న గుజరాత్‌కు చెందిన గిర్ జాతి ఆవు నుంచి సేకరించిన పిండాలను ఒంగోలు జాతి ఆవులో ప్రవేశపెట్టారు. ఇలా ఈ ఏడాది జనవరి నెలలో ఆరు పశువుపై ప్రయోగం చేశారు. వాటిలో ఒకటి విజయవంతంగా చూడి కట్టింది. దీంతో ప్రస్తుతం ఒక ఆవు ఈ నెలాఖరుకు ఈన వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మేలైన ఒంగోలు జాతి పశువుల ఉత్పత్తే లక్ష్యం ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయించడంతో ఒంగోలు జాతి పశువులను ఉత్పత్తి చేస్తున్నాం. గతంలో ఉన్న కష్టాలు ప్రస్తుతం తొలగిపోయాయి. పశుక్షేత్రంలో ఇప్పటికే మౌలిక వసతులు కల్పించారు. యాంబ్రియో పద్ధతి ద్వారా మేలు జాతి పశువుల ఉత్పత్తి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. – బి.రవి, డిప్యూటీ డైరెక్టర్, చదలవాడ పశుక్షేత్రం ఉచితంగా ఒంగోలు జాతి కోడె దూడ ఇచ్చారు ఒంగోలు ఆవు జాతి, ఒంగోలు గిత్తలను పెంపొందించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు జాతి కోడె దూడను నాలుగు నెలల క్రితం ఉచితంగా ఇచ్చింది. అప్పటికే ఏడాది పాటు దాని పోషణ చేసిన తర్వాత రైతుగా, పశుపోషకునిగా ఉన్న నాకు దానిని అందజేశారు. ఒంగోలు పశుగణాభివృద్ధి సంస్థ అధికారులు రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ద్వారా అందజేశారు. దాణా, మందులు కూడా ఇచ్చారు. ఆవులను దాటడానికి విత్తనపు గిత్తగా దీనిని తయారు చేస్తున్నాం. నాకు నాలుగు ఆవులు ఉన్నాయి. గ్రామంలోని అందరి పశుపోషకుల ఆవులను దాటించడానికి దానిని వినియోగిస్తాం. తద్వారా ఒంగోలు జాతి ఉత్పత్తిని పెంపొందిస్తాం. – గుండారెడ్డి మల్లికార్జునరెడ్డి, రైతు, చినదోర్నాల -
గోజాతి సంరక్షణలో విఫలమయ్యాం
- జాతీయ బుల్‌షోలో మంత్రి జగదీశ్‌రెడ్డి - ఏపీలో 2.5 లక్షల ఒంగోలు గిత్తలు.. - బ్రెజిల్లో 16 కోట్లు: ఏపీ స్పీకర్ కోడెల - ముగిసిన జాతీయ గిత్తల ప్రదర్శన సాక్షి, హైదరాబాద్: ‘‘పులులు, సింహాల సంరక్షణకు అనేక చట్టాలు తెచ్చారు. కానీ కోట్లాది మందికి ఆహారం, జీవనాధారం కల్పించే గోజాతిని సంరక్షించడంలో మాత్రం మనం విఫలమయ్యాం’’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం జలవిహార్‌లో జాతీయ గిత్తల ప్రదర్శన కన్నుల పండువగా జరిగింది. దేశ విదేశాలకు చెందిన పలు మేలు రకాల గిత్తలను ప్రదర్శించారు. అంకుష్ సంస్థ ఏర్పాటు చేసిన బుల్‌షో కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, సినీ నటి అమల, కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి ఓపీ చౌదరి, బ్రెజిల్ వ్యవసాయ శాఖ మంత్రి జుయో క్రూజ్ రెయిస్ ఫిల్హో, పంజాబ్ మంత్రి గుల్జార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి మనకు ప్రసాదించిన వృక్ష, జంతు, పక్షి జాతులను సంరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా పశుపోషణుండాలి: కోడెల ఒంగోలు గిత్తలు ప్రస్తుతం ఏపీలో 2.5 లక్షలుంటే.. బ్రెజిల్ దేశంలో 16 కోట్లున్నాయని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అన్ని రకాల జాతులను ఆ దేశస్థులు పెంచి పోషిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారన్నారు. వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. తెలంగాణలోని తూర్పు గోవును వెలుగులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. గోమాతలో ఔషధ గుణాలున్నాయని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. తన తల్లికి కేన్సర్ సోకిందని, అనేక రకాల మందు లు వాడామని అయితే రెండేళ్లుగా గో మూత్రాన్ని ఔషధంగా వాడుతున్నందున కేన్సర్ లక్షణాలు ప్రస్తుతం కనిపించడం లేదని చెప్పారు. అంతకుముందు సినీనటుడు మోహన్‌బాబు గిత్తలను చూడడానికి ప్రత్యేకంగా వచ్చారు. తాను గిత్తలను పెంచకపోయినా... అవంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉండే ‘తూర్పుగోవు’ను ‘తెలంగాణ గోవు’గా ప్రకటించాలని అంకుష్ సంస్థ తరపున వేణుగోపాల్ కోరారు. ఆయనకు 24 వేల ఆవులు, ఎడ్లు.. బ్రెజిల్‌కు చెందిన డాక్టర్ జోస్ ఒటావియో లెమాస్ బుల్ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈయనకు 10 వేల ఎకరాల భూమి, 24 వేల పశు సంపద ఉంది. అందులో 10 వేల ఆవులున్నాయి. వాటిని ఆయన స్వయంగా పెంచుతున్నారు. పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్న ఆయనకు 4 హెలికాప్టర్లు ఉన్నాయి. అంకుష్ సంస్థతో కలిసి ఈయన ఈ షో నిర్వహించారు. ఆకట్టుకున్న ర్యాంప్ వాక్ వివిధ మేలుజాతి గిత్తల ర్యాంప్‌వాక్ (బుల్‌షో) చూపరులను ఆకట్టుకుంది. మొదటగా తెలంగాణకు చెందిన ‘తూర్పుగోవు’ను వేదికపైకి తీసుకొచ్చారు. ఎలాంటి వాతావరణంలోనైనా ఇది తట్టుకొని జీవించగలుగుతుంది. అచ్చంపేట ప్రాంతంలో ఇది ఉంటుంది. ఏపీకి చెందిన పుంగనూరు గిత్త, కేరళకు చెందిన వెచ్చూరు గిత్త, వివిధ రకాల ఒంగోలు గిత్తలు, ఏపీకి చెందిన దేవరకోట జాతి గిత్త, గుజరాత్‌కు చెందిన గిర్, కాంక్రేజ్ గిత్తలను వేదికపై వాక్ చేయించారు. ఈ సందర్భంగా వివిధ జాతి గోవులను కాపాడుతున్నవారికి 26 మందికి గ్లోరియస్ నంది అవార్డులను అందజేశారు. -
మన ‘బోడెద్దు’కు కష్టకాలం
వేగంగా అంతరించిపోతున్న పశువులు సిసలైన తెలంగాణ జాతి గిత్తలు దియోని సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ పల్లె ప్రగతి, సంస్కృతి అంతా ఎద్దు, ఎవుసం మీద ఆధారపడింది. దాదాపు 200 ఏళ్ల నుంచి సాగులో రైతుకు తోడునీడగా నడిచిన నిఖార్సయిన తెలంగాణ జాతి ‘దియోని’ రకం ఎద్దులు క్రమంగా కాలగర్భంలో కలసిపోతున్నాయి. ఒంగోలు గిత్తలే ‘మేటి’అని చూపేందుకు అప్పటి పాలకులు దీర్ఘకాలికంగా అమలు చేసిన కుట్ర ‘బోడెద్దు’సావుకొచ్చింది. పక్క రాష్ట్రాల్లో ఈ గిత్తల విస్తరణ రోజురోజుకు ఎదిగిపోతుంటే తెలంగాణలో ఇవి క్షీణదశకు చేరుకున్నాయి. ఒంగోలు గిత్తల కంటే రెండు రెట్లు మేలు జాతి గిత్తలైన దియోని జాతి పశువులు మరో పదేళ్లలో పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. సిసలైన తెలంగాణ గిత్త నిజాం హయాంలో శాస్త్రవేత్త డాక్టర్ మున్షీ అబ్దుల్ రెహమాన్ ఈ ఎద్దులను సృష్టించారు. డాక్టర్ మున్షీ ప్రయోగశాల మహారాష్ర్టలోని లాతూర్ జిల్లా దియోని తాలూకాలో ఉండటంతో వీటికి దియోని జాతిగా గుర్తింపు పొందాయి. కాలక్రమేణా ఈ జాతి ఎద్దులు తెలంగాణ సంస్కృతిలో భాగంగా మారాయి. ఇవి ఒంగోలు గిత్తకంటే ఎంతో మెరుగైనవి. వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం.. ఒంగోలు గిత్తలు రోజుకు ఏడు కిలోల వరిగడ్డి కానీ, 20 కిలోల పచ్చిగడ్డి కానీ తిని ఆరు గంటలపాటు 12 క్వింటాళ్ల బరువును మోయగలుగుతాయి. అదే దియోనీ జాతి పశువులు రోజుకు ఐదు కిలోల వరిగడ్డి లేదా 12 కిలోల పచ్చిగడ్డితో సరిపెట్టుకుంటాయి. తెలంగాణ ప్రాంత కచ్చ రోడ్ల మీద జత ఎడ్లు 15 నుంచి 20 క్వింటాళ్ల బరువును ఏడుగంటల పాటు సునాయాసంగా మోయగలుగుతాయి. బీటీ, సిమెంటురోడ్ల మీద, టైర్ల బండిపై అయితే 28 నుంచి 35 క్వింటాళ్ల ధాన్యాన్ని ఎనిమిది గంటల పాటు మోయగలుగుతాయి. ఒక రోజులో అరఎకరం భూమిని దున్నగలుగుతాయి. 1960 దశకంలో ఒక్క మెదక్ జిల్లాలోనే 7 లక్షల ఈ జాతి పశువులు ఉన్నట్లు ఐసీఆర్ఐ గుర్తించింది. అయితే, 2012 పశుగణన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వీటిసంఖ్య 5 లక్షలకు మించి ఉండక పోవచ్చని చెబుతున్నారు. పాలకుల నిర్లక్ష్యం దియోని జాతి వేగంగా అంతరించి పోవడానికి అప్పటి పాల కుల నిర్లక్ష్యం, కుట్రలు దాగి ఉన్నాయి. ఒంగోలు గిత్తను ఎక్కువ చేసి చూపే ప్రయత్నంలో దియోని జాతిని విస్మరించారనే ఆరోపణలున్నాయి. ఒంగోలు జాతిగిత్తల వీర్యాన్ని ప్రతి పశువైద్యశాలలో అందుబాటులో ఉంచిన పాలకులు.. దియోనిని మాత్రం నిర్లక్ష్యం చే స్తూ వచ్చారు. అప్పటి మెదక్ ఎంపీ బాగారెడ్డి ప్రోద్భలంతో 1981లో కోహీర్ మండలం కొటిగార్పల్లిలో దియోని జాతి పశు పునరుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలోని ఏకైక బ్రీడింగ్ సెంటర్ ఇది. తొలినాళ్లలో ఈ కేంద్రంలో 104 విత్తన ఉత్పత్తి కోడెలు ఉండగా.. ప్రస్తుతం అక్కడ 15లోపు పశువులు మాత్రమే కనిపిస్తున్నాయి. దియోనీ జాతి పశువులు వేగంగా అంతరించిపోతున్న మాట నిజమేనని పశుసంవర్థక శాఖ ఏడీఈ లక్ష్మారెడ్డి కూడా అంగీకరిస్తున్నారు. ఇకనైనా ఈ జాతి పశువుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరముంది.