మన ‘బోడెద్దు’కు కష్టకాలం | Deoni bulls Declined in telangana state day by day | Sakshi
Sakshi News home page

మన ‘బోడెద్దు’కు కష్టకాలం

Published Wed, Jan 28 2015 6:24 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

మన ‘బోడెద్దు’కు కష్టకాలం - Sakshi

మన ‘బోడెద్దు’కు కష్టకాలం

వేగంగా అంతరించిపోతున్న పశువులు
 సిసలైన తెలంగాణ జాతి గిత్తలు దియోని

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ పల్లె ప్రగతి, సంస్కృతి అంతా ఎద్దు, ఎవుసం మీద ఆధారపడింది. దాదాపు 200 ఏళ్ల నుంచి సాగులో రైతుకు తోడునీడగా నడిచిన నిఖార్సయిన తెలంగాణ జాతి ‘దియోని’ రకం ఎద్దులు క్రమంగా కాలగర్భంలో కలసిపోతున్నాయి. ఒంగోలు గిత్తలే ‘మేటి’అని చూపేందుకు అప్పటి పాలకులు దీర్ఘకాలికంగా అమలు చేసిన కుట్ర ‘బోడెద్దు’సావుకొచ్చింది. పక్క రాష్ట్రాల్లో ఈ గిత్తల విస్తరణ రోజురోజుకు ఎదిగిపోతుంటే తెలంగాణలో ఇవి క్షీణదశకు చేరుకున్నాయి. ఒంగోలు గిత్తల కంటే రెండు రెట్లు మేలు జాతి గిత్తలైన దియోని జాతి పశువులు మరో పదేళ్లలో పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి.
 
 సిసలైన తెలంగాణ గిత్త
 నిజాం హయాంలో శాస్త్రవేత్త డాక్టర్ మున్షీ అబ్దుల్ రెహమాన్ ఈ ఎద్దులను సృష్టించారు. డాక్టర్ మున్షీ ప్రయోగశాల మహారాష్ర్టలోని లాతూర్ జిల్లా దియోని తాలూకాలో ఉండటంతో వీటికి దియోని జాతిగా గుర్తింపు పొందాయి. కాలక్రమేణా ఈ జాతి ఎద్దులు తెలంగాణ సంస్కృతిలో భాగంగా మారాయి. ఇవి ఒంగోలు గిత్తకంటే ఎంతో మెరుగైనవి. వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం.. ఒంగోలు గిత్తలు రోజుకు ఏడు కిలోల వరిగడ్డి కానీ, 20 కిలోల పచ్చిగడ్డి కానీ తిని ఆరు గంటలపాటు 12 క్వింటాళ్ల బరువును మోయగలుగుతాయి. అదే దియోనీ జాతి పశువులు రోజుకు ఐదు కిలోల వరిగడ్డి లేదా 12 కిలోల పచ్చిగడ్డితో సరిపెట్టుకుంటాయి.
 
 తెలంగాణ ప్రాంత కచ్చ రోడ్ల మీద జత ఎడ్లు 15 నుంచి 20 క్వింటాళ్ల బరువును ఏడుగంటల పాటు సునాయాసంగా మోయగలుగుతాయి. బీటీ, సిమెంటురోడ్ల మీద, టైర్ల బండిపై అయితే 28 నుంచి 35 క్వింటాళ్ల ధాన్యాన్ని ఎనిమిది గంటల పాటు మోయగలుగుతాయి. ఒక రోజులో అరఎకరం భూమిని దున్నగలుగుతాయి. 1960 దశకంలో ఒక్క మెదక్ జిల్లాలోనే 7 లక్షల ఈ జాతి పశువులు ఉన్నట్లు ఐసీఆర్‌ఐ గుర్తించింది. అయితే, 2012 పశుగణన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వీటిసంఖ్య 5 లక్షలకు మించి ఉండక పోవచ్చని చెబుతున్నారు.
 
 పాలకుల నిర్లక్ష్యం
 దియోని జాతి వేగంగా అంతరించి పోవడానికి అప్పటి పాల కుల నిర్లక్ష్యం, కుట్రలు దాగి ఉన్నాయి. ఒంగోలు గిత్తను ఎక్కువ చేసి చూపే ప్రయత్నంలో దియోని జాతిని విస్మరించారనే ఆరోపణలున్నాయి.
 
 ఒంగోలు జాతిగిత్తల వీర్యాన్ని ప్రతి పశువైద్యశాలలో అందుబాటులో ఉంచిన పాలకులు.. దియోనిని మాత్రం నిర్లక్ష్యం చే స్తూ వచ్చారు. అప్పటి మెదక్ ఎంపీ బాగారెడ్డి ప్రోద్భలంతో 1981లో కోహీర్ మండలం కొటిగార్‌పల్లిలో దియోని జాతి పశు పునరుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలోని ఏకైక బ్రీడింగ్ సెంటర్ ఇది. తొలినాళ్లలో ఈ కేంద్రంలో 104 విత్తన ఉత్పత్తి కోడెలు ఉండగా.. ప్రస్తుతం అక్కడ 15లోపు పశువులు మాత్రమే కనిపిస్తున్నాయి. దియోనీ జాతి పశువులు వేగంగా అంతరించిపోతున్న మాట నిజమేనని పశుసంవర్థక శాఖ ఏడీఈ లక్ష్మారెడ్డి కూడా అంగీకరిస్తున్నారు. ఇకనైనా ఈ జాతి పశువుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరముంది.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement