ఈ కథ నాకు రావడం లక్ : రామ్
‘‘రామ్ మంచి నటుడు. సినిమా తప్ప అతనికి వేరే ప్రపంచం తెలియదు. అలాంటి లక్షణాలున్న వాళ్లెవరైనా మంచి స్థాయిలో ఉంటారు’’ అని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్‌ల కాంబినేషన్‌లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పరుచూరి ప్రసాద్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మించిన చిత్రం ‘పండగ చేస్కో’. తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని శ్రీను వైట్ల ఆవిష్కరించి, దర్శకుడు సురేందర్ రెడ్డికి ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ, ‘‘పాటలు, ప్రచార చిత్రాలు చూస్తుంటే ఈ చిత్రం ఘన విజయం సాధించడం ఖాయమనిపిస్తోంది’’ అని అన్నారు.
రామ్ మాట్లాడుతూ - ‘‘ ‘మసాలా’ షూటింగ్ అప్పుడు వెలిగొండ శ్రీనివాస్ ఈ కథ తీసుకొచ్చారు. కథ విన్న వెంటనే, ఇది నాకు రావడం లక్కీ అనుకున్నా. అలాగే ఆ కథ గోపీ చంద్ మలినేని చేతిలో పడడం ఆయన లక్ అనుకున్నా. ఆయన చాలా బాగా తీశారు. ‘పండగ చేస్కో’కి అన్నీ తీపి గుర్తులే. 18 నెలల తర్వాత నా సినిమా విడుదలవుతోంది’’ అన్నారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో రామ్‌లో ఓ కొత్త కోణం చూస్తారు. రామ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. నేను దర్శకత్వ శాఖలో పని చేస్తున్నప్పుడు నటి అనుష్కతో వర్క్ చాలా కంఫర్ట్‌గా ఉండేది. ఆమె చాలా డౌన్ టు ఎర్త్.
ఈ సినిమా చేశాక రకుల్ మరో అనుష్కలా అనిపించింది’’ అని చెప్పారు. బ్రహ్మానందం మాట్లాడుతూ- ‘‘టైటిల్‌కు తగ్గట్టుగానే పండగ చేసుకునే సినిమా ఇది. ఈ సినిమా చేస్తున్నప్పుడు రామ్ నాకు ఆకలిగా ఉన్న పులిలా అనిపించాడు’’ అని వ్యాఖ్యానించారు. మాటల రచయిత కోనవెంకట్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాకైనా నన్ను వదిలేయమని చెప్పా. కానీ నేను లేకుండా సినిమా చేయనన్నాడు దర్శకుడు. నాకు రామ్‌లో నచ్చే గుణం ఏంటంటే టెక్నీషియన్స్‌కు విలువనిచ్చే హీరో.
రామ్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ గ్రాసర్ అవుతుంది’’ అని చెప్పారు. పరుచూరి ప్రసాద్, పరుచూరి కిరీటి, తమన్, రకుల్, సోనాల్, భాస్కరభట్ల, అనిల్ రావిపూడి తదితర చిత్రబృందం పాల్గొన్నారు. ‘స్రవంతి’ రవికిశోర్, ‘దిల్’ రాజు, నల్లమలుపు బుజ్జి, బీవీయస్‌యన్ ప్రసాద్, వీరూ పోట్ల, బాబీ తదితర అతిథులు ‘పండగ చేస్కో’ యూనిట్‌కు శుభాకాంక్షలు అందజేశారు.