వరుసగా రెండు సినిమాలు!
జయాపజయాలకు అతీతంగా యువతలో క్రేజ్‌ని సొంతం చేసుకున్న యువ కథానాయకుడు రామ్. వెంకటేశ్‌తో కలిసి ఆయన నటించిన మల్టీస్టారర్ ‘మసాలా’ వచ్చి అయిదు నెలలు కావస్తోంది. ఇప్పటివరకూ రామ్ సినిమా ఏదీ మొదలు కాలేదు. ఎనర్జీకి పర్యాయ పదమైన రామ్ సినిమా కోసం యువతరం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ విజయాన్ని సాధించాలనే కసితో రామ్ ఉన్నారని, ఈ విరామానికి కారణం అదేనని ఆయన ఆంతరంగికుల సమాచారం. కథల విషయంలో చాలా అప్రమత్తంగా రామ్ ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.
రీసెంట్‌గా రామ్ ఓ కథను ‘ఓకే’ చేశారు. వేణు అనే నూతన దర్శకుడు చెప్పిన ఈ కథ రామ్‌కి విపరీతంగా నచ్చడంతో... వెంటనే పచ్చజెండా ఊపేశారట. ఓ నూతన నిర్మాణ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించనుంది. రామ్ సరసన సమంత కథానాయికగా నటించడం ఈ సినిమాకు మరో విశేషం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రామ్ నటించే ‘పండగచేస్కో’ చిత్రం ఈ నెలలోనే సెట్స్‌కి వెళ్లనుంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. హన్సిక కథానాయికగా నటించే ఈ సినిమా తర్వాత... కొత్త దర్శకుడు వేణు సినిమా చేస్తారు రామ్. ఇప్పటివరకూ సినిమాల విషయంలో నిదానమే ప్రధానం అంటూ ముందుకెళ్లిన రామ్... ఇక నుంచి వేగం పెంచాలనుకుంటున్నారట. ఆయన అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.