పండగలా ఉండే సినిమా : రామ్
‘‘దాదాపు ఏడాది విరామం తర్వాత చేస్తున్న సినిమా ఇది. ‘మసాలా’ సినిమాకు ముందే రచయిత వెలిగొండ శ్రీనివాస్ నాకీ కథ చెప్పాడు. చాలా నచ్చింది. అతనితో పాటు మంచి రచయితల బృందం కుదిరింది. అలాగే, ఇతర శాఖలకు కూడా ప్రతిభావంతులు కుదరడం ఆనందంగా ఉంది. ఎంత అన్యమన స్కంగా థియేటర్‌కి వెళ్లినా ఈ సినిమా బాగుందనే అంటారు’’ అని చెప్పారు రామ్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రామ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా యునెటైడ్ మూవీస్ సమర్పణలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ‘పండగ చేస్కో’ శనివారం హైదరాబాద్‌లో ఆరంభమైంది.
ముహూర్తపు దృశ్యానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ -‘‘రామ్ ఎనర్జీ అంటే నాకిష్టం. ఆ ఎనర్జీ మొత్తం ఈ సినిమాలో కనిపిస్తుంది. ‘బలుపు’ తర్వాత కొంత సమయం తీసుకున్నా మంచి కథ కుదిరింది. చక్కని కథ, మంచి నిర్మాతతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. నాయకా నాయికల పాత్రలు ఎనర్జిటిక్‌గా ఉంటాయి. జగపతిబాబుది ఇందులో ముఖ్యమైన పాత్ర’’ అని చెప్పారు.
గోపీచంద్, రామ్‌లతో ముచ్చటగా తనకిది మూడో సినిమా అని, హ్యాట్రిక్ సాధించడం ఖాయం అని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. రామ్ కోసమే రాసిన కథ ఇదనీ, ఓ కోటీశ్వరుడు భారతదేశం వచ్చి ఏం చేశాడు? అనేదే ఈ చిత్రకథ అని చెప్పారు వెలిగొండ శ్రీనివాస్. నిర్మాత పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ, ‘‘రామ్‌తోగత నాలుగేళ్లుగా సినిమా చేయాలనుకుంటున్నా. అయితే ఎన్టీఆర్, బన్నీ స్థాయికి తగ్గ కథ ఉంటేనే రామ్‌తో చేయాలనుకున్నా. ఎందుకంటే అతను అంత ఎనర్జిటిక్. వినోద ప్రధానంగా సాగే సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడి చూస్తున్నారు. పండగలా ఉండే ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ఈ సినిమాలో నటించడం పట్ల రకుల్ తన ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: అనిల్ రావిపూడి.