సినిమా రివ్యూ - అనేకుడు | anekudu movie review | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ - అనేకుడు

Published Fri, Mar 6 2015 4:49 PM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

సినిమా రివ్యూ - అనేకుడు

సినిమా రివ్యూ - అనేకుడు

అనేక... కథల ఆసక్తికరమైన మేళవింపు

చిత్రం - అనేకుడు, తారాగణం - ధనుష్, అమైరా దస్తూర్, ఐశ్వర్యా దేవన్, కార్తీక్, ఆశిష్ విద్యార్థి, కథ - స్క్రీన్‌ప్లే - కె.వి. ఆనంద్, శుభ, మాటలు - శశాంక్ వెన్నెలకంటి, పాటలు - సాహితి, వనమాలి, సంగీతం - హ్యారిస్ జైరాజ్,  స్పెషల్ ఎఫెక్ట్స్ - వి. శ్రీనివాస మోహన్, ఛాయాగ్రహణం - ఓం ప్రకాష్, కూర్పు - ఆంటోనీ, నిర్మాతలు - కల్పాత్తి ఎస్. అఘోరమ్, కల్పాత్తి ఎస్. గణేశ్, కల్పాత్తి ఎస్. సురేశ్, దర్శకత్వం - కె.వి. ఆనంద్

జన్మజన్మల బంధం, పూర్వజన్మ జ్ఞాపకాలు, అప్పుడేం జరిగింది లాంటి అంశాలు ఇన్నేళ్ళ ఆధునిక జీవనం తరువాత కూడా మనిషికి ఆసక్తి కలిగించే విషయాలు. మార్మికతతో కూడిన ఈ విషయాలు ఉత్కంఠ, ఉద్విగ్నత రేపుతాయి కాబట్టి, ఇవాళ్టికీ వాటి గురించి చదవడానికీ, చూడడానికీ ముందుకొస్తారు. వెండితెరపైనా ఇది హిట్ ఫార్ములా అని పాత చిత్రాల కాలం నుంచి నిన్న మొన్నటి ‘మగధీర’ వరకు ప్రతి సినిమా నిరూపిస్తూనే ఉంది. ఆ ఫార్ములాను తీసుకొని, దాని చుట్టూ ఒక కథ కాదు... రెండు మూడు పునర్జన్మల కథలను అల్లుకొని, దాన్ని వర్తమానానికి కలిపితే? అలాంటి ప్రయత్నమే - దర్శకుడు కె.వి. ఆనంద్ చేసిన ‘అనేకుడు’. ప్రేమికుల దినోత్సవ కానుకగా తమిళనాట మొన్న ఫిబ్రవరి 13నే విడుదలైన మాతృక ‘అనేగన్’కు ఇది తెలుగు అనువాద రూపం.

కథ ఏమిటంటే...

వీడియో గేమ్స్ డిజైన్ చేసే ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థలో ఆ గేమ్స్ రూపకల్పన బృందంలో ఒకరిగా పనిచేస్తుంటుంది మధుమిత (అమైరా దస్తూర్). అదే కంపెనీలో కొత్తగా హార్డ్‌వేర్ ఉద్యోగిగా వస్తాడు అశ్విన్ (ధనుష్). తనకూ, అతనికీ మధ్య జన్మజన్మల అనుబంధం ఉందని భావిస్తుంటుంది మధుమిత. అది కేవలం ఊహాజనితమైన భ్రమ అంటూ ఉంటాడు అశ్విన్.

కొత్త గేమింగ్ ప్రాజెక్టుల్ని తొందరగా పూర్తి చేయాలంటూ, తుది గడువు విషయంలో అందరి మీదా ఒత్తిడి పెడుతుంటాడు హీరోయిన్ వాళ్ళ కంపెనీ యజమాని రవికిరణ్ (సీనియర్ నటుడు కార్తీక్). ఒత్తిడిలో ఉన్న మధుమిత సహా అందరికీ డాక్టర్‌తో చికిత్స చేయిస్తుంటాడు. మధుమితకు రెట్రాగ్రెషన్ థెరపీ చేయిస్తూ, ఆమె అనుకుంటున్న పాత జన్మల జ్ఞాపకాలను ఆ డాక్టర్ చెప్పిస్తుంటుంది. పాత జన్మల్లో తాను - అశ్విన్ బర్మాలో ఉన్నామనీ, ఆ పైన వైజాగ్‌లో కాళి - కల్యాణిగా బతికామనీ అంటూ ఉంటుంది హీరోయిన్. ఇంతకీ ఆమె మాటలన్నీ నిజమేనా? భ్రమా? నిజమైతే, వివిధ జన్మల్లో వారిని కలవనివ్వకుండా చేసిందెవరు? లాంటివన్నీ సుదీర్ఘంగా సాగే ఈ రెండుమ్ముప్పావు గంటల సినిమా.

ఎలా చేశారంటే...

మూడు జన్మల కథల మేళవింపుగా సాగే ఈ చిత్రంలో పూర్తిగా పరస్పర విరుద్ధమైన మూడు వేర్వేరు గెటప్పులు, పాత్రల్లో ధనుష్ కనిపిస్తారు, మెప్పిస్తారు. 1960ల నాటి బర్మా కథలో కాందిశీకుడైన భారతీయ కార్మికుడు బుల్లెబ్బాయ్‌గా, 1987 నాటి వైజాగ్ కథలో రౌడీయిజమ్‌కు కూడా సిద్ధపడే చిత్రకారుడైన కాళిగా, వర్తమానంలో అధునాతన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగిగా - మూడు షేడ్స్‌లోనూ పాత్రల్లోకి ఆయన పరకాయ ప్రవేశం చేశారు. అలాగే, బర్మా అమ్మాయి సముద్రగా, అహింసను బోధించే కల్యాణిగా, ఆధునిక మధుమితగా అమైరా దస్తూర్ చూడడానికి బాగున్నారు. పాత జన్మల తాలూకు జ్ఞాపకాలు గుర్తుకొచ్చీ రాని సమయం లాంటి చోట్ల ఆమె అభినయం బాగుంది.

ఇక, అప్పుడెప్పుడో ‘అభినందన’, ‘ఘర్షణ’ లాంటి చిత్రాల్లో కథానాయకుడిగా, యువ ప్రేమికుడిగా అద్భుతంగా నటించి, అందరి దృష్టినీ ఆకర్షించిన సీనియర్ నటుడు కార్తీక్. ఆ మధ్య కల్యాణరామ్ ‘ఓమ్ -3డి’ చిత్రంలోనూ విలన్ పాత్ర పోషించిన ఆయన ఇప్పుడీ సినిమాలో అలాంటి పాత్రలను తానెంత అద్భుతంగా పండించగలడో నిరూపించారు. ఆయన నుంచి ప్రేక్షకులకు ఇదొక సర్‌ప్రైజ్. పోలీసాఫీసర్‌గా ఆశిష్ విద్యార్థి, నేటి సుప్రసిద్ధ తమిళ చిత్రకారుడు మణియన్ సెల్వమ్ (మ.సె) బొమ్మలతో తెరపై చిత్రకారుడి పాత్రలో నటించిన ‘తలైవాసల్’ విజయ్, తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

హ్యారిస్ జైరాజ్ సంగీతం, ముఖ్యంగా నేపథ్య సంగీతం బాగున్నాయి. సన్నివేశాల్లోని ఉత్కంఠను పెంచడానికి ఆయన రీరికార్డింగ్ ఉపకరించింది. రెండు, మూడు పాటలు కూడా వినాలనిపించేలా ఉన్నాయి. ప్రతి పాటనూ, సన్నివేశాన్నీ కనువిందుగా చూపడంలో ఛాయాగ్రాహక - దర్శకుడు కె.వి. ఆనంద్ ప్రతిభ కనిపించింది. అలాగే, విజువల్ ఎఫెక్ట్‌లు, ఫైట్లు ఆకట్టుకుంటాయి. రాజకుమారుడు, రాజకుమారి, సైన్యాధ్యక్షుడి జన్మ తాలూకు ఎపిసోడ్‌ను చిత్రీకరించి, ఎడిటింగ్‌లో కత్తెర వేశారని అర్థమవుతూ ఉంటుంది. బర్మా ఎపిసోడ్‌తో సహా మరికొన్ని చోట్ల కత్తెరకు ఇంకాస్త పదునుపెట్టినా ఇబ్బందేమీ ఉండేది కాదు.

ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం - ఈ సినిమా డబ్బింగ్ విషయంలో తీసుకున్న శ్రద్ధ. సినిమాలో ఆ యా కథల కాలానికి తగినట్లుగా పత్రికల మీద శీర్షికలు, గోడల మీద వాల్‌పోస్టర్లు లాంటివి తెలుగు వాతావరణానికి తగినట్లు మార్చడం శ్రద్ధకు తార్కాణం. ‘ఆర్.బి.ఎఫ్ (రాయపేట బెనిఫిట్ ఫండ్)’ లాంటి బోర్డుల మీద ‘ఆర్.బి.ఎఫ్’ అని ఉంటూనే పక్కనే ‘మార్గదర్శి చిట్‌ఫండ్’ అని రాయడం లాంటి ఒకటీ అరా నెరుసులున్నా మొత్తం మీద ‘మాయాబజార్’ పోస్టర్ మొదలు ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున లాంటి అప్పటి కాలానికి తగ్గ హీరోల కటౌట్లు ఇది నేరు తెలుగు చిత్రమా అనిపించేలా చేస్తాయి. అలాగే, ధనుష్‌కు (డబ్బింగ్ ఆర్టిస్ట్ వాసు), కార్తీక్‌కు (డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయుపుత్ర నాగార్జున) తెలుగులో చేసిన స్వరదానం ఆకట్టుకుంటుంది.

ఎలా ఉందంటే...

గతంలో తమిళంలో ‘కో’ (తెలుగులో ‘రంగం’) లాంటి హిట్ చిత్రాలు అందించిన ట్రాక్ రికార్డ్ దర్శకుడిగా మారిన ఒకప్పటి న్యూస్ ఫోటోగ్రాఫర్ కె.వి.ఆనంద్‌ది. ఆయన ఈ చిత్రంలోనూ తనదైన మార్కు చూపారు. బర్మా ఎపిసోడ్‌కూ, వర్తమానానికీ మధ్య తిరిగే ఫస్టాఫ్ ఆసక్తికరమైన ఘట్టం వద్ద ముగుస్తుంది. ఇక, ఇంటర్వెల్ తర్వాత వచ్చే వైజాగ్ ఎపిసోడ్ లాంటివి ప్రేమకథకు, క్రైమ్, సస్పెన్స్‌ను బాగా కలిపాయి.

నిజానికి, మునుపటి హాలీవుడ్, తమిళ, తెలుగు చిత్రాల ప్రభావం చాలానే ఉన్న సినిమా ఇది. మన తెరకూ పునర్జన్మ కథలూ కొత్త కాదు. అయితేనేం, ఒకటికి మూడు కథలను మేళవించడంలోనే అసలు నేర్పు అంతా ఉంది. అందమైన ప్రేమ కథలు, వాటిని ఆహ్లాదంగా చూపడం... కీలకమైంది. నిజానికి, మూడు జన్మలు, ఇన్ని పాత్రల మధ్య ఆసక్తికరంగా స్క్రీన్‌ప్లేను అల్లుకోవడం, కథను గందరగోళం లేకుండా ముందుకు నడపడం అంత సులభమేమీ కాదు. ఆ విషయంలో దర్శక, రచయిత విజయం సాధించారు. పైగా, ప్రతి సీన్‌కూ బాగానే హోమ్‌వర్క్ చేసుకున్నారని అర్థమవుతుంటుంది. ఒక్కొక్క కథలో ఒక్కొక్కరు... హీరో - హీరోయిన్ల ప్రేమకు విలన్‌గా మారడంతో, వర్తమాన కథకు ఎవరు ప్రతినాయకుడనే విషయంలో చివరి రీళ్ళ వరకు ఒక చిన్న ఉత్కంఠ ప్రేక్షకులలో కొనసాగుతుంది.

సినిమా పూర్తయ్యేసరికి బోలెడన్ని పాత్రలు, బోలెడంత కాలపు కథ చూసిన భావన కలుగుతుంది. సినిమా నిడివి కూడా అందుకు తగ్గట్లే ఉంది. అయినప్పటికీ, ఆఖరు క్షణం వరకు ప్రేక్షకుడు కూర్చుంటాడు. ఆ మాత్రం కాలక్షేపం అందించే సినిమాలు... అందులోనూ రోజూ చూస్తున్న రొటీన్ చిత్రాలకు భిన్నమైన ప్రయత్నాలు... కరవైపోయిన రోజుల్లో ఏ సినిమాకైనా అంతకు మించి కావాల్సింది ఏముంటుంది! ఇప్పటికే తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అనేకుడు’కు తెలుగులోనూ అది కలిసొస్తుందనడానికి హాలులో కనిపిస్తున్న సూచనలూ అనేకం!

- రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement