ఓపికగా... అబ్బాయితో అమ్మాయి
చిత్రం: ‘అబ్బాయితో అమ్మాయి’
తారాగణం: నాగశౌర్య, పలక్ లల్వానీ, మోహన్, తులసి, రావు రమేశ్
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: పాత్రికేయ
పాటలు: రెహమాన్
సంగీతం: ఇళయరాజా
కెమేరా: శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్
నిర్మాతలు: వందనా అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట
దర్శకత్వం: రమేశ్‌వర్మ
ఏది ప్రేమ? ఏది ఆకర్షణ? జీవితానికి లవ్ ముఖ్యమా? జీవ నోపాధిగా నిలిచే కెరీర్ ముఖ్యమా? ఇవన్నీ ఎవర్‌గ్రీన్ ప్రశ్నలు. ఎదుటివాళ్ళు ఎంత చెప్పినా, ఎవరికివారు స్వీయానుభవంతో తెలుసుకుంటే కానీ తత్త్వం బోధపడని ప్రశ్నలు. సహజంగానే వీటిని బేస్ చేసుకొని సవాలక్ష సినిమాలొచ్చాయి. అయినా, ‘తమవైన సినిమాలు తమవి గాన’ అన్నట్లు డెరైక్టర్ రమేశ్‌వర్మ చేసిన సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’. ‘ఒక ఊరిలో, వీర, రైడ్’ అందించిన రమేశ్‌వర్మకిది మరో ప్రయత్నం. డిజైనర్‌గా మొదలెట్టి డెరైక్టరైన ఆయన తీసుకున్న కథ ఒక్క ముక్కలో చెప్పగలిగేది కాదు. రెండు గంటలు చూసినా అయ్యేది కాదు.
తాపీగా నడిచే ఈ కథ స్థూలంగా ఏమిటంటే, అమ్మాయి ప్రేమకి తపిస్తూ, సోషల్‌మీడియాలో ఛాటింగ్ చేస్తుంటాడు అభి (నాగశౌర్య). అలా వాయిస్ ఛాట్‌లో ప్రార్థన (పలక్ లల్వానీ) పరిచయమవుతుంది. ఒకరి ముఖం మరొకరికి తెలియకుండా, వ్యక్తిగత వివరాలు పంచుకోకుండానే మంచి స్నేహితులవుతారు. తామే సోషల్ మీడియా ఫ్రెండ్సన్న సంగతి తెలియకుండానే బయటి ప్రపంచంలో అతనూ, ఆమె ప్రేమలో పడతారు. ఆమెను ఎదురింట్లోకీ, ఆపై ప్రేమముగ్గులోకీ దింపుతాడు హీరో.
ఒక బలహీన క్షణంలో ఇద్దరూ ఒకటవు తారు. హీరోయిన్‌ను ఆమె తండ్రి (రావు రమేశ్), హీరోను అతని తండ్రి (మోహన్) దూరం పెడితే, ఒకరి ఇంట్లో మరొకరు ఆశ్రయం పొందుతారు. తన చేతిలో జీవితం నలిగిన ఆమే తన సోషల్ మీడియా ఫ్రెండ్ అని హీరోకు తెలుస్తుంది. కుమిలిపోయి, ఆ సంగతి ఆమెకు చెప్పకుండానే అమెరికాలో చదవాలన్న ఆమె లక్ష్యం కోసం ఓపికగా త్యాగాలకూ సిద్ధపడ తాడు. హీరోను హీరోయిన్ ద్వేషిస్తుంటుంది.
ఆ క్రమంలో అతను, ఆమె ఫ్యామిలీకి ఎలా దగ్గరయ్యాడు? ఆమె కూడా అసలు విషయం తెలిశాక ఏం చేసింది? ఏమైందన్నది సినిమా. ప్రేమంటే ఛాటింగ్, మీటింగ్, డేటింగనుకొనే కుర్రాడిగా మొదలై ఆ తరువాత పరివర్తన చెందే ప్రేమికుడిగా, సిసలైన స్నేహితుడిగా హీరో నాగశౌర్య కనిపిస్తారు. స్క్రిప్టు పరిధిలో వీలైనంత నటించడానికి ప్రయత్నిస్తారు.
హీరోయిన్ పలక్ లల్వానీ ముఖం మనకు కొత్త. ఆమెకు నటన కొత్త. సర్దుబాటు తప్పదు. రావు రమేశ్, ప్రగతితో పాటు ‘మౌనరాగం’ ఫేమ్ మోహన్, తులసి ఉన్నారు. అంతా సీనియర్లు, సీజన్డ్ ఆర్టిస్ట్‌లు. రావు రమేశ్, మోహన్ తదితరుల పాత్రల ప్రవర్తన, వాటి డిజైనింగ్‌పై అభ్యంతరాలుండవచ్చేమో కానీ, ఇచ్చిన సీన్లలో, చెప్పిన యాక్షన్‌లో వారు చేసినదానికి వంకపెట్టలేం.
సాంకేతిక నిపుణుల సంగతికొస్తే - ఈ సినిమాకు అనుభవజ్ఞుడైన శ్యామ్ కె. నాయుడు లాంటి కెమేరామన్ ఉన్నారు. ఇక, సంగీతానికి ఇళయరాజా లాంటి పెట్టని కోట ఉండనే ఉంది. ఇలా సినిమాలో అన్నీ ఉన్నాయి. అయినా ఇంకా ఏదో లేదేమిటని అనిపిస్తుంటుంది. ఇళయరాజా మార్కు సంగీతం సినిమా అంతటా ఉంది. కొన్ని పాటలు కొన్నేళ్ళుగా మన చెవులకు అలవాటైపోయిన ఇళయరాజా బాణీలనూ, ఆర్కెస్ట్రయిజేషన్‌నే మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తాయి.
తెరపై దృశ్యం బలహీనమైనచోట్ల తెరవెనక సంగీతంతో లేని భావోద్వేగాన్ని రేకెత్తించడానికి ‘ఇసై జ్ఞాని’ తోడ్పడ్డారు.
కాకపోతే సినిమాలో చాలా డౌట్లొస్తాయి. జరిగింది దిద్దు కోలేనంత తప్పు కాదు కాబట్టి, హీరో హీరోయిన్లు కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ పరిష్కారానికి ముందుకు రావచ్చు. కానీ, ఎవరూ ఆ పని చేయరు. ప్రేమించానన్నవాడే చాటింగ్ స్నేహితుడని తెలిశాక హీరోయిన్‌కున్న అభ్యంతరమేమిటో, ఎందుకో స్పష్టత లేదు.
ఒకటే రకం సీన్లు... ప్రతి సీనూ సుదీర్ఘంగా నడవడం... ప్రతి పాత్రా పంచ్ డైలాగ్‌సతో తత్త్వబోధ చేయడం... అసహజ పాత్ర ప్రవర్తన వల్ల ‘అబ్బాయితో అమ్మాయి’ ఓపికగా చూడాల్సిన సినిమా. తెరపై ప్రేమికుల్లానే, తెరవైపు చూసే ప్రేక్షకులకూ క్షణమొక యుగమే. వెరసి, ‘లెటజ్ ఫాల్ ఇన్ లవ్...’ అనే ఉపశీర్షికతో ఉపదేశం చేసే ఈ సినిమాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చూడాల్సిందే! ఆలసించిన ఆశాభంగం!