Ramesh Verma
-
రాక్షసుడుని హిందీలో రీమేక్ చేయబోతున్నా
‘‘గత ఏడాది నా పుట్టినరోజుకి ‘రాక్షసుడు’ సినిమా హిట్‌తో ఉన్నా.. ఈ ఏడాది ఏం లేదు. కరోనా పరిస్థితులు లేకపోయుంటే కచ్చితంగా మరో హిట్‌తో ఉండేవాణ్ణి’’ అని దర్శకుడు రమేశ్ వర్మ పెన్మెత్స అన్నారు. ‘ఒక ఊరిలో, రైడ్, వీర, అబ్బాయితో అమ్మాయి, రాక్షసుడు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రమేశ్ వర్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు. ►ఈ లాక్డౌన్లో ఇంట్లో కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాను. అయితే పని అనేది తప్పని సరి కావడంతో 10 రోజులుగా ఆఫీసుకు వెళుతున్నా. మళ్లీ షూటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్లాన్ చేయాలి కదా. ‘రాక్షసుడు’ సినిమా విడుదల తర్వాత నాకు నాలుగైదు అవకాశాలు వచ్చాయి. కానీ రవితేజగారితో చేయాలనుకోవడంతో ఆగాను. నిర్మాత కోనేరు సత్యనారాయణగారు కూడా తొందరేం లేదు కంఫర్టబుల్‌గా చేద్దామన్నారు. తమిళ్లో హిట్ అయిన ఓ సినిమా రీమేక్ చేద్దామనుకున్నాం. కానీ ఆ కథ కంటే ఇప్పుడు చేయబోయే సినిమా కథ రవితేజగారికి చాలా బాగుందని దీంతో ముందుకు వెళుతున్నాం. సెట్స్‌పైకి వెళ్లేందుకు బౌండెడ్ స్క్రిప్ట్ లాక్ చేసిపెట్టుకున్నాం. ఇంతలో కరోనా వచ్చేసింది. ప్రస్తుతం చిన్న సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి. కానీ పెద్ద చిత్రాలేవీ షూటింగ్స్ ప్రారంభించలేదు. అందరూ మొదలు పెడితే మేం కూడా సిద్ధమే. ►‘రాక్షసుడు’ హిందీ రీమేక్ హక్కులను కోనేరు సత్యనారాయణగారే తీసుకున్నారు. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం వహించాలన్నారాయన. రీమేక్‌లో నటించేందుకు చాలా మంది హీరోలు రెడీగా ఉన్నారు. కానీ మేం ఎవర్నీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. రవితేజగారి సినిమా పూర్తయ్యాక బాలీవుడ్లో ‘రాక్షసుడు’ రీమేక్ చేస్తా. ►నిర్మాతగా ‘7’ నా తొలి సినిమా. చిన్న చిత్రంగా తీద్దామనుకున్నాం. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరడంతో పెద్ద సినిమా అయింది.. బడ్జెట్ కూడా పెరిగింది. దీంతో నా స్నేహితులు కూడా ప్రొడక్షన్లో భాగమయ్యారు. ఈ చిత్రం వల్ల నష్టంలేదు.. సేఫ్ ప్రాజెక్ట్.. నెట్ ఫ్లిక్స్‌లో ఇప్పటికీ ఆదరణ బాగుంది. ఆ సినిమా హిందీలో చేస్తే బాగుంటుందని నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఓ ప్రతిపాదన కూడా పెట్టారు. భవిష్యత్‌లో సినిమాలు నిర్మించాలా? వద్దా అన్నది నిర్ణయించుకోలేదు.. అవకాశాల్ని బట్టి వెళతా. -
కిలాడీ?
ఏ పనినైనా పూర్తి చేయడం కోసం మాయ చేసి, మంత్రం వేసి, మోసం చేసేవాళ్లను కిలాడీ అంటారు. ఇప్పుడు అలాంటి జగత్ కిలాడీగా మారబోతున్నారట రవితేజ. ‘వీర’ తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. కోనేరు సత్యనారాయణ ఈ సినిమా నిర్మించనున్నారు. ఇద్దరు కథనాయికలు ఉన్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్ ఓ హీరోయిన్ అని చిత్రబృందం కన్ఫర్మ్ చేసింది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఓ పాత్ర పోలీస్ ఆఫీసర్ అట. ఇంకోటి కిలాడీ పాత్ర అని సమాచారం. ఈ సినిమాకు ‘కిలాడీ’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ప్రీ–ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
కాంబినేషన్ కుదిరిందా?
‘రాక్షసుడు’ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు దర్శకుడు రమేష్ వర్మ. ఈ ఉత్సాహంలోనే తన నెక్ట్స్ సినిమా కోసం హీరో రవితేజకు కథ వినిపించారట. కథ నచ్చడంతో రవితేజ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారట. ‘రాక్షసుడు’ సినిమాను కూడా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన సంగతి తెలిసిందే. గతంలో రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘వీర’ (2011) అనే చిత్రం వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత రవితేజ, రమేష్ కాంబినేషన్ కలవనుందన్న మాట. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 20న విడుదల కానుంది. -
రీమేక్ చేయడం సులభం కాదు
‘‘నా చిన్నప్పటి నుంచి సూపర్‌గుడ్ ఫిలిమ్స్‌లో చాలా రీమేక్‌లు చేయడం చూశా. అవన్నీ సక్సెస్‌లే. నేనెప్పుడూ రీమేక్ సినిమా చేయాలనుకోలేదు. కానీ, ‘రాక్షసుడు’ కథ నచ్చింది. ఒక పెయింటింగ్‌ని మళ్లీ వేయడం మామూలు విషయం కాదు. అలాగే రీమేక్ చేయడం కూడా ఈజీ కాదు. ఇండియాలో రీమేక్ అవుతున్న సినిమాలన్నీ హిట్ అయ్యాయా? నేను సక్సెస్ అయ్యాను’’ అని రమేష్ వర్మ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మెత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా రమేష్ వర్మ పంచుకున్న విశేషాలు... ► సాయిశ్రీనివాస్‌కి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చింది నేనే అని వింటుంటే చాలా ఆనందంగా ఉంది. బెల్లంకొండ సురేష్‌గారు వాళ్లబ్బాయిని నా చేతిలో పెట్టినప్పుడు ‘రాక్షసుడు’ సినిమాను ఎంపిక చేసుకున్నా. దీనికన్నా ముందు ఆయన ఓ లవ్ స్టోరీతో డబుల్ బడ్జెట్ ఉన్న సినిమా ఇచ్చారు. ఇద్దరు హీరోయిన్లు, దేవీశ్రీ మ్యూజిక్, లండన్‌లో సినిమా... ఇలా చాలా బెటర్ అవకాశం ఇచ్చారు. కానీ గమ్యం నన్ను ‘రాక్షసుడు’ వైపు తీసుకెళ్లింది. ► ‘కవచం’ సినిమా తర్వాత నేను సాయి శ్రీనివాస్‌కి ఈ కథ చెబితే ‘మళ్లీ పోలీస్‌గా చేయను’ అన్నాడు. బెల్లంకొండ సురేష్గారి దగ్గరకు వెళ్లి ‘రాక్షసన్’ సినిమా చూడమని చెప్పా. వాళ్ల ఫ్యామిలీ మొత్తం చూశారు.. అందరికీ నచ్చడంతో ‘రాక్షసుడు’ ఓకే అయింది. ► ఈ సినిమాలో ఫైట్స్ పెట్టాలని శ్రీనివాస్ కొంచెం ఒత్తిడి చేశాడు. కానీ, నేను ఒప్పుకోలేదు. ‘ఎందుకండీ రమేశ్‌తో రిస్క్. మీ అబ్బాయి హవీశ్‌తో చేసుకుని, వేరే పెద్ద డైరెక్టర్ని పెడితే, ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’ అని కొందరు సత్యనారాయణగారితో అన్నారు. కానీ ఆయన పట్టించుకోలేదు. ► ఇండియాలో టాప్ గ్రాసర్ సినిమాను ఓ సౌత్ ఇండియన్ డైరెక్టర్ తీస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ఐఎండీబీలో టాప్ సెకండ్ సినిమాను మేం చేశాం.. ప్రూవ్ చేసుకున్నాం. ‘రాక్షసుడు’ తో ఆత్మసంతృప్తి కలిగింది. ‘మా అబ్బాయికి బ్లాక్ బస్టర్ ఇచ్చావు’ అని సురేష్‌గారు మెసేజ్ చేయడం హ్యాపీ. ► ప్రస్తుతానికి ‘రాక్షసుడు’ సినిమాను ఇంకా ప్రమోట్ చేసుకోవాలని ఉంది. ‘రాక్షసుడు’ టైమ్‌లో నితిన్ వాళ్ల నాన్నగారు సుధాకర్రెడ్డిగారిని కలిసి కథ చెప్పా.. వాళ్లకు నచ్చింది. అయితే మీడియాలో ఆ విషయం రావడం వల్ల డిస్టర్బెన్స్ జరిగింది. ఆ కథను, ఆ ప్రేమకథని నితిన్‌తో చేయాలని ఉంది. -
సస్పెన్స్ సెవెన్
హవీష్ హీరోగా నటించిన చిత్రం ‘7’. ఈ చిత్రానికి కెమెరామేన్ నిజార్ షఫీ దర్శకత్వం వహించారు. కథ అందించి, నిర్మించారు రమేష్ వర్మ. రెజీనా, నందితా శ్వేత, త్రిదా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కొత్త హవీష్‌ను చూస్తారు. రమేష్ వర్మ సస్పెన్స్‌తో కూడిన మంచి కథ అందించారు. ఈ కొత్త కాన్సెప్ట్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది’’ అన్నారు. ‘‘సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కథ విన్నప్పుడు చాలా ఎగై్జట్ అయ్యాను. నేను విన్న స్టోరీ లైన్‌నే ట్రైలర్‌గా చూపించాం. మంచి స్పందన లభిస్తోంది. అందరూ ప్యాషనేట్‌గా వర్క్ చేశారు. రమేష్ వర్మ సూపర్ కథ అందించారు. కథకు డైరెక్టర్ పూర్తి న్యాయం చేశారు. చైతన్యా భరద్వాజ్ మంచి సాంగ్స్ ఇచ్చారు. జి.ఆర్. మహర్షి తన డైలాగ్స్‌తో అదరగొట్టారు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని అన్నారు హవీష్. ‘‘ఈ చిత్రం నా కెరీర్లో సమ్‌థింగ్ స్పెషల్. రమ్య క్యారెక్టర్ నచ్చి బాగా నటించాను. హవీష్ లవ్లీ కోస్టార్. టీమ్ అంతా మంచి పాజిటివ్ జోష్‌లో ఉన్నాం’’ అన్నారు నందితా శ్వేతా. ‘‘నిజార్ షఫీ గారు ఎన్నో హిట్ సినిమాలకు కెమెరామేన్‌గా వర్క్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ ఫస్ట్ మూవీ ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు పూజిత. ‘‘ఆడియన్స్‌కు ‘7’ డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది’’ అన్నారు త్రిదా చౌదరి. -
నయా సినిమా.. నయా లుక్
తమిళంలో గతేడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ‘రాక్షసన్’ ఒకటి. ప్రస్తుతం ఈ సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రమేష్‌వర్మ పెన్మత్స తెరకెక్కిస్తారు. హవీష్ లక్ష్మణ్ కోనేరు బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తం గురువారం జరిగింది. తొలి సన్నివేశానికి నిర్మాత కె.ఎల్.నారాయణ కెమెరా స్విచ్చాన్ చేయగా హీరో హవీష్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా హవీష్ మాట్లాడుతూ – ‘‘రాక్షసన్’ చిత్రాన్ని తెలుగులో మా బ్యానర్‌పై నిర్మించడం సంతోషంగా ఉంది. ప్రతిష్టాత్మకంగా, భారీగా నిర్మించనున్నాం. ఈ సినిమా కోసం శ్రీనివాస్ తన లుక్‌ని మార్చుకోబోతున్నారు. గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది’’ అన్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ నటించనున్నారని టాక్. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: వెంకట్ సి. దిలీప్. -
ఆ ముద్దు పెట్టుకున్నది మేం కాదు!
దక్షిణాదిన ఏ హీరోతో నటించాలని ఉంది? అని అడిగితే.. బాలీవుడ్లో ఇరగదీస్తున్న దీపికా పదుకొనే నుంచి ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రం ద్వారా పరిచయమైన పల్లక్ లల్వానీ వరకూ చెప్పే పేరు మహేశ్‌బాబు. నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో మహేశ్ అనీ, ఆయనతో పాటు టాలీవుడ్లో ఉన్న హీరోలందరి సరసన నటించాలని ఉందని పల్లక్ చెప్పింది. రమేశ్ వర్మ దర్శకత్వంలో నాగ శౌర్య, పల్లక్ నటించిన ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పల్లక్ తన గురించీ, ఈ చిత్రంలో నటించడం గురించీ చెబుతూ - ‘‘మా నాన్న జితిన్ లల్వాని హిందీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. దాంతో నటన మీద నాకూ ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం ముంబయ్‌లోని జైహింద్ కళాశాలలో బీఏ చదువుతున్నా. ఇప్పట్లో కథానాయిక అయ్యే ఆలోచన లేకపోయినా సౌత్‌లో ఓ చిత్రానికి అవకాశం రావడంతో ఆడిషన్స్‌లో పాల్గొన్నా. ఆ ఫొటోలు చూసి, రమేశ్ వర్మగారు ఈ సినిమాకి అడిగారు. ఫేస్బుక్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. వ్యక్తిగతంగా నేను ఫేస్బుక్లో లేను. అయితే, ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఎకౌంట్ ఉండేది. అప్పుడు ఓ పది మంది అజ్ఞాత వ్యక్తులతో చాటింగ్ కూడా చేశాను. ఆ తర్వాత సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నా’’ అన్నారు. ఈ చిత్రంలో నాగశౌర్యతో ముద్దు సీన్లో చేశారు.. ఆ సీన్ చేయడానికి ఇబ్బంది అనిపించలేదా? అనే ప్రశ్న పల్లక్ ముందుంచితే - ‘‘నిజం చెప్పాలంటే ఇబ్బందే. కానీ, అక్కడ ముద్దు పెట్టుకున్నది నేనూ, నాగశౌర్య కాదు. సినిమాలోని అభి, ప్రార్థన పాత్రలు. సీన్‌కి అది అవసరం కాబట్టి, చేశాను’’ అని చెప్పారు. టాలీవుడ్ నుంచి పలు అవకాశాలు వస్తున్నాయనీ, చదువుకుంటూ నటిస్తాననీ ఈ ఉత్తరాది బ్యూటీ స్పష్టం చేశారు. -
ఓపికగా... అబ్బాయితో అమ్మాయి
చిత్రం: ‘అబ్బాయితో అమ్మాయి’ తారాగణం: నాగశౌర్య, పలక్ లల్వానీ, మోహన్, తులసి, రావు రమేశ్ స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: పాత్రికేయ పాటలు: రెహమాన్ సంగీతం: ఇళయరాజా కెమేరా: శ్యామ్ కె. నాయుడు ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్ నిర్మాతలు: వందనా అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట దర్శకత్వం: రమేశ్‌వర్మ ఏది ప్రేమ? ఏది ఆకర్షణ? జీవితానికి లవ్ ముఖ్యమా? జీవ నోపాధిగా నిలిచే కెరీర్ ముఖ్యమా? ఇవన్నీ ఎవర్గ్రీన్ ప్రశ్నలు. ఎదుటివాళ్ళు ఎంత చెప్పినా, ఎవరికివారు స్వీయానుభవంతో తెలుసుకుంటే కానీ తత్త్వం బోధపడని ప్రశ్నలు. సహజంగానే వీటిని బేస్ చేసుకొని సవాలక్ష సినిమాలొచ్చాయి. అయినా, ‘తమవైన సినిమాలు తమవి గాన’ అన్నట్లు డెరైక్టర్ రమేశ్‌వర్మ చేసిన సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’. ‘ఒక ఊరిలో, వీర, రైడ్’ అందించిన రమేశ్వర్మకిది మరో ప్రయత్నం. డిజైనర్‌గా మొదలెట్టి డెరైక్టరైన ఆయన తీసుకున్న కథ ఒక్క ముక్కలో చెప్పగలిగేది కాదు. రెండు గంటలు చూసినా అయ్యేది కాదు. తాపీగా నడిచే ఈ కథ స్థూలంగా ఏమిటంటే, అమ్మాయి ప్రేమకి తపిస్తూ, సోషల్‌మీడియాలో ఛాటింగ్ చేస్తుంటాడు అభి (నాగశౌర్య). అలా వాయిస్ ఛాట్‌లో ప్రార్థన (పలక్ లల్వానీ) పరిచయమవుతుంది. ఒకరి ముఖం మరొకరికి తెలియకుండా, వ్యక్తిగత వివరాలు పంచుకోకుండానే మంచి స్నేహితులవుతారు. తామే సోషల్ మీడియా ఫ్రెండ్సన్న సంగతి తెలియకుండానే బయటి ప్రపంచంలో అతనూ, ఆమె ప్రేమలో పడతారు. ఆమెను ఎదురింట్లోకీ, ఆపై ప్రేమముగ్గులోకీ దింపుతాడు హీరో. ఒక బలహీన క్షణంలో ఇద్దరూ ఒకటవు తారు. హీరోయిన్ను ఆమె తండ్రి (రావు రమేశ్), హీరోను అతని తండ్రి (మోహన్) దూరం పెడితే, ఒకరి ఇంట్లో మరొకరు ఆశ్రయం పొందుతారు. తన చేతిలో జీవితం నలిగిన ఆమే తన సోషల్ మీడియా ఫ్రెండ్ అని హీరోకు తెలుస్తుంది. కుమిలిపోయి, ఆ సంగతి ఆమెకు చెప్పకుండానే అమెరికాలో చదవాలన్న ఆమె లక్ష్యం కోసం ఓపికగా త్యాగాలకూ సిద్ధపడ తాడు. హీరోను హీరోయిన్ ద్వేషిస్తుంటుంది. ఆ క్రమంలో అతను, ఆమె ఫ్యామిలీకి ఎలా దగ్గరయ్యాడు? ఆమె కూడా అసలు విషయం తెలిశాక ఏం చేసింది? ఏమైందన్నది సినిమా. ప్రేమంటే ఛాటింగ్, మీటింగ్, డేటింగనుకొనే కుర్రాడిగా మొదలై ఆ తరువాత పరివర్తన చెందే ప్రేమికుడిగా, సిసలైన స్నేహితుడిగా హీరో నాగశౌర్య కనిపిస్తారు. స్క్రిప్టు పరిధిలో వీలైనంత నటించడానికి ప్రయత్నిస్తారు. హీరోయిన్ పలక్ లల్వానీ ముఖం మనకు కొత్త. ఆమెకు నటన కొత్త. సర్దుబాటు తప్పదు. రావు రమేశ్, ప్రగతితో పాటు ‘మౌనరాగం’ ఫేమ్ మోహన్, తులసి ఉన్నారు. అంతా సీనియర్లు, సీజన్డ్ ఆర్టిస్ట్‌లు. రావు రమేశ్, మోహన్ తదితరుల పాత్రల ప్రవర్తన, వాటి డిజైనింగ్‌పై అభ్యంతరాలుండవచ్చేమో కానీ, ఇచ్చిన సీన్లలో, చెప్పిన యాక్షన్‌లో వారు చేసినదానికి వంకపెట్టలేం. సాంకేతిక నిపుణుల సంగతికొస్తే - ఈ సినిమాకు అనుభవజ్ఞుడైన శ్యామ్ కె. నాయుడు లాంటి కెమేరామన్ ఉన్నారు. ఇక, సంగీతానికి ఇళయరాజా లాంటి పెట్టని కోట ఉండనే ఉంది. ఇలా సినిమాలో అన్నీ ఉన్నాయి. అయినా ఇంకా ఏదో లేదేమిటని అనిపిస్తుంటుంది. ఇళయరాజా మార్కు సంగీతం సినిమా అంతటా ఉంది. కొన్ని పాటలు కొన్నేళ్ళుగా మన చెవులకు అలవాటైపోయిన ఇళయరాజా బాణీలనూ, ఆర్కెస్ట్రయిజేషన్నే మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తాయి. తెరపై దృశ్యం బలహీనమైనచోట్ల తెరవెనక సంగీతంతో లేని భావోద్వేగాన్ని రేకెత్తించడానికి ‘ఇసై జ్ఞాని’ తోడ్పడ్డారు. కాకపోతే సినిమాలో చాలా డౌట్లొస్తాయి. జరిగింది దిద్దు కోలేనంత తప్పు కాదు కాబట్టి, హీరో హీరోయిన్లు కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ పరిష్కారానికి ముందుకు రావచ్చు. కానీ, ఎవరూ ఆ పని చేయరు. ప్రేమించానన్నవాడే చాటింగ్ స్నేహితుడని తెలిశాక హీరోయిన్‌కున్న అభ్యంతరమేమిటో, ఎందుకో స్పష్టత లేదు. ఒకటే రకం సీన్లు... ప్రతి సీనూ సుదీర్ఘంగా నడవడం... ప్రతి పాత్రా పంచ్ డైలాగ్సతో తత్త్వబోధ చేయడం... అసహజ పాత్ర ప్రవర్తన వల్ల ‘అబ్బాయితో అమ్మాయి’ ఓపికగా చూడాల్సిన సినిమా. తెరపై ప్రేమికుల్లానే, తెరవైపు చూసే ప్రేక్షకులకూ క్షణమొక యుగమే. వెరసి, ‘లెటజ్ ఫాల్ ఇన్ లవ్...’ అనే ఉపశీర్షికతో ఉపదేశం చేసే ఈ సినిమాను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చూడాల్సిందే! ఆలసించిన ఆశాభంగం! -
ఇప్పటివరకూ కనీసం ఆమెను కలవనేలేదు!
‘‘ఇప్పటివరకూ నేను సున్నా. 2016లో ఓ మెట్టు ఎక్కుతాననే నమ్మకం ఉంది. జనవరి 1న ‘అబ్బాయితో అమ్మాయి’, అదే నెలాఖరున ‘కల్యాణ వైభోగమే’ చిత్రాలు రిలీజవుతాయి. మరో రెండు సినిమాలు కూడా ఆ ఏడాదే వస్తాయి’’ అని నాగశౌర్య చెప్పారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో నటించిన ‘అబ్బాయితో అమ్మాయి’ విడుదల సందర్భంగా ఈ యువహీరోతో చిట్ చాట్. కొత్త సంవత్సరం మొదటి రోజునే సినిమా రిలీజ్.. ఎలా అనిపిస్తోంది? చెప్పాలంటే ఇప్పటివరకూ నేను చేసినా ఐదారు సినిమాలు నాకు బేస్మెంట్ అనీ, ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రంతో కెరీర్ స్టార్ట్ అవుతుందనీ అనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకోదగ్గ కథ ఇది. తల్లిదండ్రులందరూ ‘అభీ మన అబ్బాయి’ అని నన్ను ఓన్ చేసుకునేలా నా పాత్ర ఉంటుంది. యూత్ అంతా నా పాత్రలో తమని చూసుకుంటారు. మూడేళ్ల క్రితమే దర్శకుడు రమేశ్ వర్మ మీతో ఈ సినిమా చేయాలనుకున్నారు కదా.. అప్పుడెందుకు చేయలేదు? అసలీ చిత్రం ద్వారానే నేను పరిచయం కావాల్సింది. కానీ, నిర్మాతలు సరిగ్గా కుదరలేదు. ఆ సమయంలోనే ‘ఊహలు గుసగుసలాడె’కి అవకాశం వచ్చింది. అయితే, ఈ కథను మాత్రం మర్చిపోలేదు. చివరకు మంచి నిర్మాతలు కుదరడంతో ఈ ఏడాది మొదలుపెట్టాం. రమేశ్ వర్మ కథలో కొన్ని మార్పులు చేసి, తీశారు. ఆయన టేకింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇళయరాజాగారి పాటలకు కాలు కదిపే అవకాశం రావడం గురించి? ఈ చిత్రానికి ఆయన పాటలు ప్రధాన బలం. ఆడియో ఫంక్షన్లో ఇళయరాజాగారిని చూసి, థ్రిల్ అయ్యాను. ‘సినిమా బాగుందబ్బాయ్.. మంచి ఫీల్ ఉంది’ అని ఆయన ప్రశంసించడంతో పొంగిపోయాను. ఇందులో లిప్ లాక్ సీన్స్ చేశారట? లిప్ లాక్లాంటిది ఉంటుంది కానీ, ప్రాపర్ లిప్ లాక్ అయితే కాదు. ఫొటోషూట్ సమయంలో చేశాం. అయినా నేను లిప్ లాక్ సీన్స్ చేయను. ఎందుకని? ‘జాదుగాడు’ సినిమాలో లిప్ లాక్ చేశాను. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, సెంటిమెంట్‌గా లిప్ లాక్ వర్కవుట్ కాదనుకుంటున్నా. అప్పటివరకూ లవ్‌స్టోరీస్ చేసి, ‘జాదుగాడు’తో మాస్ హీరోగా నిరూపించుకోవాలనుకున్నారు.. నిరాశే ఎదురైంది కదా? అవును. నన్నింకా మాస్ హీరోగా చూడ్డానికి ప్రేక్షకులు రెడీగా లేరని ఆ సినిమా చేశాక అర్థమైంది. ‘జాదుగాడు’ ఫలితం కారణంగా.. మరో రెండు, మూడేళ్ల వరకూ మాస్ చిత్రాల జోలికి వెళ్లకూడదనుకుంటున్నా. వరుసగా లవ్‌స్టోరీలంటే.. ప్రేక్షకులు మిమ్మల్ని వాటికే ఫిక్స్ చేస్తారేమో? నాగార్జునగారు, వెంకటేశ్‌గారు కూడా ముందు లవ్‌స్టోరీస్ చేసి, తర్వాత మాస్ మూవీస్ చేశారు. ఇప్పుడు నా ఏజ్‌కి తగ్గట్టుగా లవ్ స్టోరీసే చేయాలి. భవిష్యత్తులో మాస్ మూవీస్ చేస్తా. ఇంతకీ ‘అబ్బాయితో అమ్మాయి’ కథ ఏంటి? కొడుకు లవ్‌కి పేరంట్స్ సపోర్ట్ చేస్తారు. ఆ లవ్ తప్పని తెలిశాక ఎలా రియాక్ట్ అవుతారన్నది కథ. ఫేస్‌బుక్‌ది కూడా ఇందులో ఇంపార్టెంట్ రోల్. మీరు ఫేస్బుక్లో ఉన్నారా? ఫేస్బుక్ మాత్రమే కాదు.. ట్విట్టర్లోనూ లేను. ఫోన్ కూడా వాడను. ఫోన్ వాడరా.. మరి ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే? ఫోన్ వాడి నాలుగైదు నెలలైంది. నన్ను కాంటాక్ట్ చేయాలంటే నా మేనేజర్నూ, లేకపోతే మా అమ్మా, నాన్నకూ ఫోన్ చేయొచ్చు. ఫోన్ వాడకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారు? షూటింగ్ సమయంలో ఫోన్ రింగ్ అయితే, డిస్ట్రబ్ అయిపోతుంటా. అలాగే, ఫోన్ తీయకపోతే ఫ్రెండ్స్‌కీ, ఇంట్లోవాళ్లకీ కోపం వస్తుంది. అందుకే ఫోన్ వాడకూడదని ఫిక్స్ అయిపోయా. ఎప్పుడైనా లవ్‌లో పడ్డారా.. లవ్ ఫెయిల్యూర్స్ లాంటివి? నేను బీకామ్ వరకూ చదువుకున్నాను. స్పోర్ట్స్ కోటాలో సీట్ వచ్చింది. నేషనల్ లెవల్లో క్రికెట్, టెన్నిస్, బాస్కెట్ బాల్ వంటివి ఆడాను. కాలేజ్‌కి ఎక్కువగా వెళ్లడానికి కుదరకపోవడంతో లవ్‌లో పడే అవకాశం రాలేదు. లవ్ ఫెయిల్యూర్ అంటారా? చాలామంది అమ్మాయిలు నచ్చుతారు. అది ఆకర్షణా? ప్రేమా? పోల్చుకోలేదు. అనుష్క అంటే నాకిష్టం. ఇప్పటివరకూ కనీసం ఆమెను కలవనేలేదు. ఇలాంటివాటిని లవ్ ఫెయిల్యూర్ అనలేం. మరి.. రాశీఖన్నాతో లవ్ అట? ఈ వార్త విని నవ్వుకున్నాను. రాసేవాళ్లకు హక్కు ఉంటుంది. వాటి గురించి మాట్లాడుకునే హక్కు ఇతరులకు ఉంటుంది. సో.. సినిమా పరిశ్రమలో కొనసాగాలంటే... మాట్లాడే మాటలు ఇతరులవి.. వినే చెవులు మాత్రమే మనవి అని ప్రిపేర్ అయిపోవాలి. మా మమ్మీ మాత్రం ‘ఇలాంటి వార్తలు వస్తే... నీకు పెళ్లెలా అవుతుంది?’ అని భయపడుతుంటుంది. అలా అంటే సినిమా పరిశ్రమలో చాలామందికి పెళ్లిళ్లు కావమ్మా అంటుంటాను. పారితోషికం కూడా పెంచారట? లవ్ అట అని వచ్చిన వార్తకు మనల్ని గుర్తించారని ఆనందపడ్డాను. పారితోషికం పెంచాడట? అనే వార్త కూడా ఉపయోగపడింది. ‘కోటి రూపాయలు ఇవ్వలేం.. 70 లక్షలు తీసుకుంటారా?’ అని ఆ మధ్య ఓ నిర్మాత అడిగారు. అప్పటికి నేనంత కూడా తీసుకోవడంలేదు (నవ్వుతూ). -
చూస్తే ప్రేమలో పడిపోతారు!
ఓ జంట మధ్య చిగురించిన ప్రేమ వారి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పిందనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’. నాగశౌర్య, పాలక్ అల్వాని జంటగా వందన అలేఖ్య జక్కం, కిరీటి, శ్రీనివాస్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో టీజర్ ఆవిష్కరించారు. నాగశౌర్య మాట్లాడుతూ- ‘‘నేను మంచి హీరో అవుతానని రమేష్ వర్మ ఎప్పుడో నమ్మారు. అందుకే నాకోసం మంచి కథ సృష్టించారు. ఈలోగా నేను వేరే సినిమాలతో బిజీ అయిపోయా. అయినా నా కోసం రెండేళ్లు ఆగారు. ఇది కచ్చితంగా హిట్టయ్యే మూవీ. ఇళయరాజాగారితో చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది. నేను అందగాణ్ణే అనే ఫీలింగ్ కలగచేసిన కెమేరామేన్ శ్యామ్ కె. నాయుడుగారికి నా కృతజ్ఞతలు’’ అని చెప్పారు. ‘‘రమేష్ వర్మ ఓ అద్భుత మైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టీజర్ చూస్తేనే ఈ సినిమాతో ఎవరైనా ప్రేమలో పడిపోతారు’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో మల్టీ డైమన్షన్ వాసు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: పాత్రికేయ.