ఢిల్లీలోని సదర్ బజార్ మార్కెట్‌లో బుధవారం కిక్కిరిసిన జనం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విస్ఫోటనం దడ పుట్టిస్తోంది. మూడు రోజుల తేడాలో మరోసారి రికార్డు స్థాయిలో లక్షకి పైగా కేసులు నమోదై రికార్డుల్ని తిరగరాశాయి. 24 గంటల్లో 1,15,736 కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కి చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. క్రియాశీల కేసుల సంఖ్య 8,43,473కి చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 6.59 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. కొత్తగా 630 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,66,177కి చేరుకుంది.
రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు
► పంజాబ్‌లో రాత్రి కర్ఫ్యూ విధించారు. రాజకీయ సమావేశాలపై నిషేధం విధించారు. రాజకీయ నేతలు సమావేశాలు నిర్వహిస్తే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సీఎం అమరీందర్ హెచ్చరించారు. ఆంక్షలు ఈ నెల 30 వరకు అమల్లో ఉంటాయి.
► మహారాష్ట్ర ప్రభుత్వం 9, 11వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్ అయినట్టుగా ప్రకటించింది
► బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. భారీ ర్యాలీలు, ప్రదర్శనలకి అనుమతినివ్వరు. అపార్ట్‌మెంట్లు, విల్లాలలో ఉండే స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, పార్టీ హాళ్ల వినియోగాన్ని నిషేధించారు. 20 వరకు బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రార్థనలపై కూడా నిషేధం. క్లబ్బులు, పబ్‌లు, రెస్టారెంట్ల సగం సామర్థ్యంతో మాత్రమే నడపాలి.
మూడు రెట్లు వేగంతో...
కరోనా మొదటి వేవ్‌తో పోల్చి చూస్తే యాక్టివ్ కేసుల సంఖ్య 3 రెట్ల వేగంతో పెరిగిపోతోంది. కేవలం 2 రోజుల్లోనే యాక్టివ్ కేసులు 7 లక్షల నుంచి 8లక్షలు దాటేశాయి. ఏడాది ఆగస్టు 22 నాటికి 7 లక్షలున్న యాక్టివ్ కేసులు సెప్టెంబర్ 2 కల్లా 8 లక్షలు దాటాయి. లక్ష యాక్టివ్ కేసులు నమోదు కావడానికి 8 రోజులు పట్టింది.సెప్టెంబర్ 17న యాక్టివ్ కేసులు అత్యధికంగా 10,17,705 నమోదైతే అతి తక్కువగా ఫిబ్రవరి 11న 1,33,079గా ఉన్నాయి.
ఇక పని చేసే చోట వ్యాక్సిన్
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీరు పని చేసే ప్రాంతానికే వైద్య అధికారులు వచ్చి కోవిడ్–19 వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఏప్రిల్ 11 నుంచి టీకా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ బుధవారం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఏదైనా కార్యాల యంలో 45 ఏళ్ల వయసు పైబడిన వారు 100 మందికి పైగా వ్యాక్సిన్ తీసుకోవడానికి సుము ఖంగా ఉంటే అక్కడే వారికి టీకా ఇవ్వడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆ లేఖ లో స్పష్టం చేశారు. ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి వారి కార్యా లయాల్లోనే టీకా కేంద్రాలు ప్రారంభించాలని రాజేశ్ భూషణ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment