ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎదుట కిక్కిరిసిన ప్రయాణికులు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పెను ఉప్పెనలా దేశాన్ని ముంచేస్తోంది. ప్రతి రోజూ సునామీలా కేసులు వెల్లువెత్తుతూ ఉండడంతో ఒక రోజు నమోదైన రికార్డులు మర్నాడే తుడిచిపెట్టుకుపోతున్నాయి. కరోనా కరాళ నృత్యంతో ఎన్నో రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్క, కరోనాతో మరణిస్తే అంతిమ సంస్కారానికి జానెడు జాగా దొరక్క జనం నానా అవస్థలు పడుతున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో 2 లక్షలకు చేరువలో కేసులు నమోదు కావడం కరోనా పతాక స్థాయికి చేరుకున్నట్టైంది. కరోనా కాటుకి వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం (మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు) 1,84,372 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,38,73,825కి చేరుకుంది. (బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి లోపు కొత్తగా మరో 1,99,531 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం). ఇక యాక్టివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా 13.65.704కి చేరుకుంది. కరోనా మరణాలు కూడా భయాందోళనలు రేపుతున్నాయి. ఒక్క రోజులోనే 1,027 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 1,72,085కి చేరుకుంది.
యూపీ మరో మహారాష్ట్ర
ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌లో నిర్వహించిన కుంభమేళా ఆ రాష్ట్రం కొంప ముంచేలా కనపడుతోంది. గంగానదిలో పవిత్ర స్నానాలకు వెళ్లి వచ్చిన వారిలో కేవలం రెండు రోజుల్లోనే వెయ్యి మందికిపైగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక యూపీలో ఒకే రోజు 20,512 కేసులు నమోదయ్యాయి.
సీఎం యోగికి పాజిటివ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌నీ కరోనా వదిలి పెట్టలేదు.కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని యోగి తన ట్విట్టర్ ద్వారా బుధవారం వెల్లడిం చారు. గత కొద్ది రోజులుగా తనను కలుసుకున్న వారంతా కోవిడ్ పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. యూపీ ప్రభుత్వంలో కొంతమంది అధి కారులు మంగళవారం కరోనా బారిన పడడంతో యోగి ఆదిత్యనాథ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.
‘‘నాకూ కొద్దిగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ వచ్చింది. డాక్టర్ల సలహా మేరకు స్వీయ నిర్బంధంలో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధు లు నిర్వహిస్తున్నాను’’ అని యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 5న ఆదిత్యనాథ్ భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, యూపీ మంత్రి అశుతోష్ టాండన్ కూడా కరోనా బారినపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment