బుకింగ్‌లో రూ.50కి కొన్న టికెట్‌ను.. బయట డిమాండ్ ఉందని రూ.200కు అమ్మితే, దానిని బ్లాక్ వ్యవహారం అంటారు. అలా అమ్మిన వారు బ్లాక్ టికెట్లు అమ్మిన నేరం కింద శిక్షార్హులు. మరి అదే పనిని థియేటర్ల యాజమాన్యాలు అధికారికంగా చేస్తే..? దాన్ని బ్లాక్‌లో విక్రయించినట్లుగా ఎందుకు పరిగణించకూడదు? అధికారికమైనా, అనధికారికమైనా చేసిన పని అదే కదా? ఇదే ఉద్దేశంతో.. ఈ అధికారిక బ్లాక్‌కు కళ్లెం వేయటానికే రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల వారీగా టికెట్లకు నిర్ణీత ధరలను నిర్దేశించింది.
సాక్షి, అమరావతి: సినిమా అన్నది ప్రధానంగా వినోదాత్మకం. పేదల నుంచి ధనికుల వరకు దాదాపు అత్యధికులు సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారనేది కాదనలేని వాస్తవం. ఆయా సినీ హీరోలను బట్టి అభిమానుల సంఖ్య ఉంటుంది. తమ అభిమాన కథానాయకుడి సినిమాను తొలి రోజే చూడాలన్న ఉత్సాహం చాలా మంది అభిమానుల్లో ఉంటుంది. ఈ అభిమానాన్ని వీలున్నంత వరకు ‘క్యాష్’ చేసుకోవాలనుకున్న సినిమా వాళ్ల అత్యాశ ఎంతో మంది పేదల జేబులకు చిల్లు పొడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏ సినిమా అయినా ఒక్కటే.. సినిమాను సినిమాగానే చూడాలి.
ఎవరి సినిమా అయినా.. ఏ రోజైనా.. టికెట్ ధర మాత్రం ఒకటే ఉండాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. తొలి రోజైనా, తొలి మూడు రోజులైనా.. నాలుగో రోజైనా వేసేది అదే సినిమా. అందులో తొలి మూడు రోజులు అదనపు పాటలు, సీన్ల వంటివేమీ ఉండవు. మరి అలాంటప్పుడు తొలి మూడు రోజులూ టికెట్ల ధరలు పెంచటం ఎందుకు అన్న సగటు ప్రేక్షకుడి ప్రశ్న సబబే అని ప్రభుత్వం ఏకీభవించింది. ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని, నటీ నటులకు ఎక్కువ పారితోషికం ఇచ్చామని.. తదితర కారణాలతో టికెట్ల రేట్లు పెంచుతామంటే ఇకపై కుదరదని స్పష్టం చేసింది.
ప్రాంతాల వారీగా టికెట్ల ధర
తమ అభిమాన హీరో సినిమా అనో.. లేక పేరున్న దర్శకుడి సినిమా అనో రిలీజైన తొలి రోజో, తర్వాతి రోజో చూడాలనుకుంటారు. ఆ బలహీనతను సొమ్ము చేసుకోవటానికి ఆ రెండు మూడు రోజులూ కొన్ని సినిమాల రేట్లను నాలుగైదు రెట్లు పెంచేయటమేంటన్నది అభిమానుల ఆక్రోశం కూడా. కాకపోతే ఎలాగైనా ఆ రోజే చూడాలన్న ఉద్దేశంతో ఎక్కువ డబ్బులు పెట్టడానికి కూడా వెనకాడటం లేదు. కాబట్టే ఈ అధికారిక బ్లాక్‌ను నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు.. ఇలా ప్రాంతాల వారీగా టికెట్లకు ధరలు నిర్దేశించింది. ఇవి అన్ని సినిమాలకూ... అన్ని రోజులూ అమలవుతాయని స్పష్టం చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా దీన్ని సమర్థించిన నేపథ్యంలో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై కొత్త సినిమాలకు అదనపు బాదుడు ఉండదనేది పెద్ద ఉపశమనం కలిగించిందని వారి భావన. దీంతోపాటు ప్రతి సినిమా హాలు తగినంత పార్కింగ్ ప్రాంతాన్ని కేటాయించాలని, సహేతుక పార్కింగ్ ధరలను వసూలు చేయాలని, థియేటర్ క్యాంటీన్లలో విక్రయించే వస్తువులు కూడా వాటిపై ఉండే గరిష్ట చిల్లర ధరకు మించి విక్రయించకూడదని స్పష్టం చేసింది. వీటిని ఉల్లంఘిస్తే ఆయా థియేటర్ల యాజమాన్యాలే బాధ్యత వహించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment