సినిమా హాళ్లలో పెరుగుతున్న సందడి | Theaters to reopen in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

తెర..మెరుగు

Published Mon, Dec 28 2020 4:53 AM | Last Updated on Mon, Dec 28 2020 8:17 AM

Theaters to reopen in Andhra Pradesh - Sakshi

గుంటూరులోని ఓ థియేటర్‌లో కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా కూర్చొని సినిమా వీక్షిస్తున్న ప్రేక్షకులు

సాక్షి, నెట్‌వర్క్‌: కోవిడ్‌ కారణంగా దాదాపు ఎనిమిది నెలలకు పైగా ఇంటర్వెల్‌ ప్రకటించిన సినిమా హాళ్లు మెల్లగా తెరుచుకుంటున్నాయి. రాష్ట్రంలోని మూడు నాలుగు జిల్లాల్లో సగానికి పైగా థియేటర్లు తెరవగా... మిగిలిన జిల్లాల్లో కూడా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ రావటంతో... నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది.

దీంతో యాజమాన్యాలు ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ ఏర్పాటు చేస్లూ, భౌతికదూరం, మాస్కుల వంటి నిబంధనలు పాటిస్తూ థియేటర్లను తెరుస్తున్నారు. మొదట పాత సినిమాలతో వీటిని తెరవగా... తాజాగా కొత్త సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ప్రేక్షకుల సంఖ్య కూడా ఏరోజుకారోజు పెరుగుతూనే వస్తోంది. కొత్త సినిమా ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్లు హౌస్‌ఫుల్‌ కూడా కావడం గమనార్హం. సంక్రాంతికి మరిన్ని కొత్త సినిమాలు వస్తే ప్రేక్షకులు థియేటర్లకు పూర్తిస్థాయిలో వస్తారని, అప్పటికి థియేటర్లన్నీ తెరుచుకుంటాయని యజమానులు చెబుతున్నారు.  

కృష్ణా, నెల్లూరుల్లో సగానికి పైగానే..
కృష్ణా, గుంటూరు, నెల్లూరు, విశాఖ, వైఎస్సార్‌ జిల్లాలో పెద్ద సంఖ్యలో థియేటర్లు తెరుచుకున్నాయి. మిగతా జిల్లాల్లో ఇలా తెరచుకున్న థియేటర్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ ఇది రోజూ పెరుగుతూ ఉండటం సినీ రంగానికి ఊరటనిస్తోంది. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో సగానికిపైగానే థియేటర్లు తెరుచుకున్నాయి. కృష్ణాలో మొత్తం 126 థియేటర్లకు గాను 65, నెల్లూరులో 75కి గాను 38 తెరుచుకున్నాయి. ఇక గుంటూరులో 160 థియేటర్లకు గాను 60, వైఎస్సార్‌ జిల్లాలో 53కు గాను 24, విశాఖలో 82కు గాను 36 థియేటర్లలో సినిమా ప్రదర్శన మొదలైంది.  

కోవిడ్‌ నిబంధనల అమలు ఇలా...
► థియేటర్లతో పాటు, పరిసరాలనూ శుభ్రంగా ఉండేలా చూస్తున్నారు.

► టికెట్ల జారీలో ఆఫ్‌లైన్‌ కన్నా ఆన్‌లైన్‌ బుకింగ్‌కే ప్రాధాన్యమిస్తున్నారు.

► మాస్క్‌ను తప్పనిసరి చేశారు. లేనివారిని టిక్కెట్టున్నా అనుమతించడం లేదు.

► ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి.. టెంపరేచర్‌ ఎక్కువుంటే వెనక్కి పంపేస్తున్నారు.

► ఎక్కడికక్కడ శానిటైజర్లు అందుబాటులో ఉంచుతూ ప్రేక్షకులు వాడేలా చూస్తున్నారు.

► మధ్య సీటును వదిలేసి భౌతిక దూరం పాటిస్తున్నారు. బ్లాక్‌ చేసిన సీట్లకు స్టిక్కరింగ్‌ చేశారు.

షోల మధ్య విరామంలో అన్ని సీట్లను శానిటైజ్‌ చేయటంతో పాటు వాష్‌రూమ్‌లు, క్యాంటీన్‌ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

►ప్రేక్షకులు విధిగా సెల్‌ఫోన్‌లో ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, టిక్కెట్‌ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలని, మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని పేర్కొంటూ థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.


కోవిడ్‌ నిబంధనలన్నీ పాటిస్తున్నారు
గుంటూరులోని పల్లవి థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లా. థియేటర్‌లోకి వెళ్లే ముందే మాస్క్‌ ఉందా లేదా అనేది చూశారు. అనంతరం వారే శానిటైజర్‌ను చేతులపై వేస్తున్నారు. లోపల సీటు తరువాత సీటును కేటాయించారు. కోవిడ్‌ నిబంధనలన్నీ పాటిస్తున్నారు.
–– సీహెచ్‌ వంశీ, ప్రేక్షకుడు, గుంటూరు నగరం

ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది
ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నా. మాస్క్‌ లేకపోతే లోనికి అనుమతించడం లేదు. కొందరికి థియేటర్‌ నిర్వాహకులే మాస్క్‌లు పంపిణీ చేశారు. చాన్నాళ్ల తర్వాత థియేటర్‌లో సినిమా చూశా. థియేటర్లో చూస్తే ఆ ఎక్స్‌పీరియెన్స్‌ వేరు. టీవీలో అది రాదు.
– – హరినా«థ్, ప్రేక్షకుడు, కృష్ణనగర్, గుంటూరు

థియేటర్‌లో ఏర్పాట్లు బాగున్నాయి
చాలా రోజుల తర్వాత థియేటర్లు ప్రారంభించడంతో కొత్త సినిమా కాబటిట సోలో బతుకే సో బెటర్‌ సినిమాకు వెళ్లా. థియేటర్‌లో కోవిడ్‌ నిబంధనలు పాటించారు. సీట్ల మధ్య గ్యాప్‌ ఏర్పాటు చేశారు. థియేటర్‌ అవరణలో శానిటైజ్‌ చేస్తున్నారు. ఏర్పాట్లు బాగా ఉన్నాయి.
–– తాడి శివ, ప్రేక్షకుడు, విజయవాడ  

ఆ ఉల్లాసమే వేరు
చాలా కాలం తరువాత థియేటర్‌కు వెళ్లి ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమా చూశా. ఓటీటీల్లో కొత్త సినిమాలు వచ్చినా, స్నేహితులతో కలసి థియేటర్‌కు వెళ్లి చూడటం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. థియేటర్‌ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడొచ్చు.
– ధనబాబు, ప్రేక్షకుడు, మచిలీపట్నం

కొత్త సినిమాలు వస్తే ఊపిరి పీల్చుకుంటాం
ఇప్పుడిప్పుడే థియేటర్లు ఓపెన్‌ చేస్తున్నాం. సాధారణ పరిస్థితి రావాలంటే కొంత టైమ్‌ పడుతుంది. సంక్రాంతికి కొత్త సినిమాలు వచ్చాయంటే మేము కాస్త ఊపిరి పీల్చుకుంటాం.
– బాబు, థియేటర్‌ మేనేజర్, మదనపల్లె.

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నాం  
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం పట్టణంలో సినిమా థియేటర్లు ఇటీవలే ప్రారంభించాం. ప్రతి సీటు, ప్రతి షోకు శానిటైజ్‌ చేయటంతో పాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి మాస్క్‌ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నాం.  
– సీహెచ్‌.పెద్దబాబు,  సినిమా థియేటర్‌ నిర్వాహకుడు, మార్కాపురం, ప్రకాశం జిల్లా

కరోనా భయమైతే ఉంది
చాలా రోజుల తర్వాత థియేటర్‌లో సినిమా చూశా. ఒకవైపు సంతోషం, మరోవైపు కరోనా భయం కూడా ఉంది. థియేటర్లు, సీట్లను ఎప్పటికప్పుడు శానిటైజర్లతో శుభ్రం చేయిస్తే ప్రేక్షకులకు భయం తగ్గుతుంది.  
–ఇమ్రాన్, హిందూపురం, అనంతపురం జిల్లా

ప్రేక్షకులు రావడం సంతోషంగా ఉంది  
దాదాపు తొమ్మిది నెలల విరామం తర్వాత థియేటర్లు క్రమంగా తెరుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రధానంగా కార్మికులకు మళ్లీ ఉపాధి దొరుకుతోంది. ఉత్సాహంగా థియేటర్‌కు వస్తున్న ప్రేక్షకులు కూడా మాకు సహకరిస్తున్నారు.
– దేవళ్ల సూర్యనారాయణ (బుజ్జి), మారుతి థియేటర్‌ కా>ంట్రాక్టర్‌  


శ్రీకాకుళం జిల్లా పాలకొండ వెంకటగౌరి థియేటర్‌ వద్ద ప్రేక్షకులకు థర్మల్‌స్కాన్‌ చేస్తున్న సిబ్బంది


సినిమా థియేటర్‌ పరిసరాల్లో  కోవిడ్‌–19 నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచిస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement