స్టార్ హీరోల కటౌట్లతో కళకళలాడిన థియేటర్ అది వందల సినిమాలను చూపించిన తెర అది హౌస్‌ఫుల్ బోర్డ్‌తో ఆనందించిన స్క్రీన్ అది గల్లాపెట్టె గలగలు విన్న చోటు అది తెగిన టికెట్లు, విసిరిన పూలతో మురిసిన ప్రాంగణం అది కానీ ఇక ఇవేవీ కనబడవు. స్టార్ల కటౌట్ల స్థానంలో ఆఫర్ల హోర్డింగులు అగుపించనున్నాయి పెళ్లి భజంత్రీలు మోగనున్నాయి రెస్టారెంట్లు కనపడబోతున్నాయి. భాగ్యనగరంలో పలు సింగిల్ థియేటర్లు మూతపడబోతున్నాయి. కొన్నేళ్లుగా ‘సినిమా చూపిస్త మావా’ అంటూ కొన్ని వందల సినిమాలు చూపించాయి. ఇక ‘సినిమా చూపించలేం మావా’ అంటున్నాయి.
హైదరాబాద్‌లో ఫేమస్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కొన్ని మూతపడనున్నాయని తెలిసింది. హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్‌కు పాపులర్ జంక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా ఆడేదాన్ని బట్టి హిట్, ఫ్లాప్ డిసైడ్ చేయొచ్చు అంటారు సినిమా పండితులు. సంధ్య, సుదర్శన్, దేవి, శ్రీమయూరి, సప్తగిరి, ఉష మయూరి... ఈ ఏరియాలో చాలా ముఖ్యమైన థియేటర్లు. ఈ థియేటర్స్‌లో శ్రీ మయూరి 70 ఎంఎంని త్వరలోనే మూసేయాలనుకుంటున్నారట. అలానే హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ఉండే ఫేమస్ సింగిల్ స్క్రీన్లు కూడా మూతబడనున్నాయని తెలిసింది. టోలీచౌకి ఏరియాలోని ‘గెలాక్సీ’, నారాయణగూడలోని ‘శాంతి’ థియేటర్, బహదూర్‌పురలోని ‘శ్రీరామా’, మెహదీపట్నంలోని ‘అంబ’, సికింద్రాబాద్ ఏరియాలోని ‘టివోలీ’, ఎల్బీ నగర్‌లోని ‘సుష్మ’ థియేటర్స్ కూడా మూతపడనున్నాయని సమాచారం.
కరోనా వల్ల థియేటర్స్ పరిశ్రమకు పూర్తిస్థాయిలో దెబ్బ పడింది. ఎనిమిదిన్నర నెలలు అయింది థియేటర్స్‌లో బొమ్మ పడి... కౌంటర్ దగ్గర టికెట్స్ తెగి. అయితే ఇలా థియేటర్స్‌ను మూసివేయడం సినిమా ప్రేమికులకు పెద్ద దెబ్బే. కానీ కోవిడ్ కంటే ముందు నుంచి కూడా సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి బాలేదు. థియేటర్లు నిండకపోవడం, టికెట్ రేట్లు, రెంటల్ చార్జీలు, కరెంట్ బిల్లులు, యూఎఫ్‌ఓ (ప్రొజెక్టర్‌కి సంబంధించినవి) బిల్లులు.. ఈ లెక్కల్లో లాభం చూడటం గగనం అనే పరిస్థితులే థియేటర్లు మూసేద్దాం అనే నిర్ణయం వెనక బలమైన కారణం అని తెలిసింది.
కరోనా వల్ల పరిస్థితి ఇంకా దారుణం అయింది. సినిమా పరిశ్రమ కోలుకోవాలని ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా థియేటర్ల యాజమాన్యాలకు అనేక రాయితీలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రకటన తర్వాత సినిమాహాళ్లు త్వరలోనే తెరచుకుంటాయి అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇలా పలు థియేటర్లకు శాశ్వతంగా తాళాలు పడబోతున్నాయనేది ఆయా థియేటర్లలో సినిమాలు చూసి ఆనందించిన ప్రేక్షకులకు చేదు వార్తే. ఈ సింగిల్ స్క్రీన్స్‌ను ఫంక్షన్ హాలులా, సూపర్ మార్కెట్లలా, షాపింగ్ మాల్స్‌లా మార్చబోతున్నారని తెలిసింది.
అన్ని రాష్ట్రాలతో పోలిస్తే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ సంఖ్య చాలా ఎక్కువ. అలానే మన తెలుగులో విడుదలయ్యే సినిమాల సంఖ్య కూడా అంతే. మరి థియేటర్స్ ఒక్కొక్కటిగా మూతపడితే థియేటర్స్ సిస్టమ్ కచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టే. ఆల్రెడీ ఓటీటీ వర్సెస్ థియేటర్స్ డిబేట్ ఓవైపు నడుస్తూనే ఉంది. ప్రేక్షకుడిని థియేటర్స్‌వైపు వచ్చేలా చేస్తూనే, ఆల్రెడీ ఉన్న థియేటర్స్‌ను కమర్షియల్ స్పేస్‌లా మార్చేయకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. ఎందరో సూపర్‌స్టార్లు పుట్టిన సింగిల్ స్క్రీన్‌లు తన శోభ కోల్పోకూడదు.
థియేటర్లు మూతపడటానికి ప్రధాన కారణం గురించి థియేటర్ యాజమాన్యాల ప్రతినిధిగా సదానందం మాట్లాడుతూ – ‘‘లాభం లేకుండా ఏ వ్యాపారమూ చేయలేం. గవర్నమెంట్ నుండి మాకు రావాల్సిన రాయితీలు అన్నీ ఇచ్చామంటున్నారు. కానీ, పన్నెండేళ్లుగా రావాల్సిన థియేటర్ మెయింటినెన్స్ ఛార్జీలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇంతవరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. (ప్రతి సినిమా టిక్కెట్‌కు 3 రూపాయలు గవర్నమెంట్ చెల్లించాలి). అలాగే రెండేళ్లనుండి థియేటర్‌లో ఫ్రీ పార్కింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో పార్కింగ్‌కు డబ్బులు లేక థియేటర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దానికి తోడు కరోనా కారణంగా సినిమాల ప్రొడక్షన్ తగ్గటం వంటి ఎన్నో కారణాలతో ఈ థియేటర్లు మూతపడుతున్నాయి. ఈ థియేటర్లన్నీ ప్రైమ్ ఏరియాల్లో ఉండటంతో వాటిని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు ఉపయోగించుకునే ఆలోచనలతో యాజమాన్యాలు ఉన్నాయి’’ అన్నారు.
సినిమా చూపించలేం మావా!
Published Fri, Nov 27 2020 12:33 AM | Last Updated on Fri, Nov 27 2020 7:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment