CLOSES
-
అస్సాంలోని మదర్సాలన్నిటినీ మూసేస్తాం
బెళగావి: అస్సాంలోని అన్ని మదర్సా (ముస్లిం మత పాఠశాల)లను మూసి వేస్తామని ఆ రాష్ట్ర సీఎం హిమాంత బిశ్వ శర్మ తెలిపారు. ఆధునిక భారతదేశంలో మదర్సాల అవసరం అవసరం లేదని చెప్పారు. ‘దేశానికి, అస్సాం రాష్ట్రానికి సేవలు చేసేందుకు అవసరమైన డాక్టర్లు, ఇంజినీర్లు, ఇతర వృత్తి నిపుణులను తయారు చేసే స్కూళ్లు, కాలేజీలతో మాత్రమే అవసరం ఉంది. మదర్సాలతో కాదు’అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 600 మదర్సాలను మూసివేశాం, మిగతా వాటినీ మూసేస్తామని అన్నారు. కర్ణాటకలోని బెళగావిలో గురువారం రాత్రి జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిత్యం బంగ్లాదేశ్ నుంచి వస్తున్న జనంతో మన సంస్కృతి, ఆచారాలకు ముప్పు ఏర్పడిందన్నారు. ‘మన దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లమని గర్వంగా చెప్పుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ, హిందువును అని గర్వంగా చెప్పుకునే వారు కావాలి’అని హిమాంత చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చరిత్రను వక్రీకరించాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ను నయా మొఘలుల పార్టీగా అభివర్ణించారు. ఒకప్పుడు మొఘలులు భారత్‌ను బలహీనం చేసేందుకు ప్రయత్నించారు..కాంగ్రెస్ ఇప్పుడదే చేస్తోందన్నారు. -
‘డ్రై ఫ్రూట్స్’పై తాలిబన్ ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ నుంచి డ్రై ప్రూట్స్ సహా అనేక వస్తువులను భారత్‌తో పాటు అనేక దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో దేశంలో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఆఫ్గానిస్తాన్ సరిహద్దులను తాలిబన్లు మూసివే యడంతో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపో యాయి. ఈ ప్రభావం అన్నింటికంటే ఎక్కువగా భారత్‌లోని డ్రైప్రూట్స్ వ్యాపారంపై పడింది. కళ తప్పిన ఢిల్లీలోని కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్ ఏటా భారత్‌లో అమ్ముడవుతున్న డ్రై ప్రూట్స్‌లో 80% అఫ్గాన్ నుంచే దిగుమతి అవుతుంటాయి. ఇందులో ఎండుద్రాక్ష, బాదం, అంజీర్, వాల్నట్స్, పిస్తా, కాజు వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు అఫ్గానిస్తాన్ నుంచి మన దేశానికి సరుకు రాకపోవడంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. పది రోజుల వ్యవధిలోనే దేశంలోని అతిపెద్ద డ్రై ప్రూట్స్ హోల్‌సేల్ మార్కెట్ అయిన ఢిల్లీ చాందినీ చౌక్ కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్లో 30% నుంచి 40% వరకు ధరల్లో పెరుగుదల నమోదైందని వ్యాపారులు తెలిపారు. ఒక్కొక్క డ్రైఫ్రూట్ ధర కిలోకు రూ.100 నుంచి రూ.400 వరకు పెరిగాయి. 10 రోజుల్లో ఎంత మార్పు?: ఒకవైపు దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కావడం, మరోవైపు డ్రైఫ్రూట్స్ వినియోగంతో సాధారణ ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆరోగ్య నిఫుణులు తెలపడం కారణంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో వాటి వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు అఫ్గాన్ పరిణామాల నేపథ్యంలో ధరల పెరుగుదల తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని డ్రైఫ్రూట్స్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు చాందినీ చౌక్ కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్లో అడుగుపెట్టడానికి స్థలం ఉండని పరిస్థితి నుంచి నేడు చాలా తక్కువ మంది షాపింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాలకు ఈ హోల్‌సేల్ మార్కెట్ నుంచే డ్రైఫ్రూట్స్ సరఫరా అవుతుంటాయి. 10 రోజుల క్రితం వరకు కిలో రూ.700 చొప్పున అమ్ముడైన క్వాలిటీ బాదం ఇప్పుడు రూ.1000–1200కి అమ్ముడవుతోంది. అఫ్గానిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే అంజీర్ ధర గతంలో కిలోకు రూ.800–1000 వరకు ఉండగా, తాజా పరిణామాలతో ఒక్కసారిగా రూ.1100–1200 వరకు చేరింది. ప్రస్తుతానికి సరిపడ నిల్వలు బాదం, ఎండు ద్రాక్ష, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ఆశ్చర్యపోతున్నారని డ్రై ఫ్రూట్ రిటైల్ వ్యాపారి బల్వీర్ సింగ్ అన్నారు. అయితే ప్రస్తుతానికి తమ వద్ద నిల్వలు సరిపడా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ వ్యాపారులు తమ వద్ద ఉన్న పరిమిత స్టాక్ ధరను నెమ్మదిగా పెంచి విక్రయిస్తున్నారని, రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని వారు చెబుతున్నారని సింగ్ తెలిపారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరిన తర్వాత ధరల్లో స్థిరత్వం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపారుల ముందు జాగ్రత్త రానున్న రోజుల్లో దిగుమతులు జరగకపోవడం కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అనేకమంది వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకును నిల్వ చేయడం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో డ్రై ఫ్రూట్స్ ధరలు తాము ఏ రేటుకు పొందుతామనే భయం వ్యాపారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు తక్కువ ధరలో ఎందుకు విక్రయించాలని కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వం పరిష్కారం కనుక్కోవాలి రాబోయే కొద్ది రోజుల్లో అఫ్గానిస్తాన్ నుండి కొత్త సరుకు వస్తుందని డ్రైప్రూట్స్ వ్యాపారి గౌరవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. గతంలోనే తమకు రావాల్సిన స్టాక్‌కు సంబంధించిన అక్కడి వ్యాపారులకు ముందుగానే చెల్లించామని, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని గౌరవ్ తెలిపారు. అంతేగాక అఫ్గానిస్తాన్‌లోని వ్యాపారులతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదని, ఈ వ్యాపారంలో తమ కోట్లాది రూపాయలు ప్రమాదంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలని, లేకపోతే డ్రైఫ్రూట్స్ వ్యాపారులు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దేశంలో 80 శాతం డ్రై ఫ్రూట్స్ అఫ్గానిస్తాన్ నుంచి వచ్చినవే ఉంటాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ప్రస్తుత పరిణామాల ప్రభావం డ్రైఫ్రూట్స్ వ్యాపారాన్ని ప్రభావితం చేసిందని, దీని కారణంగా ధరలు పెరగడం సహజమని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కసరత్తు చేస్తోందని, త్వరలోనే పరిష్కారాన్ని కనుగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దుబాయ్ నుంచి డ్రైఫ్రూట్స్ ఉత్పత్తుల దిగుమతులకు ఎలాంటి ఆటంకాలు లేవన్నారు. -
సినిమా చూపించలేం మావా!
స్టార్ హీరోల కటౌట్లతో కళకళలాడిన థియేటర్ అది వందల సినిమాలను చూపించిన తెర అది హౌస్‌ఫుల్ బోర్డ్‌తో ఆనందించిన స్క్రీన్ అది గల్లాపెట్టె గలగలు విన్న చోటు అది తెగిన టికెట్లు, విసిరిన పూలతో మురిసిన ప్రాంగణం అది కానీ ఇక ఇవేవీ కనబడవు. స్టార్ల కటౌట్ల స్థానంలో ఆఫర్ల హోర్డింగులు అగుపించనున్నాయి పెళ్లి భజంత్రీలు మోగనున్నాయి రెస్టారెంట్లు కనపడబోతున్నాయి. భాగ్యనగరంలో పలు సింగిల్ థియేటర్లు మూతపడబోతున్నాయి. కొన్నేళ్లుగా ‘సినిమా చూపిస్త మావా’ అంటూ కొన్ని వందల సినిమాలు చూపించాయి. ఇక ‘సినిమా చూపించలేం మావా’ అంటున్నాయి. హైదరాబాద్‌లో ఫేమస్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కొన్ని మూతపడనున్నాయని తెలిసింది. హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్‌కు పాపులర్ జంక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా ఆడేదాన్ని బట్టి హిట్, ఫ్లాప్ డిసైడ్ చేయొచ్చు అంటారు సినిమా పండితులు. సంధ్య, సుదర్శన్, దేవి, శ్రీమయూరి, సప్తగిరి, ఉష మయూరి... ఈ ఏరియాలో చాలా ముఖ్యమైన థియేటర్లు. ఈ థియేటర్స్‌లో శ్రీ మయూరి 70 ఎంఎంని త్వరలోనే మూసేయాలనుకుంటున్నారట. అలానే హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ఉండే ఫేమస్ సింగిల్ స్క్రీన్లు కూడా మూతబడనున్నాయని తెలిసింది. టోలీచౌకి ఏరియాలోని ‘గెలాక్సీ’, నారాయణగూడలోని ‘శాంతి’ థియేటర్, బహదూర్‌పురలోని ‘శ్రీరామా’, మెహదీపట్నంలోని ‘అంబ’, సికింద్రాబాద్ ఏరియాలోని ‘టివోలీ’, ఎల్బీ నగర్‌లోని ‘సుష్మ’ థియేటర్స్ కూడా మూతపడనున్నాయని సమాచారం. కరోనా వల్ల థియేటర్స్ పరిశ్రమకు పూర్తిస్థాయిలో దెబ్బ పడింది. ఎనిమిదిన్నర నెలలు అయింది థియేటర్స్‌లో బొమ్మ పడి... కౌంటర్ దగ్గర టికెట్స్ తెగి. అయితే ఇలా థియేటర్స్‌ను మూసివేయడం సినిమా ప్రేమికులకు పెద్ద దెబ్బే. కానీ కోవిడ్ కంటే ముందు నుంచి కూడా సింగిల్ స్క్రీన్స్ పరిస్థితి బాలేదు. థియేటర్లు నిండకపోవడం, టికెట్ రేట్లు, రెంటల్ చార్జీలు, కరెంట్ బిల్లులు, యూఎఫ్ఓ (ప్రొజెక్టర్‌కి సంబంధించినవి) బిల్లులు.. ఈ లెక్కల్లో లాభం చూడటం గగనం అనే పరిస్థితులే థియేటర్లు మూసేద్దాం అనే నిర్ణయం వెనక బలమైన కారణం అని తెలిసింది. కరోనా వల్ల పరిస్థితి ఇంకా దారుణం అయింది. సినిమా పరిశ్రమ కోలుకోవాలని ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా థియేటర్ల యాజమాన్యాలకు అనేక రాయితీలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రకటన తర్వాత సినిమాహాళ్లు త్వరలోనే తెరచుకుంటాయి అని అందరూ అనుకుంటున్న సమయంలో ఇలా పలు థియేటర్లకు శాశ్వతంగా తాళాలు పడబోతున్నాయనేది ఆయా థియేటర్లలో సినిమాలు చూసి ఆనందించిన ప్రేక్షకులకు చేదు వార్తే. ఈ సింగిల్ స్క్రీన్స్‌ను ఫంక్షన్ హాలులా, సూపర్ మార్కెట్లలా, షాపింగ్ మాల్స్‌లా మార్చబోతున్నారని తెలిసింది. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ సంఖ్య చాలా ఎక్కువ. అలానే మన తెలుగులో విడుదలయ్యే సినిమాల సంఖ్య కూడా అంతే. మరి థియేటర్స్ ఒక్కొక్కటిగా మూతపడితే థియేటర్స్ సిస్టమ్ కచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టే. ఆల్రెడీ ఓటీటీ వర్సెస్ థియేటర్స్ డిబేట్ ఓవైపు నడుస్తూనే ఉంది. ప్రేక్షకుడిని థియేటర్స్‌వైపు వచ్చేలా చేస్తూనే, ఆల్రెడీ ఉన్న థియేటర్స్‌ను కమర్షియల్ స్పేస్లా మార్చేయకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. ఎందరో సూపర్స్టార్లు పుట్టిన సింగిల్ స్క్రీన్లు తన శోభ కోల్పోకూడదు. థియేటర్లు మూతపడటానికి ప్రధాన కారణం గురించి థియేటర్ యాజమాన్యాల ప్రతినిధిగా సదానందం మాట్లాడుతూ – ‘‘లాభం లేకుండా ఏ వ్యాపారమూ చేయలేం. గవర్నమెంట్ నుండి మాకు రావాల్సిన రాయితీలు అన్నీ ఇచ్చామంటున్నారు. కానీ, పన్నెండేళ్లుగా రావాల్సిన థియేటర్ మెయింటినెన్స్ ఛార్జీలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇంతవరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. (ప్రతి సినిమా టిక్కెట్‌కు 3 రూపాయలు గవర్నమెంట్ చెల్లించాలి). అలాగే రెండేళ్లనుండి థియేటర్లో ఫ్రీ పార్కింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో పార్కింగ్‌కు డబ్బులు లేక థియేటర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దానికి తోడు కరోనా కారణంగా సినిమాల ప్రొడక్షన్ తగ్గటం వంటి ఎన్నో కారణాలతో ఈ థియేటర్లు మూతపడుతున్నాయి. ఈ థియేటర్లన్నీ ప్రైమ్ ఏరియాల్లో ఉండటంతో వాటిని షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు ఉపయోగించుకునే ఆలోచనలతో యాజమాన్యాలు ఉన్నాయి’’ అన్నారు. -
పేమెంట్ బ్యాంకులు... ప్చ్!
ప్రజలందరికీ మరింతగా ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పేమెంట్స్ బ్యాంకుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారుతోంది. లా¿¶ సాటైన వ్యాపార విధానం లేకపోవడంతో కార్యకలాపాలు ప్రారంభించిన కొన్నాళ్లకే కొన్ని మూతబడగా, అసలు మొదలుపెట్టకుండానే మరికొన్ని వైదొలుగుతున్నాయి. వొడాఫోన్ ఎం–పెసా ఈ నెల తొలినాళ్లలోనే కార్యకలాపాలు నిలిపివేసినట్లు సమాచారం. తాజాగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ (ఏబీఐపీబీ) ఈ ఏడాది అక్టోబర్ నుంచి కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించింది. వ్యాపార పరిస్థితుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల వ్యాపార విధానం లాభదాయకత దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. 2018 ఫిబ్రవరిలో ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఏబీఐపీబీలో దాదాపు 20 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. సుమారు 200 మంది పైగా సిబ్బంది ఉన్నారు. ఏబీఐపీబీ మూసివేతతో వీరిని గ్రూప్‌లోని ఇతర సంస్థలకు బదిలీ చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిపాజిట్ల గురించి ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విత్‌డ్రా చేసుకునేందుకు తగినంత సమయం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు ఇందులో 51 శాతం, వొడాఫోన్ ఐడియాకు 49 శాతం వాటాలు ఉన్నాయి. 2017–18లో ఏబీఐపీబీ రూ. 24 కోట్ల నష్టం నమోదు చేసింది. 11 బ్యాంకులకు లైసెన్సులు.. 2015లో 11 సంస్థలకు ఆర్బీఐ పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులు ఇచ్చింది. అయితే, టెక్ మహీంద్రా, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీతో పాటు కన్సార్షియంగా ఏర్పడిన దిలీప్ సంఘ్వీ, ఐడీఎఫ్సీ బ్యాంక్, టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు పేమెంట్స్ బ్యాంక్ ప్రతిపాదనలను పక్కన పెట్టాయి. సూత్రప్రాయంగా పొందిన లైసెన్సులను తిరిగిచ్చేశాయి. ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులు పూర్తి స్థాయి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటితో పోలిస్తే ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు పరిమిత స్థాయిలో ఉన్నాయి. 2018 మే ఆఖరు నాటికి దేశీయంగా పేమెంట్స్ బ్యాంకుల్లో రూ. 540 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అత్యధికంగా రూ. 307 కోట్లు, పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో రూ. 194 కోట్లు, ఫినోలో రూ. 37 కోట్లు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో రూ. 1.39 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. కఠినతరమైన నిబంధనలతో కష్టాలు.. ఇటు డిపాజిట్ల సమీకరణపరంగానూ అటు రుణాల వితరణలోనూ కష్టతరమైన నిబంధనలు పాటించాల్సి వస్తుండటమే పేమెంట్స్ బ్యాంకులు విఫలమవుతుండటానికి కారణాలుగా ఉంటున్నాయి. పేమెంట్ బ్యాంకులు ఒక్కో ఖాతాదారు నుంచి రూ. 1 లక్షకు మించి డిపాజిట్లు సేకరించడానికి లేదు. రుణాలివ్వడానికి లేదు. కానీ సేకరించిన నిధుల్లో 75 శాతాన్ని ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రుణాలపరమైన రిస్కులు పెద్దగా లేకపోయినప్పటికీ 15 శాతం మేర మూలధనం నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సి వస్తోంది. ఇక ప్రతీ వివరాన్నీ నియంత్రణ సంస్థకు తెలియజేయాలన్న మరో నిబంధన కూడా సమస్యగా ఉంటోంది. పేమెంట్ బ్యాంకులు వైవిధ్యమైన సేవలు అందించేందుకు ఎక్కువగా టెక్నాలజీపైనే ఆధారపడుతున్నాయి. అయితే, వివరాల వెల్లడి నిబంధనల వల్ల మొత్తం వ్యాపార ప్రణాళికను బైటపెట్టినట్లవుతుందని, ఫలితంగా పోటీ సంస్థలకు తమ వ్యాపార రహస్యాలను చేజేతులా అందించినట్లవుతుందని అవి ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అవి పూర్తి స్థాయి బ్యాంకులకు ఎప్పటికీ నిజమైన పోటీదారుగా నిలిచే పరిస్థితులు లేవని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఖాతాదారుల వివరాల ్ర«ధువీకరణ కోసం ఆధార్ ఆధారిత ప్రక్రియను పేమెంట్స్ బ్యాంకులకు కూడా అందుబాటులోకి తెస్తే .. కేవైసీ నిబంధన పాటింపు వ్యయాలు తగ్గుతాయని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. అలాగే వివిధ సాధనాలను విక్రయించేందుకు థర్డ్ పార్టీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా పేమెంట్స్ బ్యాంకులకు వెసులుబాటు కల్పించాలని తెలిపింది. ఇలాంటి విధానాలతో పేమెంట్స్ బ్యాంకులు విజయవంతం కాగలవని పేర్కొంది. అనిశ్చితిలో బ్యాంకుల భవిష్యత్..: ఎస్బీఐ నివేదిక పేమెంట్స్ బ్యాంకుల భవిష్యత్ అనిశ్చితిలో ఉందని, అవి సమర్ధంగా పనిచేయాలంటే నియంత్రణ సంస్థ తోడ్పాటు తప్పనిసరని ఎస్బీఐ ఒక నివేదికలో వెల్లడించింది. ‘పేమెంట్ బ్యాంక్‌ల భవిష్యత్ అనిశ్చితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, నియంత్రణ సంస్థ, ప్రభుత్వ తోడ్పాటుతో వీటి వ్యాపారం క్రమంగా విస్తరించి, వృద్ధి చెందే అవకాశం ఉంది‘ అని పేర్కొంది. నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో పేమెంట్స్ బ్యాంక్ విధాన ం విఫలమైనట్లుగానే కనిపిస్తోందని వివరించింది. 11 సంస్థలు లైసెన్సులు పొందినప్పటికీ నాలుగు సంస్థలు మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించడం అవి కూడా మనుగడ సాగించలేని పరిస్థితులు నెలకొనడం ఇందుకు నిదర్శనమని పేర్కొంది. -
మార్కెట్ల జోరు:10800కిపైన నిఫ్టీ
సాక్షి, ముంబై: వారం చివరలో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 290 పాయింట్లు ఎగిసి 35,535 వద్ద,నిఫ్టీ పాయింట్లు 9010,806 లాభపడి వద్ద స్థిరంగా ముగిశాయి. ముఖ్యంగా నిఫ్టీ 10800స్థాయికిపైన ముగిసింది. ఒక దశలో 300 పాయింట్లకుపైగా పుంజుకుంది. ఆరంభంనుంచి ఉత్సాహంగాఉన్న సూచీలు ట్రేడింగ్ ఆఖరు గంటలో మరింత పుంజుకున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే ముగిశాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ప్రయివేట్ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ , ఐటీ, ఇతర స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్ల ర్యాలీ మార్కెట్లకు ఊతమిచ్చాయి. టెలికాం, ఫార్మ సెక్టార్ భారీగా నష్టపోగా , రియల్టీ స్వల్పంగా నష్టపోయింది. రిలయన్స్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, జిందాల్ స్టీల్, హింద్ కాపర్, టాటా స్టీల్, వేదాంతా, సెయిల్, నాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్,ఐషర్ మోటార్స్ ఇన్ఫోసిస్, టీసీఎస్ హెచ్‌సీఎల్ లాభపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్సర్వ్, యూపీఎల్ లాంటి షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. అయితే జియో దెబ్బతో ఎయిర్టెల్, ఆర్‌కాం, ఐడియా, పీసీ జ్యుయలరీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అటు ఫారెక్స్ మార్కెట్లు రూపాయి నష్టాలనుంచి తేరుకుంది. డాలరు మారకంలో 0.04 పైసల లాభంతో 67.28 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పుత్తడి కూడా రూ.121 పుంజుకుని పది గ్రా. 31,486 వద్ద ఉంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలోనే నష్టాలను చవిసూచిన మార్కెట్లు చివరికి సెన్సెక్స్124 పాయింట్ల నష్టంతో 30, 834 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో 9491 వద్ద ముగిశాయి. గడచిని మూడు సెషన్లుగా నెలకొన్ని సెల్లింగ్ ప్రెజర్ కారణంగా సెన్సెక్స్, నిఫ్టీ సాంకేతిక స్థాయిలకు దిగువనే ముగిశాయి. ముఖ్యంగా 2017 లో మొదటిసారిగా నిఫ్టీ వరసగా ఆరవ సెషన్లో కూడా నష్టాలనే ఎదుర్కొంది. మెటల్ సెక్టార్లాభపడగా, ఎనర్జీ, మీడియా,బ్యాంకింగ్ సెక్టార్ నష్టపోయాయి. ఆర్ఐఎల్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ, జీ, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, స్టేట్‌బ్యాంక్, ఐటీసీ నష్టపోగా, టెక్‌మహీంద్రా, యస్‌బ్యాంక్, అంబుజా, టాటా స్టీల్, వేదాంతా, ఎయిర్టెల్, అల్ట్రాటెక్, ఐషర్, ఇన్ఫ్రాటెల్, ఎన్టీపీసీ లాభపడ్డాయి. అటు డాలర్ మారకంలో రుపాయి 0.07 పైసల నష్టంతో 64.61 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పదిగ్రా. రూ. 143 ఎగిసి రూ. 28, 696 వద్ద ఉంది. -
ఎన్నాళ్లీ ఎక్కిళ్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తప్పేట్టు లేదు. కాలువలకు నీటి విడుదల గడువు పొడిగించినా జిల్లాలోని అన్ని చెరువులు పూర్తిగా నిండలేదు. ఫలితంగా ఈ వేసవిలో నీటి అవసరాలు తీరే అవకాశం కనిపించటం లేదు. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు మండిపోతుండటంతో నీరు భారీగా ఆవిరయ్యే పరిస్థితి ఉంది. దీనికి తోడు వాడకం కూడా పెరుగుతుంది. బుధవారం నుంచి కాలువలు మూసివేస్తున్నారు. 45 రోజులపాటు కాలువలకు నీటి సరఫరా ఉండదు. ఈ దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. డెల్టా ప్రాంతంలో 441 మంచినీటి చెరువులు ఉండగా.. అందులో 426 చెరువుల్ని నింపామని, మిగిలిన చెరువుల్లోనూ నీరు నింపేందుకు చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. అయితే చాలా చెరువుల్లో 70 నుంచి 80 శాతం వరకే నీరు నిండింది. మరోవైపు గ్రామాల్లోని జనాభాతో పోలిస్తే చెరువులు తక్కువ సామర్థ్యంతో ఉండటంతో 45 రోజులపాటు నీటిని అందించే పరిస్థితి లేకుండాపోతోంది. కాలుష్యం కాటు చెరువులు పూర్తిగా నిండకపోవడం ఒక సమస్య అయితే.. చాలాచోట్ల నీరు కలుషితమై రంగు మారుతోంది. ఉంగుటూరులో చెరువులో నీరు నిండుగా ఉన్నా రంగు మారిందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో చెరువులు అపరిశుభ్రంగా ఉన్నాయి. చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. చెరువుల్ని ఆరబెట్టకుండా నీటితో నింపారు. ఫలితంగా జలాలు కలుషితమవుతున్నాయి. నీళ్లు పసర్లెక్కి చెత్తా చెదారంతో నిండుతున్నాయి. గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ పూర్తిగా పాడైపోయాయి. అందువల్ల నీటిని ఫిల్టర్ చేయకుండా నేరుగా సరఫరా చేస్తున్నారు. పోడూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో నీటికొరతను ఎదుర్కొనేందుకు వేసవిలో ఒక్కపూట మాత్రమే కుళాయిల ద్వారా నీరు సరఫరా చేసేవారు. ఈ వేసవిలోనూ అదే పరిస్థితి తలెత్తేలా ఉంది. ఆచంట ప్రాంతంలో వేసవికి ముందే తాగునీటి ఎద్దడి తలెత్తింది. ఆచంట, పెనుమంచిలి, ఎ.వేమవరం, శేషమ్మచెరువు గ్రామాలకే తాగునీరు సరఫరా చేస్తున్నారు. అదికూడా కలుషితం కావడంతో వాడకానికి మాత్రమే వినియోగిస్తున్నారు. గోదావరి తీరం వెంబడి ఉన్న పెదమల్లం, కోడేరు, కరుగోరుమిల్లి, భీమలాపురం గ్రామాల్లో బోర్లు పడని పరిస్థితి. ఫలితంగా ఆ గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడంతో బోర్లు పని చేయడం లేదు. ప్రైవేటు వాటర్ ప్లాంట్ల నుంచి మంచినీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కొల్లేరు గ్రామాల్లోని చెరువుల్లో నింపిన నీరు 15 నుంచి 20 రోజులకే రంగు మారుతుండటంతో అధికారులు తలలు బాదుకుంటున్నారు. గుండుగొలను సమగ్ర మంచినీటి పథకం ద్వారా 20 వేల మందికి మంచినీటిని సరఫరా చేయాల్సి ఉండగా కొల్లేరు శివారున ఉన్న చెట్టున్నపాడు, మల్లవరం గ్రామాలకు నేటికి నీరు చేరడం లేదు. కొంతకాలం క్రితం పైపులైన్ ధ్వంసం కావడంతో కోరుకల్లుకు నీరందటం లేదు. భీమవరం మండలం యనమదుర్రు, దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, తుందుర్రు, చినఅమిరం, కొమరాడ, దెయ్యాలతిప్ప, నాగిడిపాలెం, లోసరి తదితర 25 గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువుల్లో నీళ్లు నింపినా వారం రోజులకే ఇంకిపోతోంది. గ్రామాల్లో జనాభాకు సరిపడా విస్తీర్ణంలో రక్షిత మంచినీటి చెరువులు లేకపోవడంతో ఏటా వేసవిలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెడితేనే నీటిఎద్దడి నుంచి గ్రామీణ ప్రజలు బయటపడే అవకాశం ఉంటుంది. -
17 నెలల గరిష్టానికి ఆయిల్ ధరలు
న్యూయార్క్ : ఆయిల్ ఉత్పత్తి కోత, లిబియా, అమెరికానుంచి ఎగుమతులుపెరగనున్నాయనే అంచనాల నేపథ్యంలో ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో 17 నెలల గరిష్టానికి చేరాయి. శుక్రవారం లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.2 శాతం పెరిగి 55.16 డాలర్ల వద్ద ముగిసింది. ఈ బాటలో న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ బ్యారల్ కూడా 0.13 శాతం బలపడి 53.02 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇది 17 నెలల గరిష్టంకాగా, ఇంతక్రితం 2016 జూలైలో మాత్రమే చమురు ధరలు ఈ స్థాయిలో ట్రేడయ్యాయి. సరఫరా మరియు డిమాండ్ చుట్టూ చాలా అంశాలు పనిచేస్తున్నాయని అప్రమత్తంగా ఉండాలని యూరోపియన్ పరిశోధన డైరెక్టర్ , సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ లిమిటెడ్ క్రిస్టియన్ షుల్జ్ ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ,సరఫరా లో బ్యాలెన్స్ తప్పినపుడు ధరల పెరుగుదల సాధారణమని వ్యాఖ్యానించారు. లిబియన్ రీబౌండ్ లిబియాలో గత నెల కేవలం 600,000 బారెల్స్ గా చమురు ఉత్పత్తి పుంజుకుందని సరఫరా, బ్లూమ్‌బెర్గ్ అంచనాలు చూపిస్తున్నాయి. నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తఫా సానల్లా ప్రకారం,2017 ప్రారంభంనాటికి ఒక రోజుకు 900,000 బారెల్స్, తదుపరి సంవత్సరం చివరి నాటికి 1.2 మిలియన్ బ్యారెల్స్ స్థాయికి ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. కాగా పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఎనిమిది సంవత్సరాలలో మొదటిసారి ఉత్పత్తి అరికట్టేందుకు గత నెల అంగీకరించింది. వియత్నాంలో నిర్వహించిన సమావేశంలో రష్యాతదితర నాన్‌ఒపెక్ దేశాలతో సౌదీ అరేబియా అధ్యక్షతన ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోత విధించేందుకు ఒక అంగీకారానికి వచ్చాయి. 2017 జనవరి 1 నుంచి సంయుక్తంగా రోజుకి 18 లక్షల బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోత విధించేందుకు నిర్ణయించాయి. దీంతో ఇటీవల చమురు ధరలు జోరందుకున్న సంగతి తెలిసిందే. -
ఆ ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ మూతపడింది
-
ఆ ప్రతిష్టాత్మక బ్రిడ్జ్ మూతపడింది
బీజింగ్ : చైనాలోని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ మూత పడింది. ఆగస్టు 22న ప్రారంభమైన గ్లాస్ వంతెనను కేవలం 13రోజుల్లో మూసివేశారు. మెయింటినెన్స్ కారణాల రీత్యా మూసివేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అత్యవసరంగా నిర్వహించాల్సిన మెయిన్టెనెన్స్ పనుల కోసం బ్రిడ్జ్‌ను మూసివేస్తున్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. పునః ప్రారంభ సమయాన్ని మళ్లీ ప్రకటిస్తామని అధికారులు ప్రకటించారు. హునన్ ప్రావిన్స్‌లో రెండు కొండల మధ్య ఉన్న ఈ అతి ఎత్తైన, అతి పొడువైన గ్లాస్ బ్రిడ్జ్ (430 మీ. పొడవు) ప్రపంచంలో అతి పెద్ద గాజు వంతెనగా పేరొంది. బ్రిడ్జ్‌ను ప్రారంభించిన తర్వాత టూరిస్టుల తాకిడి మరింత పెరగడంతో ఈ నిర్ణయ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి రోజు 8 వేల మంది టూరిస్టులను తట్టుకునే శక్తి బ్రిడ్జ్‌కు ఉంది. కానీ రికార్డు స్థాయిలో అత్యధిక సంఖ్యలో సుమారు 10 రెట్ల పర్యాటకుల తాకిడి పెరగడంతో తక్షణమే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 'తాము ప్రతిదీ బుక్ చేసుకున్నామని, ఇప్పుడు మూసివేశామంటున్నారు. ..తమాషా చేస్తున్నారా? తదితర కమెంట్లు వెల్లువెత్తాయి.