ఎన్నాళ్లీ ఎక్కిళ్లు
Published Wed, Apr 19 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తప్పేట్టు లేదు. కాలువలకు నీటి విడుదల గడువు పొడిగించినా జిల్లాలోని అన్ని చెరువులు పూర్తిగా నిండలేదు. ఫలితంగా ఈ వేసవిలో నీటి అవసరాలు తీరే అవకాశం కనిపించటం లేదు. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు మండిపోతుండటంతో నీరు భారీగా ఆవిరయ్యే పరిస్థితి ఉంది. దీనికి తోడు వాడకం కూడా పెరుగుతుంది. బుధవారం నుంచి కాలువలు మూసివేస్తున్నారు. 45 రోజులపాటు కాలువలకు నీటి సరఫరా ఉండదు. ఈ దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. డెల్టా ప్రాంతంలో 441 మంచినీటి చెరువులు ఉండగా.. అందులో 426 చెరువుల్ని నింపామని, మిగిలిన చెరువుల్లోనూ నీరు నింపేందుకు చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. అయితే చాలా చెరువుల్లో 70 నుంచి 80 శాతం వరకే నీరు నిండింది. మరోవైపు గ్రామాల్లోని జనాభాతో పోలిస్తే చెరువులు తక్కువ సామర్థ్యంతో ఉండటంతో 45 రోజులపాటు నీటిని అందించే పరిస్థితి లేకుండాపోతోంది.
కాలుష్యం కాటు
చెరువులు పూర్తిగా నిండకపోవడం ఒక సమస్య అయితే.. చాలాచోట్ల నీరు కలుషితమై రంగు మారుతోంది. ఉంగుటూరులో చెరువులో నీరు నిండుగా ఉన్నా రంగు మారిందని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో చెరువులు అపరిశుభ్రంగా ఉన్నాయి. చాలాచోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. చెరువుల్ని ఆరబెట్టకుండా నీటితో నింపారు. ఫలితంగా జలాలు కలుషితమవుతున్నాయి. నీళ్లు పసర్లెక్కి చెత్తా చెదారంతో నిండుతున్నాయి. గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ పూర్తిగా పాడైపోయాయి. అందువల్ల నీటిని ఫిల్టర్ చేయకుండా నేరుగా సరఫరా చేస్తున్నారు. పోడూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో నీటికొరతను ఎదుర్కొనేందుకు వేసవిలో ఒక్కపూట మాత్రమే కుళాయిల ద్వారా నీరు సరఫరా చేసేవారు. ఈ వేసవిలోనూ అదే పరిస్థితి తలెత్తేలా ఉంది. ఆచంట ప్రాంతంలో వేసవికి ముందే తాగునీటి ఎద్దడి తలెత్తింది. ఆచంట, పెనుమంచిలి, ఎ.వేమవరం, శేషమ్మచెరువు గ్రామాలకే తాగునీరు సరఫరా చేస్తున్నారు.
అదికూడా కలుషితం కావడంతో వాడకానికి మాత్రమే వినియోగిస్తున్నారు. గోదావరి తీరం వెంబడి ఉన్న పెదమల్లం, కోడేరు, కరుగోరుమిల్లి, భీమలాపురం గ్రామాల్లో బోర్లు పడని పరిస్థితి. ఫలితంగా ఆ గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవడంతో బోర్లు పని చేయడం లేదు. ప్రైవేటు వాటర్ ప్లాంట్ల నుంచి మంచినీళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కొల్లేరు గ్రామాల్లోని చెరువుల్లో నింపిన నీరు 15 నుంచి 20 రోజులకే రంగు మారుతుండటంతో అధికారులు తలలు బాదుకుంటున్నారు. గుండుగొలను సమగ్ర మంచినీటి పథకం ద్వారా 20 వేల మందికి మంచినీటిని సరఫరా చేయాల్సి ఉండగా కొల్లేరు శివారున ఉన్న చెట్టున్నపాడు, మల్లవరం గ్రామాలకు నేటికి నీరు చేరడం లేదు. కొంతకాలం క్రితం పైపులైన్ ధ్వంసం కావడంతో కోరుకల్లుకు నీరందటం లేదు. భీమవరం మండలం యనమదుర్రు, దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, తుందుర్రు, చినఅమిరం, కొమరాడ, దెయ్యాలతిప్ప, నాగిడిపాలెం, లోసరి తదితర 25 గ్రామాల్లో రక్షిత మంచినీటి చెరువుల్లో నీళ్లు నింపినా వారం రోజులకే ఇంకిపోతోంది. గ్రామాల్లో జనాభాకు సరిపడా విస్తీర్ణంలో రక్షిత మంచినీటి చెరువులు లేకపోవడంతో ఏటా వేసవిలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెడితేనే నీటిఎద్దడి నుంచి గ్రామీణ ప్రజలు బయటపడే అవకాశం ఉంటుంది.
Advertisement
Advertisement