పేమెంట్‌ బ్యాంకులు... ప్చ్‌! | Aditya Birla Idea Payments Bank to Close Operations | Sakshi
Sakshi News home page

పేమెంట్‌ బ్యాంకులు... ప్చ్‌!

Published Tue, Jul 23 2019 5:47 AM | Last Updated on Tue, Jul 23 2019 5:47 AM

Aditya Birla Idea Payments Bank to Close Operations - Sakshi

ప్రజలందరికీ మరింతగా ఆర్థిక సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పేమెంట్స్‌ బ్యాంకుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారుతోంది. లా¿¶ సాటైన వ్యాపార విధానం లేకపోవడంతో కార్యకలాపాలు ప్రారంభించిన కొన్నాళ్లకే కొన్ని మూతబడగా, అసలు మొదలుపెట్టకుండానే మరికొన్ని వైదొలుగుతున్నాయి. వొడాఫోన్‌ ఎం–పెసా ఈ నెల తొలినాళ్లలోనే కార్యకలాపాలు నిలిపివేసినట్లు సమాచారం. తాజాగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఏబీఐపీబీ) ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించింది.

వ్యాపార పరిస్థితుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల వ్యాపార విధానం లాభదాయకత దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. 2018 ఫిబ్రవరిలో ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. ఏబీఐపీబీలో దాదాపు 20 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. సుమారు 200 మంది పైగా సిబ్బంది ఉన్నారు. ఏబీఐపీబీ మూసివేతతో వీరిని గ్రూప్‌లోని ఇతర సంస్థలకు బదిలీ చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిపాజిట్ల గురించి ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విత్‌డ్రా చేసుకునేందుకు తగినంత సమయం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నాయి. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌కు ఇందులో 51 శాతం, వొడాఫోన్‌ ఐడియాకు 49 శాతం వాటాలు ఉన్నాయి. 2017–18లో ఏబీఐపీబీ రూ. 24 కోట్ల నష్టం నమోదు చేసింది.  

11 బ్యాంకులకు లైసెన్సులు..
2015లో 11 సంస్థలకు ఆర్‌బీఐ పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్సులు ఇచ్చింది. అయితే, టెక్‌ మహీంద్రా, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీతో పాటు కన్సార్షియంగా ఏర్పడిన దిలీప్‌ సంఘ్వీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, టెలినార్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థలు పేమెంట్స్‌ బ్యాంక్‌ ప్రతిపాదనలను పక్కన పెట్టాయి. సూత్రప్రాయంగా పొందిన లైసెన్సులను తిరిగిచ్చేశాయి. ఫినో పేమెంట్స్‌ బ్యాంక్, ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకులు పూర్తి స్థాయి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటితో పోలిస్తే ఎన్‌ఎస్‌డీఎల్‌ పేమెంట్స్‌ బ్యాంక్, జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు పరిమిత స్థాయిలో ఉన్నాయి. 2018 మే ఆఖరు నాటికి దేశీయంగా పేమెంట్స్‌ బ్యాంకుల్లో రూ. 540 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో అత్యధికంగా రూ. 307 కోట్లు, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకులో రూ. 194 కోట్లు, ఫినోలో రూ. 37 కోట్లు, ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో రూ. 1.39 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.  

కఠినతరమైన నిబంధనలతో కష్టాలు..  
ఇటు డిపాజిట్ల సమీకరణపరంగానూ అటు రుణాల వితరణలోనూ కష్టతరమైన నిబంధనలు పాటించాల్సి వస్తుండటమే పేమెంట్స్‌ బ్యాంకులు విఫలమవుతుండటానికి కారణాలుగా ఉంటున్నాయి. పేమెంట్‌ బ్యాంకులు ఒక్కో ఖాతాదారు నుంచి రూ. 1 లక్షకు మించి డిపాజిట్లు సేకరించడానికి లేదు. రుణాలివ్వడానికి లేదు. కానీ సేకరించిన నిధుల్లో 75 శాతాన్ని ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. రుణాలపరమైన రిస్కులు పెద్దగా లేకపోయినప్పటికీ 15 శాతం మేర మూలధనం నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సి వస్తోంది. ఇక ప్రతీ వివరాన్నీ నియంత్రణ సంస్థకు తెలియజేయాలన్న మరో నిబంధన కూడా సమస్యగా ఉంటోంది. పేమెంట్‌ బ్యాంకులు వైవిధ్యమైన సేవలు అందించేందుకు ఎక్కువగా టెక్నాలజీపైనే ఆధారపడుతున్నాయి.

అయితే, వివరాల వెల్లడి నిబంధనల వల్ల మొత్తం వ్యాపార ప్రణాళికను బైటపెట్టినట్లవుతుందని, ఫలితంగా పోటీ సంస్థలకు తమ వ్యాపార రహస్యాలను చేజేతులా అందించినట్లవుతుందని అవి ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అవి పూర్తి స్థాయి బ్యాంకులకు ఎప్పటికీ నిజమైన పోటీదారుగా నిలిచే పరిస్థితులు లేవని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఖాతాదారుల వివరాల ్ర«ధువీకరణ కోసం ఆధార్‌ ఆధారిత ప్రక్రియను పేమెంట్స్‌ బ్యాంకులకు కూడా అందుబాటులోకి తెస్తే .. కేవైసీ నిబంధన పాటింపు వ్యయాలు తగ్గుతాయని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. అలాగే వివిధ సాధనాలను విక్రయించేందుకు థర్డ్‌ పార్టీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా పేమెంట్స్‌ బ్యాంకులకు వెసులుబాటు కల్పించాలని తెలిపింది. ఇలాంటి విధానాలతో పేమెంట్స్‌ బ్యాంకులు విజయవంతం కాగలవని పేర్కొంది.

అనిశ్చితిలో బ్యాంకుల భవిష్యత్‌..: ఎస్‌బీఐ నివేదిక
పేమెంట్స్‌ బ్యాంకుల భవిష్యత్‌ అనిశ్చితిలో ఉందని, అవి సమర్ధంగా పనిచేయాలంటే నియంత్రణ సంస్థ తోడ్పాటు తప్పనిసరని ఎస్‌బీఐ ఒక నివేదికలో వెల్లడించింది. ‘పేమెంట్‌ బ్యాంక్‌ల భవిష్యత్‌ అనిశ్చితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, నియంత్రణ సంస్థ, ప్రభుత్వ తోడ్పాటుతో వీటి వ్యాపారం క్రమంగా విస్తరించి, వృద్ధి చెందే అవకాశం ఉంది‘ అని పేర్కొంది. నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో పేమెంట్స్‌ బ్యాంక్‌ విధాన ం విఫలమైనట్లుగానే కనిపిస్తోందని వివరించింది. 11 సంస్థలు లైసెన్సులు పొందినప్పటికీ నాలుగు సంస్థలు మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించడం అవి కూడా మనుగడ సాగించలేని పరిస్థితులు నెలకొనడం ఇందుకు నిదర్శనమని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement