
సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ నుంచి డ్రై ప్రూట్స్ సహా అనేక వస్తువులను భారత్‌తో పాటు అనేక దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో దేశంలో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఆఫ్గానిస్తాన్ సరిహద్దులను తాలిబన్లు మూసివే యడంతో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపో యాయి. ఈ ప్రభావం అన్నింటికంటే ఎక్కువగా భారత్‌లోని డ్రైప్రూట్స్ వ్యాపారంపై పడింది.
కళ తప్పిన ఢిల్లీలోని కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్
ఏటా భారత్‌లో అమ్ముడవుతున్న డ్రై ప్రూట్స్‌లో 80% అఫ్గాన్ నుంచే దిగుమతి అవుతుంటాయి. ఇందులో ఎండుద్రాక్ష, బాదం, అంజీర్, వాల్‌నట్స్, పిస్తా, కాజు వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు అఫ్గానిస్తాన్ నుంచి మన దేశానికి సరుకు రాకపోవడంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. పది రోజుల వ్యవధిలోనే దేశంలోని అతిపెద్ద డ్రై ప్రూట్స్ హోల్‌సేల్ మార్కెట్ అయిన ఢిల్లీ చాందినీ చౌక్ కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్‌లో 30% నుంచి 40% వరకు ధరల్లో పెరుగుదల నమోదైందని వ్యాపారులు తెలిపారు. ఒక్కొక్క డ్రైఫ్రూట్ ధర కిలోకు రూ.100 నుంచి రూ.400 వరకు పెరిగాయి.
10 రోజుల్లో ఎంత మార్పు?:
ఒకవైపు దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కావడం, మరోవైపు డ్రైఫ్రూట్స్ వినియోగంతో సాధారణ ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆరోగ్య నిఫుణులు తెలపడం కారణంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో వాటి వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు అఫ్గాన్ పరిణామాల నేపథ్యంలో ధరల పెరుగుదల తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని డ్రైఫ్రూట్స్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు చాందినీ చౌక్ కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్‌లో అడుగుపెట్టడానికి స్థలం ఉండని పరిస్థితి నుంచి నేడు చాలా తక్కువ మంది షాపింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాలకు ఈ హోల్‌సేల్ మార్కెట్ నుంచే డ్రైఫ్రూట్స్ సరఫరా అవుతుంటాయి. 10 రోజుల క్రితం వరకు కిలో రూ.700 చొప్పున అమ్ముడైన క్వాలిటీ బాదం ఇప్పుడు రూ.1000–1200కి అమ్ముడవుతోంది. అఫ్గానిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే అంజీర్ ధర గతంలో కిలోకు రూ.800–1000 వరకు ఉండగా, తాజా పరిణామాలతో ఒక్కసారిగా రూ.1100–1200 వరకు చేరింది.
ప్రస్తుతానికి సరిపడ నిల్వలు
బాదం, ఎండు ద్రాక్ష, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ఆశ్చర్యపోతున్నారని డ్రై ఫ్రూట్ రిటైల్ వ్యాపారి బల్వీర్ సింగ్ అన్నారు. అయితే ప్రస్తుతానికి తమ వద్ద నిల్వలు సరిపడా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ వ్యాపారులు తమ వద్ద ఉన్న పరిమిత స్టాక్ ధరను నెమ్మదిగా పెంచి విక్రయిస్తున్నారని, రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని వారు చెబుతున్నారని సింగ్ తెలిపారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరిన తర్వాత ధరల్లో స్థిరత్వం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
వ్యాపారుల ముందు జాగ్రత్త
రానున్న రోజుల్లో దిగుమతులు జరగకపోవడం కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అనేకమంది వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకును నిల్వ చేయడం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో డ్రై ఫ్రూట్స్ ధరలు తాము ఏ రేటుకు పొందుతామనే భయం వ్యాపారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు తక్కువ ధరలో ఎందుకు విక్రయించాలని కొందరు భావిస్తున్నారు.
ప్రభుత్వం పరిష్కారం కనుక్కోవాలి
రాబోయే కొద్ది రోజుల్లో అఫ్గానిస్తాన్ నుండి కొత్త సరుకు వస్తుందని డ్రైప్రూట్స్ వ్యాపారి గౌరవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. గతంలోనే తమకు రావాల్సిన స్టాక్‌కు సంబంధించిన అక్కడి వ్యాపారులకు ముందుగానే చెల్లించామని, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని గౌరవ్ తెలిపారు. అంతేగాక అఫ్గానిస్తాన్‌లోని వ్యాపారులతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదని, ఈ వ్యాపారంలో తమ కోట్లాది రూపాయలు ప్రమాదంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలని, లేకపోతే డ్రైఫ్రూట్స్ వ్యాపారులు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దేశంలో 80 శాతం డ్రై ఫ్రూట్స్ అఫ్గానిస్తాన్ నుంచి వచ్చినవే ఉంటాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ప్రస్తుత పరిణామాల ప్రభావం డ్రైఫ్రూట్స్ వ్యాపారాన్ని ప్రభావితం చేసిందని, దీని కారణంగా ధరలు పెరగడం సహజమని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కసరత్తు చేస్తోందని, త్వరలోనే పరిష్కారాన్ని కనుగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దుబాయ్ నుంచి డ్రైఫ్రూట్స్ ఉత్పత్తుల దిగుమతులకు ఎలాంటి ఆటంకాలు లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment