
‘ఆపరేషన్ ఛత్తీస్‌గఢ్’ లీడ్ చేయబోం
♦ కేంద్ర హోంశాఖ ప్రతిపాదనను తిరస్కరించిన రాష్ట్రం
♦ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల నియంత్రణపై ఢిల్లీలో కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల నియంత్రణ ఆపరేషన్‌కు తాము ఆధ్వర్యం వహించలేమని రాష్ట్ర పోలీసుశాఖ కేంద్రానికి స్పష్టం చేసింది. మావోయిస్టుల కదలికలు, దాడుల వ్యూహాలపై తాము సమాచారం అందించినా.. ఛత్తీస్‌గఢ్ పోలీసులు పట్టించుకోలేదని, దాంతో భారీ నష్టం కలిగిందని పేర్కొంది. అలాంటివారితో కలసి పనిచేసి, తమ బలగాలను బలిపశువులను చేసుకోలేమని స్పష్టం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల మావోయిస్టులు మారణకాండ సృష్టించిన విషయం తెలిసిందే. దాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం..
మావోయిస్టుల నియంత్రణ కోసం కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహా రాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా జరుగుతున్న సీఆర్పీ ఎఫ్–మావోయిస్టు దాడులు, మావోయిస్టుల నియంత్రణ, నిఘా వైఫల్యం, పోలీసు బలగాల వ్యూహాలు తదితర అంశాలపై నాలుగు గంటల పాటు చర్చించినట్లు తెలిసింది.
మీరే ఆధ్వర్యం వహించండి
ప్రభావిత ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, తెలం గాణలలో ప్రస్తుతం మావోయిస్టులతో పెద్దగా సమస్యలు లేవు. తెలంగాణలో అయితే వారి ఉనికిగానీ, కార్యకలాపాలుగానీ బాగా తగ్గిపోయాయి. పేరుకు తెలంగాణ మావోయిస్టు కమిటీ ఉన్నా.. అది ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏవోబీ(ఆంధ్రా, ఒడిషా బార్డర్) కమిటీ కొంతవరకు కార్యకలాపాలు సాగిస్తోంది.
దీంతో మావోయిస్టు కార్యకలాపాలను నియంత్రించడంలో కీలకంగా పని చేసిన గ్రేహౌండ్స్‌పై కేంద్ర హోంశాఖ దృష్టి పడింది. ఇక మావోయిస్టుల సమాచార సేకరణలో తెలంగాణ ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో) చాలా ముందుంది కూడా. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల నియంత్రణకు రాష్ట్ర గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ సేవలను వాడుకునేలా కేంద్ర హోంశాఖ ప్రతిపాదన తెచ్చినట్టు తెలిసింది. అయితే దీనికి అంగీ కరించబోమని తెలంగాణ తరఫున హాజరైన ఉన్నతాధికారి తేల్చిచెప్పినట్టు సమాచారం.
ఈ వైఫల్యానికి మీరే బాధ్యులు!
తెలంగాణ ఎస్‌ఐబీ ఇచ్చిన సమాచారాన్ని పెడచెవిన పెట్టిన ఛత్తీస్‌గఢ్ పోలీసులపై కేంద్ర హోం మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏడాదిగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక సభ్యులు ఛత్తీస్‌గఢ్‌లోనే ఉన్నారని.. వారు భారీ దాడులకు వ్యూహం రచిస్తున్నట్లు తెలిపినా సరైన వ్యూహం లేకుండా బలగాలను మోహరించడం ఏమిటంటూ నిలదీసినట్లు తెలిసింది. ఇంతటి వైఫల్యమున్న ఛత్తీస్‌గఢ్‌తో సంయుక్తంగా కలసి రావడానికి ఏ రాష్ట్ర పోలీస్ శాఖ ముందుకు వస్తుందని పేర్కొన్నట్లు సమాచారం. ఇక ముందు ఇలాంటి పరిణామాలు జరిగితే దానికి మొత్తం బాధ్యత ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, పోలీసులదేనని పరోక్షంగా హెచ్చరించినట్టు తెలుస్తోంది.
కలసివెళదామంటున్న కేంద్ర హోంశాఖ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఐబీలు ఇచ్చే ప్రతి సమాచారాన్ని మిగతా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు కీలకంగా భావించాలని కేంద్ర హోంశాఖ సూచించినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల నియంత్రణలో ఈ రెండు రాష్ట్రాల భాగస్వామ్యం కీలకమైనదని.. వారితో సహకరించుకుని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. త్వరలోనే ఛత్తీస్‌గఢ్‌లో ఐదు రాష్ట్రాల డీజీపీలు భేటీ అయి యాక్షన్ ప్లాన్ రూపొం దించుకోనున్నట్లు తెలిసింది.
వారితో కలసి పనిచేయలేం!
ఆపరేషన్ ఛత్తీస్‌గఢ్‌ను లీడ్ చేయలేమని స్పష్టం చేసిన çరాష్ట్ర పోలీసు శాఖ ఇందుకు రెండు కారణాలను కేంద్ర హోంశాఖకు వివరించింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, దండకారణ్య కమిటీ, కేకేడబ్ల్యూ కమిటీ, టీఎస్‌సీ(తెలంగాణ స్టేట్ కమిటీ) అన్నీ ఛత్తీస్‌గఢ్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయని... సంయుక్త కార్యచరణతో ముందుకు వెళదామని ఇంతకుముందే తాము చెప్పినా ఛత్తీస్‌గఢ్ పోలీసులు కలసి రాలేదని తెలిపింది. ఇక మావోయిస్టుల దాడులపై తాము కీలక సమాచారాన్ని అందించినా ఛత్తీస్‌గఢ్ పోలీసులు పెడచెవిన పెట్టారని... అలాంటివారితో కలసి పనిచేసి, తమ బలగాలను బలి పశువుల్ని చేసుకోలేమని స్పష్టం చేసినట్లు సమాచారం. పైగా సీఆర్పీఎఫ్‌కు, ఛత్తీస్‌గఢ్ పోలీసులకు మధ్య సమాచార సేకరణ, పంపిణీ సరిగా లేదని.. అందువల్లే తగిన కార్యచరణ లేక జవాన్లు బలైపోతున్నారని తేల్చిచెప్పినట్టు తెలిసింది.