స్మార్ట్‌ ఖాకీ | A single khaki uniform across the country | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 2 2017 1:38 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM

A single khaki uniform across the country - Sakshi

పోలీస్‌ అంటే ఖాకీ.. ఖాకీ అంటే పోలీస్‌.. ఈ రెండింటిదీ విడదీయరాని అనుబంధం. పోలీసులు ఎలా ఉంటారు అనగానే ఖాకీ డ్రెస్‌ మనసులో మెదులుతుంది. అలాంటి ఖాకీ యూనిఫాం ఇప్పుడు మారబోతోంది.
ఈ దిశగా బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(బీపీఆర్‌అండ్‌డీ) విభాగం కసరత్తు చేస్తోంది. కొత్త పోలీసు యూనిఫాం ఎలా ఉండబోతోందన్న దానిపై దేశవ్యాప్తంగా లక్షలాదిమంది పోలీస్‌ సిబ్బంది, అధికారులతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.

– సాక్షి, హైదరాబాద్‌    

ప్రజల నుంచీ అభిప్రాయ సేకరణ.. 
పోలీసులపై అభిప్రాయంతో పాటు యూనిఫాం మార్పుపై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు నాలుగు ప్రశ్నల రూపంలో అభిప్రాయాలు కోరింది. 

1? పోలీసులతో మీరు తరచుగా మాట్లాడతారా? వారిని కలవాల్సి వచ్చిందా? అనే ప్రశ్నపై వారిని ఎక్కువగా కదిలించింది. ఇందుకుగానూ 66 శాతం మంది చాలా అరుదుగా పోలీసులను కలవాల్సి వస్తోందని చెప్పారు. 13 శాతం మంది అసలు కలవాల్సిన పరిస్థితి లేదని, 12 శాతం మంది తరచుగా పోలీసులను కలుస్తామని చెప్పగా, 4 శాతం మంది చాలా తరచుగా కలుస్తామని జవాబిచ్చారు. 

2? పోలీస్‌ యూనిఫాంను చూడగానే మీకు కలిగే భావం ఏంటి? అని అడిగారు. 22 శాతం మంది సేఫ్‌ అండ్‌ సెక్యూర్‌గా ఉంటుందని, 39 శాతం మంది యూనిఫాం చూడగానే బెదిరించినట్టుగా ఉంటోందని చెప్పారు. 7 శాతం మంది ఖాకీ యూనిఫాం చూడగానే గర్వంగా అనిపిస్తుందని, మరో 20 శాతం మంది యూనిఫాం చూస్తే గౌరవం ఇవ్వాలని అనిపిస్తుందని చెప్పగా.. 34 శాతం మంది ఎలాంటి అభిప్రాయం తెలుపలేదు. 

3? ప్రస్తుతం ఉన్న పోలీస్‌ యూనిఫాంపై అభిప్రాయం కోరగా.. 3 శాతం మంది స్మార్ట్‌గా అనిపిస్తుందని, 23 శాతం మంది యూనిఫాం చూస్తే అసహ్యంగా, చిరిగిన దుస్తుల్లా కనిపిస్తాయని తెలిపారు. 50 శాతం మంది ధరించే వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని తెలుపగా, 24 శాతం మంది ఎలాంటి అభిప్రాయాలు చెప్పలేదు. 

4? మహిళా పోలీస్‌ అధికారులు, సిబ్బంది ధరించే యూనిఫాంపై అభిప్రాయం కోరగా 17 శాతం మంది యూనిఫాం స్మార్ట్‌గా ఉంటుందని, 46 శాతం మంది చాలా సాధారణంగా, పెద్దగా గుర్తించలేని విధంగా ఉందని తెలిపారు. 7 శాతం మంది భారత సంస్కృతికి సరిపడదని చెప్పారు. 21 శాతం మంది మహిళా సిబ్బంది యూనిఫాం ఏంటో తెలియదని చెప్పారు. 

బీపీఆర్‌అండ్‌డీ నేతృత్వంలో.. 
దేశవ్యాప్తంగా పోలీస్‌ శాఖలో తీసుకురావాల్సిన మార్పులు, ఆధునీకరణపై నిరంతర అధ్యయనాలు, అభిప్రాయ సేకరణ చేసే బీపీఆర్‌అండ్‌డీ విభాగం..పోలీస్‌ యూనిఫాంలో తీసుకురావాల్సిన మార్పులపైనా అధ్యయనం చేసింది. గుజరాత్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సంస్థతో కలసి దేశవ్యాప్తంగా పోలీస్‌ యూనిఫాం మార్పు, కొత్త యూనిఫాంపై అధ్యయనం నిర్వహించింది. ఇందుకుగానూ 2012 నుంచి 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పోలీస్‌ బలగాల యూనిట్లను పరిశీలించి నివేదికను రూపొందించింది. నేషనల్‌ పోలీస్‌ అకాడమీ, తెలంగాణ పోలీస్‌ అకాడమీ, తమిళనాడు, కేరళ, రాజస్తాన్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది.  

ఎవరి శైలి వారిదే..  
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకమైన ఖాకీ దుస్తులు ఉంటున్నాయని బీపీఆర్‌అండ్‌డీ అభిప్రాయపడింది. కొన్ని రాష్ట్రాల్లో బాగా ముదురు రంగు ఖాకీ దుస్తులు వాడుతున్నారని, మరికొన్ని రాష్ట్రాల్లో లేత ఖాకీ రంగు దుస్తులు వాడుతున్నారని పేర్కొంది. అయితే ఒక రాష్ట్రంలోనే వివిధ రకాల్లో యూనిఫాంలు కుట్టించుకుంటున్నారని, కానిస్టేబుళ్లు ఒక శైలిలో, అధికారులు మరో శైలిలో యూనిఫాంలను కుట్టిస్తున్నారని, దీని వల్ల ఏకరూపత సాధ్యం కావడం లేదని అభిప్రాయపడింది. కిందిస్థాయి సిబ్బంది సొంత డబ్బులతో యూనిఫాం కుట్టించుకుంటున్నారని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఖాకీ యూనిఫాం, శైలిపై పోలీస్‌ సిబ్బంది, అధికారుల నుంచీ అభిప్రాయ సేకరణ చేసింది. చాలా అసౌకర్యంగా ఉందని కొన్ని రాష్ట్రాల సిబ్బంది చెప్పగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఫర్వాలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. యూనిఫాంతో పాటు టోపి, షూ, బెల్ట్‌ తదితరాలపై అసంతృప్తి వ్యక్తమైంది. 

ప్రధాన రకాలు ఇవే.. :  అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు అక్కడి వాతావరణం, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నామని బీపీఆర్‌అండ్‌డీ స్పçష్టం చేసింది. స్మార్ట్‌ పోలీసింగ్‌లో భాగంగా ‘స్మార్ట్‌ పోలీస్‌ యూనిఫాం’తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. ఖాకీ యూనిఫాం స్థానంలో పోలీస్‌ సిబ్బంది ధరించాల్సిన డ్రెస్‌ల మోడళ్లను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ రూపొందించింది. పోలీస్, మహిళా పోలీస్‌కు ఒకే యూనిఫాం రూపొందించింది. అయితే హాఫ్‌ షర్ట్, ఫుల్‌ షర్ట్‌ రకాల్లో తయారు చేసింది. ప్రస్తుతమున్న ముదురు రంగును కొంత తగ్గిస్తూ.. లేత ఖాకీ రంగు అనిపించేలా చొక్కా రూపొందించింది. ఖాకీతో పాటు కొంచెం పసుపు రంగు కలిసేలా చొక్కా ఉండనుందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ తెలిపింది. చొక్కాపై ఇండియన్‌ పోలీస్‌ బ్యాడ్జ్, దానిలోనే బ్లడ్‌ గ్రూప్‌ స్పష్టంగా కనిపించేలా ఉంటాయి. హోదాను బట్టి చొక్కాపై నీలిరంగు షోల్డర్‌పై స్టార్స్‌ను పెట్టుకోవాల్సి ఉంటుందని డిజైన్‌లో స్పష్టంచేసింది. 

స్మార్ట్‌గా ఉండేందుకే.. 
దేశవ్యాప్తంగా స్మార్ట్‌ పోలీసింగ్‌ను అందుబాటులోకి తెచ్చే యత్నంలోనే ఖాకీ యూనిఫాం, శైలిపై డిజైన్లు చేయిస్తున్నట్టు బీపీఆర్‌అండ్‌డీ స్పష్టం చేసింది. యూనిఫాం మాత్రమే కాక టోపి, బెల్ట్, నేమ్‌ బ్యాడ్జ్, డ్యూటీ జాకెట్, షూ, సాక్స్, రెయిన్‌ కోట్‌..  ఇలా టాప్‌ టూ బాటమ్‌.. పోలీస్‌ యూనిఫాం వ్యవస్థనే మార్చాలని నిర్ణయానికి వచ్చింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ రూపొందించిన పలు డిజైన్లపై కేంద్ర హోంశాఖకు నివేదిక అందించనున్నట్టు బీపీఆర్‌అండ్‌డీ వర్గాలు స్పష్టం చేశాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement