smart policing
-
తెలంగాణ పోలీస్‌కు ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ పోలీసింగ్‌లో ఉత్తమ విధానాలను అమలు చేస్తున్నందుకుగాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) తెలంగాణ పోలీస్ శాఖకు 2021–స్మార్ట్ పోలీసింగ్ అవార్డును ప్రకటించింది. తెలంగాణ పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగంలో షీ–భరోసా, సైబర్ ల్యాబ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బాలల రక్షణలో సాధించిన ఉత్తమ ఫలితాలకుగాను న్యూఢిల్లీలోని ఫిక్కీ ఈ అవార్డును ప్రకటించింది. ఈ ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు–2021ను ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా స్వీకరించారు. -
పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
భవానీపురం (విజయవాడ పశ్చిమ): వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలీస్ వ్యవస్థలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులతో స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచిందని హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. విజయవాడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నూతనంగా నిర్మించిన భవానీపురం మోడల్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గతంలో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు 250 రోజులు తీసుకునేవారని, ఇప్పుడు 42 రోజుల్లోనే సమర్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యలను సత్వరం పరిష్కరించేలా పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మహిళల కోసం ఉమెన్ హెల్ప్ డెస్క్.. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళల కోసం ఆయా పోలీస్ స్టేషన్లలో ఉమెన్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోని 14,500 మంది మహిళా పోలీసులు వీటిద్వారా సేవలందిస్తారని సుచరిత తెలిపారు. మహిళలు, బాలికల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 98 లక్షల మంది మహిళలు తమ మొబైల్స్‌లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేశామన్నారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, డీజీపీ గౌతమ్ సవాంగ్, నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.చిరంజీవిరెడ్డి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెస్ట్ ఏసీపీ డాక్టర్ కె.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ పోలీసింగ్‌లో సర్వేలో ఏపీ అరుదైన రికార్డు..
సాక్షి, అమరావతి: జాతీయ స్ధాయిలో ఘనతను చాటిన ఏపీ పోలీస్ శాఖను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించినందుకు ఏపీ పోలీసుశాఖను సీఎం మనస్పూర్తిగా అభినందించారు. ఇదేరీతిలో ప్రజలకు మరిన్నిసేవలను నిర్ణీతత సమయంలో అందించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. కాగా, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీసు ఉన్నతాధికారులు సచివాలయంలో సీఎంని కలిశారు. ఆ తర్వాత.. స్మార్ట్ పోలీసింగ్ సర్వే వివరాలను సీఎం జగన్‌కి వెల్లడించారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ స్మార్ట్ పోలీసింగ్ సర్వేలో.. ఏపీ పోలీసింగ్ నెంబర్‌వన్ ర్యాంక్ సాధించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన ఈ ఫౌండేషన్.. తొమ్మిది ప్రామాణిక అంశాల్లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాలలో సర్వే చేపట్టిందని డీజీపీ తెలిపారు. 2014లో డీజీపీల సదస్సులో ప్రధాని మోదీ పిలుపు మేరకు స్మార్ట్ పోలీసింగ్ పద్ధతులను పాటించామని తెలిపారు. ఆయా రాష్ట్రాలలో పోలీస్ ఫౌండేషన్ ఏడేళ్లుగా సర్వే నిర్వహిస్తుందన్నారు. ఈ ఏడాది ఏపీ తొలిసారిగా మొదటి ర్యాంకు సాధించిందని డీజీపీ వివరించారు. ఏపీ పోలీస్ శాఖ.. ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఐపిఎఫ్‌ఐపిఎఫ్ అధ్యయనం చేస్తుందని అన్నారు. దీనిలో రిటైర్డు డీజీలు,ఐపీఎస్‌లు,ఐఏఎస్‌లు, ఐఐటీ ప్రొఫెసర్లు, పౌరసమాజ ప్రముఖులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. పౌరులపట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించడం, జవాబుదారితనం, ప్రజల నమ్మకం విభాగాల్లో ఏపీ నెంబర్ వన్ స్థానం సాధించిందని అన్నారు. సెన్సిటివిటీ, పోలీసుల ప్రవర్తన, అందుబాటులు పోలీస్ వ్యవస్థ, టెక్నాలజీ ఉపయోగం విభాగాల్లో అత్యుత్తమ ర్యాంకింగ్ కనబర్చిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, అడిషనల్ డీజీ (బెటాలియన్స్) శంకభ్రత బాగ్చి, డీఐజీ (టెక్నికల్ సర్వీసెస్) పాలరాజు, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ హజరయ్యారు. -
పోలీసింగ్‌లో తెలంగాణ ‘స్మార్ట్’
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. పోలీసింగ్‌లో టాప్‌లో నిలిచింది. దేశంలో ఎంపిక చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్మార్ట్ పోలీసింగ్ విధానాల అమలుపై ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీసు ఫౌండేషన్ (ఐపీఎఫ్) సంస్థ సమగ్ర సర్వే నిర్వహించింది. మొత్తం 11 అంశాలపై చేసిన ఈ సర్వేలో తెలంగాణకు ఐదింటిలో మొదటి స్థానం, మరో ఐదింటిలో రెండో స్థానం లభించింది. కేవలం ఒక్క దాంట్లో మూడో స్థానం వచి్చంది. ఈ నివేదికను ఫౌండేషన్ చైర్మన్‌గా ఉన్న ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాష్ సింగ్ గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. అస్సాం, బీఎస్‌ఎఫ్‌లకూ డీజీగా పని చేసిన ఈయన గతంలో పోలీసు సంస్కరణలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి నేతృత్వం వహించారు. ఈ సర్వేలో మొత్తం 1,61,192 నమూనాలు సేకరించి విశ్లేంచారు. అవసరమైన స్థాయిలో, సంతృప్తికరంగా నమూనాలు రాని నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను దీని ఫలితాల్లో చేర్చలేదు. ఆయా అంశాలన్నీ కలిసి పది పాయింట్లకుగాను ఐపీఎఫ్ స్మార్ట్ పోలీసింగ్ సూచీ–2021లో 8.11 స్కోరుతో ఏపీ తొలిస్థానంలో, 8.10 స్కోరుతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ పనితీరు బాగుందని నివేదిక ప్రశంసించింది. 2014లో దిశానిర్దేశం చేసిన మోదీ దేశంలో స్మార్ట్ పోలీసింగ్ విధానాలు అమలుకావాలని, జవాబుదారీతనం, పాదర్శకత, అవినీతిరహితంగా ఇవి సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో దిశానిర్దేశం చేశారు. ఆ సంవత్సరం గువాహటిలో జరిగిన డీజీపీల కాన్ఫరెన్స్‌లో ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇది జరిగి ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఏ మేరకు లక్ష్యసాధన జరిగిందో తెలుసుకోవడానికి ఐపీఎఫ్ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ఐపీఎఫ్ ప్రతినిధులు ప్రజలను రెండు వర్గాలుగా విభజించి నమూనాలు సేకరించారు. ఇప్పటికే పోలీసులను ఆశ్రయించడం లేదా వారితో సంబంధాలు కలిగి ఉన్న వారితోపాటు ఇప్పటివరకు ఈ రెండూ చేయని వారి నుంచీ నమూనాలు సేకరించారు. శుక్రవారం నుంచి లక్నోలో ఈ సంవత్సరానికి సంబంధించిన డీజీపీల సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం ఫలితాలు విడుదల చేశారు. ఈ సర్వే నేపథ్యంలో స్మార్ట్ పోలీసింగ్‌కు, పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. స్మార్ట్ పోలీసింగ్‌లో ఉత్తమ స్కోర్ సాధించిన రాష్ట్రానికి ప్రజల నమ్మకం పొందడంలోనూ అదే స్థాయి ఫలితాలు రావడం దానికి నిదర్శనమని ఐపీఎఫ్ పేర్కొంది. తమ సర్వే నమూనాలో ఇచి్చన చిరునామాకు 25,671 సలహాలు, సూచనలు వచ్చాయని, వాటిని విశ్లేíÙస్తున్నామని తెలిపింది. తెలంగాణలో ఇలా.. పోలీసుల సున్నితత్వంలో 8.27 స్కోరుతో, ప్రజలతో సత్ప్రవర్తన (8.14), సౌలభ్యం (8.29), పోలీసుల స్పందన (8.28), టెక్నాలజీ వినియోగం (8.17) అంశాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో 8.08 స్కోరుతో, స్మార్ట్ పోలీసింగ్ (8.10)లో, నిష్పాక్షిక పోలీసింగ్ (7.97)లో, జవాబుదారీతనం (7.95)లో, పోలీసులపై ప్రజల నమ్మకం (8.07)లో రెండోస్థానంలో, అవినీతిరహిత సేవల అంశంలో 7.78 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. ఏపీలో ఇలా.. మొత్తం 11 అంశాలకుగాను ఏపీ మూడింటిలో మొదటి స్థానంలో నిలిచింది. స్మార్ట్ పోలీసింగ్‌లో 8.11 స్కోర్‌తో, జవాబుదారీతనంలో 8 స్కోర్‌తో, పోలీసులపై ప్రజల నమ్మకంలో 8.15 స్కోర్‌తో తొలిస్థానంలో నిలిచింది. ప్రజలతో స్రత్పవర్తనలో 8.14 స్కోరుతో రెండు తెలుగు రాష్ట్రాలు పట్టికలో పైభాగాన నిలిచాయి. -
స్మార్ట్ పోలీసింగ్.. మనమే కింగ్
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పోలీసు శాఖ జాతీయస్థాయిలో మరోసారి తన ఘనతను చాటుకుంది. స్మార్ట్ పోలీసింగ్‌లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ప్రజలపట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిర్ధారించేందుకు ‘స్మార్ట్ పోలీసింగ్’ అనే అంశంపై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వే ఫలితాలను గురువారం వెల్లడించింది. స్వయం ప్రతిపత్తిగల ప్రతిష్టాత్మకమైన ఆ సంస్థ ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు సంబంధించి తొమ్మిది ప్రామాణిక అంశాల్లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ఈ సర్వే నిర్వహించారు. వాటిలో ఆరు అంశాలు పోలీసుల సమర్థతకు సంబంధించినవి కాగా మూడు అంశాలు పోలీసు విలువలకు సంబంధించినవి. ఫ్రెండ్లీ పోలీసింగ్, నిష్పక్షపాత శైలి, చట్టబద్ధ–పారదర్శ పోలీసింగ్, జవాబుదారీతనం, ప్రజల నమ్మకం.. విభాగాల్లో మన రాష్ట్ర పోలీసు శాఖకు మొదటిస్థానం లభించింది. పోలీసుల ప్రవర్తన, అందుబాటులో పోలీసు వ్యవస్థ, పోలీసుల స్పందన, టెక్నాలజీ వినియోగం.. విభాగాల్లో రెండోస్థానంలో నిలిచింది. మొత్తం మీద తొమ్మిది అంశాల్లో కలిపి దేశంలో మొదటి ర్యాంకు సాధించింది. ఈ సర్వేలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన డీజీపీల సదస్సులో స్మార్ట్ పోలీసింగ్ అంశాన్ని ప్రస్తావించారు. ఆయన సూచనలతో ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ ఏటా ఈ సర్వే నిర్వహిస్తోంది. ఆ సంస్థ ఏడేళ్లుగా నిర్వహిస్తున్న సర్వేలో రాష్ట్ర పోలీసు శాఖ తొలిసారి మొదటి ర్యాంకు సాధించింది. దేశవ్యాప్తంగా విశేష గుర్తింపున్న ఈ సర్వేలో రాష్ట్ర పోలీసు శాఖ అగ్రస్థానంలో నిలవడం ద్వారా జాతీయస్థాయిలో గుర్తింపు సాధించింది. సీఎం అభినందన ప్రజలకు ఉత్తమ పోలీసు సేవలు అందించడంలో భారతదేశంలోనే మొదటిస్థానం సాధించిన రాష్ట్ర పోలీసు శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇదే రీతిలో ప్రజలకు మరిన్ని సేవలను నిర్ణీత సమయంలో అందించి ఈ ప్రస్థానాన్ని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. పోలీసు శాఖను హోం మంత్రి సుచరిత కూడా అభినందించారు. -
పీఎస్‌లలో శుభ్రత పాటించాలి
మోమిన్‌పేట : పోలీస్ స్టేషన్లో పరిశుభ్రత పాటించాలని ఎస్పీ అన్నపూర్ణ సిబ్బందికి సూచించారు. పీఎస్‌ల వార్షిక తనిఖీల్లో భాగంగా డీఎస్పీ శిరీషతో కలిసి సోమవారం ఆమె మోమిన్‌పేట స్టేషన్‌ను సందర్శించారు. పీఎస్‌లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో కలియతిరిగి ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని.. సీఐ శ్రీనివాస్, ఎస్ఐ అరుణ్‌కుమార్‌ను అభినందించారు. స్మార్ట్, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో సిబ్బంది పాత్ర కీలకమని తెలిపారు. ప్రజల్లో పోలీసులంటే భయం పోగొట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా ప్రతీ స్టేషన్‌కు రిసెప్షనిస్ట్‌తో పాటు ఫిర్యాదుదారులకు అవసరమైన కాగితం, పెన్నుతో పాటు టేబుళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. తాగేందుకు చల్లని నీరు, చెట్ల కింద కూర్చునేందుకు బల్లలు వేశామన్నారు. రికార్టులను ఫైలింగ్ చేయడంతో పాటు సిబ్బందికి అవసరమైన వసతులు కల్పిస్తున్నామని వివరించారు. జిల్లాలోని 14 పీస్‌లను స్మార్ట్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు. గతంలో కన్నా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. ప్రతీ రోజు వాహనాల తనిఖీలు, డ్రంకన్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామన్నారు. లైసెన్స్ లేకుండా, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధిస్తున్నామని వెల్లడించారు. దీంతో ప్రమా దాలు బాగా తగ్గాయన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలతో పాటు భరోసా కేంద్రాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఐ శ్రీనివాస్, ఎస్ఐ అరుణ్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
ఒడిశా పోలీస్.. భలే స్మార్ట్ గురూ..!
భువనేశ్వర్ : రాష్ట్ర పోలీసుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ పోలీసింగ్ అవార్డును ప్రదానం చేసింది. సామూహిక పోలీస్‌వ్యవస్థ ఆవిష్కరణ, వాస్తవ కార్యాచరణతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఈ ప్రతిష్టాత్మక అవార్డును సాధించినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారి సారా శర్మ ఈ అవార్డును కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ శాఖ మంత్రి విజయ్ గోయల్ చేతుల మీదుగా గురువారం అందుకున్నారు. బలమైన ప్రజా సంబంధాలు బలమైన ప్రజా సంబంధాలతో పాటు పోలీస్ వ్యవస్థను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు డీజీపీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ విశేషంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న నేరాల పంథాలో ఆయన పోలీస్ వ్యవస్థను తరచూ సంస్కరిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసులు ఇటీవల కాలంలో పొరి పంయి కొథా టియే, మో సాథీ వగైరా ప్రత్యేక కార్యక్రమాల్ని ఆవిష్కరించారు. ప్రజా చైతన్యంతో నేరాల్ని నివారించే సూత్రంతో డీజీపీ ఆవిష్కరిస్తున్న సామూహిక పోలీసింగ్ వ్యవస్థ జాతీయ స్థాయి అవార్డును సాధించడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోం ది. ప్రధానంగా మహిళా వర్గంలో సాధికారతను ప్రోత్సహించి సమయస్ఫూర్తితో పరిస్థితుల్ని ఎదుర్కోవలసిన మార్గదర్శకాల్ని సమయానుకూలం గా జారీ చేసి విస్తారంగా ప్రసారం చేస్తున్నారు. ప్రజా చైతన్యం కోసం రథాలు బాలికలపట్ల ఇటీవల పెరిగిన అత్యాచారాలు, లైంగిక వేధింపుల నేపథ్యంలో పొరి పంయి కొథా టియే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 15 పొరి ఎక్స్‌ప్రెస్ చైతన్య రథాల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఈ చైతన్య రథాలు రాష్ట్రవ్యాప్తంగా బాలికలపట్ల అత్యాచారాల ప్రభావిత ప్రాంతాల్లో సందర్శిస్తాయి. ఎక్కడికక్కడ బహిరంగ చైతన్య కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. కరపత్రాల పంపిణీతో పాటు భారీ తెర ఏర్పాటు చేసి విపత్కర పరిస్థితులు, నివారణ ఉపాయాలు, చట్టపరమైన సదుపాయాలు, శిక్ష విధింపు వ్యవహారాల్ని సరళ రీతిలో సాధారణ పజానీకానికి అర్థమయ్యే రీతిలో ప్రదర్శించడం పొరి పంయి కొథా టియే కార్యక్రమం సమ్రగ సారాంశం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరవధికంగా 15 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కేంద్ర మంత్రి ప్రదానం చేసిన ప్రతిష్టాత్మక అవార్డు తమ కార్యాచరణను ప్రోత్సహించి మరింత ఉత్సాహంతో ముందుకు నడిపిస్తుందని డీజీపీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు. -
ఇదిగో.. మన రోబో పోలీస్!
హైదరాబాద్: ప్రజల సమస్యలు, ఫిర్యాదులను తెలుసుకుని పోలీసులకు తెలియజేసే రోబో పోలీస్ త్వరలో అందుబాటులోకి రానుందని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. హెచ్–బోట్స్ రోబోటిక్స్ సంస్థ తయారు చేసిన స్మార్ట్ పోలీసింగ్ రోబో బీటా వెర్షన్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ట్రైడెంట్ హోటల్లో ఆయన ఆవిష్కరించారు. వచ్చేఏడాది జూలై నాటికి ఈ రోబో క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇది ప్రపంచంలోనే మొదటి స్మార్ట్ పోలీసింగ్ రోబో అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగంలోనే కాకుండా హార్డ్‌వేర్‌లోనూ ముందుందనే విషయాన్ని హెచ్–బోట్స్ రోబోటిక్స్ సంస్థ రుజువు చేసిందని పేర్కొన్నారు. రోబోటిక్స్ రంగంలో ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ సంస్థలు రోబోల సేవలు వినియోగించుకుంటున్నాయని చెప్పారు. హెచ్ బోట్స్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు కిషన్ పీఎస్వీ మాట్లాడుతూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రోబో పోలీస్ బేటా వెర్షన్ రూపొందించినట్లు తెలిపారు. డిసెంబర్ 31న రెండు గంటల పాటు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద రోబో పోలీస్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తామని తెలిపారు. తెలంగాణ, అసోం, బెంగళూర్ పోలీసుల సలహాలు, హిటాచీ కంపెనీ సహకారంతో ఈ రోబోను తయారు చేసినట్లు వివరించారు. గేటెడ్ కమ్యూనిటీల్లోనూ దీన్ని భద్రతా విధుల కోసం వినియోగించుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఇమిగో గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్, సీఈవో దెబాయాన్ బసు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరిప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రోబోల తయారీలో హెచ్–బోట్స్ రోబోటిక్స్, ఇమిగో గ్రూప్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. హెచ్‌బోట్స్ రోబొటిక్స్ పరిశోధనల కోసం రూ.6.5 కోట్లు ఆర్థిక సాయం అందజేస్తామని చంద్రశేఖర్ తెలిపారు. హాయ్ చెబుతుంది.. షేక్ హ్యాండ్ ఇస్తుంది.. - ఈ రోబో హాయ్ చెబుతుంది.. షేక్ హ్యాండ్ ఇస్తుంది. తలను కదిలిస్తుంది. ఇంగ్లిష్‌లో మాట్లాడితే ప్రతిగా సమాధానాలు, సలహాలు ఇస్తుంది. - ఫిర్యాదు చేస్తే టోకెన్ నంబర్ ఇస్తుంది. ఫిర్యాదు వివరాలు తెలుపుతుంది. - టచ్ స్క్రీన్‌పై కంప్లయింట్ ఆప్షన్‌పై నొక్కితే ఫొటో, వీడియో, ఆడియో తదితర ఏదైనా రూపంలో ఫిర్యాదు చేయొచ్చు. - ఎమర్జెన్సీ బటన్‌పై నొక్కితే అంబులెన్స్, ఫైర్, పోలీసులతో కాల్స్ మాట్లాడొచ్చు. - షీటీం కంప్లయింట్‌పై నొక్కి ఈవ్ టీజింగ్స్పై మహిళలు షీటీమ్స్‌తో మాట్లాడొచ్చు. అత్యవసర సమయాల్లో నొక్కి వెళ్లిపోయినా చాలు.. ప్రాంతాల్లో ఉన్న షీటీమ్స్‌కు వీడియో, ఆడియో పంపి అప్రమత్తం చేస్తుంది. - మారణాయుధాలతో తిరిగే వారి సమాచారాన్ని పోలీసులకు అందిస్తుంది. - రోడ్డు ప్రమాదం జరిగినా, స్నాచింగ్‌లకు పాల్పడినా, కిడ్నాప్‌లు, పెద్ద గొడవ జరిగినా, జనం గుమిగూడినా వీడియో, ఆడియోలను పోలీసులకు చేరవేస్తుంది. రోడ్డు ప్రమాదాల దృశ్యాలను పంపి అంబులెన్స్‌ను అప్రమత్తం చేస్తుంది. రోబో పోలీస్ వివరాలివీ.. - ఎత్తు 5.2 అడుగులు, బరువు 43 కిలోలు. - ధర: రూ.5 నుంచి రూ.6 లక్షలు - ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. - లోపల బ్యాటరీ, ముందు భాగంలో ఓ స్క్రీన్ ఉంటుంది. - ఆటోమెటిక్‌గా రీచార్జ్ చేసుకుంటుంది. బయటికి వస్తే సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. - వాయిస్ రికగ్నిషన్‌తో పని చేస్తుంది. - 360 డిగ్రీల కోణంలో ఫొటోలు, వీడియో తీసేందుకు సీసీ కెమెరాలు ఉంటాయి. రెండు కళ్లల్లోనూ కెమెరాలుంటాయి. వ్యవసాయం, విద్యా రంగాలపై దృష్టి వ్యవసాయం, విద్యా రంగాల్లో సేవలందించే రోబోల తయారీ లక్ష్యంతో పనిచేస్తున్నామని కిషన్ పీఎస్వీ తెలిపారు. ఇంగ్లిష్తో పాటు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడేలా రోబో పోలీస్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉందన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో రోబో ల్యాబ్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని తెలిపారు. – కిషన్ పీఎస్వీ -
స్మార్ట్ ఖాకీ
పోలీస్ అంటే ఖాకీ.. ఖాకీ అంటే పోలీస్.. ఈ రెండింటిదీ విడదీయరాని అనుబంధం. పోలీసులు ఎలా ఉంటారు అనగానే ఖాకీ డ్రెస్ మనసులో మెదులుతుంది. అలాంటి ఖాకీ యూనిఫాం ఇప్పుడు మారబోతోంది. ఈ దిశగా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(బీపీఆర్‌అండ్‌డీ) విభాగం కసరత్తు చేస్తోంది. కొత్త పోలీసు యూనిఫాం ఎలా ఉండబోతోందన్న దానిపై దేశవ్యాప్తంగా లక్షలాదిమంది పోలీస్ సిబ్బంది, అధికారులతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. – సాక్షి, హైదరాబాద్ ప్రజల నుంచీ అభిప్రాయ సేకరణ.. పోలీసులపై అభిప్రాయంతో పాటు యూనిఫాం మార్పుపై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు నాలుగు ప్రశ్నల రూపంలో అభిప్రాయాలు కోరింది. 1? పోలీసులతో మీరు తరచుగా మాట్లాడతారా? వారిని కలవాల్సి వచ్చిందా? అనే ప్రశ్నపై వారిని ఎక్కువగా కదిలించింది. ఇందుకుగానూ 66 శాతం మంది చాలా అరుదుగా పోలీసులను కలవాల్సి వస్తోందని చెప్పారు. 13 శాతం మంది అసలు కలవాల్సిన పరిస్థితి లేదని, 12 శాతం మంది తరచుగా పోలీసులను కలుస్తామని చెప్పగా, 4 శాతం మంది చాలా తరచుగా కలుస్తామని జవాబిచ్చారు. 2? పోలీస్ యూనిఫాంను చూడగానే మీకు కలిగే భావం ఏంటి? అని అడిగారు. 22 శాతం మంది సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటుందని, 39 శాతం మంది యూనిఫాం చూడగానే బెదిరించినట్టుగా ఉంటోందని చెప్పారు. 7 శాతం మంది ఖాకీ యూనిఫాం చూడగానే గర్వంగా అనిపిస్తుందని, మరో 20 శాతం మంది యూనిఫాం చూస్తే గౌరవం ఇవ్వాలని అనిపిస్తుందని చెప్పగా.. 34 శాతం మంది ఎలాంటి అభిప్రాయం తెలుపలేదు. 3? ప్రస్తుతం ఉన్న పోలీస్ యూనిఫాంపై అభిప్రాయం కోరగా.. 3 శాతం మంది స్మార్ట్‌గా అనిపిస్తుందని, 23 శాతం మంది యూనిఫాం చూస్తే అసహ్యంగా, చిరిగిన దుస్తుల్లా కనిపిస్తాయని తెలిపారు. 50 శాతం మంది ధరించే వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని తెలుపగా, 24 శాతం మంది ఎలాంటి అభిప్రాయాలు చెప్పలేదు. 4? మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది ధరించే యూనిఫాంపై అభిప్రాయం కోరగా 17 శాతం మంది యూనిఫాం స్మార్ట్‌గా ఉంటుందని, 46 శాతం మంది చాలా సాధారణంగా, పెద్దగా గుర్తించలేని విధంగా ఉందని తెలిపారు. 7 శాతం మంది భారత సంస్కృతికి సరిపడదని చెప్పారు. 21 శాతం మంది మహిళా సిబ్బంది యూనిఫాం ఏంటో తెలియదని చెప్పారు. బీపీఆర్‌అండ్‌డీ నేతృత్వంలో.. దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలో తీసుకురావాల్సిన మార్పులు, ఆధునీకరణపై నిరంతర అధ్యయనాలు, అభిప్రాయ సేకరణ చేసే బీపీఆర్‌అండ్‌డీ విభాగం..పోలీస్ యూనిఫాంలో తీసుకురావాల్సిన మార్పులపైనా అధ్యయనం చేసింది. గుజరాత్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థతో కలసి దేశవ్యాప్తంగా పోలీస్ యూనిఫాం మార్పు, కొత్త యూనిఫాంపై అధ్యయనం నిర్వహించింది. ఇందుకుగానూ 2012 నుంచి 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పోలీస్ బలగాల యూనిట్లను పరిశీలించి నివేదికను రూపొందించింది. నేషనల్ పోలీస్ అకాడమీ, తెలంగాణ పోలీస్ అకాడమీ, తమిళనాడు, కేరళ, రాజస్తాన్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. ఎవరి శైలి వారిదే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకమైన ఖాకీ దుస్తులు ఉంటున్నాయని బీపీఆర్‌అండ్‌డీ అభిప్రాయపడింది. కొన్ని రాష్ట్రాల్లో బాగా ముదురు రంగు ఖాకీ దుస్తులు వాడుతున్నారని, మరికొన్ని రాష్ట్రాల్లో లేత ఖాకీ రంగు దుస్తులు వాడుతున్నారని పేర్కొంది. అయితే ఒక రాష్ట్రంలోనే వివిధ రకాల్లో యూనిఫాంలు కుట్టించుకుంటున్నారని, కానిస్టేబుళ్లు ఒక శైలిలో, అధికారులు మరో శైలిలో యూనిఫాంలను కుట్టిస్తున్నారని, దీని వల్ల ఏకరూపత సాధ్యం కావడం లేదని అభిప్రాయపడింది. కిందిస్థాయి సిబ్బంది సొంత డబ్బులతో యూనిఫాం కుట్టించుకుంటున్నారని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఖాకీ యూనిఫాం, శైలిపై పోలీస్ సిబ్బంది, అధికారుల నుంచీ అభిప్రాయ సేకరణ చేసింది. చాలా అసౌకర్యంగా ఉందని కొన్ని రాష్ట్రాల సిబ్బంది చెప్పగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఫర్వాలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. యూనిఫాంతో పాటు టోపి, షూ, బెల్ట్ తదితరాలపై అసంతృప్తి వ్యక్తమైంది. ప్రధాన రకాలు ఇవే.. : అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు అక్కడి వాతావరణం, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నామని బీపీఆర్‌అండ్‌డీ స్పçష్టం చేసింది. స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా ‘స్మార్ట్ పోలీస్ యూనిఫాం’తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. ఖాకీ యూనిఫాం స్థానంలో పోలీస్ సిబ్బంది ధరించాల్సిన డ్రెస్‌ల మోడళ్లను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించింది. పోలీస్, మహిళా పోలీస్‌కు ఒకే యూనిఫాం రూపొందించింది. అయితే హాఫ్ షర్ట్, ఫుల్ షర్ట్ రకాల్లో తయారు చేసింది. ప్రస్తుతమున్న ముదురు రంగును కొంత తగ్గిస్తూ.. లేత ఖాకీ రంగు అనిపించేలా చొక్కా రూపొందించింది. ఖాకీతో పాటు కొంచెం పసుపు రంగు కలిసేలా చొక్కా ఉండనుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ తెలిపింది. చొక్కాపై ఇండియన్ పోలీస్ బ్యాడ్జ్, దానిలోనే బ్లడ్ గ్రూప్ స్పష్టంగా కనిపించేలా ఉంటాయి. హోదాను బట్టి చొక్కాపై నీలిరంగు షోల్డర్‌పై స్టార్స్‌ను పెట్టుకోవాల్సి ఉంటుందని డిజైన్‌లో స్పష్టంచేసింది. స్మార్ట్‌గా ఉండేందుకే.. దేశవ్యాప్తంగా స్మార్ట్ పోలీసింగ్‌ను అందుబాటులోకి తెచ్చే యత్నంలోనే ఖాకీ యూనిఫాం, శైలిపై డిజైన్లు చేయిస్తున్నట్టు బీపీఆర్‌అండ్‌డీ స్పష్టం చేసింది. యూనిఫాం మాత్రమే కాక టోపి, బెల్ట్, నేమ్ బ్యాడ్జ్, డ్యూటీ జాకెట్, షూ, సాక్స్, రెయిన్ కోట్.. ఇలా టాప్ టూ బాటమ్.. పోలీస్ యూనిఫాం వ్యవస్థనే మార్చాలని నిర్ణయానికి వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన పలు డిజైన్లపై కేంద్ర హోంశాఖకు నివేదిక అందించనున్నట్టు బీపీఆర్‌అండ్‌డీ వర్గాలు స్పష్టం చేశాయి. -
తెలంగాణ పోలీసు శాఖకు ఐదు అవార్డులు
హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టాత్మకమైన ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. ఫిక్కీ నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర పోలీసు శాఖ చేస్తున్న పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు స్మార్ట్ వెరిఫికేషన్ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఫిక్కీ చైర్మన్ వైకే మోడీ చేతుల మీదుగా డీజీపీ అనురాగ్ శర్మ గురువారం అందుకున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు కీలక కృషి చేస్తున్న హైదరాబాద్ కమిషనరేట్‌లోని సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మరో అవార్డు దక్కింది. ఈ అవార్డును సైబర్ క్రైం ఏసీపీ రఘువీర్ అందుకున్నారు. స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ కేటగిరీ కింద హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డికి దక్కింది. ఈ అవార్డును హైదరాబాద్ అదనపు కమిషనర్ మురళీ కృష్ణ స్వీకరించారు. రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తానికి స్మార్ట్ ఇన్నొవేటివ్ పోలీసింగ్ కింద స్పెషల్ జ్యూరీ అవార్డు, ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ అండ్ నెట్వర్క్ సిస్టం ప్రాజెక్ట్‌కు సూర్యాపేట ఎస్పీ పరిమళ హనా నూతన్ మరో అవార్డు సొంతం చేసుకున్నారు. కార్యక్రమానికి శాంతి భద్రతల ఇన్చార్జి ఐజీ రమేశ్‌రెడ్డి హాజరయ్యారు. ఏపీ పోలీస్ శాఖ కూడా రెండు అవార్డులు సొంతం చేసుకున్నట్లు ఫిక్కీ తెలిపింది. -
గుంటూరులో మోడల్ పోలీస్ స్టేషన్
పట్నంబజారు (గుంటూరు) : గుంటూరులో నూతనంగా ఏర్పాటుచేసిన నగరంపాలెం, పాతగుంటూరు మోడల్ పోలీస్స్టేషన్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లోనే పాతగుంటూరు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హెలికాప్టర్లో బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి నేరుగా చేరుకున్న ఆయన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర అధికారులతో కలిసి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. డీజీపీ నండూరి సాంబశివరావు, ఇతర పోలీసు అధికారులు సీఎంకు స్వాగతం పలికగా, కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, ఆహ్వానితులకు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అడిషనల్ ఎస్పీ జె.భాస్కరరావు ఆహ్వానం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పోలీసు నియమావళి పుస్తకావిష్కరణ... సభా ప్రాంగణంలో పోలీసు నియమావళి పుస్తకాన్ని డీజీపీ సాంబశివరావు విజ్ఞప్తి మేరకు సీఎం ఆవిష్కరించారు. 2001 సంవత్సరం తరువాత పోలీసు మాన్యువల్‌ను మరోసారి సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా డీజీపీ సాంబశివరావు తెలిపారు. అనంతరం గత ఏడాది నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించిన 4500 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అనంతరం ఏపీ పోలీసులకు సంబంధించి నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ స్మార్ట్ కార్డులను ఆవిష్కరించారు. పోలీసుల వైద్య పరీక్షల కోసం అత్యవసరంగా రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పోలీసు ఈ–లెర్నింగ్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. పలువురికి ప్రశంసా పత్రాలు... పోలీసు శాఖలోని క్రైం విభాగంలో నిందితులు, దొంగలను పట్టుకోవటంతో పాటు భారీ కేసులను ఛేదించిన నలుగురికి ఎ, బి, సి, డి.. ప్రాతిపదికన ప్రశంసాపత్రాలు, అవార్డులను అందజేశారు. దీనిలో ‘ఎ’ కింద కర్నూలుకు చెందిన డీఎస్పీ అశోక్‌కుమార్, రాజమండ్రి సీఐ రవికుమార్, విజయవాడ సీఐ సహేరా, అడిషనల్ డీజీ అతుల్సింగ్లకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు హోం శాఖ కార్యదర్శి అనురాధ, విజయవాడ నగర కమిషనర్ గౌతమ్ సవాంగ్, అడిషనల్ డీజీలు ఠాగూర్, ద్వారక తిరుమలరావు, సురేంద్రబాబు, ఐజీలు సునీల్‌కుమార్, మహేష్ చంద్ర లడ్హా, హరీష్‌కుమార్ గుప్తా, ఎన్.సంజయ్, రమణకుమార్, కలెక్టర్ కాంతిలాల్ దండే, గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు సర్వశ్రేష్ఠత్రిపాఠి, నారాయణ నాయక్, పీæవీఎస్ రామకృష్ణ, హరికుమార్, రాజకుమారి, గోపీనాథ్ జెట్టి, కోటేశ్వరరావు, నగర కమిషనర్ నాగలక్ష్మి, జేసీ కృతికా శుక్లా, జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, ఎమ్మెల్యేలు షేక్ మొహమ్మద్ ముస్తఫా, మోదుగుల వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ పోలీసింగ్‌పై పోటీలు
సంగారెడ్డి టౌన్: అక్టోబరు 21న పోలీసుల అమర వీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని ‘స్మార్ట్ పోలీసింగ్’ అంశంపై జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫోటోగ్రఫీ, షార్ట్ వీడియో ఫిల్మ్ (పోలీసు శాఖ సేవలపై) చిత్రాలు, పోలీసు సేవ గురించి ప్రచురితమయిన ప్రత్యేక కథనాలను పాత్రికేయులు ఈ నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు సెల్ నం. 94409 01847లో సంప్రదించాలని సూచించారు. -
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందాం..
స్మార్ట్ పోలీసింగ్ వర్క్‌షాప్‌లో డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్ : పోలీసులపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. పవర్ ఒక్కటే పోలీసుల బలం కాదని, స్నేహభావంతో సమస్యలను పరిష్కరించినపుడు ప్రజల్లో మరింత గౌరవం పెరుగుతుందని చెప్పారు. మంగళవారం రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో నిర్వహించిన స్మార్ట్ పోలీసింగ్ వర్క్‌షాప్‌కు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాలంతోపాటు పోలీసులు టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు నైపుణ్యం సాధించాలని సూచించారు. దేశం మొత్తంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రమే స్మార్ట్ పోలీసింగ్ మీద వర్క్‌షాప్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. కేంద్ర హోం శాఖలో ఆధునీకరణ విభాగానికి చెందిన ప్రిన్సిపాల్ సైంటిఫిక్ అధికారి సంజయ్ శర్మ మాట్లాడుతూ.. స్మార్ట్ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాలంటే పోలీసులందరికీ శిక్షణ అవసరమన్నారు. కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డెరైక్టర్ ఈశ్కుమార్, అదనపు డెరైక్టర్ ఎంకే సింగ్, హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులందరూ పోలీసు అకాడమీలో మొక్కలు నాటారు.