యువతికి షేక్ హ్యాండ్ ఇస్తున్న స్మార్ట్ పోలీసింగ్ రోబో
హైదరాబాద్: ప్రజల సమస్యలు, ఫిర్యాదులను తెలుసుకుని పోలీసులకు తెలియజేసే రోబో పోలీస్ త్వరలో అందుబాటులోకి రానుందని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పేర్కొన్నారు. హెచ్–బోట్స్ రోబోటిక్స్ సంస్థ తయారు చేసిన స్మార్ట్ పోలీసింగ్ రోబో బీటా వెర్షన్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ట్రైడెంట్ హోటల్‌లో ఆయన ఆవిష్కరించారు. వచ్చేఏడాది జూలై నాటికి ఈ రోబో క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇది ప్రపంచంలోనే మొదటి స్మార్ట్ పోలీసింగ్ రోబో అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ రంగంలోనే కాకుండా హార్డ్‌వేర్‌లోనూ ముందుందనే విషయాన్ని హెచ్–బోట్స్ రోబోటిక్స్ సంస్థ రుజువు చేసిందని పేర్కొన్నారు. రోబోటిక్స్ రంగంలో ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ సంస్థలు రోబోల సేవలు వినియోగించుకుంటున్నాయని చెప్పారు. హెచ్ బోట్స్ రోబోటిక్స్ వ్యవస్థాపకుడు కిషన్ పీఎస్‌వీ మాట్లాడుతూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రోబో పోలీస్ బేటా వెర్షన్ రూపొందించినట్లు తెలిపారు. డిసెంబర్ 31న రెండు గంటల పాటు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద రోబో పోలీస్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తామని తెలిపారు. తెలంగాణ, అసోం, బెంగళూర్ పోలీసుల సలహాలు, హిటాచీ కంపెనీ సహకారంతో ఈ రోబోను తయారు చేసినట్లు వివరించారు. గేటెడ్ కమ్యూనిటీల్లోనూ దీన్ని భద్రతా విధుల కోసం వినియోగించుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఇమిగో గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్, సీఈవో దెబాయాన్ బసు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరిప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రోబోల తయారీలో హెచ్–బోట్స్ రోబోటిక్స్, ఇమిగో గ్రూప్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. హెచ్‌బోట్స్ రోబొటిక్స్ పరిశోధనల కోసం రూ.6.5 కోట్లు ఆర్థిక సాయం అందజేస్తామని చంద్రశేఖర్ తెలిపారు.
హాయ్ చెబుతుంది.. షేక్ హ్యాండ్ ఇస్తుంది..
- ఈ రోబో హాయ్ చెబుతుంది.. షేక్ హ్యాండ్ ఇస్తుంది. తలను కదిలిస్తుంది. ఇంగ్లిష్‌లో మాట్లాడితే ప్రతిగా సమాధానాలు, సలహాలు ఇస్తుంది.
- ఫిర్యాదు చేస్తే టోకెన్ నంబర్ ఇస్తుంది. ఫిర్యాదు వివరాలు తెలుపుతుంది.
- టచ్ స్క్రీన్‌పై కంప్లయింట్ ఆప్షన్‌పై నొక్కితే ఫొటో, వీడియో, ఆడియో తదితర ఏదైనా రూపంలో ఫిర్యాదు చేయొచ్చు.
- ఎమర్జెన్సీ బటన్‌పై నొక్కితే అంబులెన్స్, ఫైర్, పోలీసులతో కాల్స్ మాట్లాడొచ్చు.
- షీటీం కంప్లయింట్‌పై నొక్కి ఈవ్ టీజింగ్స్‌పై మహిళలు షీటీమ్స్‌తో మాట్లాడొచ్చు. అత్యవసర సమయాల్లో నొక్కి వెళ్లిపోయినా చాలు.. ప్రాంతాల్లో ఉన్న షీటీమ్స్‌కు వీడియో, ఆడియో పంపి అప్రమత్తం చేస్తుంది.
- మారణాయుధాలతో తిరిగే వారి సమాచారాన్ని పోలీసులకు అందిస్తుంది.
- రోడ్డు ప్రమాదం జరిగినా, స్నాచింగ్‌లకు పాల్పడినా, కిడ్నాప్‌లు, పెద్ద గొడవ జరిగినా, జనం గుమిగూడినా వీడియో, ఆడియోలను పోలీసులకు చేరవేస్తుంది. రోడ్డు ప్రమాదాల దృశ్యాలను పంపి అంబులెన్స్‌ను అప్రమత్తం చేస్తుంది.
రోబో పోలీస్ వివరాలివీ..
- ఎత్తు 5.2 అడుగులు, బరువు 43 కిలోలు.
- ధర: రూ.5 నుంచి రూ.6 లక్షలు
- ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది.
- లోపల బ్యాటరీ, ముందు భాగంలో ఓ స్క్రీన్ ఉంటుంది.
- ఆటోమెటిక్‌గా రీచార్జ్ చేసుకుంటుంది. బయటికి వస్తే సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి.
- వాయిస్ రికగ్నిషన్‌తో పని చేస్తుంది.
- 360 డిగ్రీల కోణంలో ఫొటోలు, వీడియో తీసేందుకు సీసీ కెమెరాలు ఉంటాయి. రెండు కళ్లల్లోనూ కెమెరాలుంటాయి.
వ్యవసాయం, విద్యా రంగాలపై దృష్టి
వ్యవసాయం, విద్యా రంగాల్లో సేవలందించే రోబోల తయారీ లక్ష్యంతో పనిచేస్తున్నామని కిషన్ పీఎస్‌వీ తెలిపారు. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో మాట్లాడేలా రోబో పోలీస్‌ను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉందన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో రోబో ల్యాబ్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని తెలిపారు.
– కిషన్ పీఎస్‌వీ
Comments
Please login to add a commentAdd a comment