ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందాం..
స్మార్ట్ పోలీసింగ్ వర్క్‌షాప్‌లో డీజీపీ అనురాగ్ శర్మ
సాక్షి, హైదరాబాద్ : పోలీసులపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం, విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. పవర్ ఒక్కటే పోలీసుల బలం కాదని, స్నేహభావంతో సమస్యలను పరిష్కరించినపుడు ప్రజల్లో మరింత గౌరవం పెరుగుతుందని చెప్పారు. మంగళవారం రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో నిర్వహించిన స్మార్ట్ పోలీసింగ్ వర్క్‌షాప్‌కు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాలంతోపాటు పోలీసులు టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు నైపుణ్యం సాధించాలని సూచించారు. దేశం మొత్తంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రమే స్మార్ట్ పోలీసింగ్ మీద వర్క్‌షాప్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు.
కేంద్ర హోం శాఖలో ఆధునీకరణ విభాగానికి చెందిన ప్రిన్సిపాల్ సైంటిఫిక్ అధికారి సంజయ్ శర్మ మాట్లాడుతూ.. స్మార్ట్ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాలంటే పోలీసులందరికీ శిక్షణ అవసరమన్నారు. కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డెరైక్టర్ ఈశ్‌కుమార్, అదనపు డెరైక్టర్ ఎంకే సింగ్, హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులందరూ పోలీసు అకాడమీలో మొక్కలు నాటారు.