రాష్ట్ర పోలీసు కమిషనరేట్ కార్యాలయం
భువనేశ్వర్ : రాష్ట్ర పోలీసుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ పోలీసింగ్ అవార్డును ప్రదానం చేసింది. సామూహిక పోలీస్‌వ్యవస్థ ఆవిష్కరణ, వాస్తవ కార్యాచరణతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఈ ప్రతిష్టాత్మక అవార్డును సాధించినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారి సారా శర్మ ఈ అవార్డును కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ శాఖ మంత్రి విజయ్ గోయల్ చేతుల మీదుగా గురువారం అందుకున్నారు.
బలమైన ప్రజా సంబంధాలు
బలమైన ప్రజా సంబంధాలతో పాటు పోలీస్ వ్యవస్థను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు డీజీపీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ విశేషంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న నేరాల పంథాలో ఆయన పోలీస్ వ్యవస్థను తరచూ సంస్కరిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసులు ఇటీవల కాలంలో పొరి పంయి కొథా టియే, మో సాథీ వగైరా ప్రత్యేక కార్యక్రమాల్ని ఆవిష్కరించారు. ప్రజా చైతన్యంతో నేరాల్ని నివారించే సూత్రంతో డీజీపీ ఆవిష్కరిస్తున్న సామూహిక పోలీసింగ్ వ్యవస్థ జాతీయ స్థాయి అవార్డును సాధించడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోం ది. ప్రధానంగా మహిళా వర్గంలో సాధికారతను ప్రోత్సహించి సమయస్ఫూర్తితో పరిస్థితుల్ని ఎదుర్కోవలసిన మార్గదర్శకాల్ని సమయానుకూలం గా జారీ చేసి విస్తారంగా ప్రసారం చేస్తున్నారు.
ప్రజా చైతన్యం కోసం రథాలు
బాలికలపట్ల ఇటీవల పెరిగిన అత్యాచారాలు, లైంగిక వేధింపుల నేపథ్యంలో పొరి పంయి కొథా టియే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 15 పొరి ఎక్స్‌ప్రెస్ చైతన్య రథాల్ని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఈ చైతన్య రథాలు రాష్ట్రవ్యాప్తంగా బాలికలపట్ల అత్యాచారాల ప్రభావిత ప్రాంతాల్లో సందర్శిస్తాయి. ఎక్కడికక్కడ బహిరంగ చైతన్య కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. కరపత్రాల పంపిణీతో పాటు భారీ తెర ఏర్పాటు చేసి విపత్కర పరిస్థితులు, నివారణ ఉపాయాలు, చట్టపరమైన సదుపాయాలు, శిక్ష విధింపు వ్యవహారాల్ని సరళ రీతిలో సాధారణ పజానీకానికి అర్థమయ్యే రీతిలో ప్రదర్శించడం పొరి పంయి కొథా టియే కార్యక్రమం సమ్రగ సారాంశం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరవధికంగా 15 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కేంద్ర మంత్రి ప్రదానం చేసిన ప్రతిష్టాత్మక అవార్డు తమ కార్యాచరణను ప్రోత్సహించి మరింత ఉత్సాహంతో ముందుకు నడిపిస్తుందని డీజీపీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment