
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఇకపై ఎవరైనా భూములను కొనొచ్చు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. జమ్మూకశ్మీర్‌లోని పలు చట్టాలకు చేసిన సవరణల్లో ఈ మార్పులను తీసుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు కేవలం ఆ రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు మాత్రమే భూములు కొనే హక్కును కలిగి ఉండేవారు. సెక్షన్ 17లోని ఆ హక్కును కేంద్రం తొలగించడంతో, ఇప్పుడు ఎవరైనా జమ్మూకశ్మీర్‌లో భూములను కొనొచ్చు. అయితే వ్యవసాయ భూములను, వ్యవసాయేతరులకు అమ్మేందుకు ఈ సవరణ అంగీకరించలేదని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పారు.
అయితే వ్యవసాయ భూములను విద్య, వైద్యానికి సంబంధించిన లక్ష్యాలకు వినియోగించుకోవచ్చు. ఈ చర్యను పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) వ్యతిరేకించింది. ఈ సవరణలు ఆమోదనీయం కాదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌ను అమ్మకానికి పెట్టారని అన్నారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యతిరేకంగా ఆర్టికల్ 370ని రద్దు చేశాక, ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ను అమ్మకానికి పెట్టారని, తమ సహజవనరులను దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని వ్యాఖ్యానించారు.