
సాక్షి, హైదరాబాద్: వారు సీనియర్ ఐపీఎస్‌లు.. సీనియర్ ఎస్పీ నుంచి అదనపు డీజీపీ హోదా వరకు పనిచేస్తున్నారు. కానీ ఏం లాభం 5 నెలలుగా జీతాల్లేకుండా ఖాళీగా ఉన్నారు. అదేం టని ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది నిజం. రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు గత అక్టోబర్‌లో కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చి రిపోర్ట్ చేశారు. సాధారణంగా రిపోర్టు చేసిన వారం, పది రోజుల్లో పోస్టింగ్ కల్పిస్తారు. కానీ ప్రభుత్వం వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదు. 5 నెలలు గడిచిపోయాయి. ఏం చేయాలో తెలియదు? ఎక్కడ కూర్చో వాలో తెలియదు? జీతం రాదు.. మరి ఏం చేసేది.
చివరికి ఆ అధికారులు డీజీపీ కార్యాలయానికి రావడమే మానేశారు. అప్పుడు.. ఇప్పుడు బదిలీలు అంటూ వచ్చే వార్తలతో డీజీపీ కార్యాలయానికి రావడం.. తోటి బ్యాచ్ అధికారుల గదిలో కొద్దిసేపు కూర్చుని వెళ్లిపోవడం.. ఇది పరిస్థితి. మరోవైపు ఆదిలాబాద్ ఉట్నూర్ ఘటనలో కరీంనగర్ డీఐజీ, ఆదిలాబాద్ ఎస్పీ.. డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేశారు. వీరు కూడా 2 నెలలుగా వెయిటింగ్‌లోనే ఉన్నారు. వీరికి జీతాల్లేవు. పోస్టింగ్ లేదు.. ఆఫీస్ లేదు. ఇక శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ముగ్గురు ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారులకూ పోస్టింగ్స్‌లు లేవు. వీరి పరిస్థితీ అంతే.
ఎందుకింత నిర్లక్ష్యం
కొత్త రాష్ట్రం, పైగా టెక్నాలజీ, ఆధునీకరణ కార్యక్రమాలు, ఇతరత్రా పనులను సవాలుగా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ప్రతీ అధికారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోగలగాలి. కానీ ఇలా ఐపీఎస్ అధికారులను వెయిటింగ్‌లో పెట్టడం ఏంటని మిగతా ఐపీఎస్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఐపీఎస్ అధికారులు తక్కువగా ఉన్నారని, మరికొంత మందిని కేటాయించాలని కేంద్ర హోంశాఖను కోరిన ప్రభుత్వం.. ఇప్పుడు ఇంతమందిని వెయిటింగ్‌లో పెట్టడం ఏంటని ఐపీఎస్‌లకు ఆక్రోశాన్ని కలిగిస్తోంది. పోనీ అధికారులకు సరిపడా పోస్టులు లేవా అంటే అదీ కారణం కాదు. ప్రస్తుతం ఒక్కో సీనియర్ ఐపీఎస్ అధికారి 2 బాధ్యతలను అదనంగా నిర్వహిస్తున్నారు. వెయిటింగ్‌లో ఉన్న వారిని అక్కడ నియమించి పనిభారం తగ్గించవచ్చు. కానీ ఆ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో పోస్టింగ్ ఇవ్వని వ్యవహారంపై ఐపీఎస్‌ల్లో వాడివేడిగా చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment