
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ వన్ డీఎస్పీలుగా పోలీస్ శాఖలో చేరి కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతి పొందిన పలువురు ఐపీఎస్ అధికారుల సీనియారిటీ పునఃసమీక్షిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వీరి సీనియారి టీని తప్పులతడకగా రూపొందించిన డీవోపీటీపై బాధిత అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీనియారిటీ వ్యవహారంలో మూడేళ్ల క్రితం రూల్స్ సవరించారని, ఆ సవరణలకు ముందే తాము కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా పదోన్నతి పొందామని 1996, 1998, 2001 బ్యాచ్ గ్రూప్–1 అధికారులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
డీవోపీటీ రూపొందించిన సీనియారిటీతో తాము రెండేళ్ల సర్వీసు కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేయడంతో పాత రూల్స్ ప్రకారం కన్ఫర్డ్ రూల్స్ వర్తింపజేయాలని డీవోపీటీని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు డీవోపీటీ ఐపీఎస్‌ల బ్యాచ్‌లను సవరించి కేంద్ర హోంశాఖకు జాబితా అందించింది. కేంద్ర హోంశాఖ సవరించిన కన్ఫర్డ్ ఐపీఎస్ బ్యాచ్‌లను అధికారికంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు పంపించింది. ఈ ప్రకారమే పదోన్నతులు, సీనియారిటీ స్కేలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.