పదవ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీపై చర్చ
సాక్షి, హైదరాబాద్: పదవ షెడ్యూల్‌లో గల సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఈ నెల 18వ తేదీన కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి రావాల్సిందిగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ బుధవారం లేఖ రాసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు సంప్రదింపుల ద్వారా దీనిపై ఒక ఒప్పందానికి రాని పక్షంలో కేంద్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇరు రాష్ట్రాలు కమిటీలను ఏర్పాటు చేశాయి.
టీ సర్కారు తమ సీఎస్ రాజీవ్‌శర్మ, ఏజీ రామకృష్ణారెడ్డితో కమిటీని ఏర్పాటు చేయగా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బాల సుబ్రహ్మణ్యంతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు గత నెల 18వ తేదీన సమావేశమైనప్పటికీ ఒక ఒప్పందానికి రాలేదు. ఇదే విషయాన్ని ఏపీ ఇటీవల కేంద్ర హోంశాఖకు లేఖ ద్వారా తెలియజేసింది. దీంతో కేంద్ర హోంశాఖ ఈ నెల 18న భేటీ ఏర్పాటుచేసింది. పదవ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల వివరాలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. ఆ వివరాలను కేంద్ర హోంశాఖకు అందజేయాలని నిర్ణయించింది. జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేయాల్సిందిగా కోరనుంది.
9వ షెడ్యూల్ సంస్థల ఆస్తులు రూ.50 వేల కోట్లు
ఇలా ఉండగా 9వ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల వివరాలను సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా నమూనా పత్రాన్ని రూపొందించి సంస్థల వారీగా ఆస్తులు, అప్పుల వివరాలను సేకరించనుంది. ఆయా సంస్థల్లో ఉద్యోగుల వివరాలను ప్రాంతాల వారీగా సేకరించాలని కూడా నిర్ణయించింది. రూ.50 వేల కోట్ల వరకు ఆస్తులుంటాయని ప్రాథమికంగా అంచనా వేసింది. సేకరించిన వివరాలను షీలా బిడే కమిటీకి సమర్పించనుంది.