
ఎఫ్‌డీఐలకు 3 నెలల్లోనే క్లియరెన్స్
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయటంలో భాగంగా.. ఎఫ్‌డీఐకి భద్రతాపరమైన ఆమోదాన్ని సాధ్యమైనంత వరకూ మూడు నెలల్లో పూర్తిచేసేందుకు కేంద్ర హోంశాఖ అంగీకరించిందని కేంద్రం వెల్లడించింది. శుక్రవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి నిర్మలాసీతారామన్ జవాబు చెప్పారు.
గత మూడేళ్లలో ఎఫ్‌డీఐ రాకలో హెచ్చుతగ్గులున్నాయని వీటికి కారణం స్థూల ఆర్థిక అవరోధాలని అన్నారు. ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు భద్రతాపరమైన ఆమోదంలో జాప్యానికి సంబంధించి.. వ్యూహాత్మక రంగాలైన విమానయానం, టెలికాం సహా వివిధ శాఖలు, విభాగాల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయని అంగీకరించారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై నిర్ణయాలను తగిన జాగరూకతతో తీసుకుంటామన్నారు.