మల్టీ బ్రాండ్ రిటైల్లో ఎఫ్డీఐ కుదరదు: సీతారామన్
న్యూఢిల్లీ: దేశీయ చిల్లర వర్తకులు విదేశీ కంపెనీలతో పోటీ పడేలా, రైతులు స్వయం సమృద్ధి సాధించేంత వరకు బహుళ బ్రాండ్‌ల చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అనుమతించడం సాధ్యం కాదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ వాల్‌మార్ట్‌లను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ది ఎకనమిస్ట్ ఇండియా సదస్సు 2016లో ఈ మేరకు ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐలను ఎందుకు అనుమతించకూడదు? అన్న ప్రశ్నకు నిర్మలా సీతారామన్ బదులిచ్చారు. ‘దేశంలో చివరి వరకు అనుసంధానత లేదు, మౌలిక వసతులు సరిగా లేవు. రైతులు, చిన్న వర్తకులకు ఆర్థిక సేవలు ఇంకా పూర్తి స్థాయిలో అందడం లేదు. ఈ అంతరాలను పూడ్చాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం దీనిపైనే దృష్టి పెట్టింది’ అని ఆమె వివరించారు. ఇప్పటికైతే విదేశీ ప్లేయర్లతో పోటీ పడే స్థాయిలో మనం లేమన్నారు. కాగా, ఎఫ్‌డీఐ పాలసీ ప్రకారం విదేశీ కంపెనీలు దేశీయ కంపెనీల్లో 51% వాటా తీసుకునేందుకు అనుమతి ఉంది.
ఉచిత ఒప్పందాల పునఃపరిశీలన
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఎఫ్‌టీఏ)ను సమీక్షించనున్నట్టు నిర్మలాసీతామన్ చెప్పారు. గతంలో చేసుకున్న ఎఫ్‌టీఏల వల్ల ఆశించిన మేర ప్రయోజనాలు సిద్ధించలేదని వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు తమ దృష్టికి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. వీటిపై తగినంత అవగాహన లేకపోవడం ఓ కారణమన్నారు. ఈ ఒప్పందాలను అనుకూలంగా మలుచుకుని దేశీయ ఎగుమతిదారులు లబ్ధి పొందలేకపోయినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆసియా దేశాలతో జరగాల్సిన స్థాయిలో ఎగుమతులు లేవన్నారు. కనుక ఎఫ్‌టీఏలను సమీక్షిస్తామని చెప్పారు. పది దేశాల ఆసియాన్, జపాన్, కొరియా, సింగపూర్ తదితర దేశాల్లో మన దేశానికి ఉచిత వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి.