మల్టీబ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐని అనుమతించం
న్యూఢిల్లీ: మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను ప్రభుత్వం అనుమతించబోదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ‘ఈ విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎలాంటి గందరగోళం లేదు..’ అని మోడీ సర్కార్ ఏర్పడి వందరోజులు పూర్తయిన సందర్భంగా సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె చెప్పారు.
ఈ రంగంలో ఎఫ్‌డీఐపై బీజేపీ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించి ఎన్నికల్లో నెగ్గిందని అన్నారు. మునుపటి యూపీఏ ప్రభుత్వం మల్టీబ్రాండ్ రిటైల్‌లో 51 శాతం ఎఫ్‌డీఐని అనుమతించగా, బీజేపీ వ్యతిరేకించింది. అయితే, యూపీఏ విధానానికి స్వస్తిపలికే చర్యలను మోడీ సర్కార్ ఇప్పటివరకు చేపట్టలేదు. యూకేకు చెందిన టెస్కో పెట్టుబడి ప్రతిపాదనను మాత్రమే యూపీఏ హయాంలో అనుమతించారు.
ఈ-కామర్స్‌లోనూ అంగీకరించం...
మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలో ఏ రూపంలోనూ ఎఫ్‌డీఐని అనుమతించేది లేదనీ, ఈ-కామర్స్ రూట్లో కూడా ఒప్పుకోబోమనీ నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక ప్యాకేజీల గురించి ప్రశ్నించగా, ఈ విషయంపై ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయనీ, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ బదులిచ్చారు. కాగా, నిర్మాణ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను సరళతరం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు.
మేధో హక్కులపై త్వరలో పాలసీ
మేధో సంపత్తి హక్కుల(ఐపీఆర్)ను మరింత సమర్థవంతంగా అమలుచేసేదిశగా 6 నెలల్లో కార్యాచరణ విధానాన్ని(పాలసీ)ని ప్రకటించనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘భారత్‌కు ప్రస్తుతం ఐపీఆర్ పాలసీ లేదు. తొలిసారిగా మేం దీన్ని అమల్లోకి తీసుకురానున్నాం. ఫార్మా ఇతరత్రా కొన్ని రంగాల్లో మన మేధో హక్కులను కూడా పరిరక్షించుకోవాలంటే తగిన పాలసీ అవసరం. మరోపక్క, అమెరికాతో ఐపీఆర్ విషయంలో కొన్ని సమస్యలు నెలకొన్నాయి. వీటన్నింటికీ సరైన విధానం ఒక్కటే పరిష్కారమార్గం’ అని పేర్కొన్నారు.