అల్లర్లకు టీడీపీ కుట్ర | Central Intelligence Bureau says TDP conspiracy to attacks in AP | Sakshi
Sakshi News home page

అల్లర్లకు టీడీపీ కుట్ర

Published Thu, May 23 2019 3:30 AM | Last Updated on Thu, May 23 2019 3:38 AM

Central Intelligence Bureau says TDP conspiracy to attacks in AP - Sakshi

సాక్షి, అమరావతి: అధికారాంతమున తెలుగుదేశం పార్టీ బరి తెగిస్తోంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో అల్లర్లు, అలజడులు రేపేందుకు పన్నాగం పన్నుతోంది. శాంతిభద్రతల సమస్యలు సృష్టించి, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడాలన్నదే ఆ పార్టీ లక్ష్యం. టీడీపీ కుట్రను కేంద్ర నిఘా వర్గాలు గుర్తించడంతో అసలు బండారం బట్టబయలైంది. ఈ మేరకు టీడీపీ కుతంత్రంపై కేంద్ర ఇంటలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేసింది. దాంతో ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఐబీ వర్గాల సమాచారం ప్రకారం.. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు టీడీపీ పక్కాగా పన్నాగం పన్నింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని అధికారులు, సిబ్బందితో టీడీపీ ఏజెంట్లు కుమ్మక్కయ్యేందుకు వ్యూహం పన్నారని ఐబీ గుర్తించింది.

తద్వారా వీవీ ప్యాట్‌లోని స్లిప్పులను గల్లంతు చేయడం టీడీపీ ఏజెంట్ల అసలు ఉద్దేశం. అందుకోసం అవసరమైతే వీవీ ప్యాట్‌ స్లిప్పులను నమిలి మింగేయాలని కూడా టీడీపీ అధిష్టానం తమ ఏజెంట్లకు నిర్దేశించినట్లు సమాచారం. అనంతరం ఈవీఎంలోని ఓట్లకు, వీవీ ప్యాట్లలోని స్లిప్పులకు మధ్య తేడా ఉందని టీడీపీ ఏజెంట్లే లెక్కింపు కేంద్రాల్లో ఆందోళనకు దిగుతారు. అప్పటికే బయట ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు వెంటనే ఆందోళనలను ఉధృతం చేస్తారు. ఆ వెనువెంటనే దాడులకు దిగుతూ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భయోత్పాతాన్ని సృష్టిస్తారు. తద్వారా శాంతిభద్రతలకు విఘాతం కల్పించి ఏకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను అడ్డుకోవడమే వారి లక్ష్యం. ఇక టీడీపీ కచ్చితంగా ఓడిపోతుందన్న అంచనా ఉన్న నియోజకవర్గాల లెక్కింపు కేంద్రాల వద్దకు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించకూడదని టీడీపీ ఎత్తుగడ వేస్తోంది. అందుకోసం కొందరు రిటర్నింగ్‌ అధికారులతో టీడీపీ కుమ్మక్కైంది. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేకుండా చేసి ఓట్ల లెక్కింపు  ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు.  
 
టీడీపీ ఓడిపోతుందని స్పష్టమవుతున్న నియోజకవర్గాల కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మరింతగా బరి తెగించాలని టీడీపీ ఎత్తుగడ వేస్తోంది. ఆ కేంద్రాల వద్ద శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ఎంతకైనా తెగించాలని తమ శ్రేణులకు టీడీపీ నాయకత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకోవాలన్నది టీడీపీ కుతంత్రం. అందుకోసం పెద్దఎత్తున దాడులకు తెగబడేందుకు టీడీపీ సంఘ విద్రోహ శక్తులను ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ముందస్తుగానే మోహరిస్తోందని ఐబీ నివేదించింది.  
 
సున్నిత నియోజకవర్గాలివీ...  
టీడీపీ అల్లర్లు, అలజడులు సృష్టించే అవకాశాలున్న నియోజకవర్గాల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి ఐబీ నివేదించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అల్లర్లకు ఆస్కారం ఉన్న నియోజకవర్గాలు ఇవీ... 
అనంతపురం: తాడిపత్రి, రాప్తాడు, ఉరవకొండ, పెనుకొండ, హిందూపూర్‌ 
కర్నూలు: ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆదోని, డోన్, పత్తికొండ 
వైఎస్సార్‌: జమ్మలమడుగు, మైదుకూరు, రైల్వే కోడూరు, కమలాపురం, కడప 
చిత్తూరు: తంబళ్లపల్లె, పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి 
నెల్లూరు: నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కొవ్వూరు,  
ప్రకాశం: చీరాల, అద్దంకి, కొండేపి, కనిగిరి 
గుంటూరు: పెదకూరపాడు, సత్తెనపల్లి, మంగళగిరి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట 
కృష్ణా: మైలవరం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, గన్నవరం, గుడివాడ 
పశ్చిమ గోదావరి: దెందులూరు, ఏలూరు, తణుకు, ఆచంట 
తూర్పు గోదావరి: కొత్తపేట, రామచంద్రాపురం, కాకినాడ రూరల్, అమలాపురం 
విశాఖపట్నం: భీమిలి, గాజువాక, పెందుర్తి 
విజయనగరం: బొబ్బిలి, చీపురుపల్లి 
శ్రీకాకుళం: నరసన్నపేట, ఆమదాలవలస  
  
అప్రమత్తంగా ఉండండి  
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించింది.  ఈవీఎంలలో ఓట్ల లెక్కింపును మొదట పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఈవీఎంలను సురక్షితంగా మళ్లీ భద్రపర్చాలని సూచించింది. ఆ తరువాతే వీవీ ప్యాట్‌ల స్లిప్పుల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. అసాంఘిక, అనధికార వ్యక్తులు ఎవరూ లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా టీడీపీ అరాచకాలు సృష్టించేందుకు కుట్ర పన్నిందన్న నిఘా వర్గాల  సమాచారం అధికార వర్గాలను ఆందోళన పరుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement